Tuesday, February 28, 2012

ఫిబ్రవరి 28 బంద్‌ ఉప ఎన్నికలు ప్రజా సమస్యల ఎజెండాపై కేంద్రీకరణ


గవర్నర్‌ ప్రసంగంలో ఎన్ని అసత్యాలు చెప్పినా బడ్జెట్‌ బండారమే వున్న స్తితిని విదితం చేసింది. సంక్షేమ జపం మధ్యనే ఎస్‌సిఎస్‌టి సబ్‌ ప్లాన్‌కు నిధుల కోత దాపురించింది. మద్యపానాన్ని ఆదాయ వనరుగా చేసుకోవడమే గాక ఆ మద్యం సిండికేట్ల దగ్గర కోటానుకోట్ల ముడుపులు మింగిన మంత్రుల పేర్లు వెల్లడైతే ప్రభుత్వం గిజగిజలాడిపోతున్నది.ఒక్క జనవరి నెలలోనే 160 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నా వ్యవసాయ సంక్షోభాన్ని నివారించేందుకు రైతులను ఆదుకునేందేకు కనీస చర్యలు లేవు. 879 మండలాల్లో కరువు వుందని ప్రకటించిన ప్రభుత్వం రైతులను గ్రామీణ పేదలను ఆదుకోవడానికి ప్రకటించిన చర్యలు శూన్యం. ధరలు మండిపోతుంటే రూపాయకు కిలోబియ్యం ప్రచారంతో సరిపెడుతున్నది. హక్కులు హామీల అమలుకై ఉద్యమించిన కార్మికులు ఉద్యోగులు యువత మహిళలు ప్రతివారిపై లాఠీలతో విరుచుకుపడి అణచివేయజూస్తున్నది.
ప్రాంతీయ వివాదాలు, పదవీ దాహాల చుట్టూ పరిభ్రమిస్తున్న ప్రస్తుత రాజకీయ పర్వంలో ఉప ఎన్నికలకు గతంలో లేని ప్రత్యేక ప్రాధాన్యత, ప్రచారం లభిస్తున్నాయి. ముఖ్యంగా టిఆర్‌ఎస్‌ సభ్యులు తమ స్థానాలకు రాజీనామా చేసి మళ్లీ ఎన్నికవడం ఒక వ్యూహంగా పలు సార్లు జరిగింది. కానీ, ఇప్పుడు పోటీ చేస్తున్న వారిలో కాంగ్రెస్‌ . తెలుగుదేశంల నుంచి ఆ పార్టీలోకి వచ్చిన వారున్నారు. కోవూరులో తెలుగుదేశం మాజీ సభ్యుడు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ తరపున పోటీలో వున్నారు. టిఆర్‌ఎస్‌ అభ్యర్థులే రాజీనామా ఇచ్చి మళ్ళీ పోటీ చేసిన గత సందర్భాలకూ , ఇతర పార్టీల వారిని చేర్చుకున్న ప్రస్తుత పరిస్థితికి కొంత తేడా వుంది. ఈ తేడాలు ఏమున్నా మౌలికంగా పెద్ద వ్యత్యాసం వుందని చెప్పలేము. బిజెపి కూడా పోటీ చేస్తానని ప్రకటిస్తుండడంతో తెలంగాణా జెఎసిలో సభ్యత్వం గల పార్టీల మధ్యన కూడా విభేదాల విస్పోటనం ప్రస్పుటమవుతున్నది.
సిపిఎం నాలుగు స్థానాలలో అభ్యర్థులను ప్రకటించి రాజకీయంగా తన విధానం ప్రజల్లోకి తీసుకుపోవడానికి, పోటీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నది. ఈ నాలుగింటిలోనూ మూడు చోట్ల గతంలో పార్టీ పోటీ చేసిన వివిధ సందర్భాలున్నాయి. నెల్లూరు జిల్లా కోవూరులో గతంలో ఒకసారి ఉప ఎన్నికల పోరాటంలో గణనీయంగా ఓట్లు తెచ్చుకున్నది. వరంగల్‌ జిల్లా స్టేషన్‌ ఘనపూర్‌లో జయాపజయాలపై సిపిఎం పోటీ ప్రభావం చాలా వుందని రాజకీయ వర్గాలన్నీ లోగడ అంచనా వేశాయి. ఇతరుల ఎత్తుగడలు ఎన్నికల రంగంలో ఏమైనప్పటికీ ప్రజా సమస్యలను రంగం మీదకు తెచ్చి రాజకీయ చర్చ ఆ వైపు మరల్చాలన్నదే సిపిఎం ఎజెండాగా వుంది.
