Thursday, November 5, 2015

ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు -బి.వి.రాఘవులు వ్యాసం

ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు
(బి.వి.రాఘవులు )
రిజర్వేషన్లు బలహీనవర్గాలకు, అంటే వివక్షకు గురయ్యే తరగతులకు ప్రభుత్వాలు ఇచ్చే సదుపాయం. బలహీనవర్గాలను ఆదుకోవ డానికి, వారి పట్ల ఉండే వివక్షను నిర్మూలించ డానికి ప్రభుత్వాలు అనేక రకాల చర్యలు తీసుకుంటాయి. వాటిలో రిజర్వేషన్లు ఒక భాగం. ప్రభుత్వాలు తీసుకునే వాటిని సాను కూల చర్యలు అంటాం. సానుకూలంగా తీసుకునే చర్యలు రకరకాల పద్ధతుల్లో ఉండొచ్చు. ఈ చర్యల సమూహంలో ఒక భాగమే రిజర్వేషన్లు. ఏదో ఒక రకమైన సానుకూల చర్యలు ప్రతి దేశంలోనూ ఉన్నాయి. అన్ని రకాల సానుకూల చర్యలు ఒక దేశంలోనే ఉండొచ్చు. కొన్ని దేశాల్లో కొన్ని రకాల చర్యలే ఉండొచ్చు. ఆ దేశంలో ఎవరైతే బలహీన వర్గాలుగా ఉంటారో, వివక్షకు గురవుతూ ఉంటారో అటువంటి వారికి సాయం చేసే ప్రయత్నాలు అన్ని దేశాల్లోనూ జరుగు తున్నాయి. అలాగే భారతదేశంలో కులవివక్ష అనేది ప్రధానాంశంగా ఉంది. ఇప్పటికి కూడా దళితులను అంటరానివారిగా చూస్తూ, వారిపట్ల అనేక విధాలుగా, అన్ని రంగాలలోనూ వివక్ష చూపుతున్నారు. బిసిలను అంటరానివారిగా చూడకపోయినా, వివక్షకు గురిచేస్తున్నారు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని, కుల వివక్షకు గురవుతున్న వారికి రిజర్వేషన్లు ఇవ్వాలని మనం కోరుతున్నాం.
మన దేశంలో మహిళల పట్ల కూడా వివక్ష చూపుతున్నారు. వివక్ష కొనసాగుతుంది కాబట్టి వారికి కూడా కొన్ని సానుకూల చర్యలు అమలు జరుపుతున్నారు. సానుకూల చర్యలలో భాగంగా స్థానిక సంస్థల్లో, ఉద్యోగాలలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించారు. అలాగే వికలాంగులకు మూడు శాతం రిజర్వేషన్లు కల్పించారు. అమెరికా, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో జాతి వివక్ష ప్రాతిపదికన ఉండే వ్యత్యాసాలను, అసమానతలను అధిగమించ డానికి కొన్ని సానుకూల చర్యలను అమలు జరుపుతున్నారు. చైనాలో వెనుకబడిన తెగలు, మైనారిటి జాతులు, కొండ ప్రాంతాలకు చెందిన ప్రజలు తదితరులను సమాజంలో అభివృద్ధి చెందినవారిస్థాయికి తీసుకురావడానికి సానుకూల చర్యలను అమలు చేస్తున్నారు. ప్రపంచంలో ఏ దేశాన్ని పరిశీలన చేసినా ఏదో ఒక మోతాదులో, కొన్ని తరగతుల ప్రజలకు సానుకూల చర్యలను అమలు చేస్తున్నారు
అమెరికా మనకన్నా ముందు పెట్టుబడి దారీ, ప్రజాస్వామ్య దేశంగా అభివృద్ధి చెందింది. మనకన్నా ముందు రాజ్యాంగాన్ని, ఎన్నికల విధానాన్ని ఏర్పాటు చేసుకున్న దేశం. నూటికి 98 మంది పట్టణాల్లో నివసిస్తున్నారు. కులవివక్ష లేనటువంటి దేశం. అయినా అలాంటి దేశంలో కూడా వివక్ష మూలంగా ఇంకా సానుకూల చర్యలు అమలు జరుగు తూనే ఉన్నాయి. ఇంగ్లాండులో కూడా కొన్ని తరగతులకు సానుకూల చర్యలు అమలు జరుగుతున్నాయి. ఇంత అభివృద్ధి అయిన దేశాల్లో కూడా ఇప్పటికి ఈ సానుకూల చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. వివక్ష ఉన్నంత కాలం, బలహీనవర్గాలు ఇతర తరగతులతో సమానంగా అభివృద్ధి కాలేనంతకాలం ఇటు వంటి సానుకూల చర్యలకు డిమాండ్‌ ఉంటుంది. పాలకులు అలాంటి చర్యలను అవస రాన్ని బట్టి ఉపయోగించుకుంటారు.
