Wednesday, January 8, 2014

దొందూ దొందే; గుజరాత్ అభివృద్ధి నిజ స్వరూపం; బి డబ్ల్యూ ఏ స్పెక్ట్రమ్ ఫీజు బి ఎస్ ఎన్ ఎల్ , ఏం టి ఎన్ ఎల్ కు వాపసు పై రేపు కేబినెట్ సమావేశం

దొందూ దొందే
అవినీతిపై పోటాపోటీగా మాటల తూటాలు పేల్చే కాంగ్రెస్‌, బిజెపిలు అవినీతిపరులను అందలమెక్కించేందుకూ పోటీ పడుతుండడం జుగుప్సాకరం. కర్ణాటక లోకాయుక్తలో నమోదైన ఒక భూ కుంభకోణం కేసు ఛార్జిషీట్‌ ప్రకారం ఎడ్యూరప్ప ఎ1 కాగా కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వము కేబినెట్‌లోకి కొత్తగా తీసుకున్న శివకుమార్‌ ఆరవ నిందితుడు. ఇప్పుడు ఒకరు కాంగ్రెస్‌లోనూ, ఇంకొకరు బిజెపిలోనూ ఉండడం చిత్రం ... భళారే విచిత్రం అనిపిస్తోంది కదా! బెణిగహళ్లిలో నాలుగెకరాల భూమిని సిఎం హోదాలో ఎడ్యూరప్ప డీనోటిఫై చేశారట. కర్ణాటక ప్రభుత్వరంగ సంస్థ మైసూర్‌ మినరల్స్‌ నుంచి 10.8 లక్షల టన్నుల నాణ్యమైన ఇనుప ఖనిజ రేణువులను అమ్మి భారీగా సొమ్ముచేసుకున్నాడీ శివకుమార్‌. అవినీతి, బంధుప్రీతి ఆరోపణలతో న్యాయస్థానాలేగాక జనం ఛీకొట్టిన ఎడ్యూరప్పను తిరిగి బిజెపి అక్కున చేర్చుకోవడం మరో వైపరీత్యం. పార్టీని వీడి కర్ణాటక జనతా పక్ష (కెజెపి) పేరిట వేరే పార్టీని పెట్టిన ఆ పెద్ద మనిషి ఇప్పుడు బేషరతుగా బిజెపిలోకి వెళ్లడం ఇరు పక్షాలకూ సిగ్గుచేటే! ఎడ్యూరప్ప నాయకత్వంలోని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం చెప్పలేనంత అవినీతిలో కూరుకు పోయింది. ఆంధ్రప్రదేశ్‌, కర్ణా టకల్లో అక్రమ మైనింగ్‌ మహా సామ్రా జ్యాన్ని నిర్మించుకున్న గాలి జనార్దనరెడ్డి ఆయన అనుంగు శిష్యుడే! కాకపోతే ఎడ్యూరప్ప ఒక బలమైన సామాజిక తరగతికి ప్రతినిధిగా ఉండడంవల్ల బిజెపి సోషల్‌ ఇంజనీరింగ్‌లో ఒక సాధనంగా ఉపయోగపడతారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలోని బలమైన ఆ సామాజిక తరగతిని పార్టీ ఓటు బ్యాంకుగా మార్చుకోవచ్చని వారి ఆశ కావచ్చు. కర్ణాటకలోనే గాదు దేశమంతటా ఆ రెండు పార్టీల తీరు ఇలాగే ఉంది. ఒక పార్టీకి మరొకటి వ్యతిరేకమని అంటున్నా ఇలాంటి విషయాల్లో దొందూ దొందే. ఇక దేశాన్ని అధోగతి పట్టిస్తున్న నయా ఉదారవాద విధానాల్లో ఆ రెండు పార్టీలకూ తేడా ఏమాత్రమూలేదు. అమెరికా సామ్రాజ్యవాదానికి, అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడికి సాగిలపడ్డంలోనూ పోటీ పడతారు. కానీ ఒక పార్టీకి వ్యతిరేకంగా మరో పార్టీ నిప్పులు చెరుగుతుంటాయి. నిజానికి వారు నిప్పులన్నీ వేస్తున్నది జనంపైనే. ఏ పార్టీ అధికారానికి వచ్చినా ప్రజలపై పడేది భారమే తప్ప కలిగే ఊరట లేదు. మాటల గారడితో మోసగించే పార్టీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కేవలం నాయకుల మాటలు, ప్రాసలు కాకుండా ఆ పార్టీ అనుసరించే విధానాలను పరిశీలించాలి. దేశంలో అధికార ప్రతిపక్షాలుగా ఉన్న ఆ రెండు పార్టీలకు విధాన ప్రత్యామ్నాయం రావాలి ... దాన్ని జనం బలపర్చాలి
 (”ప్రజాశక్తి” 7.1.2014 సంపాదకీయం నుండి.)
