Thursday, January 9, 2014

కార్మికులు వ్యవసాయం నుండి పరిశ్రమలకు కాకుండా పరిశ్రమల నుండి తిరిగి వ్యవసాయానికి తరలి వెళ్ళే పరిస్థితి రాబోతున్నది –క్రిసిల్ సంస్థ నివేదిక

క్రిసిల్ (CRISIL= క్రెడిట్ రేటింగ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఆఫ్ ఇండియా లిమిటెడ్) అనేది ఒక రేటింగు సంస్థ. దాని వ్యాపారం మూడు రకాలు. 1. క్రెడిట్ రేటింగు-ఒక కంపెనీకి ఏ మేరకు అప్పు ఇయ్య వచ్చు అనేది పరిశీలించి అప్పు ఇచ్చే సంస్థలకి చెపుతుంది.2. పరిశోధన-వివిధ కంపెనీల ఈక్విటీ, ఋణ గ్రహణ యోగ్యత, రిస్కు తదితర అంశాలపై పరిశోధన చేస్తుంది. 3. సలహా-విధానాల విషయములో కంపెనీలకు సలహాలిస్తుంది.

ఈ సంస్థలో అత్యధిక వాటాలు “ స్టాండర్డ్ అండ్ పూర్” అనే  కంపెనీవి. స్టాండర్డ్ అండ్ పూర్స్ , అమెరికా ఆర్థిక రంగ పరిశోధనా సంస్థ మెక్ గ్రా హిల్ ఫైనాన్సియల్ లో ఒక విభాగం. ఈ విధముగా ఈ క్రిసిల్ సంస్థ పై పెత్తనం అంతిమముగా అమెరికా కంపెనీ మెక్ గ్రా హిల్ ఫైనాన్సియల్ దే.

ఈ క్రిసిల్ సంస్థ 7.1.2014 న ఒక పత్రికా ప్రకటన ఇచ్చింది. దీని ప్రకారం భారత దేశం లో వ్యవసాయేతర ఉద్యోగిత 2004-05 నుండి 2011-12 వరకు 5 కోట్ల 20 లక్షలు పెరిగింది. కానీ 2011-12 నుండి 2018-19 వరకూ  3 కోట్ల 80 లక్షలు మాత్రమే పెరుగుతుంది. ఈ విధముగా వ్యవసాయేతర ఉద్యోగిత పెరుగుదల రానున్న 7 సంవత్సరాలలో 25 శాతం పడి పోతుంది. ఆర్థిక వ్యవస్థ పెరుగుదల మందగించినందున, పరిశ్రమలు మరియు సేవల రంగాలలో శ్రామిక సాంద్రత తగ్గుతున్నందున ఈ పరిస్థితి ఏర్పడింది. తయారీ రంగములో ప్రతి 1 శాతం ఉత్పత్తి అభివృద్ధికి 2005 లో ఉద్యోగిత 0.68 పెరగగా, 2012 నాటికి ఇది 0.17 కు పడి పోయింది. ఈ విధముగా ఆర్థిక మాంద్యం, ఆటోమేషన్ ల వలన పరిశ్రమలు, సేవల రంగాలలో కార్మికుల పెరుగుదల తగ్గుతున్నది. దీనివలన వ్యవసాయేతర రంగాల నుండి  వ్యవసాయ రంగానికి 2013-19 మధ్య కాలం లో 1 కోటి 20 లక్షల మంది కార్మికులు  తరలించ బడతారు.

వ్యవసాయ రంగం ఉత్పత్తి స్థూల జాతీయ ఉత్పత్తిలో 14 శాతమే. కానీ వ్యవసాయ రంగం లో ఉద్యోగిత,  మొత్తం ఉద్యోగిత లో 49శాతం. కాబట్టి వాస్తవానికి వ్యవసాయ రంగం నుండి వ్యవసాయేతర రంగానికి శ్రామికులు తరలి వెళ్లాల్సిన అవసరం వున్నది. శ్రామికులు ఈ విధముగా గతం లో వ్యవసాయ రంగము నుండి వ్యవసాయేతర రంగాలకు తరలి వెళ్లారు. 2004-05 నుండి 2011-12 మధ్య కాలం లో వ్యవసాయ రంగం నుండి 3 కోట్ల 70 లక్షలమంది శ్రామికులు వ్యవసాయేతర రంగాలకు తరలి వేళ్ళారు. కానీ ఇప్పుడు ఇందుకు విరుద్ధముగా జరగ బోతున్నది. 2013-2019 మధ్య కాలములో వ్యవసాయేతర రంగాల నుండి వ్యవసాయ రంగానికి 1 కోటి 20 లక్షల మండి శ్రామికులు తరలి వెళతారు.