ఈరోజు గుజరాత్‌లో పటేళ్ళ ఉద్యమం జరుగుతున్నది. ఇస్తే అందరికి రిజర్వేషన్లు ఇవ్వండి లేదా అందరికీ రద్దు చేయండనే నినాదంతో ఈ ఉద్యమం జరుగుతున్నది. ఇటువంటి డిమాండ్లు, ఆందోళనలు అన్ని దేశాల్లో వస్తున్నాయి. అయినా అ డిమాండ్లను బట్టి సానుకూల చర్యలేమి ఆగిపోవడంలేదు.
ప్రపంచంలో వివిధ దేశాల్లో సానుకూలమైన చర్యలు ఉన్నాయి. అన్ని దేశాల గురించి పరిశీలించకపోయినా మూడు దేశాల గురించి తెలుసుకుందాం. ఆ మూడు దేశాలే ఎందు కంటే, ఈ మూడూ విభిన్నమైన పద్ధతుల్లో ఉన్నాయి. ఆ మూడు దేశాల్లో అమెరికా ఒకటి. అమెరికాలో మహిళలు, నల్లజాతి ప్రజలకు సంబంధించి ప్రధానమైన సానుకూల చర్యలు తీసుకుంటున్నారు. వివిధ తరగతుల సామా జిక, ఆర్థిక పరిస్థితులను మెరుగు చేయడం కోసం ఈ సానుకూల చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఈ రెండు తరగతులకు మాత్రమే పరిమితం చేయడం లేదు. లాటిన్‌ అమెరికన్‌ దేశాల నుండి వచ్చే స్పానిష్‌ మాట్లాడేవాళ్లు, మనలాంటి దేశాల నుండి వెళ్లిన ఆసియా జాతుల వారికి కొన్ని అవకాశాలు కల్పిస్తున్నాయి. వాళ్ల దేశ చట్టం ప్రకారం విశ్వవిద్యాలయాల్లో చదివేవాళ్లలో వైవిధ్యం ఉండాలి. ఈ వైవి ధ్యాన్ని చూపించడం కోసం ఇక్కడి నుంచి తెలివైన విద్యార్థులను తీసుకెళ్లి, వాళ్లకి స్కాలర్‌షిప్‌లను ఇచ్చి విద్యాలయాలలో చేరు కొని వైవిధ్యాన్ని చూపిస్తున్నాయి. రెడ్‌ ఇండియన్స్‌కు రిజర్వు చేసిన ప్రాంతం వారికి మాత్రమే ప్రత్యేకించి ఉంటుంది అమెరికాలో రిజర్వేషన్లు ఆ విధంగా అమలు జరుగు తున్నాయి. వైవిధ్యాన్ని పెంపొదించడం కోసం చర్యలు తీసుకుంటారు తప్ప రిజర్వేషను ఉండదు. ఇది అమెరికాలో పద్దతి. మొట్టమొదట ఈ వైవిధ్యమనేది అందరికి వర్తించలేదు. ప్రభుత్వ సహకారం పొందే వాళ్లు ఈ వైవిద్యాన్ని పాటించాలి. ప్రభుత్వం సహాయం పొందని యూనివర్సిటీలు ఉంటాయి. సంస్థలు వుంటా యి. ఈ సానుకూలమైన చర్యలు అనేవి వ్యక్తుల పట్ల చూపిస్తే రాజ్యంగానికి వ్యతిరేకం. ఈ చర్చలు, గొడవలు అమెరికాలో కొనసాగు తున్నాయి. వైవిధ్యం పాటించని కంపెనీల మీద కేసులు వేస్తాయి. వైవిధ్యం ఎందుకు లేదు అని విచారణ చేస్తారు. వైవిధ్యం లేకపోతే ఒత్తిడి చేస్తారు. ఇలాంటివి కొన్ని ఫలితాలు ఇస్తాయి. రంగు వివక్ష చాలా దుర్భరమైంది. ఈ విష యంలో ఇంకా అమెరికాలో మార్పు లేదని అంటున్నారు.