పదవుల కోసం కాకుండా ఒక రాజకీయాభిప్రాయం కోసం రాజీనామాలు చేశారు గనక పాత వారినే తిరిగి గెలిపించాలన్న ప్రచారం సాగుతున్నా వారు భారీ మెజార్టీలు తెచ్చుకోగలుగుతారా? గతంలో వారు ప్రాతినిధ్యం వహించిన పార్టీల ప్రతిఘటన వుండదా? కడప జిల్లా వెలుపల తొలిసారి చేస్తున్న పోటీ ప్రభావం వైఎస్‌ఆర్‌ పార్టీపై ఎలా వుంటుంది? వగైరా చర్చలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఏది ఏమైనా ఉప ఎన్నికల నేపథ్యంలో చర్చోపచర్చలు నేడు ప్రజలను వేధిస్తున్న ప్రధాన సమస్యలను పట్టించుకోవడం లేదు. ప్రజల జీవితాలను దుర్భరం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలపై ప్రధానంగా విమర్శలు సాగడం లేదు. పార్టీల పరంగానూ వ్యక్తిగతంగానూ పరస్పర దూషణలతో నిందారోపణలతో ప్రధాన పార్టీలు ప్రజలను ముంచెత్తే అవకాశాలే కనిపిస్తున్నాయి. తమ తమ పాత్రలను,కప్పిపుచ్చుకుంటూ అవతలి వారిపై దాడి చేయడమే ఏకైక వ్యూహంగా అమలు చేయడం జరుగుతున్నది.
తెలంగాణా ప్రాంతంలో ఎన్నికలు జరిగే ఆరు నియోజకవర్గాలలోనూ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అంశం ప్రధానంగా వుండటం సహజమే. అలాగే ఈ అంశంపై ప్రధాన పార్టీలు పరస్పరం తిట్టిపోసుకోవడం తప్ప తమ అవకాశవాద పోకడలను, ద్వంద్వ భాషణలను వదులుకుంటాయని ఆశించడానికి ఏ మాత్రం ఆస్కారం లేదు. ఈ దూషణలు ఉప ఎన్నికల ప్రచారంలో మరింత ప్రకోపించినా ఆశ్చర్యం లేదు. ఈ క్రమంలో తప్పించుకుంటున్నది మాత్రం కాంగ్రెస్‌ పార్టీనే.
రాష్ట్ర సమైక్యతా, విభజనా అన్న సమస్యపై తన అభిప్రాయం తేల్చిచెప్పకుండా రాష్ట్ర ప్రజలతో చెలగాటమాడుతున్న దోషి కాంగ్రెస్‌ పార్టీ. గతంలో అనేక సార్లు అనేక విధాలుగా ప్రాంతీయతత్వాలను ఎగదోసిన ఆ పార్టీ ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు చర్యలు ప్రారంభిస్తున్నట్టు ప్రకటించి తర్వాత పరిస్థితుల మార్పు పేరిట వెనక్కు తగ్గింది. మారిన పరిస్థితులలో అందరి అభిప్రాయాలు సేకరించి అధ్యయనం చేయాలంటూ శ్రీకృష్ణ కమిటీని వేసింది.ఆ కమిటీ నిర్దేశిత సమయంలో నివేదిక నిచ్చింది. ఆ తర్వాత ఏడాదిన్నర గడిచిపోయినా నిర్ణయం ప్రకటించకుండా కాలక్షేపం చేస్తూ కేంద్రం కావాలని చిచ్చు ఎగదోస్తున్నది. తన అంతర్గత కలహాలను కప్పిపుచ్చుకోవడానికి తెలంగాణ సమస్యను సాధనంగా వాడుకుంటున్నది. ఏకాభిప్రాయం కావాలని, అఖిల పక్షం జరగాలని సన్నాయి నొక్కులతో తన అవకాశవాదాన్ని కప్పిపుచ్చుకుంటున్నది. కాంగ్రెస్‌ నాయకులే వివిధ ప్రాంతాలలో వివిధ రకాలుగా మాట్లాడుతూ ఉద్రేకాలు పెంచుతున్నారు. వారిలో కొందరు ప్రాంతీయ వ్యూహాలతో రాజీనామాలు చేస్తుంటే మరికొందరు ఆ కొత్త పదవులకై తహతహలాడుతున్నారు. ఇవన్నీ ఎలా వున్నా అధికారాన్ని కాపాడుకునే విషయంలో కాంగ్రెస్‌ వారిలో ఎలాటి తేడాలు లేవు.ప్రాంతాలను బట్టి రెండు ముక్కలుగానూ నాయకులను బట్టి అనేక వర్గాలుగానూ చీలిపోయి వున్న కాంగ్రెస్‌ పార్టీ తమలోనే మృగ్యమైన ఏకాభిప్రాయం ఇతరులలో సాధించాలని చెప్పడం హాస్యాస్పదం. అందరూ అధిష్టానం మాట శిరోధార్యమంటుంటూ ఆ అధిష్టానమే తల పట్టుకుని కూచున్న విచిత్ర స్థితి. రోజుకో మాట మారుస్తూ రాష్ట్ర ప్రజానీకాన్ని గజిబిజి పర్చడం తప్ప సహేతుకమైన, పారదర్శకమైన పరిష్కార ప్రకటన వైపు అంగుళమైనా కదలిక లేదు. అందుకే ఉప ఎన్నికల రంగంలోనూ ఈ అంశంపై అధికార పక్షం అభిశంసనకు గురి కావడం తథ్యం.