                            గుజరాత్ అభివృద్ధి నిజ స్వరూపం
మోడీ కి కార్పొరేట్ అధిపతులు, వారి చేతిలో వున్న టి.వి చానల్సు, పత్రికలు ఎందుకు సానుకూల ప్రచారం చేస్తున్నాయి? అతను ప్రధాన మంత్రి అయితే, ప్రజలు సృష్టించిన సంపదని తమకి అనుకూలముగా కాంగ్రెస్ కన్నా మరింత పకడ్బందీగా  పంపిణీ చేస్తాడని. గుజరాత్ లో అతను అదే చేశాడు. అందుకనే గుజరాత్ నమూనా ఆర్థికాభివృద్ధి దేశానికి అవసరం అని ప్రచారం చేస్తున్నారు. నిజంగా గుజరాత్ ప్రజలు ఇతర రాష్ట్రాల ప్రజలకన్నా సౌఖ్యముగా వున్నారా? 2004-05 నుండి 2011-12 మధ్య కాలం లో తలసరి స్థూల ఉత్పత్తి అభివృద్ధి రేటు బీహార్ లో 15.3 శాతం, తమిళనాడు లో 8.65 శాతం, కాగా గుజరాత్ లో 8.19 శాతమే వున్నది. సామాజికాభివృద్ధి సూచికల  ప్రకారం గుజరాత్ 1981 లో 4వ స్థానం లో వున్నది. అది 2001 లో 7వ స్థానానికి, 2008 లో 8 వ స్థానానికి పడి పోయింది. 2000-2008 మధ్య సామాజికాభివృద్ధి విలువలో పెరుగుదల చూస్తే గుజరాత్ మిగతా రాష్ట్రాలతో పోలిస్తే 18వ స్థానం లో వున్నది. అక్షరాస్యతలో గుజరాత్ 1981 లో 4వ స్థానం లో వుంటే 2011 లో 6వ స్థానానికి దిగజారింది. 1991-2011 మధ్య అక్షరాస్యతా అభివృద్ధిలో గుజరాత్ 20 ప్రధాన రాష్ట్రాలలో 16 వ స్థానం లో వున్నది. జనన కాల ఆయు: ప్రమాణం లో గుజరాత్ 1992 లో 9వ స్థానం లో వుంటే 2006 లో దాని స్థానం 10 కి దిగజారింది. 1991-2009 మధ్య శిశు మరణాల రేటు విషయం లో గుజరాత్ 20 ప్రధాన రాష్ట్రాలతో పోలిస్తే 10వ స్థానం లో వున్నది.నేషనల్ శాంపుల్ సర్వే ప్రకారం భారత దేశం లో గ్రామీణ దారిద్ర్యానికి నిర్వచనముగా వున్న 2200 కేలరీల ఆహారం అందుబాటులో లేని ప్రజల సంఖ్య గుజరాత్ లో 1993-94 లో 71.5శాతం  కాగా 2009-10 లో ఈ సంఖ్య 76 శాతానికి పెరిగింది. అదేవిధముగా పట్టణ దారిద్ర్యానికి కొలమానమైన 2100 కేలరీల ఆహారం అందుబాటులో లేని వారి సంఖ్య 1993-94 లో గుజరాత్ లో 57 శాతం వుండగా 2009-10 లో 66 శాతానికి పెరిగింది.తలసరి ఆహార వినియోగం తగ్గిందంటే ధనికులు తమ వినియోగాన్ని తగ్గించుకోరు కాబట్టి పేదల తలసరి వినియోగం లెక్కల్లో  కనపడే దానికన్నా వాస్తవంగా చాలా ఎక్కువగా తగ్గుతుంది. కాబట్టి గుజరాత్ లో స్థూల ఉత్పత్తి ఎంత పెరిగినా ఆ రాష్ట్రం లో దారిద్ర్యం, ఆకలి నిరపేక్షంగా పెరుగుతున్నాయి.గుజరాత్ లో వేతనాలు గ్రామీణ స్త్రీ, పురుష వేతనాల విషయములో అదే విధముగా పట్టణ  స్త్రీ పురుష వేతనాల విషయములో ప్రతి ఉత్పాదక రంగములోనూ దేశ సగటు కంటే తక్కువగా వున్నాయి.
