Sunday, October 6, 2013

భాషా ప్రవర్ధకులు

 మన రాజకీయ వేత్తల భాషా పరమైన సేవను చెప్పడానికి భాష చాలదనాలి. ఎందుకంటే వారు అనేక అసభ్య పదాలను వాడటం ద్వారా ఆమోదం కల్పిస్తుంటారు. పరస్పర దూషణలో భాగంగా నిత్య నూతనమైన తిట్లను సృష్టిస్తుంటారు. తమ కుంభకోణాలతో అక్రమాలతో అనేక కొత్త పదాలనూ వాడుకలోకి తెస్తుంటారు. ఉదాహరణకు స్కామ్‌, కిక్‌బాక్స్‌, వంటి మాటలకు గతంలో ఇంత ప్రఖ్యాతి వుండేది కాదు. అలాగే తెలంగాణా నోట్‌ సందర్భంగానే టేబుల్‌ నోట్‌ అనే మాట తెలుగువారికి సుపరిచితమైంది. అనిశ్చితి అన్న మాట ఇప్పుడు సర్వసాధారణమై పోయింది. అంతకు ముందు అసమ్మతి, కబ్జా, భూబకాసురుడు, అక్రమార్కులు వంటి మాటలన్నీ వారి పుణ్యమే!
ఈ దేశంలో ప్రథమ కుటుంబంగా అనధికార హోదా సాగించుకునే సోనియా తనయుడైన రాహుల్‌ గాంధీ కూడా ఈ కోవలో తక్కువ తిన్నాడా? ఆయన మాటలే కాక చేతలు కూడా జోరుగా వుంటాయి. మొదట ప్రొబేషన్‌లో వున్న ప్రధానిగా చాలా కాలేజీలు యూనివర్సిటీలు తిరుగుతూ విద్యార్థులతో కాలక్షేపం చేశారు. ఆ తర్వాత దశలో తాత రాసిన డిస్కవరీ ఆఫ్‌ ఇండియా పేరుకు తగినట్టే దేశాటన చేశారు. ఎన్నికల పోరాటంలో దూకి వెన్ను విరుచుకున్నారు. అడుగు పెట్టినచోటనల్లా అపజయాలు మూటకట్టుకొచ్చారు. అయితేనేం? ఆయన యువరాజు! ప్రధాని పదవిని మొదట ఆయన తల్లిగారు తర్వాత ఆయన త్యాగం చేశారంటూ నిరంతరం ఊదరగొడుతుంటారు కాంగ్రెస్‌ వందిమాగధులు. సరే ఎవరి భక్తి లేక భుక్తి వారిదని సరిపెట్టుకోవచ్చు. కాని ఆయన మాత్రం అవన్నీ నిజమే అనుకుని రెచ్చిపోవడంతోనే చిక్కు వస్తుంటుంది. ఉదాహరణకు అయిదేళ్ల కిందట పార్లమెంటులో అణు ఒప్పందంపై హోరాహోరీ వాదనలు జరిగినప్పుడు మొదటిసారి అరంగేట్రం చేసిన రాహులుడు ఎవరో కళావతి అనే వితంతు మాత ఆమె పిల్లల కోసం ఈ బిల్లు అవసరమంటూ అదరగొట్టారు. తర్వాత ఆ కళావతికైనా సహాయం అందింది లేదు. అయోధ్య సమస్య, పాకిస్తాన్‌తో సంఘర్షణ తదితర అనేక కీలకాంశాలపై నాలుక పారేసుకున్న యువరాజా వారు తర్వాత వాటిని సవరించుకున్న దాఖలాలైనా లేవు.
ఇక తాజాగా నేరస్థ సభ్యుల అనర్హత ఆర్డినెన్సుపై ఆయన అగ్గినిప్పులే కక్కి అహో అనిపించుకున్నారు. బాగానే వుంది. కాని సర్వాధికార నేతకు దీనిపై జరిగిన చర్చగాని తీసుకుంటున్న చర్యలు గాని తెలియవనుకోవాలా? ఈ బిల్లును చించేయాలని చిందులు తొక్కిన వారు ముందే కాస్త సైగ చేసి వుంటే మన్మోహన్‌జీ అంగుళమైనా అడుగేసేవారా? కాని అంత చప్పగా చెబితే సత్తా ఏం తెలుస్తుంది? ముందు ఆర్డినెన్సు రావాలి. తర్వాత తాను ఆగ్రహించాలి. అప్పుడది వెనక్కుపోవాలి. నిజానికి రాహులుడు బాబాయి సంజరు గాంధీ, నాన్న గారైన రాజీవ్‌ గాంధీ మార్గమే అనుసరిస్తున్నారనుకోవాలి. ఎమర్జెన్సీలో సంజరు గాంధీ ఆంధ్ర ప్రదేశ్‌ పర్యటనకు వచ్చినపుడు పవిత్రమైన పాదరక్షలు మర్చిపోతే రాష్ట్ర నేతలు అతి వినయంగా