అయితే ప్రభుత్వ పక్షం ఈ విధమైన దుర్నీతితో దుస్థితిలో కూరుకు పోయి వుంటే ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం కూడా సూటిగా తన అభిప్రాయం చెప్పగలస్థితి లేదు. చెప్పాల్సింది గతంలోనే చెప్పాము అనడం తప్ప ఏది ఇప్పుడు చెప్పడానికి సిద్ధంగా లేదు. రెండు చోట్ల రెండు రకాలుగా మాట్లాడ్డంలో తెలుగుదేశం నేతలు కూడా తీవ్రంగానే వ్యవహరిస్తున్నారు. టిఆర్‌ఎస్‌కు, కొందరు తెలుగుదేశం నేతలకు మధ్యన మాటల యుద్ధం వికృత రూపం తీసుకుని కొత్త వివాదాలకు దారి తీయడం చూస్తున్నాం. రాష్ట్రంలో ప్రస్తుత అనిశ్చిత పరిస్థితికి ప్రధాన బాధ్యత కాంగ్రెస్‌ అధిష్టానానిదే అయినా ప్రచారంలో విమర్శ కేంద్రీకరించే బదులు, నువ్వు ద్రోహివంటే నువ్వు మోసగాడివని దూషించుకోవడమే జరుగుతున్నది. ఈ ధోరణి వాస్తవంలో అధికార పక్షం నెత్తిన పాలు పొయ్యడమే. అవినీతి అంతర్గత కలహాలతో నిండిన తన అనిశ్చిత పాలన నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఈ రాజకీయాలు దానికి చక్కగా సరిపోతాయి. విధానపరమైన అంశాలు వెనక్కు పోయి వివాదాల చుట్టూ చక్కర్లు గొట్టడం విద్వేషాలు రగిల్చివీరంగాలు తొక్కడం రివాజు అవుతుంది. దీని వెనక రాజకీయ తాత్వికత లేకపోలేదు. ప్రజలను పిప్పి చేస్తున్న ప్రైవేటీకరణ ప్రపంచీకరణ విధానాల్లో ప్రధాన పాలక వర్గ పార్టీల మధ్య తేడాలేమీ లేవు. అధికారంలో వుంటే ప్రపంచ బ్యాంకు వెంట పరుగులు, ప్రతిపక్షంలో వుంటే దానిపై పిడుగులు అన్న చందంగా వీరి రాజకీయాలు నడుస్తుంటాయి. గతంలో తెలుగు దేశం వున్నప్పుడు కాంగ్రెస్‌,ఇప్పుడు కాంగ్రెస్‌ హయాంలో తెలుగుదేశం చేస్తున్న విమర్శలే ఇందుకు నిదర్శనం. ఏవో తక్షణాంశాలపై మొక్కుబడిగా విమర్శలు చేయడం తప్ప మూలాల్లోకి వెళ్లడం వుండదు. ఒకరి తీరు తెన్నులు మరొకరికి తెలుసు గనక ప్రతిసారీ వాటిని తవ్విపోసుకుంటూ కృత్రిమమైన ఆవేశాలు రగిలించి అసలైన అంశాలను వెనక్కు నెట్టడం పరిపాటి. వరస వాయిదాల పదే పదే ప్రతిష్టంభనల తర్వాత జరుగుతున్న శాసనసభ సమావేశాలలో ఇది ప్రస్తుతం కళ్లముందు కనిపిస్తున్న సత్యం. సమస్యలన్నీ చర్చించేందుకు రాజ్యాంగబద్ధ్దమైన వేదికగా వున్న శాసనసభకే ఈ పరిస్థితి తెచ్చిపెట్టిన వారు ఉప ఎన్నికల ప్రచారంలో బాధ్యతగా వ్యవహరిస్తారని, ప్రజా సమస్యలు ముందుకు తెస్తారని ఆశించడం అమాయకత్వమే.
