Sunday, January 5, 2014

2014 సంవత్సర సదసత్సంకల్పం

విధాన పరమయిన ప్రత్యామ్నాయ నిర్మాణములోభాగస్వాములమవుదాము
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2013 కన్నా 2014 మెరుగుగా వుంటుందని ఆశించుదాము. “Ring out the old, ring in the new” ( పాత  కి వీడ్కోలు, కొత్తకి స్వాగతం) అని లార్డ్ టెన్నిసన్ అన్నారు. ప్రతి సంవత్సరం అంతకి ముందు సంవత్సరం కన్నా బాగుండాలని ఆశిస్తాము. అయితే జీవితం ఒక నిరంతర కొనసాగింపు కాదని అనుభవం రుజువు చేస్తున్నది. 2013 లో మనకి ఇష్టమయినవి కొన్ని ముగింపు పలికాయి. ప్రతీకాత్మకమయిన టెలిగ్రామ్ కథ ముగిసింది. సచిన్ టెండూల్కర్ కవితాత్మక క్రికెట్  ముగిసింది. డబ్బా ఫిలిమ్ రీలు కథ ముగిసింది. “ధూమ్-3” పూర్తిగా డిజిటల్ ఫిలిమ్ అని బాలీవుడ్ ప్రకటించింది. ఇంకా అనేకం ఇటువంటివి ముగిశాయి. వీటి గురించి తెలియజేయటం చరిత్ర బాధ్యత.
ఢిల్లీ లో ఆం ఆద్మీ పార్టీ ప్రభుత్వము ఏర్పాటు చేయటంతో 2013 ముగిసింది. వారికి అభినందనలు తెలియజేస్తున్నాము. అయితే ఆం ఆద్మీ పార్టీ పాలన 2014లో ప్రారంభమయింది. ఒక కొత్త పార్టీ ఎన్నికలలో బ్రహ్మాండముగా గెలవటం గతం లో భారత ప్రజాస్వామ్యం లో అనేక సార్లు జరిగింది. ఎన్.టి. రామారావు నాయకత్వములో తెలుగు దేశం సాధించిన అఖండ విజయం ఇందుకు ఒక ఉదాహరణ. అయితే అటువంటి పార్టీల మనుగడ, కొనసాగింపు అవి అనుసరించే విధానాలపై , అమలు చేసే కార్యక్రమాలపై ఆధారపడి వుంటుంది. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వము విషయములో కూడా ఇదే వర్తిస్తుంది. ప్రజల కడగండ్లు పెంచే నయా ఉదారవాద ఆర్థిక విధానాల పట్ల  తన విధానాన్ని, కార్యక్రమాన్నీ   2014లో ఆప్ ప్రకటిస్తుందని ఆశించుదాము. భారత దేశ లౌకిక, ప్రజాతంత్ర  పునాదిని సవాలు చేస్తున్న మతోన్మాదం పట్ల తన విధానమేమిటో 2014 లో ఆప్ ప్రకటిస్తుందని ఆశించుదాము.