ఇక రెండో దేశం మలేషియా. 70శాతం ప్రజలు మలయా జాతికి చెందిన వారు. పాలకవర్గాలు మలయా జాతి వాళ్లే. మలయా జాతికి చెందిన వాళ్లే రాజులు. మలయా జాతికి చెందిన వాళ్లే పాలన కొనసాగించేవారు. డచ్‌వాళ్లు మలయా పాలకులు ఒప్పందం చేసుకున్నప్పుడు ఆర్థికంగా కీలకమైన ప్లాంటేషన్స్‌ను డచ్‌, ఇంగ్లీషు వాళ్లు ఆక్రమించు కున్నారు. చిన్నచిన్న పనుల్లోకి మలయా ప్రజలను నెట్టివేశారు. వెట్టిచాకిరి, గొడ్డుచాకిరి చేసే పరిస్థితుల్లోకి మలయా జాతి ప్రజలు వెళ్లిపోయారు. చైనా నుండి వచ్చిన కూలీలు పరిశ్రమలలో పనిచేసేవారు. పరిశ్రమలు ఎక్కడుంటే పట్టణాలు అక్కడ ఉంటాయి. పట్టణాల్లో చైనా వాళ్లు ఉన్నారు. గ్రామాల్లో మలయా జాతి ప్రజలు ఉన్నారు. ఆర్థిక అసమానతలు పెరిగాయి. మలేషియా కు స్వాతంతం వచ్చిన తర్వాత ఇది సామాజిక సమస్యగా తయారైంది. జాతీయ ప్రభుత్వాలు మలేజాతి ప్రజలకనుకూలంగా మలేషియాలో ఉండే ప్రతి కుటుంబానికి భూమి ఇచ్చారు. బ్యాంకుల అప్పులు, ఉద్యోగాల్లో 70శాతం ఇచ్చా రు. ఈ పాతిక ముప్ఫై సంవత్సరాలలో మలయా జాతి ప్రజల్ని అక్షరాస్యుల్ని చేయాలని, వారిలో పెట్టుబడిదారీ వర్గాన్ని తయారు చేయా లని ప్రయత్నించారు. మలయా ప్రజలను అభివృద్ధి చేయటానికి ఈ సానుకూల చర్యలను తీసుకున్నారు.
ఉత్తర ఐర్లాండ్‌: మార్క్స్‌్‌ ఇండియా గురించి రాసే దానికన్నా ముందే ఐర్లాండ్‌ గురించి రాశారు. జాతుల సమస్య గురించి రాసేటప్పుడు దీని గురించి రాసారు. ఐర్లాండ్‌ ఇంగ్లాండు పక్కనే ఉంటుంది. ఐర్లాండ్‌, ఇంగ్లాండు, స్కాట్లాండ్‌ పక్కపక్కనే ఉంటాయి. వీటన్నింటిని కలిపి గ్రేట్‌ బ్రిటన్‌ అంటారు. ఐర్లాండు ప్రధా నంగా వ్యవసాయ దేశం. ఉత్తర ఐర్లాండులో క్యాథలిక్కులు దక్షిణ ఐర్లాండులో ప్రొటెస్టెంట్లు మెజారిటిగా ఉండేవారు. మొత్తంగా ఐర్లాండులో చూసుకుంటే ప్రొటెస్టెంట్లు మెజారిటి. ఉత్తర ఐర్లాండు వీడిపోయిన తర్వాత క్యాథలిక్‌లు మైనారిటీగా మారారు. వారిని చాలా హీనంగా చూసేవారు. క్యాథలిక్కులు సాయుధ పోరాటం చేశారు. తర్వాత సంఘర్షణలను తగ్గించటం కోసం 1989లో ఫెయిర్‌ ఎంప్లాయిమెంటు చట్టం పెట్టారు. ఉపాధికి జనాభా నిష్పత్తిని పాటించడం వీటిలో ఒకటి. కొన్నిటికి అవసరమైన వారిలభ్యతను ప్రాతిపదికగా తీసుకున్నారు. ఒకవేళ అమలు జరపకపోతే కోర్టుకు వెళ్లొచ్చు. మూడు నాలుగు సార్లు విచారణ జరిపి ఆ తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ఆ రకంగా సంఘర్షణను నివారించడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఈ మూడు దేశాలను పరిశీలిస్తే మూడు రకాల వివక్షను అధిగమించడానికి సానుకూలమైన చర్యలను ఉపయోగిస్తున్నారు.
భారతదేశం: రాజ్యాంగంలో దళితులకు విద్యా ఉద్యోగాలలో 17 శాతం రిజర్వేషన్లు గ్యారంటి చేశారు. అర్హులు లేకపోతే ఆ స్థానా లను ఖాళీగా ఉంచుతారు. జనాభా నిష్పత్తి ప్రాతిపదిక మీద రిజర్వేషన్లు ఉంటాయి. రిజర్వేషన్లలో దళితులకు, గిరిజనులకు, వెనుకబడిన తరగతులకు 50 శాతం పరిమితిని విధించారు. జనాభా శాతానికి అనుగుణంగా రిజర్వేషన్లు వర్తింపజేయాలి. అంబేద్కర్‌ కంటే ముందుగానే రిజర్వేషన్లు వచ్చాయి. బ్రిటిషు వారు కూడా రిజర్వేషన్లు అమలు జరిపారు. రిజర్వేషన్లు మొదట దళితుల కోసం రాలేదు. హిందు, ముస్లింలను విభజించటం కోసం వచ్చాయి. ప్రారంభంలో రాజకీయ రిజర్వేషన్లు ఉన్నాయి. కమ్యూనల్‌ అవార్డు పేరుతో దీనిని అమలు చేశారు. విద్య, ఉపాధిలో రిజర్వేషన్లు మొదట బ్రిటిషు ప్రాంతంలోని దక్షిణ భారత దేశంలో ప్రారంభమయ్యాయి. జాతీయోద్యమం దాన్ని అంగీకరించింది. బ్రహ్మణ వ్యతిరేక ఉద్యమం దక్షిణాన బలంగా ఉంది. జాతీయోద్యమానికి అప్పట్లో రెండు సమస్యలు ఎదురయాయి 1. బ్రిటిషు వారికి వ్యతిరేకంగా భారతీయులందరిని ఐక్యం చేయాలి. 2. మతపరమైన ప్రాతిపదిక మీద ముస్లింలను వేరుచేసి, ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేయాలనే బ్రిటిషు వారి ప్రయత్నాన్ని ఎదుర్కోవాలి. దేశం విడిపోనక్కర్లేదని, అందరి ప్రయోజనాల పరిరక్షణ కోసమే జాతీయో ద్యమం ఉందని చెప్పారు. అటు ముస్లింలకు ఇటు దళితులకు రిజర్వేషన్లు కల్పించాలి. ఆరకంగా పాలక వర్గాలు రిజర్వేషన్లను కల్పించాయి. ప్రారం భంలో అంబేద్కర్‌ని అప్పటి కాంగ్రెసు ప్రభుత్వం ముంబయిలో ఓడించింది. ఆ తర్వాత బెంగాల్‌ నుండి ముస్లిం లీగ్‌ అభ్యర్థిగా గెల్చి రాజ్యాంగ సభ సభ్యుడయ్యారు. దేశ విభజన నిర్ణయంతో ఆ స్థానాన్ని కోల్పోయారు. కాంగ్రెస్‌ మనసు మార్చుకుని ఉప ఎన్నిక ద్వారా ఆయనను మళ్లీ గెలిపించి రాజ్యంగసభకు ఛైర్మెన్‌గా చేశారు. రాజ్యాంగంలో రిజర్వేషన్లను పొందుపర్చడంలో ఆయన కీలకపాత్ర నిర్వహించారు.
వివక్ష అనేది అనేక రూపాల్లో ఉంటుంది. సామాజిక ,ఆర్థిక, ఉపాధి, లింగ భేదంతో ఉండొచ్చు. పనుల్లో వివక్ష., వృత్తిరీత్యా వివక్ష. సంపద పరంగా వివక్ష. తదితరాలున్నాయి. అంటరానితనం వివిధ రూపాల్లో ఉంటుంది.
భారతదేశంలో కులవివక్ష ప్రధానమైనది. సమాజ నిర్మాణంలో నుంచి వచ్చిన కులవివక్ష, ఆర్థిక, సామాజిక రూపాల్లో కొనసాగు తున్నది. రుణాల్లో వివక్ష, మార్కెట్లో వివక్ష, వినిమయంలో వివక్ష చూస్తున్నాం. విద్య, వైద్య, ఉపాధి రంగాల్లో కూడా వివక్ష చూస్తున్నాం. భౌతికంగా కూడా వివక్షను చూస్తున్నాం.