భారత ఆర్థిక వ్యవస్థ పెరుగుదల 2004-05 నుండి 2011-12 వరకూ సగటున సంవత్సరానికి 8.5 శాతం వుండగా ఇది 2013-2019 మధ్య కాలం లో 6 శాతమే వుంటుంది. ఈ పెరుగుదల కూడా ఉద్యోగిత పెరుగుదలకి అంతగా అవకాశం లేని ఫైనాన్సియల్, రియల్ ఎస్టేట్, మరియు ఐ టి వంటి బిజినెస్ సర్వీసెస్ రంగాలలోనే వుంటుంది. 2012 లో ఈ రంగాలనుండి ఉత్పత్తి, మొత్తం స్థూల జాతీయోత్పత్తిలో 19 శాతం కాగా  ఉద్యోగిత, మొత్తం ఉద్యోగితలో 1 శాతం మాత్రమే.

ఇదీ క్రిసిల్  పరిశోధన సారాంశం. మరి అది సూచించిన పరిష్కారం ఏమిటి? ఉద్యోగిత పెరగాలంటే ఆర్థిక మాంద్యం తొలగి పోవాలి. ఆర్థిక మాంద్యం తొలగించేందుకు పెట్టుబడుల విషయములో కార్పొరేట్సుకు వున్న అవరోధాలను, మౌలిక వసతుల అభివృద్ధి కోసం పెట్టే పెట్టుబడులపై వున్న అవరోధాలనూ తొలగించాలి. తయారీ రంగం లో ఉద్యోగిత పెంచాలంటే అందుకు అవరోధముగా వుంటున్న కార్మిక చట్టాలను సరళీకరించాలి(కార్మిక హక్కులు చట్టాలనుండి తొలగించాలని దీని అర్థం). శ్రామికులు ఎక్కువ మంది  అవసరమయ్యే టెక్స్ టైల్స్, వజ్రాలు, నగలు, తోళ్ళ పరిశ్రమలలో వున్న అవరోధాలను తొలగించాలి.

అమెరికా-భారత బడా పెట్టుబడి దారుల పరిశోధనా సంస్థ అయిన క్రిసిల్, భారత ఆర్థిక వ్యవస్థ రాబోయే 7 సంవత్సరాల కాలం లో మాంద్యం లోనే వుంటుందనీ, కోలుకునే అవకాశం లేదనీ గుర్తించింది. కానీ ఈ సంక్షోభం నుండి బయట పడాలంటే పెట్టుబడి దారులకు పెట్టుబడుల పై వున్న అన్ని అవరోధాలనూ తొలగించాలని,  అదే సందర్భములో కార్మిక హక్కులు కత్తిరించాలని అంటున్నది.  ఆర్థిక సంక్షోభం భారాన్ని కార్మికుల పై, ప్రజల పై మోపాలనేదే ఈ పరిశోధన సారాంశం.

ప్రజల కొనుగోలు శక్తి పెరగకుండా మన ఆర్థిక వ్యవస్థ మాంద్యం నుండి బయట పడటం సాధ్యం కాదు. ప్రజల కొనుగోలు శక్తి పెరగాలంటే మన దేశ వనరులను విదేశీ, స్వదేశీ పెట్టుబడిదారులకు అభివృద్ధి పేరుతో అప్పగించటం కాకుండా ప్రభుత్వమే ఆ వనరులను ప్రజలకి అనుకూలమయిన ఆర్థిక అభివృద్ధికి వినియోగించాలి. పెట్టుబడి దారులకు ప్రతి సంవత్సరం ఇస్తున్న ఋ.5 లక్షల కోట్ల పన్నుల మినహాయింపులను రద్దు చేస్తే ప్రభుత్వానికి ఋ.5 లక్షల కోట్లు ప్రతి సంవత్సరం అందుబాటులోకి వస్తాయి. మన దేశములో, ఇతర దేశాలలో మన సంపన్న వర్గాలు అక్రమముగా కూడా బెట్టిన నల్ల ధనాన్ని స్వాధీనం చేసుకుంటే ఋ.60లక్షల కోట్లకు పైగా దొరుకుతుంది. ఈ విధముగా సమకూర్చుకున్న సొమ్ముతో ప్రజలపై ఎటువంటి భారాలూ విధించాల్సిన అవసరం లేకుండా వ్యవసాయం పై, మౌలిక వసతుల పై ప్రభుత్వము పెట్టుబడులు పెట్టి ఉద్యోగిత కల్పనకు అవసరమయిన అభివృద్ధిని సాధించ వచ్చు. ఈ పని కాంగ్రెస్, బి జె పి, టిడి పి, వై ఎస్సార్ సి పి, టి ఆర్ ఎస్ వంటి బూర్జువా-భూస్వామ్య పార్టీలు చేయవు. అవి చేసేది సెంటిమెంట్లు రెచ్చగొట్టి ప్రజలను దారి మళ్లించటమే.  మన దేశ సమస్యలకు నిజమయిన పరిష్కారం చూపించగల శక్తులు వామ పక్షాలు, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, ప్రజాతంత్ర శక్తులు మాత్రమే. వాటిని బలపరచి విధాన పరమయిన ప్రత్యామ్నాయాన్ని సృష్టించటమే పరిష్కారం.

No comments:

Post a Comment