Monday, March 2, 2015

మోడి ప్రభుత్వ కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక, ప్రభుత్వ రంగ వ్యతిరేక, ఎస్ సి /ఎస్టీ/మహిళ/శిశు వ్యతిరేక బడ్జెట్ కు నిరసనగా 3.3.2015న భోజన విరామ సమయం లో ప్రదర్శనలు నిర్వహించండి --బి ఎస్ ఎన్ ఎల్ ఎంప్లాయీస్ యూనియన్


మోడీ ప్రభుత్వ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటులో 28.2.2015న ప్రవేశ పెట్టిన 2015-16 సంవత్సరపు బడ్జెట్ ఉద్యోగులకు, కార్మికులకు, ప్రజలకు, ఎస్ సి/ఎస్టీ/మహిళా/శిశు తదితర బలహీన తరగతులకు, ప్రభుత్వ రంగ సంస్థలకు, బిఎస్ఎన్ఎల్ పునరుద్ధరణకు   పూర్తి వ్యతిరేకముగా వున్నది. స్వదేశీ విదేశీ బడా పెట్టుబడిదారులకు, సంపన్నులకు పూర్తి అనుకూలముగా వున్నది.

స్వదేశీ విదేశీ బడా పెట్టుబడిదారులకు సంపన్నులకు 2014-15 లో మోడీ ప్రభుత్వము ఇచ్చిన రాయితీల విలువ రు 5,89,285.20 కోట్లు. ఇది ఆ సంవత్సరపు బడ్జెట్ లోటు రు.5,55,649 కోట్లకన్నా ఎక్కువ. కాబట్టి బడ్జెట్ లోటుకి కారణం సంపన్నులకిచ్చిన అనుచిత రాయితీలే. ఇప్పుడు 2015-16 బడ్జెట్ లో కూడా ఇదే ధోరణిని మోడీ ప్రభుత్వము కొనసాగిస్తున్నది. రు. 5 లక్షల కోట్లకు మించిన ఈ భారీ రాయితీలను కొనసాగిస్తూనే ఈ బడ్జెట్ లో అదనముగా  సంపన్నులకు ప్రత్యక్ష పన్నులలో రు. 8315 కోట్లు రాయితీనిచ్చింది. ఇంతేకాక సంపద పన్నును పూర్తిగా రద్దు చేసింది. కార్పొరేట్ కంపెనీల లాభాలపై వేసే కార్పొరేట్ పన్నును 30 శాతం నుండి దశలవారిగా 25 శాతం కు నాలుగు సంవత్సరాలలో తగ్గిస్తామని ప్రకటించింది. ఎఫ్ డి ఐ (విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి) మరియు ఎఫ్ ఐ ఐ (విదేశీ సంస్థాగత పెట్టుబడి) లకు అనేక రాయితీలిచ్చింది. వాటాల అమ్మకం వలన వచ్చే లాభాలపై పన్ను (క్యాపిటల్ గెయిన్స్ టాక్స్) చెల్లింపునుండి మినహాయింపునిచ్చింది.