సానుకూల చర్యలు కూడా అనేక రూపాల్లో ఉండవచ్చు. ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, విద్యలో రిజర్వేషన్లు అటువంటివే. కోటా విధానం, అలాగే ఇంకా అనేక రూపాల్లో సంక్షేమ హాస్టళ్ళలో నూటికి నూరుశాతం దళితులు, గిరిజనులు ఉంటారు. సానుకూల చర్యల్లో రిజర్వేషన్లు అనేది ఒకటి. ఉపాధిలో వాటా కోసం ప్రయివేటురంగంలో రిజర్వేషన్లు కావాలనే డిమాండు ముందుకొచ్చింది. సరళీకరణ విధానం తర్వాత అభివృద్ధి సమస్య ముందుకు వచ్చింది. అభివృద్ధికి సంబంధించి బడ్జెట్‌లో వాటా ఉండాలి. సబ్‌ప్లాన్‌ పరంగా అభివృద్ధి పథంలో ముందుకు పోవచ్చు. బడ్జెట్‌ను ధనవంతులు ఉపయోగించుకోవడం ఇప్పుడు ఎక్కువైంది.
సరళీకరణ విధానంలో సామాజిక న్యాయం దెబ్బతింది. విద్య, వైద్య సేవలను డబ్బు రూపంలోకి మార్చారు. రక్షిత మంచినీటి పథకం స్థానంలో నీళ్లని కొనే పద్దతిని రుద్దుతున్నారు. గ్యాస్‌సబ్సీడీ, విద్యుత్‌ సబ్సిడీ తీసేస్తామం టున్నారు. ఉచితంగా పొందే సర్వీసులన్నీంటిపై ఇలా దాడి చేస్తున్నారు.
బలహీనవర్గాలకు ఉపయోగపడే ఉపాధి హామీ, మధ్యాహ్న భోజన పథకానికి, రిజర్వేషను అనేవి ప్రభుత్వ ఆధీనంలో ఉన్న వాటిలో అమలు జరుగుతాయి. ప్రభుత్వ రంగంలో కూడా కాంట్రాక్టు పద్దతి ద్వారా ఉద్యోగాలను ప్రయివేటీకరణ చేస్తూ, రిజర్వే షన్లను వమ్ము చేస్తున్నారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న వాటిలో కూడా మినహాయింపు ఉన్నాయి. సరళీకరణ విధానాల వల్ల ఉన్న ప్రభుత్వ రంగం ప్రయివేటీకరణ అవుతున్నది.
పర్మినెంటు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ తదితర పేర్లతో కార్మికులను తీసుకుంటున్నపుడు రిజర్వేషన్లు అమలు కావటం లేదు. ఉన్న ప్రభుత్వ రంగాన్ని రక్షించుకుంటే రిజర్వేషన్లు ఉంటాయి. చాలా సంఘాలు మొక్కుబడిగా చేస్తున్నాయి. రాజ్యాంగంలో పెట్టిన రిజర్వే షన్లను బహిరంగంగా రద్దుచేసే శక్తి పాలక వర్గాలకు లేదు. ఈ రిజర్వేషన్లు ఉండే మూడు అంశాల కోసం పోరాటాలు చేయాలి. ప్రభుత్వ రంగాన్ని రక్షించుకోవడం, విద్యలో ప్రయివేటు రంగం ఉండకూడదనే డిమాండు చేయాలి. ప్రభుత్వ రంగాన్ని మనం రక్షించుకోవాలి. కాబట్టి ఈ సరళీకరణ విధానాలు తీసుకున్న ప్పుడు సామాజిక న్యాయం గురించి ఆలోచిం చాలి. ఉపాధి లాంటి వాటి కన్నా రాజకీయ రంగంలో రిజర్వేషన్లు ఉండాలని పాలకవర్గాలు ప్రయత్నం చేస్తాయి. పాలకవర్గాల్లో వైవిధ్యం ఉండాలని కోరుకుంటారు.100మంది పెట్టుబడి దారులుంటే కొంతమంది దళితులు ఉండటం, కొంత మంది ముస్లింలు ఉంటే పాలక వర్గాలకు లాభం. సానుకూలమైన చర్యలు అనేవి పెట్టుబడిదారులకు ఉపయోగపడేవి తప్ప విప్లవాలను ఉధృతం జ్ఞాపకం పెట్టుకోవాలి.