రాష్ట్రంలో ఇంత దారుణమైన అనిశ్చిత రాజకీయ వాతావరణం నెలకొన్న స్థితిలో నిజమైన ప్రజా సమస్యలను ఎజెండాపైకి తెచ్చి నిలపగల నిబద్ధ్దత, స్పష్టత వున్నది వామపక్షాలకే. ఇటీవల ఖమ్మంలో బ్రహ్మాండంగా జరిగిన సిపిఎం 23 వ రాష్ట్ర మహాసభలు వామపక్ష ఐక్యతకూ, ప్రజా ఉద్యమాల బలోపేతానికి కృషి చేయాలని నొక్కి చెప్పాయి. ఆ తర్వాత కాలంలో వామపక్షాల ఐక్య కార్యాచరణ మరింత దృఢతరమవుతున్నది. కరీం నగర్‌లో సిపిఐ మహాసభ కూడా జరిగింది. 2000 సంవత్సరంలో విద్యుచ్ఛక్తి ఉద్యమం ద్వారా ప్రజా పోరాటాలకు కొత్త వూపిరులూదిన వామపక్షాలు నేటి అవకాశవాద వాతావరణంలోనూ సమరశీల ఉద్యమాలకు శంఖారావం చేస్తున్నాయి. సరిగ్గా ఈ సమయంలోనే దేశ వ్యాపితంగా వచ్చిన ఫిబ్రవరి 28 సమ్మె పిలుపు ప్రజా సమస్యలన్నిటినీ ప్రతిబింబిస్తూ సమరశీలతను ప్రతిధ్వనించనున్నది. ఆ రోజునే రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర బంద్‌ నిర్వహించాలని వామపక్షాలు పిలుపునిచ్చాయి. ఇటీవలి కాలంలో ఈ విధమైన పిలుపునివ్వడం ఇదే ప్రథóమం. దీన్ని దిగ్విజయంగా నిర్వహించడం ద్వారా వివిధ తరగతుల బాధిత ప్రజానీకాన్ని ఏకోన్ముఖ పోరాటాలవైపు నడిపించేందుకు ప్రాతిపదిక ఏర్పడుతుంది. స్వార్థపూరిత రాజకీయాల విష వలయం నుంచి తప్పించి విస్తృత సమస్యలపై సమైక్య ఉద్యమాలు సాగించడానికి కార్యాచరణ మార్గం ఏర్పడుతుంది.కనకనే విశాల ప్రజా శ్రేయస్సు కాంక్షించే ప్రతి వారూ ఈ బంద్‌ను సమ్మెను జయప్రదం చేయాలి. విధానపరమైన, ప్రజాప్రధానమైన రాజకీయాలకు ఉద్యమాలకు వూతమివ్వాలి.
