Thursday, January 30, 2014

4 జి సర్వీసులు అందించబోతున్న ప్రయివేటు టెలికాం కంపెనీలు-మరి బి ఎస్ ఎన్ ఎల్ పరిస్థితి ఏమిటి?


టెలికాం కంపెనీలకు మొబైల్ సర్వీసులపై వచ్చే ఆదాయములో వాయిస్ కాల్స్ పై వచ్చే ఆదాయమే అత్యధికం. కానీ క్రమంగా డేటా సర్వీసుల పై (మొబైల్ ఫోన్ లో ఇంటర్నెట్) ఆదాయం పెరుగుతున్నది. భవిష్యత్తులో డేటా సర్వీసులపై వచ్చే ఆదాయం గణనీయముగా పెరుగుతుంది. కాబట్టి పోటీలో నిలబడ దలచుకున్న టెలికాం కంపెనీలు డేటా సర్వీసుల పై కేంద్రీకరిస్తున్నాయి. అందుకు వీలుగా తగిన స్పెక్ట్రమ్ బ్యాండ్ ను కొనటానికి, నెట్ వర్కును అప్గ్రేడ్ చేయటానికీ ప్రయత్నిస్తున్నాయి.
డేటా సర్వీసులను 2 జి స్పెక్ట్రమ్ ద్వారా ఇస్తే స్పీడు తక్కువగా వుంటుంది. 3 జి పై అయితే అంతకన్నా ఎక్కువ స్పీడ్ వుంటుంది. 4 జి అయితే మరింత ఎక్కువ స్పీడ్ వుంటుంది. మొబైల్ ఫోన్ లో ఇంటర్నెట్ చూసే వాళ్ళు ఎంత ఎక్కువ వీలయితే అంత ఎక్కువ స్పీడ్ తో డేటా సర్వీసులు కావాలనుకుంటారు.
ప్రస్తుతం ప్రయివేటు టెలికాం కంపెనీల వద్ద, బి ఎస్ ఎన్ ఎల్ వద్ద 3 జి స్పెక్ట్రమ్ వున్నది. కానీ 4 జి స్పెక్ట్రమ్ కొన్ని కంపెనీలకు మాత్ర్రమే వున్నది. 4 జి సర్వీసులు ఇవ్వటానికి ఉపయోగ పడే 2300,2600  మెగాహెట్జ్ బ్యాండ్స్ స్పెక్ట్రమ్ వేలం 2010 లో జరిగింది. ఈ బ్యాండ్స్ నే బి డబ్ల్యూ ఏ స్పెక్ట్రమ్ బ్యాండ్స్ అని కూడా ఆంటారు. అయితే ప్రభుత్వము అప్పుడు ఈ బ్యాండ్స్ లో బి ఎస్ ఎన్ ఎల్ కు ఇచ్చిన బి డబ్ల్యూ ఏ స్పెక్ట్రమ్ నాసిరకంది ఇచ్చారు. దానిని ఉపయోగించి 4 జి సర్వీసులు ఇవ్వాలంటే అందుకవసరమయిన టెక్నాలజీకి చాలా ఎక్కువగా పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. అయినప్పటికి దానికి వేలములో నిర్ణయించబడిన మార్కెట్ రేటును బి ఎస్ ఎన్ ఎల్ నుండి ప్రభుత్వము వసూలు చేసింది. గిట్టుబాటు కానీ ఈ స్పెక్ట్రమ్ ను బి ఎస్ ఎన్ ఎల్ ప్రభుత్వానికి తిరిగి ఇచ్చింది. అందుకోసం బి ఎస్ ఎన్ ఎల్ చెల్లించిన రు. 6700 కోట్లను బి ఎస్ ఎన్ ఎల్ కు వాపసు ఇవ్వాలని ప్రభుత్వము నిర్ణయించింది. కానీ 2010 లో జరిగిన వేలములో ప్రయివేటు కంపెనీలు మంచి నాణ్యమయిన బి డబ్ల్యూ ఏ స్పెక్ట్రమ్ ను పొందాయి.
 ఆ వేలములో ఇన్ఫోటెల్ 22 సర్కిల్సుకు (అంటే దేశములో అన్నీ సర్కిల్సుకు) బి డబ్ల్యూ ఏ స్పెక్ట్రమ్ ను కొన్నది.  ఆ తరువాత ఈ కంపెనీని ముకేష్ అంబానీ కంపెనీ “రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్” కొన్నది. కాబట్టి రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ కు ఈ విధముగా దేశ వ్యాపితముగా అన్నీ సర్కిల్సులో 4 జి సర్వీసులు ఇవ్వటానికి వీలయిన స్పెక్ట్రమ్ లభించింది. ఎయిర్టెల్ 4 సర్కిల్సులో,  ఎయిర్సెల్ 8 సర్కిల్సులో కొన్నాయి. కాల్కమ్ అనే అమెరికా కంపెనీ 4 సర్కిల్సులో బి డబ్ల్యూ ఏ స్పెక్ట్రమ్ ను కొని ఆ తరువాత తన కంపెనీ భారత శాఖలో 51 శాతం పైగా ఎయిర్టెల్ కు అమ్మలని నిర్ణయించింది. ఈ కార్యక్రమం 2014 కు పూర్తవుతుంది. ఈ విధముగా ఎయిర్టెల్ కు మరో 4 సర్కిల్సు లో బి డబ్ల్యూ ఏ స్పెక్ట్రమ్ దొరుకుతుంది. తికోణ అనే మరొక బ్రాడ్ బ్యాండ్ కంపెనీ 5 సర్కిల్సులో బి డబ్ల్యూ ఏ స్పెక్ట్రమ్ ను కొన్నది. ఈ విధముగా ప్రస్తుతం రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ కు దేశం లో అన్నీ సర్కిల్సులో, ఎయిర్టెల్ కు 8 సర్కిల్సులో, ఎయిర్సెల్ కు 8 సర్కిల్సులో, తికోణ కు 5 సర్కిల్సులో బి డబ్ల్యూ ఏ స్పెక్ట్రమ్ వున్నది. దీనితో అవి 4 జి సర్వీసులు ఇయ్యవచ్చు. 4 జి సర్వీసుల స్పీడు 3 జి కన్నా 10 నుండి 12 రెట్లు ఎక్కువగా వుంటుంది.
త్వరలో రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ అన్ని సర్కిల్సులో 4 జి సర్వీసులు దానితో పాటు వాయిస్ సర్వీసులు ప్రారంభించబోతున్నది. ఎయిర్టెల్ ఇప్పటికే కలకత్తా, బెంగళూరు, పూనా వంటి కొన్ని నగరాలలో 4 జి సర్వీసులు ప్రారంభించింది. తమిళనాడు సర్కిల్ లో ఎయిర్సెల్ త్వరలో 4జి సర్వీసులు ప్రారంభించబోతున్నది. వోడాఫోన్ దగ్గర 4 జి సర్వీసులకు పనికి వచ్చే బి డబ్ల్యూ ఏ స్పెక్ట్రమ్ ప్రస్తుతం లేదు. అయినప్పటికి అది తన నెట్ వర్కు ను ఇంటర్నెట్ ప్రోటోకాల్ సామర్థ్యం గల నెట్ వర్క్ గా అప్ గ్రేడ్  చేసేందుకు పూనుకుంటున్నది. ఇందుకు సంవత్సరానికి రు.5000 కోట్ల చొప్పున రెండు మూడు సంవత్సరాలు పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. అందుకు అది సిద్ధముగా వున్నది. ఆ విధముగా నెట్ వర్క్ ను అప్గ్రేడ్ చేసిన అనంతరం అది వాయిస్ కాల్స్ తో పాటు డేటా సర్వీసులను కూడా ఎక్కువ స్పీడ్ తో ఇవ్వటానికి వీలవుతుంది. ఫిబ్రవరి 2014 లో జరిగే స్పెక్ట్రమ్ వేలము లో పాల్గొని అందులో 2 జి సర్వీసులకు ప్రస్తుతం వినియోగిస్తున్న 1800 ఎం‌హెచ్‌జెడ్ బ్యాండ్ నే 5 మెగాహెర్ట్జ్ కొని దానితో 4 జి సర్వీసులు ఇచ్చే ఆలోచనతో ఐడియా సెల్యులార్ వున్నది.
 2జి సర్వీసులకు వినియోగిస్తున్న 900/1800 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ బ్యాండ్ తోనే 4 జి సర్వీసులు ఇయ్య వచ్చు. అయితే ఇంతకు ముందు ఇవ్వబడిన 900/1800 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ బ్యాండ్ ను 2 జి సర్వీసులకు మాత్రమే వినియోగించాలానే  షరతు వున్నది. ఇప్పుడు ప్రభుత్వము 2012 లో జరిగిన, ఆ తరువాత జరిగే వేలములో అమ్మబడే 1800 మెగాహెర్ట్జ్ బ్యాంక్డ్ స్పెక్ట్రమ్ ను 2 జి సర్వీసులకే గాక 4 జి సర్వీసులు ఇవ్వటానికి కూడా వినియోగించవచ్చునని నిబంధనలను సడలించింది. దీనినే స్పెక్ట్రమ్ లిబరలైజేషన్ అంటారు. కాబట్టి ఈ స్పెక్ట్రమ్ లిబరలైజేషన్ విధానం ప్రకారం ఈ సంవత్సరం జరిగే  వేలము లో 1800 మెగాహెర్ట్జ్ బ్యాండ్ స్పెక్ట్రమ్ ను కొని దానితోనే 4జి సర్వీసులు ఇచ్చే ప్రయత్నము లో ఐడియా వున్నది.