ఈ విధముగా స్వదేశీ విదేశీ బడా పెట్టుబడిదారులకు, సంపన్నులకు లక్షలాది కోట్ల అనుచిత రాయితీలిచ్చి అందువలన బడ్జెట్ లో ఏర్పడే లోటును భర్తీ చేసే పేరుతో ప్రభుత్వ రంగ సంస్థల వాటాలను అమ్మి (డిజిన్వెస్ట్మెంట్) తద్వారా రు.70,000 కోట్లు ఆదాయం సమకూర్చాలని, ప్రజలు వాడుకునే సరుకులపై పన్నులు (పరోక్ష పన్నులు) పెంచి తద్వారా అదనముగా రు.23383 కోట్లు ఆదాయం సమకూర్చుకోవాలని నిర్ణయించింది. లోటును తగ్గించేందుకు ప్రజా సంక్షేమానికి పెట్టె ఖర్చును (సబ్సిడీలను)  తగ్గించాలని నిర్ణయించింది.  గత సంవత్సరం (2014-15) లోనే ప్రభుత్వ ఖర్చును బడ్జెట్ లో కేటాయించినదానిలో 7 శాతం (రు. 1,14,000 కోట్లు) తగ్గించారు. గత సంవత్సరం 2014-15 లో ప్రభుత్వ ఖర్చుకు బడ్జెట్ కేటాయింపు జి డి పి (స్థూల జాతీయ ఉత్పత్తి) లో 10.8 శాతం కాగా ఇప్పుడు 2015-16 బడ్జెట్ లో 10.3 శాతం కు తగ్గింది. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి, ఆహార భద్రత పథకానికి కేటాయింపు ల నిజ విలువ పెరగకుండా స్తబ్ధముగా వున్నది. మొత్తం సబ్సిడీలు గత బడ్జెట్ లో జి డి పి లో 2.1 శాతం (రు. 2.60 లక్షలు)  కాగా ఇప్పుడు ఈ బడ్జెట్ లో 1.7 శాతం ( 2.44 లక్షలు)కు కుదించారు. ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమానికి గత బడ్జెట్ లో రు. 35,163 కోట్లు కేటాయించగా ఈ బడ్జెట్ లో రు.29,653 కోట్లు మాత్రమే కేటాయించారు. గృహనిర్మాణం మరియు పట్టణ పేదరిక నిర్మూలనకు గత బడ్జెట్ లో రు.6008 కోట్లు కేటాయించగా ఈ బడ్జెట్ లో రు.5634 కోట్లు మాత్రమే కేటాయించారు.

మోడీ బడ్జెట్ ఎస్ సి/ఎస్ టి/మహిళా/శిశు తదితర బలహీన తరగతులకు వ్యతిరేకముగా వున్నది.  ట్రైబల్ సబ్ ప్లాన్ కు కేటాయింపు గత బడ్జెట్ కన్నా ఈ బడ్జెట్ లో రు.5000 కోట్లు తగ్గింది. బడ్జెట్ లో ట్రైబల్ సబ్ ప్లాన్ కు 8.2 శాతం కేటాయించాలనే నిబంధనను ఉల్లంఘించి 5.5 శాతమే కేటాయించారు. ఎస్ సి సబ్ ప్లాన్ కు 17 శాతం కేటాయించాలనే నిబంధనను ఉల్లంఘించి 8.34 శాతమే (కేటాయించాల్సిన దానికన్నా రు.12000 కోట్లు తక్కువ) కేటాయించారు. మహిళా సాధికారికత మరియు అభ్యుదయానికి కేటాయించే జండర్ బడ్జెట్ కేటాయింపును గత బడ్జెట్ కన్నా ఈ బడ్జెట్ లో 20 శాతం (రు.20,000 కోట్లు) తగ్గించారు. సమగ్ర శిశు అభివృద్ధి పథకం (ఐ సి డి ఎస్) కు గత సంవత్సరం రు. 16,000 కోట్లు కేటాయించగా ఈ సంవత్సరం (2015-16) అందులో సగం రు.8000 కోట్లు మాత్రమే కేటాయించారు.

