Saturday, January 18, 2014

రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ రంగ ప్రవేశం; ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు

రిలయన్స్ జియో  ఇన్ఫోకామ్ లిమిటెడ్ రంగ ప్రవేశం
ఇప్పుడున్న 13 టెలికాం సర్వీసు కంపెనీలకు అదనముగా మన దేశములో మరో కంపెనీ “రిలయన్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్”(ఆర్ జె ఐ ఎల్) త్వరలో రంగ ప్రవేశం చేయబోతున్నది. ఇది రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీది(ఇప్పుడు నడుస్తున్న రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్(ఆర్ కామ్) ఇతని తమ్ముడు అనిల్ అంబానీది). 2010 లోనే ఆర్ జె ఐ ఎల్, 4 జి స్పెక్ట్రమ్ ను దేశమంతటా అన్నీ సర్కిల్సుకు కొన్నది. మరే ఇతర కంపెనీకి కూడా దేశమంతటా ఈ విధముగా 4 జి స్పెక్ట్రము లేదు. 4 జి అంటే బి డబ్ల్యూ ఏ స్పెక్ట్రమ్. బి ఎస్ ఎన్ ఎల్ కూడా దేశ వ్యాపితముగా బి డబ్ల్యూ ఏ  స్పెక్ట్రమ్ ను 2010 లో కొన్నది. కానీ బి ఎస్ ఎన్ ఎల్ కు ఇచ్చినడది నాసి రకం అయినందున వాపసు చేయాల్సి వచ్చింది. ఆ విధముగా బి ఎస్ ఎన్ ఎల్ కు 4 జి స్పెక్ట్రమ్ లేకుండా పోయింది. 4 జి స్పెక్ట్రమ్ తో హై స్పీడ్ డేటా సర్వీసులు, 3 జి కన్నా మరింత వేగముగా ఇయ్య వచ్చును. అయితే, 4 జి ద్వారా డేటా సర్వీసులు మాత్రమే ఇవ్వాలాని లైసెన్సు  షరతు అయినందున, ఆర్ జె ఐ ఎల్ కు వాయిస్ సర్వీసులు ఇవ్వటానికి పనికివచ్చే 2 జి స్పెక్ట్రమ్ లేనందున అది ఇంకా సర్వీసులు ప్రారంభించ లేదు. ఇప్పుడు ఫిబ్రవరిలో 2 జి స్పెక్ట్రమ్ అమ్మకానికి ప్రభుత్వము వేలము నిర్వహిస్తున్నది. ఈ వేలములో పాల్గొని 2 జి స్పెక్ట్రమ్ ను కొని వాయిస్ మరియు హై స్పీడ్ డేటా సర్వీసులను త్వరలో ఆర్ జె ఐ ఎల్ ప్రారంబించబోతున్నది. తన సొంత నెట్వర్క్ ఏర్పాటు వెంటనే సాధ్యము కాదు  కాబట్టి ఇతర కంపెనీల నెట్వర్క్సు ద్వారా ఆర్ జె ఐ ఎల్ తన సర్వీసులు ఇవ్వబోతున్నది. ఇప్పుడున్న ప్రభుత్వ టెలికాం కంపెనీలు బి ఎస్ ఎన్ ఎల్ మరియు ఏం టి ఎన్ ఎల్ లు నష్టాలలో వుండగా ప్రయివేటు టెలికాం  కంపెనీలు ఎయిర్టెల్ ఐడియా వంటివి  అప్పుల్లో వుండగా ఈ ఆర్ జె ఐ ఎల్ ఋ.80,000ల భారీ నగదు నిలవలతో రంగ ప్రవేశం చేస్తున్నది. పెట్రోల్, గ్యాస్ వ్యాపారం లో గాలివాటుగా, ప్రభుత్వ అనుచిత సహాయముతో  సంపాదించిన లాభాలతో ఇది ముందుకు వస్తునంది.  
ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు
ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనామిక్ ఫోరం) సర్వే లో నిర్ధారితమయిన విషయాలు   
