Sunday, January 12, 2014

వివేక పథం

నేడు వివేకానందుడి 150వ జయంతి
నవీన భారత స్ఫూర్తిప్రదాతల్లో ఒకరైన వివేకానందుడి నూట యాభయ్యవ జయంతి ఆయన ఆదర్శాలను స్మరించుకోవడానికి సరైన సందర్భం. స్వాతంత్య్ర పోరాట చైతన్యం ఇంకా పొటమరించక ముందు దశకు చెందిన వివేకానందుడు నాటి యువత పట్టుదలకూ, దీక్షా దక్షతలకూ, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిల్చిపోయాడు. కర్తవ్య నిర్వహణ తప్ప శుష్క వేదాంత ప్రవచనాలలో మునిగితేలడం వృథా అని ఘంటాపథంగా చెప్పిన ధీశాలి. ఆనాటి యూరోపియన్‌ పునరుజ్జీవ భావన,  భారత దేశంలో మొదలవుతున్న భక్తి ఉద్యమం వంటి వాటి సారాంశాన్ని జీర్ణం చేసుకుని మానవ సేవయే మాధవ సేవ అనగలిగాడు. సాటి మనుషులకు సేవ చేయకుండా ఉపాసనలు ఎన్ని చేసినా, ఉపవాసాలు ఉన్నా ఉపయోగమేమిటని నిలదీశాడు. మనుషుల్లోనే దైవత్వాన్ని చూడాలన్న తన సందేశానికి అనుగుణంగానే సేవా సంస్థలు స్థాపించడానికి ప్రేరణ అయ్యాడు. క్రైస్తవ మతబోధకుల తరహాలో మిషన్‌ అన్న పదాన్ని కూడా తీసుకుని రామకృష్ణ మిషన్‌ స్థాపించాడు.

దైవ స్వరూపులమంటూ అమాయకులను మోసగించే బూటకపు స్వాముల వలలో పడవద్దని హెచ్చరించిన దూరదృష్టి ఆయనది. పుట్టపర్తి సాయిబాబా చివరి క్షణాలు, ఇటీవల నిత్యానంద స్వామి, ఆశారాం బాపూ వంటి వారి వ్యవహారాలు చూస్తే ఆయన హెచ్చరికలో ఎంత దూరం చూపు ఉందో అర్థమవుతుంది. అలాగే మతాల పేరిటనే గాక ఒకే మతంలో శాఖల దురభిమానంతో కత్తులు దూసుకోవద్దని ఆయన హితవు చెప్పారు. ఇలాటి వ్యర్థ యుద్ధాలతో చరిత్ర రక్తసిక్తమైందని ఆవేదన చెందుతారు. కర్మ పేరిట ప్రకృతి వైపరీత్యాలను కూడా భరించాలనే వారి మూర్ఖత్వంపై నిప్పులు చెరిగాడు.

మతం పేరిట మానవీయతను మరుగున పర్చడాన్ని ఆయన అనుమతించలేదు. శిథిలాలయమ్ములో శివుడు లేడోయి అని పాడిన భావకవుల మాదిరిగానే మనుషులను ఆదుకోలేని మతం వ్యర్థమన్నాడు. అన్నిటికన్నా ఆయన ప్రత్యేకత సామాజిక సత్యాలు కొన్నిటిని గుర్తించడంలో కనిపిస్తుంది. వైజ్ఞానిక రంగంలో వెనకబడిపోవడం వల్లనే భారత దేశంతో సహా ప్రాచ్య ప్రపంచం దుర్బలపడిపోయిందని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. విజ్ఞాన శాస్త్రం లేకుండా వికాసం లేదన్నాడు. సోషలిజం భావనను గురించి ప్రస్తావిస్తూనే తనదైన వర్ణ పరిణామ సిద్ధాంతం ప్రవచిస్తాడు. చాతుర్వర్ణ వ్యవస్థ ప్రకారం మొదట బ్రాహ్మణులు, తర్వాత క్షత్రియులు పాలించారంటూ దృష్టాంతాలు చూపిస్తాడు. ఇప్పుడు వర్తకులు అంటే పెట్టుబడిదారుల పెత్తనం నడుస్తుందని, రేపు శూద్రులు అంటే శ్రామికుల రాజ్యం రావడం ముగింపు అనీ నాటి తన అవగాహనగా చెప్పాడు. శాస్త్రీయ దృక్పథం ప్రకారం చూస్తే అనేక పరిమితులు ఉన్నా వీటి వెనక ఉన్న స్ఫూర్తి మాత్రం గుర్తించవలసిందే.

విస్తారంగా అందుబాటులో ఉన్న వివేకానందుడి రచనలు, వచనాలు చూస్తే మత ప్రబోధం కన్నా వ్యక్తిగత దీక్షా దక్షతలు పెంచుకోవాలన్న సందేశం ప్రధానంగా గోచరిస్తుంది. లేచి నిలబడు, లక్ష్యం సాధించే వరకూ విశ్రమించకు అన్న ఆయన సూక్తి అందరికీ అన్ని వేళలా వర్తిస్తుంది. యువతకు కావలసింది ఉక్కు నరాలు, ఇనుప కండరాలు అన్న ఆయన మాటలు చూసినప్పుడు నెత్తురు నిండే శక్తులు మండే సైనికులారా రారండి వంటి వాక్యాలు మదిలో మెదులుతాయి. ఆకలితో నకనకలాడే వాడికి ఆధ్యాత్మిక ప్రబోధాలేమిటని ఆయన చేసిన ఆక్షేపణ మందిరాలు, మసీదుల పేరిట మంటలు పెట్టే మతోన్మాద శక్తులపై పోరాటానికి ప్రేరణగా తీసుకోవలసిందే. మానవీయత, సేవా నిరతి, ఉక్కు సంకల్పం, వైజ్ఞానిక దృష్టి ఇవన్నీ వివేకానందుడిని ఉత్తేజ ప్రదాతగానే నిలిపి ఉంచుతాయి. ఈ నూటయాభయ్యవ జయంతి నాడు స్మరించుకోవలసినవీ ఆ లక్షణాలే.


(ప్రజాశక్తి 12.1.2014 సంపాదకీయం నుండి)

No comments:

Post a Comment