ఈ బడ్జెట్ లో అనేక ప్రతిపాదనలు ఉద్యోగులకు, కార్మికులకు వ్యతిరేకముగా వున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థల డిజిన్వెస్ట్మెంట్ ను పెద్ద ఎత్తున అమలు చేయాలని ప్రతిపాదించింది. గతం లో ఎన్నడూ లేనంతగా, రు.70,000 కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వ రంగ సంస్థల డిజిన్వేస్టుమెంటు ద్వారా 2015-16 సంవత్సరం లో సంపాదించాలని నిర్ణయించింది. ఇంతేగాక ప్రభుత్వ శాఖల ఆధీనములో వున్న ఓడ రేవులను కార్పొరేషన్లుగా మార్చాలని నిర్ణయించింది. వాటి ప్రయివేటీకరణకి ఈ విధముగా పునాది వేస్తున్నది. ఈ విధముగా ప్రభుత్వ రంగం పై పెద్ద దాడిని ప్రకటించింది. ఇన్కమ్ టాక్స్ మినహాయింపు పరిమితిని పెంచకుండా మధ్యతరగతి ఉద్యోగులను నిరుత్సాహపరచింది. ఈపీఎఫ్ అమలు జరుగుతున్న ఉద్యోగులను అది సరిగా పని చేయటం లేదనే సాకుతో దానినుండి తప్పించి నూతన పెన్షన్ విధానం కు దారి మళ్లించే ప్రయత్నం ఈ బడ్జెట్ లో కనపడుతున్నది. ఈ పి ఎఫ్ కు గాని లేదా నూతన పెన్షన్ విధానానికి గాని ఆప్షన్ ఇచ్చే అవకాశం ఇస్తామని బడ్జెట్ ప్రతిపాదించింది. ఈ పి ఎఫ్ నిధులను షేర్ మార్కెట్ జూదానికి ఎరగా వేసే అవకాశం అంతగా లేదు. అదే నూతన పెన్షన్ విధానమయితే ఉద్యోగుల పెన్షన్ కంట్రిబ్యూషన్ నిధులను పెన్షన్ ఫండ్ కంపెనీలు షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్ట వచ్చు. పెన్షన్ ఫండ్ కంపెనీలకు నష్టాలు వస్తే పెన్షన్ రాని పరిస్థితి నూతన పెన్షన్ విధానం లో ఎదురవుతుంది. ఇదే విధముగా  ఈ ఎస్ ఐ గాని ఆరోగ్య బీమా పథకానికి గాని ఆప్షన్ ఇస్తామని బడ్జెట్ ప్రతిపాదించింది. ఆరోగ్య నిధులను కూడా ఇన్సూరెన్సు కంపెనీల జూదానికి  మళ్లించే ప్రయత్నం ఇది.

మోడీ ప్రభుత్వ బడ్జెట్ నష్టాలలో వున్న ప్రభుత్వరంగ సంస్థలను ఆడుకునేందుకు ఎటువంటి ప్రతిపాదనలు చేయలేదు. నష్టాలలో వున్న ప్రభుత్వ రంగ సంస్థల డిజిన్వెస్ట్మెంటును ప్రతిపాదించింది. ఈవైఖరి బిఎస్ఎన్ ఎల్ పునరుద్ధరణకు వ్యతిరేకముగా వున్నది. బి డబ్ల్యూ ఏ స్పెక్ట్రమ్ ను వాపసు చేసినందుకు గాను అందుకు చెల్లించిన రు.6724 కోట్ల రూపాయిలను ప్రభుత్వము బి ఎస్ ఎన్ ఎల్ కు వెంటనే తిరిగి ఇవ్వాలని మనము డిమాండ్ చేస్తున్నాము. కానీ ప్రభుత్వము ఈ బడ్జెట్ లో ఇందుకుగాను కేవలము రు.830 కోట్లు మాత్రమే కేటాయించింది(2014-15 లో రు.100 కోట్లే చెల్లించింది). జబ్బు పడిన సంస్థగా ప్రకటించబడిన ఐటిఐ కి ఉద్యోగుల జీతాల చెల్లింపుకు మద్దతుగా రు. 150 కోట్లు, పునరుద్ధరణకు 50 కోట్లు  కేటాయించింది(గత సంవత్సరం జీతాల చెల్లింపుకు మద్దతుగా రు.165 కోట్లు కేటాయించింది. పునరుద్ధరణకు రు.460 కోట్లు కేటాయించి ఆ తరువాత దానిని రు.192 కోట్లకే కుదించింది).  కానీ ఆ సంస్థ పునరుద్ధరణకు రు. 4157 కోట్లు తో ఒక ప్యాకేజీని గత యు పి ఏ ప్రభుత్వము 12.2.2014న ఆమోదించినప్పటికి , ఈ పునరుద్ధరణ పథకాన్ని 18 నెలలలో  అమలు చేయాలని నిర్దేశించినప్పటికి అందుకవసరమయిన నిధులను కేటాయించలేదు. ప్రభుత్వ రంగ సంస్థల పునరుద్ధరణ పట్ల మోడి ప్రభుత్వానికి ఏ మాత్రమూ ఆసక్తి లేదని ఈ బడ్జెట్ కేటాయింపులు రుజువు చేస్తున్నాయి. అదే సందర్భములో ప్రయివేట్ టెలికాం కంపెనీలు వోడాఫోన్ మొదలగునవి చెల్లించాల్సిన వేల కోట్ల రూపాయిల క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ ను వదులుకోటానికి మోడి ప్రభుత్వము సంసిద్ధమయింది. 