2013లో మన దేశ ప్రజానీకం పై మోపబడిన ఆర్థిక భారాలు 2014 లో మరింత తీవ్రము కావని ఆశించుదాము. అయితే మన దేశము అనుసరిస్తున్న ఆర్థిక విధానాలలో సమూలమయిన మార్పు వస్తేనే ఇది సాధ్యము. కానీ 2014 ప్రారంభములోనే కుకింగ్ గ్యాస్, పెట్రోలు, డీజీలు ధరలు మళ్ళీ  పెంచారు. ఆర్థిక భారాలు మోపటానికి కారణం ప్రపంచ ఆర్థిక సంక్షోభమేనని అనటం ఇప్పుడు మామూలయింది. ప్రపంచ ఆర్థిక సంక్షోభం కొనసాగే పరిస్థితే వున్నది. 2013 లో కోలుకుంటున్నట్లు అనిపించినా అది నిలకడగా లేదు. 2008 లో ప్రారంభమయిన ప్రపంచ ఆర్థిక సంక్షోభం ప్రభావాన్ని ఆనాడు భారత దేశం తట్టుకుని నిలబడగలిగింది. కానీ అది ఎక్కువ కాలం కొనసాగలేదు. ఇప్పుడు భారత దేశం ఈ ఆర్థిక సంక్షోభ భారం ఒత్తిడికి సతమతమవుతున్నది.దీనిని  తిప్పికొట్టాలంటే మన దేశ వనరులను, మార్కెట్లను విదేశీ, స్వదేశీ పెట్టుబడిదారుల  లాభాపేక్షకు  కట్టబెడుతున్న హద్దూ అదుపూ లేని ఆర్థిక సంస్కరణల నుండి మన దేశం వైదొలగాలి. మన దేశ వనరులను స్వదేశీ ఆర్థిక అభివృద్ధికి, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకి వినియోగించాలి.
 ప్రజలకు కాంగ్రెస్, బి జె పి విధానాలలో తేడా కనపడటం లేదు. రెండు పార్టీలు ఆర్థిక విధానాలలో, అవినీతిలో ఒకే రకముగా వున్నాయి. స్పెక్ట్రమ్ కుంభ కోణాలు, బొగ్గు గనుల కుంభ కోణాలు వాజపాయీ పరిపాలనా కాలములో కూడా జరిగినందున వాటిపై లోతయిన చర్చ జరగనీయకుండా పార్లమెంటులో అల్లర్లు సృష్టించి వాయిదా పడేలా చేసే కార్యక్రమాన్ని బి జె పి అమలు చేస్తున్నది. ఈ విషయములో కాంగ్రెస్, బి జె పి ల మధ్య “మ్యాచ్ -ఫిక్సింగ్” జరిగింది. సరళీకరణ విధానాలను కాంగ్రెస్, బి జె పి లు ఉమ్మడిగా బలపరుస్తున్నాయి. కోట్లాది ఉద్యోగులకు ఆర్థిక భద్రత లేకుండా చేసే విధముగా పెన్షన్ ఫండ్స్ లో విదేశీ పెట్టుబడులను అనుమతించటం, బ్యాంకుల జాతీయకరణను వమ్ము చేసే విధముగా ప్రయివేటీకరణ, విదేశీ ఫైనాన్సు సంస్థలకు హద్దూ అదుపూ లేకుండా  అనుమతించి మన దేశాన్ని అంతర్జాతీయ పెట్టుబడి జూదగొండితనానికి బలిచేయటం తదితర విధానాలను , కాంగ్రెస్, బి జె పి లు రెండూ కలిసి అమలు చేస్తున్నాయి.
2014 లో ఈ విధానాలను మార్చే అవకాశం వస్తుంది. పాలక పార్టీని మార్చటానికే గాక విధానాలను మార్చటానికి కూడా 2014 లో జరిగే ఎన్నికలు అవకాశం కలిగిస్తాయి. భారత ప్రజలు, వారు కావాలనుకుంటే, రానున్న సార్వత్రిక ఎన్నికలు ఇచ్చే అవకాశాన్ని వినియోగించుకుని ప్రత్యామ్నాయ విధానాలను అమలు చేయగలిగే రాజకీయ ప్రత్యామ్నాయాన్ని ముందుకు తీసుకు రావచ్చు. ప్రత్యామ్నాయ విధానం అంటే ప్రజలకు హక్కులు కల్పించటమే గాని భిక్షగా వేసే విదిలింపులతో సరిపెట్టటం కాదు. ఆహార భద్రత, ఉచిత వైద్యం, ఉచిత విద్య, పని హక్కు లేదా తగినంత నిరుద్యోగ భృతి, వృద్ధులకు వికలాంగులకు సార్వత్రిక సంరక్షణా పథకాలు హక్కుగా కల్పించటం అనేది ప్రత్యామ్నాయ విధానానికి పునాదిగా వుండాలి. ఇటువంటి ప్రత్యామ్నాయ విధానం ఆవశ్యకత కేవలం మానవతా దృక్పథం కోసం మాత్రమే కాదు. అది ఆర్థికపరముగా చాలా హేతుబద్ధమయిన విధానము. ఈ హక్కులు ప్రజలకి కల్పిస్తే అప్పుడు ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. దానివలన స్వదేశీ డిమాండు పెరిగి తద్వారా వస్తువుల తయారీ పరిశ్రమలకు, ఉద్యోగావకాశాలు పెద్ద ఎత్తున పెరగటానికీ ప్రోత్సాహం లభిస్తుంది. అభివృద్ధి నిరంతరాయముగా కొనసాగటానికి, అసమానతలు తగ్గటానికి అది దారి తీస్తుంది.