పెట్టుబడిదారులకు ఇప్పుడు ప్రభుత్వ రంగ అవసరం తీరిపోయింది కాబట్టి రద్దు చేయమంటున్నారు. ప్రభుత్వ రంగం ఉంటే కొన్ని ప్రయోజనాలు పొందవచ్చు. కాబట్టి మనం ఉంచమంటున్నాం. ఇతర అంశాలలో రిజర్వేషన్లు సక్రమంగా అమలు జరగకపోయినా రాజకీయ రిజర్వేషన్లు బలహీనవర్గాల్లో పకడ్బందీగా అమలు జరుగుతున్నాయి. రాజకీ య రిజర్వేషన్లు పాలకవర్గాలను సృష్టించడా నికి ఒక మార్గం. సామాజిక న్యాయం కోసం జరిగే పోరాటంలో ప్రైవేటురంగంలో రిజర్వే షన్ల కోసం జరిగే పోరాటం ముఖ్యమైన అంశంగా ఉంది.
ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు వద్దు అనే వాదనకు, రిజర్వేషన్లను రద్దు చేయాలి అనే వాదనకు పెద్ద వ్యతాస్యం లేదు. కొత్త వాదన ఏమిటంటే విదేశీ పెట్టుబడులు వస్తే మనదేశం అభివృద్ధి అవుతుంది. సమ్మెలు, ఆందోళనలు చేస్తే విదేశీ పెట్టుబడులు రావనే పేరుతో కార్మికుల సమ్మెలు, ఆందోళనలపై ఆంక్షలను విధిస్తున్నారు. కార్మిక చట్టాలు అమలు చేస్తే విదేశీ పెట్టుబడులు రావు. అలాగే సరళీకరణ విధానాలకు, రిజర్వేషన్లకు పొత్తు కుదరదని ప్రచారం చేస్తున్నారు. సరళీకరణ విధానంలో మార్కెట్టు అన్ని అంశాలను నిర్ణయం చేయాలి. చట్టాలు యజ మానుల కనుకూలంగా, పట్టువిడుపులతో వినియోగించుకొనే విధంగా ఉండాలి. రిజర్వే షన్లు యజమాని తన అవసరాలకను గుణంగా కార్మికులతో వ్యవహరించటానికి అటంకం కల్పిస్తాయి. అందువలన ప్రయివేటీకరణ విధా నాలు తీవ్రమౌతున్న క్రమంలో విదేశీ పెట్టుబ డుల రాక, అభివృద్ధి పేరుతో పాలకవర్గాలు రిజర్వేషన్లకు మొత్తంగా ఎసరు పెడుతున్నాయి.
ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించ టానికి బిజెపి వ్యతిరేకంగా ఉంది. ప్రభుత్వ రంగంలో ఉన్న రిజర్వేషన్లను సైతం రద్దు చేయాలని ఆర్‌యస్‌యస్‌, బిజెపిలు చర్చను ప్రారంభించాయి. నిరుద్యోగం పెరిగే కొద్ది దళి తులు, గిరిజనుల్లో చేరితే మాకు కూడా ఉద్యోగాలు వస్తాయన్న ఆశలు పెరుగుతున్నాయి.
ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు ్ల వస్తే బాగుపడతామని అనుకునేవాళ్లు చాలా మంది ఉంటారు. మధ్యతరగతి వాళ్ళు ప్రయివేటు రంగంలో రిజర్వేషన్ల పట్ల ఆసక్తిగా ఉన్నారు. ప్రైవేటురంగంలో రిజర్వేషన్లపై ఆసక్తి ఉన్న తరగతుల నన్నిటినీ సమీకరించాలి. రిజర్వే షన్లతో పాటు సబ్‌ప్లాన్‌ కోసం జరుగుతున్న ఆందోళనలోనూ వీరిని భాగస్వాములుగా చేయాలి. ఈ విధంగా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఆందోళన బలోపేతమైతేనే, ఈ కోర్కెలను సాధించుకోవటం సాధ్యమౌతుంది. సామాజిక న్యాయానికి సంబంధించిన ఈ ముఖ్యమైన అంశం మీద మనం కృషి చేయాల్సిన అవసరం ఉంది.
- బి వి రాఘవులు
రచయిత సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు

No comments:

Post a Comment