Sunday, October 6, 2013

బాధ్యతా రాహిత్యం

తెలంగాణా నోట్‌ ఆమోదం వార్తల తర్వాత కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో పెరిగిన 
అలజడిని చల్లార్చేందుకు కేంద్రం చొరవ చూపకపోవడం శోచనీయం. వాస్తవానికి ఈ అంశంపై రాజకీయ లెక్కలతో రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసిన దోషం కాంగ్రెస్‌ది కాగా అందుకు దోహదం చేసిన అవకాశవాదం తెలుగుదేశం, వైసీపీ వంటి పార్టీలది. ఈ విషయంలో రాూ ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి, ఆయన మంత్రివర్గ సహచరులు, కేంద్రం మంత్రుల ధోరణి మరింత హాస్యాస్పదంగా ఉంది. ప్రక్రియ అమలయ్యే ఆఖరి ఘట్టం వరకూ అధిష్ఠానానికి అత్యంత విధేయులుగా వ్యవహరించిన వీరే ఇప్పుడు వీరంగం తొక్కుతూ సమైక్య రాగమాలపించడం ప్రజల ఇంగితాన్ని పరిహసిస్తోంది. రాజీనామాలకు సిద్ధమంటూనే ఎడతెగని మల్లగుల్లాలు పడటంలోనే ఈ నేతల నిజ స్వరూపం స్పష్టం. తీర్మానాన్ని ఓడించేందుకే తాము కొనసాగుతున్నామన్న వివరణ ఇస్తూనే వివాదపడటంలో కనిపించేది రాజకీయ భవిష్యత్తు కోసం తాపత్రయం తప్ప ప్రజల పట్ల బాధ్యత కాదు. తెలంగాణా నిర్ణయం తర్వాత ఇతర ప్రాంతాల ప్రజల్లో తలెత్తిన సందేహాలను, సమస్యలనూ పరిష్కరించేందుకు భరోసా కల్పించవలసిన కేంద్రం ఆ బాధ్యతను పూర్తిగా విస్మరించింది. నోట్‌ తర్వాతనైనా అలాటి నిర్దిష్ట చర్యలు ప్రకటించే బదులు ఉత్తుత్తి హామీలతో సరిపెట్టజూస్తున్నది. సహజంగానే ఇలాటి సందర్భాలలో ప్రజల్లో ఆవేశం, అసహనం పెరుగుతున్నాయి. పాలక పక్షాల నేతలూ అవి పెరిగే ఎత్తుగడలే అనుసరిస్తూ పబ్బం గడుపుకొంటున్నారు. విశాల ప్రయోజనాల కన్నా వివాదాస్పద సంకుచిత రాజకీయలే వారికి ముఖ్య మవుతున్నాయి. నిన్నటి మా సంపాదకీయంలో వైసీపీ, తెలుగుదేశం వైరం గురించి చేసిన వ్యాఖ్యలకు తగినట్టే ఈ రోజు అనంతపురంలో ప్రత్యక్ష ఘర్షణ పడ్డారు. జగన్‌, చంద్రబాబు పోటాపోటీ నిరాహారదీక్షలు ప్రకటించారు. ఇవన్నీ ఎలా పరిణమిస్తాయో తెలియదుగాని అసలు సమస్యలను దారి తప్పించి అవాంఛనీయ ఘర్షణలకు దారి తీయొచ్చు. ఆ మాటకొస్తే కాంగ్రెస్‌లోనే వివిధ బృందాలు వివిధ రకాలుగా ఎత్తులు, పై ఎత్తులు వేస్తున్నాయి. పిసిసి అధ్యక్షుడితో సహా పాలక పార్టీకి చెందిన పలువురిపై ప్రజాగ్రహం వ్యక్తం కావడం యాదృచ్ఛికం కాదు. ఏది ఏమైనా ఈ సమయంలో స్వార్థ రాజకీయ శక్తుల సంకుచిత వ్యూహాలకు బలికాకుండా ప్రజలు అప్రమత్తత వహించాలి. అలాటి వారి ఆట కట్టించాలంటే అనవసరమైన అధికార ప్రధానమైన విన్యాసాలు కట్టిపెట్టి నిజమైన సమస్యలపై చర్చ జరగాలి. అన్ని పార్టీలతో రౌండ్‌ టేబుల్‌ జరగాల్సిన సమయంలో కేంద్ర క్యాబినెట్‌ టేబుల్‌ నోట్‌ అంటూ కొత్త ఉద్రిక్తత రగిలించింది. దీనిపై స్పందన ఏమిటో ప్రత్యక్షంగా అర్థమై ఉండాలి. ఈ తరుణంలో పరిస్థితిని మరింత దిగజార్చేబదులు సిపిఎం సూచించినట్టు అఖిలపక్ష సమావేశం జరిపి అందరి అభిప్రాయాలతో పరిష్కారం కోసం ప్రయత్నించాలి. ఎన్నికల కోసం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అన్ని పార్టీలు చెప్పినందువల్లనే తీసుకున్నట్టు అధికార పక్షం పదే పదే చెబుతున్నది. క్యాబినెట్‌ నోట్‌లోనూ అదే ఉంది. ఆ తర్కం ప్రకారమే అయినా నిర్ణయం అమలు పర్యవసానాలు, పరిష్కారాలపైనా ఆయా పార్టీల అభిప్రాయాలను తెలుసుకోవడం మంచిది. ఏ పార్టీ అయినా పరిపరివిధాల మాట్లాడే బదులు తాము ఏం కోరుకుంటున్నదీ చెప్పడానికి అలాటి వేదిక భూమిక అవుతుంది. ఉత్తరోత్తరా చట్టసభల్లో చర్చకు వచ్చినప్పుడు కూడా ఎవరేమిటో తెలుస్తుంది.

No comments:

Post a Comment