కానీ బి ఎస్ ఎన్ ఎల్ పరిస్థితి ఏమిటి? 4 జి సర్వీసులు ఇచ్చే వీలున్న బి డబ్ల్యూ ఏ స్పెక్ట్రమ్ ను అది పైన తెలియజేసిన కారణాలవలన ప్రభుత్వానికి వాపసు ఇచ్చింది. కాబట్టి అది ప్రస్తుతము 2 జి సర్వీసులను ఇస్తున్న 900/1800 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ బ్యాండును వినియోగించి 4 జి సర్వీసులను ఇయ్య వచ్చు. ఈ బ్యాండ్స్ స్పెక్ట్రమ్ బి ఎస్ ఎన్ ఎల్ వద్ద పుష్కలముగా వున్నది. కానీ బి ఎస్ ఎన్ ఎల్ కు ఈ బ్యాండ్ స్పెక్ట్రమ్ ను 2010 కి ముందే కేటాయించటం జరిగినందున దానిని 2 జి కి తప్ప మరి ఏ ఇతర సర్వీసులు ఇవ్వటానికి కూడా వినియోగించకూడదనే నిబంధన వర్తిస్తుంది. ఒక వేళ ఈ బ్యాండ్ తోనే 4 జి సర్వీసులు ఇవ్వాలంటే అందుకు ఈ బ్యాండు స్పెక్ట్రమ్  కు 2012 లో జరిగిన వేలములో నిర్ణయించబడిన ధరను బి ఎస్ ఎన్ ఎల్ చెల్లించాల్సి వుంటుంది. ఇది అనేక వేల కోట్ల రూపాయిలు అవుతుంది. అంత చెల్లించగలిగే పరిస్థితి నష్టాలలో వున్న బి ఎస్ ఎన్ ఎల్ కు లేదు. ప్రభుత్వము రూల్సు సడలించి ఈ చెల్లింపుతో నిమిత్తము లేకుండా అనుమతిస్తేనే ఇప్పుడు తనవద్ద వున్న 900/1800 మెగాహెర్ట్జ్ బ్యాండ్ స్పెక్ట్రమ్ ను ఉపయోగించి 4 జి సర్వీసులిచ్చి పోటీలో నిలబడగలగటం బి ఎస్ ఎన్ ఎల్ కు సాధ్యమవుతుంది.

No comments:

Post a Comment