అదే సమయంలో ఉప ఎన్నికల ప్రచారంలోనూ ప్రజా సమస్యలను ముందుకు తీసుకురావడానికి శాయశక్తులా కృషి జరగాల్సి వుంది. ఎందుకంటే సందట్లో సడేమియా అన్నట్టు సంక్షోభ స్థితిని ఆసరా చేసుకుని ప్రభుత్వం ప్రజలపై భారాల పరంపర రుద్దుతున్నది. ఉదాహరణకు విద్యుత్‌ సంస్థపై 25 వేల కోట్ల లోటుతో పాటు రకరకాల రూపాల్లో 15 వేల కోట్ల మేరకు ప్రజల నుంచి గుంజేందుకు ప్రయత్నిస్తున్నది. ఈ కాలంలో మొత్తం. 10 వేల కోట్లకు పైగా ప్రజలపై అదనపు భారాలు విధించింది. ఆదాయం,పన్ను వసూళ్లు20 శాతం వరకూ పెరిగాయని ఆర్థిక మంత్రి బడ్జెట్‌ ప్రసంగంలోనే పేర్కొన్నారు.గవర్నర్‌ ప్రసంగంలో ఎన్ని అసత్యాలు చెప్పినా బడ్జెట్‌ బండారమే వున్న స్థితిని విదితం చేసింది. సంక్షేమ జపం మధ్యనే ఎస్‌సిఎస్‌టి సబ్‌ ప్లాన్‌కు నిధుల కోత దాపురించింది. మద్య పానాన్ని ఆదాయ వనరుగా చేసుకోవడమే గాక ఆ మద్యం సిండికేట్ల దగ్గర కోటానుకోట్ల ముడుపులు మింగిన మంత్రుల పేర్లు వెల్లడైతే ప్రభుత్వం గిజగిజలాడిపోతున్నది.ఒక్క జనవరి నెలలోనే 160 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నా వ్యవసాయ సంక్షోభాన్ని నివారించేందుకు రైతులను ఆదుకునేందుకు కనీస చర్యలు లేవు. 879 మండలాల్లో కరువు వుందని ప్రకటించిన ప్రభుత్వం రైతులను గ్రామీణ పేదలను ఆదుకోవడానికి ప్రకటించిన చర్యలు శూన్యం. ధరలు మండిపోతుంటే రూపాయికి కిలోబియ్యం ప్రచారంతో సరిపెడుతున్నది. హక్కులు హామీల అమలుకై ఉద్యమించిన కార్మికులు, ఉద్యోగులు యువత, మహిళలు ప్రతివారిపై లాఠీలతో విరుచుకుపడి అణచివేయజూస్తున్నది.
మొండిగోడలతో మిగిలిపోయిన ఇందిరమ్మ ఇళ్ల పూర్తి ఒక సవాలు కాగా అదే తన ఘనతగా చాటుకుంటూ అరకొర నిధులు విదిల్చి సరిపెడుతున్నది. అందులోనూ 270 కోట్లకు పైగా అవినీతి జరిగినట్టు సంబంధిత మంత్రి ప్రకటిస్తే, మరో మంత్రి మావారికే ఇచ్చుకుంటే తప్పేమిటని సవాలు చేస్తున్న విడ్డూరం.ఆరోగ్యశ్రీ, 108 భజనతో కుప్పకూలిన ప్రజారోగ్య రంగాన్ని పునరుద్ధ్దరించే యోచన ఏ కోశానా లేదు. సంక్షేమ హాస్టళ్ల సమస్యలు, ఫీజు రియింబర్సుమెంటు బకాయిలు ఇలా చెప్పాలంటే ఏ సమస్యకూ పరిష్కారం లేదు. పట్టణాల్లో ప్రపంచ బ్యాంకు ఆదేశాల ప్రకారం ఆస్తిపన్ను, నీటిపన్ను, చెత్త పన్ను వగైరాలన్నీ ఇష్టానుసారం పెంచేసి ప్రభుత్వం ప్రజలను పీడిస్తున్నది. దేశంలోనూ 2 జి స్పెక్ట్రం వంటి అవినీతి కుంభకోణాలకు తోడు అధిక ధరలు ఆహార అభద్రత తాండవిస్తున్నాయి. ఎఫ్‌డిఐల ప్రవేశంతో చిల్లర వ్యాపారుల బతుకులు ఛిద్రమై పోతున్నాయి. దేశ విదేశ గుత్త పెట్టుబడిదార్లు బహుళ జాతి సంస్థలకు సామ్రాజ్యవాదులకు తప్ప సామాన్య ప్రజలకు మేలు చేయని ఈ విధానాలను తిప్పికొట్టకపోతే దేశ స్వతంత్య్రానికేగాక, ప్రజాస్వామ్య విలువలకూ ముప్పు తప్పదు.
వీటన్నిటిపై పోరాటానికి ప్రతిరూపమే ఫిబ్రవరి 28 బంద్‌. వామపక్షాల సమైక్య పిలుపుపై జరుగుతున్న ఈ బంద్‌ను జయప్రదం చేయడం ద్వారా పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజా గ్రహాన్ని ప్రకటించాలి. ప్రకంపనలు సృష్టించాలి. శాసనసభలోనూ ఉప ఎన్నికలలోనూ కూడా విశాల ప్రజాసమస్యలకే పెద్ద పీట వేసి పరిష్కారాలకై పోరాడాలి. అదే నేటి కర్తవ్యం.
-బి.వి.రాఘవులు

No comments:

Post a Comment