Sunday, January 12, 2014

సంక్రాంతి సంబరము

అయిదు లక్షల అరువదేడులు
గడిచిపోయేను కలియుగంబున;
పదియు తొమ్మిది వందలాయేను
              ఇంచుమించు శతాబ్దముల్.

అరువదంచుల కాలచక్రము
తిరుగుచున్నది వరుస తప్పక
వాన కురియును పంట పండును
             లోకవృత్తము నడువగా.

పాలు తీసిన పొదుగులట్టుల
వాలబడె  సంక్రాంతి మబ్బులు,
మంచుపడు హేమంత రాత్రులు,
              జతలు పాయవు పక్షులున్.

బూజు దులిపిన పూరి యిండ్లును
వెల్ల వేసిన వీధి గోడలు
ఆలికి మ్రుగ్గులనిడిన యరుగులు
             అందగించెను పల్లెలన్.

తెల్లవారగ మేలుకొలుపులు
పాడుచును హరిదాసులాడగ
గొంతులెత్తు శకుంతములు
         నందముగ సుతి కలుపుచున్.

సస్య కేసర కపిశ శోభల
చేలు పసుపాడిన విధంబున
చూడ కన్నుల వేడుకాయెను
            భూమి గంధము చల్లగా.

మంచి గుమ్మడి పూలపళ్ళెము
లెత్తె పూజకు ప్రొద్దుపొడుపులు
రేయి చుక్కలరీతి గన్నది
          దోసపూవుల పిందెలన్.

నవ్యధాన్య సువాసనలతో
పాలునిండిన భాండములతో
ఇండ్లు సిరి ముంగిండ్లయిన  ఈ
         పచ్చి పండుగ సందెలన్.

 కడుపు నిండా కుడిచి హాయిగా
కంటినిండా నిదుర పోదురు
ఆలు బిడ్డలు జానపదులీ
        వెలితి తెలియని దినములన్.

తలకు తాపును తలపులేవో
మదిని కదుపును మనసులేవో
గతము రా దా గతము తెలియదు
         నేటి శుభములే మనకగున్.

క్రొత్తబియ్యము క్రొత్త బెల్లము
ముఱ్ఱుపాలను పోసి కలిపీ
కేరుతును పొంగింత మీ దిన
     పుణ్యకాలోదయములన్.

మంగళము సంక్రాంతి సామికి
మంగళము మా భోగి సానికి
మంగళము మన మాతృభూమికి
               మంగళంబందఱికినీ.

-----రాయప్రోలు సుబ్బారావు (1892-1984)

శకుంతములు=పక్షులు; సస్య కేసర కపిశ శోభల =పంటల ఎరుపు తీరిన పసుపు రంగు అందాలు; గతము రాదాగతము తెలియదు= జరిగిన కాలము తిరిగి రాదు; భవిష్యత్తు తెలియదు;

రాయప్రోలు సుబ్బారావుతో తెలుగులో అభినవ కవిత ఆరంభమయింది. వేణుగానం లోని లాలిత్యము, మృణాళ కాండం (తామర తూడు)లోని సౌకుమార్యము, ద్రాక్షరసం లోని మాథుర్యము తన అభినవ కవితా మార్గానికి క్రొత్త రుచిని సమకూర్చినట్లు రాయప్రోలు  అన్నారు.  ఆయన ప్రకృతిని ఉపాసించటానికి సాహిత్యాన్ని ఆలంబనంగా గ్రహించారు. “జగమంతయు సౌందర్య స్థగితము, శివమయము” అన్నారు. “తేనియతోడబుట్టువయి తీపులు తీఱిన దీ తెనుంగు” అని తెలుగు భాష తీయదనాన్ని కీర్తించారు.




           

No comments:

Post a Comment