అందించి వచ్చారని కథలు చెప్పుకున్నారు. ఆయన గారి దుర్మరణంతో రంగ ప్రవేశం చేసిన రాజీవ్‌ గాంధీ నాయకత్వం తొలిదశలో హైదరాబాదు వస్తున్నారని ముఖ్యమంత్రి అంజయ్య ఎంతో అభిమానంగా అట్టహాసంగా విమానాశ్రయానికి వెళితే అందరి సమక్షంలో అవమానించారు. దీనిపై శాసనసభలో సుందరయ్య నాయ కత్వంలో ప్రతిపక్ష సభ్యులందరూ లేచి నిలబడి రాష్ట్ర ప్రజల తరపున మౌన నిరసన తెలిపారు! తర్వాత ఎన్టీఆర్‌ హయాంలో రాజీవ్‌, సోనియాలు వచ్చినపుడు ఆమె తనను బెదిరించారంటూ ఒక మాజీ ఎంపి గగ్గోలు పెట్టారు. కీర్తిశేషుడైన ఆ ఎంపి తర్వాత ఆ పార్టీలోనే చేరి ఆమెకు విధేయుడుగా మెలగడం మరో విపరీతం. ఏమైతేనేం ఈ పరంపరను రాహుల్‌ గాంధీ జాగ్రత్తగా పాటిస్తున్నారు గనకే అప్పుడప్పుడు అధికార పూర్వకంగా పార్టీ, ప్రభుత్వ పెద్దలపై విరుచుకు పడుతుంటారు. ఈ మధ్య ఆర్డినెన్సు విషయంలో ఆయన వ్యాఖ్యలకు మన్మోహన్‌ సింగ్‌ వంటి మహా విధేయ ప్రధాని కూడా మనసు కష్ట పెట్టుకోవలసి వచ్చిందంటే అవి ఏ స్థాయిలో వున్నాయో తెలుసుకోవచ్చు. ఇప్పుడు దాన్ని వెనక్కు తీసుకున్నారు కూడా. అయితే ఈ సందర్భంగా తాను ఉపయోగించిన భాష బాగాలేదని అమ్మ చెప్పిందని తల్లిచాటు కొడుకులా మాట్లాడుతున్న యువరాజు కుటుంబ వరవడికి అద్దం పట్టారని చెప్పాలి. ప్రజాస్వామ్యం పేరుతో రాచరిక పద్ధతులు అమలు జరిగే దేశంలో పరిస్థితులు ఇంతకన్నా భిన్నంగా వుంటాయా?
సరే నరేంద్ర మోడీ గారిది మరో పద్ధతి. ఆయన మనుషుల గురించి మతాల గురించి దేశాల గురించి చాలా తేలిగ్గా మాట్లాడుతుంటారు. గుజరాత్‌ నరమేధం గురించి అడిగితే కారు కింద కుక్కపిల్లపడి చనిపోతే ఎలాగో అలాగే బాధపడతానన్నారు. ఇది బాగాలేదంటే అందులో కరుణ రసం చూడమని కాళిదాసులా భంగిమ దాల్చారు. ఇప్పుడు దేవాలయాల కన్నా మరుగుదొడ్ల అవసరం చాలా వుందంటూ అపర మానవతా మూర్తిలా సెలవిచ్చారు. ఆలయాల పేరిట అగ్గిరాజేసిన పార్టీ అత్యున్నత నేత ఇలా చెప్పడంలో ఆత్మ వంచన పరవంచన కూడా మాటలకందేవి కావు. ఆకలిగొన్న వాడికి అద్వైతం గాక అన్నం అవసరమని వివేకానందుడు అనడం వేరు. ప్రతిదీ స్థాయి తక్కువ భాషలో ఇష్టానుసారం వాకృచ్చే నరేంద్ర భాషణం వేరు. నిజానికి ఈ దేశంలో మరుగుదొడ్ల కొరత చాలా ఎక్కువగానే వుంది. కాని తమ పార్టీ నిన్నటి అగ్రనేత అద్వానీ గుజరాత్‌లోనే సోమనాథ్‌ నుంచి అయోధ్య పేరుతో రథయాత్ర ప్రారంభించి నప్పుడు మొత్తం నిర్వహణ బాధ్యత చూసిన మోడీకి అప్పుడు ఈ సూక్తి గుర్తురాలేదా? ఇదే మాట మరెవరైనా అని వుంటే మతాన్ని అవమానించారని అఘాయిత్యం చేసేవారు కాదా? నిజానికి మోడిఫికేషన్‌ అన్నమాటను కమోడిఫికేషన్‌ అని చమత్కరించడం సరైందేనని తన మాటలతో బిజెపి'ప్రధాని' నిరూపించుకున్నారు. భాషకు ఇన్ని విధాల సేవలందిస్తున్న ఈ నేతలను ఎన్ని బిరుదులిచ్చి సత్కరించుకుంటే సరిపోతుంది?
(prajasakti 5.10.2013)

No comments:

Post a Comment