మోడీ బడ్జెట్  గత యు పి ఏ ప్రజా వ్యతిరేక విధానాలనే మరింత జోరుగా అమలు జేసేదిగా వున్నది. విదేశీ స్వదేశీ పెట్టుబడిదారులకు మరిన్ని రాయితీలిస్తేనే వారు వచ్చి పెట్టుబడులు పెట్టి దేశాన్ని అభివృద్ధి చేస్తారని దాని వలన ఉద్యోగావకాశాలు విస్తృతంగా పెరుగుతాయనే  తర్కం దీని వెనుక వున్నది. ప్రజల కొనుగోలు శక్తి పెరగకుండా పెట్టుబడిదారులకు రాయితీలిచ్చి ఉత్పత్తిని పెంచినా పెంచిన ఉత్పత్తిని అమ్మేదెలా? కాబట్టి ప్రజల కొనుగోలు శక్తిని పెంచకుండా ఉత్పత్తి నిరంతరాయముగా పెరగటం సాధ్యము కాదు. ప్రపంచ వ్యాపితముగా ఆర్థిక మాంద్యం మరి కొన్ని సంవత్సరాలు కొనసాగే పరిస్థితిలో మన ఉత్పత్తులను ఇక్కడి ప్రజలు కొనలేక పోయినా విదేశాలలో అమ్మటం కూడా సాధ్యం కాదు. అందుకనే మన ఎగుమతుల రంగం మాంద్యం లో వున్నది. కాబాట్టి స్వదేశీ విదేశీ బడా పెట్టుబడిదారులకు భారీ స్థాయిలో అనుచిత రాయితీలిచ్చే విధానం, అందుకోసం ప్రజలకిచ్చే సబ్సిడీలను, సంక్షేమ పథకాలను కత్తిరించి వారి కొనుగోలు శక్తిని మరింత క్షీణింపజేయటం మంచిది కాదు. కార్పొరేత్సుకిచ్చే లక్షలాది కోట్ల అనుచిత రాయితీలను రద్దు చేసి ఆ నిధులను ప్రజా సంక్షేమానికి, మౌలిక వసతులు అమృయు వ్యవసాయ రంగాల అభివృద్ధికి ఖర్చు పెడితే ఆర్థిక ప్రగతి, ఉద్యోగ అవకాశాల పెరుగుదల తప్పకుండా సాధ్యమవుతుంది. కానీ ఎన్నికలలో తనకి మద్దతునిచ్చిన కార్పొరేత్సు రుణం తీర్చుకునేందుకు మోడీ వారికి భారీ రాయితీలిచ్చి ఆ భారాల్ని ప్రజలపై, ఉద్యోగులపై, కార్మికులపై, ప్రభుత్వ రంగా సంస్థాలపై మొపే పనిలో వున్నాడు. ఈ ప్రజా వ్యతిరేక విధానాలను కార్మికు, ఉద్యోగులు, ప్రజలు  ప్రతిఘటించాలి. ప్రజానుకుల ఆర్థిక విధానాల కోసం  పోరాడాలి.

ఈ పోరాటం లో భాగంగా , మోడి ప్రజా వ్యతిరేక బడ్జెట్ కు నిరసనగా 3.3.2015న ప్రదర్శనలు జరపాలని బి ఎస్ ఎన్ ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ సెంట్రల్ హెడ్ క్వార్టర్సు పిలుపునిచ్చింది. ఈ పిలుపుననుసరించి అన్నీ జిల్లా కేంద్రాలలో, ఇతర ముఖ్యమయిన కేంద్రాలలో ప్రదర్శనలు నిర్వహించాలని సర్కిల్ యూనియన్ విజ్ఞప్తి చేస్తున్నది
.
అభినందనలతో
బి ఎస్ ఎన్ ఎల్ ఎంప్లాయీస్ యూనియన్, ఆంధ్ర ప్రదేశ్ సర్కిల్


No comments:

Post a Comment