ప్రపంచ ఆర్థిక వేదిక అనే సంస్థ కేంద్ర కార్యాలయం స్విట్జర్లాండులో వుంది. ప్రతి సంవత్సరం ఈ సంస్థ అధ్వర్యములో స్విట్జర్లాండులోని దావోస్ లో ప్రపంచం, ప్రాంతాలు, పరిశ్రమలు ఎదుర్కొనే సమస్యలపై చర్చ జరుగుతుంది.. ఈ సమావేశాలలో ప్రపంచ వ్యాపితముగా అనేక దేశాల రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలు, మేధావులు పాల్గొంటారు. దీని సభ్యులు వివిధ దేశాల బడా పెట్టుబడిదారులు. ఈ సంవత్సరం (2014) చర్చలు  జనవరి 22-24 తేదీలలో జరుగుతాయి. ఈ సమావేశాల సందర్భముగా ప్రపంచ ఆర్థిక వేదిక, ప్రపంచం ఎదుర్కొంటున్న గడ్డు సమస్యలపై ప్రపంచ వ్యాపితముగా పరిశ్రమలనుండి, ప్రభుత్వాలనుండి, విశ్వ విద్యాలయాల నుండి మొత్తం 700 మంది నిపుణుల అభిప్రాయాల సేకరించింది.  తాను చేసిన ఈ సర్వే ఆధారముగా 16.1.2014 న ఒక నివేదికని ప్రకటించింది. ఈ నివేదిక ప్రకారం ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు:
1.     ప్రపంచ వ్యాపితముగా ధనికులకు, పేదలకు మధ్య పెరుగుతున్న వ్యత్యాసమే ప్రపంచం ఎదుర్కొనే సమస్యలలో  మొదటిది. దీని వలన రానున్న దశాబ్దములో ప్రపంచానికి తీవ్రమయిన హాని జరుగుతుంది.
2.    ఆర్థిక అసమానతల తరువాత ప్రపంచాన్ని ఇబ్బంది పెట్టే సమస్యలు-- వాతావరణ తీవ్రత, నిరుద్యోగ సమస్య, పర్యావరణ మార్పులు, సైబర్ దాడులు(ఇంటెర్నేట్ నెట్వర్క్సు ను వైరస్ ద్వారా ధ్వంసం చేసే దాడులు)
3.    యూరోజోన్ దేశాల ఋణ సంక్షోభం ప్రపంచ వ్యాపితముగా ద్రవ్య సంక్షోభాన్ని సృష్టించే అవకాశం వున్నది. .  ఈ సంక్షోభానికి అమెరికా, జపాన్ ప్రభుత్వాలు తీవ్ర స్థాయిలో రుణగ్ర్రస్తమవటం ఆజ్యం పోసినట్లవుతున్నది. ద్రవ్య సంక్షోభం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని బాగా దెబ్బ తీసే అవకాశం వున్నది.
4.    ఒక ప్రధాన ద్రవ్య యంత్రాగమో లేక సంస్థయో  దెబ్బ తిని దాని ఫలితముగా ప్రపంచ ద్రవ్య మార్కెట్లు తాజాగా తీవ్రమయిన పరిస్థితిని ఎదుర్కోనే  అవకాశం వుంది.  అమెరికా లో 5 సంవత్సరాల క్రితం లేహ్మాన్ బ్రదర్స్ సంస్థ పతనమయినందున దాని వలన ప్రపంచములో ప్రధాన ద్రవ్య వ్యవస్థలు, సంస్థలు  విఫలమయ్యాయి.  ఇప్పుడు మళ్ళీ ఏదయినా ఒక ప్రధాన  ద్రవ్య వ్యవస్థ విఫలమయితే ఇదే పరిస్థితి  పునరావృతమవుతుందని ఆందోళన వ్యక్తమవుతున్నది. బ్యాంకుల ఆస్తుల నాణ్యత పట్ల అనిశ్చితి నెలకొని వుండటమే దీనికి కారణం.
5.    ఇటువంటి ఆర్థిక సంకటము వలన తీవ్రమయిన సాంఘిక, రాజకీయ అస్థిరత ఎదురయ్యే అవకాశం వున్నది.
2008 నుండి 5 సంవత్సరాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్రమయిన మాంద్యాన్ని ఎదుర్కొన్నది. ఆ మాంద్యము నుండి కోలుకుంటున్నదానే  ఆశ సంశయాస్పదమై  మరో సంక్షోభం ఎదురయ్యే అవకాశం కనిపిస్తున్నది. పెట్టుబడిదారీ విధానం వికటించి వినాశ కర అంతర్జాతీయ ఫైనాన్సు పెట్టుబడిదారీ విధానముగా మారినందున ఈ సమస్యలు ఎదురవుతున్నాయి. 22-24 తేదీలలో జరగబోయే ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశం లో అంతర్జాతీయ ఫైనాన్సు పెట్టుబడి దారీ వ్యవస్థల ప్రతినిధులు ఈ సమస్యలకు ఎటువంటి పరిష్కారం చెపుతారో వేచి చూద్దాం.


No comments:

Post a Comment