ఈ హక్కులు కల్పించటానికి అవసరమయిన వనరులు మన దేశములో పుష్కలముగా వున్నాయి. ఇప్పుడు వాటిని ప్రజలకు అందుబాటులోకి రానీయకుండా విదేశీ స్వదేశీ పెట్టుబడి దారులు అవినీతికర పద్ధతులలో దోచుకుంటున్నారు. ఈ భారీ స్థాయి అవినీతిని ఆపి, సంపన్నులకు ఇస్తున్న లక్షలాది కోట్ల పన్నుల మినహాయింపులను రద్దు చేసి అందు వలన లభించే భారీ నిధులతో ప్రభుత్వము ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాల కోసం పెట్టుబడిగా పెట్టాలి. మౌలిక వసతులు(రైల్వే, టెలికాం, రోడ్లు, విద్యుత్తు, ఓడ రేవులు, ఓడలు, విమానాశ్రయాలు, రవాణా సౌకర్యాలు  తదితరాలు) నిర్మించటానికీ పెట్టుబడిగా పెట్టాలి. దీనివలన  ఉద్యోగావకాశాలు మరింత ఎక్కువగా పెరుగుతాయి. అవసరమయిన మౌలిక వసతులు అందుబాటులోకి వస్తాయి. కానీ అటువంటి ప్రత్యామ్నాయాన్ని అమలు చేయటానికి అవసరమయిన రాజకీయ సంకల్పం మన దేశానికి కావాలి.
కాబట్టి మన దేశానికి కావాల్సింది ఎన్నికల ప్రత్యామ్నాయం మాత్రమే కాదు. విధానపరమయిన ప్రత్యామ్నాయం అంతకన్నా ముఖ్యం. 2014లో అటువంటి వామ పక్ష, ప్రజాస్వామిక, లౌకిక ప్రత్యామ్నాయం కోసం భారత దేశం ఎదురు చూస్తున్నది.
అటువంటి ప్రత్యామ్నాయం కోసం శక్తివంతమయిన ప్రజా పోరాటాలు జరిగిన సంవతరముగా 2014 చరిత్రలో నమోదు కావాలని, అందుకోసం మనమంతా కృషి చేయాలని ఆశిస్తున్నాము.  దానితో పాటు 2014 ఎన్నికలలో మత తత్వ శక్తులను తిరుగులేని విధముగా  ఓడించి మన దేశ లౌకిక ప్రజాస్వామిక  పునాదులను కాపాడుకోవాలి. మెరుగయిన భారత దేశాన్ని నిర్మించటానికి.  ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు ఈ కర్తవ్యాలను నిర్వహించాల్సిన అవసరం వున్నది.
(ఇది “పీపుల్స్ డెమోక్రసీ” జనవరి 2014 సంచికలో ప్రచురితమయిన  సీతారాం యేచూరి వ్యాసానికి స్వేచ్ఛానువాదం...అశోకబాబు)


No comments:

Post a Comment