కాబట్టి నరేంద్ర మోడీ ప్రధాని అవటామంటూ జరిగితే దేశం, ప్రజలు మరింత అధోగతి పాలవుతారు. కార్పొరేట్సుకు అధిక ప్రయోజనాలు దక్కుతాయి.
(ప్రజాశక్తి 8.1.2014 సంచికలో ప్రభాత్ పట్నాయక్ వ్యాసం నుండి ఈ వివరాలు సేకరించటం జరిగింది)
బి డబ్ల్యూ ఏ స్పెక్ట్రమ్ ఫీజు బి ఎస్ ఎన్ ఎల్ , ఏం టి ఎన్ ఎల్ కు వాపసు పై రేపు కేబినెట్ సమావేశం
ప్రభుత్వము బి ఎస్ ఎన్ ఎల్ మరియు ఏం టి ఎన్ ఎల్ లకు నాసిరకం బి డబ్ల్యూ ఏ స్పెక్ట్రమ్ ను అంటగట్టి ప్రయివేటు కంపెనీలకు నాణ్యమయిన స్పెక్ట్రమ్ ఇచ్చింది. ఇందుకోసం 2010 లో ప్రభుత్వము బి ఎస్ ఎన్ ఎల్ నుండి రు. 8314 కోట్లు, ఏం టి ఎన్ ఎల్ నుండి రు. 4534 కోట్లు వసూలు చేసింది. కానీ ఈ స్పెక్ట్రమ్ నాసి రకమయినందున బి ఎస్ ఎన్ ఎల్, ఏం టి ఎన్ ఎల్ లు ప్రభుత్వానికి వాపసు ఇచ్చాయి. అందుకోసం తాము చెల్లించిన సొమ్మును తిరిగి ఇవ్వాలని డిమాండు చేశాయి. యూనియన్లు  కూడా ఈ డిమాండుకు మద్దతు తెలిపి అనేక ఆందోళణలు, పోరాటాలు చేశాయి. డి ఓ టి కూడా ఈ సొమ్మును బి ఎస్ ఎన్ ఎల్, ఏం టి ఎన్ ఎల్ లకు వాపసు ఇవ్వాలని మంత్రివర్గ ఉపసంఘానికి సిఫార్సు చేసింది. 1.8.2013 న జరిగిన మంత్రి వర్గ ఉపసంఘం ఈ సిఫార్సును అంగీకరించి కేబినెట్ ఆమోదానికి పంపింది. రేపు (9.1.2014) జరిగే కేబినెట్ సమావేశం దీని పై అంతిమ నిర్ణయం తీసుకోవాలి. ఈ సొమ్ము  బి ఎస్ ఎన్ ఎల్, ఏం టి ఎన్ ఎల్ లకు వాపసు ఇచ్చేందుకు కేబినేట్ అంగీకరిస్తుందా, అంగీకరిస్తే ఎంత ఇవ్వాలని చెపుతుంది, వీటి పై  రేపు సమావేశములో నిర్ణయం జరుగుతుంది. 
(ఎకనామిక్ టైంసు పత్రిక 8.1.2013 వార్త)


No comments:

Post a Comment