Wednesday, January 15, 2014

వోడాఫోన్ లో 100% ఎఫ్ డి ఐ; బి ఎస్ ఎన్ ఎల్/ఏం టి ఎన్ ఎల్ లకు ప్రాధాన్యత ఇవ్వద్దంటున్న ప్రయివేటు టెలికాం కంపెనీలు; ఈ పి ఎఫ్ పరిధిలో వున్న ఈ పి ఎస్-95 స్కీములో కనీస పెన్షన్ రు.1000

వోడాఫోన్ ఇండియా లిమిటెడ్ లో విదేశీ పెట్టుబడి 64.38 శాతం నుండి 100 శాతం కు పెంచేందుకు ప్రతిపాదన

వోడాఫోన్ ఇండియా లిమిటెడ్ లో బ్రిటిష్ కంపెనీ వోడాఫోన్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ కు 64.83 శాతం వాటా వున్నది. రు.10,141 కోట్ల ఎఫ్ డి ఐ తో వోడాఫోన్ ఇండియా లిమిటెడ్ లో ఎఫ్ డి ఐ పరిమితిని 100 శాతం చేసి దానిని 100 శాతం తన అధీనం లో నడిచే సంస్థగా చేయాలని వోడాఫోన్ ఇంటెర్నేషనల్ హోల్డింగ్స్ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనని ప్రధానమంత్రి అధ్యక్షతన ఏర్పడిన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ ఉపసంఘానికి నివేదించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ ప్రతిపాదన అమలులోకి వస్తే వోడాఫోన్ ఇండియా లిమిటెడ్ నూటికి నూరు శాతం విదేశీ యాజమాన్యములో వున్న మొదటి టెలికాం  సర్వీసు కంపెనీ అవుతుంది. మన టెలికాం నెట్వర్కు పై విదేశీ ఆధిపత్యం దీనితో ప్రారంభం అవుతుంది. ఇతర టెలికాం  కంపెనీలలో కూడా విదేశీ పెట్టుబడి క్రమముగా పెరుగుతుంది.
విదేశీ పెట్టుబడులపై, అప్పులపై ఆధారపడే సరళీకరణ విధానాలు దేశ ప్రయోజనాలకు వ్యతిరేకం. పాలక కాంగ్రెస్, ప్రతిపక్ష బి జె పి, మరియు ఇతర బూర్జువా పార్టీలు  ఈ ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేయటం లో పోటీ పడుతున్నాయి.

ప్రభుత్వ శాఖలు టెలికాం సర్వీసుల విషయములో బి ఎస్ ఎన్ ఎల్/ఏం టి ఎన్ ఎల్ లకు ప్రాధాన్యాతనివ్వటం రాజ్యాంగ విరుద్ధం-ప్రయివేటు టెలికాం ఆపరేటర్లు

ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు తమ టెలికాం సేవలను ప్రభుత్వ రంగ సంస్థలయిన బి ఎస్ ఎన్ ఎల్/ఏం టి ఎన్ ఎల్ ల నుండి మాత్రమే తీసుకోవాలని బి ఎస్ ఎన్ ఎల్/ఏం టి ఎన్ ఎల్ యూనియన్ల సంయుక్త కార్యాచరణ కమిటీ అనేక సార్లు డిమాండు చేసింది. ఉద్యమాలు నడిపింది. చివరికి దీనిని ఆమోదిస్తూ ఒక ప్రతిపాదన తయారు చేసినట్లు ప్రభుత్వము 9.12.2013న పార్లమెంటులో ఒక ప్రశ్నకు జవాబు ఇస్తూ చెప్పింది. అయితే ఈ ప్రతిపాదనను ప్రయివేటు టెలికాం కంపెనీలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు ఈ విధముగా బి ఎస్ ఎన్ ఎల్/ఏం టి ఎన్ ఎల్ లకు ప్రాధాన్యత నివ్వటం చట్టవిరుద్ధమని, రాజ్యాంగములో 14వ అధికారణములో వున్న సమానత్వ సూత్రంకు ఇది వ్యతిరేకమని, ఇది సమాన ప్రాతిపదికపై పోటీని నిరాకరిస్తున్నదని, కాబట్టి దీనిని అమలు చేయవద్దనీ కోరుతూ ప్రయివేటు సెల్ ఫోన్ కంపెనీల సంఘం  “సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా”, 13.1.2014 న డి ఓ టి కి లెటరు రాసింది.
ప్రయివేటు టెలికాం కంపెనీలు నిర్వహించలేని అనేక సామాజిక బాధ్యతలను బి ఎస్ ఎన్ ఎల్, ఏం టి ఎన్ ఎల్ లు నిర్వహిస్తున్నందున ఆ కంపెనీలకు ప్రభుత్వము ప్రాధాన్యత ని ఇవ్వాల్సిన అవసరం వున్నది. అయితే ఇటువంటి స్వల్ప విషయములో మాత్రమే ప్రాధాన్యతనిచ్చేందుకు ప్రభుత్వము ముందుకు వస్తున్నది. ప్రధాన విషయాలలో మాత్రం ప్రభుత్వ రంగ సంస్థలకు వ్యతిరేకముగా, ప్రయివేటు కంపెనీలకు అనుకూలముగా వుంటున్నది. అయినప్పటికి ఇంత స్వల్ప రాయిటీని బి ఎస్ ఎన్ ఎల్/ఏం టి ఎన్ ఎల్ లకు ఇవ్వటాన్ని ప్రయివేటు టెలికాం కంపెనీలు వ్యతిరేకిస్తున్నాయి.

ఈ పి ఎఫ్ పెన్షన్ స్కీములో కనీస పెన్షన్ రు.1000 కి పెంచే ప్రతిపాదన

ఈ పి ఎఫ్ సంస్థ నిర్వహిస్తున్న  ఈపీఎస్-95(ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్-95) ప్రకారం పెన్షన్ తీసుకునేవారికి కనీస పెన్షన్ రు.1000 కి పెంచుతూ ఈ నెలలో కేంద్ర ప్రభుత్వము ఆర్డర్సు ఇచ్చే అవకాశం వున్నది. దీనివలన ఈ పి ఎఫ్ స్కీము పరిధిలో వున్న అసంఘటిత కార్మికులకు ప్రయోజనం  కలుగుతుంది. ఇందుకోసం ఆర్థిక మంత్రిత్వ శాఖ సంవత్సరానికి అదనముగా రు.1300 కోట్లు అందించాలని కార్మిక మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. ఇప్పటివరకూ వేతనం(బేసిక్, డి ఏ) ఎంత వున్నా సరే, రు.6500/- వేతనాన్ని మాత్రమే ఈ స్కీము లో వున్న వారి పెన్షన్ లెక్కింపుకు పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఇప్పుడు ఈ సీలింగును రు. 15000 కు పెంచాలని ప్రభుత్వము ప్రతిపాదించింది. ( బి ఎస్ ఎన్ ఎల్ లో బేసిక్, డి ఏ మొత్తం పై  పెన్షన్ లెక్కింపుకు ఆప్షన్ వున్నది)పై ఈ ప్రతిపాదనలు అమలులోకి వస్తే ఈపీఎఫ్ పెన్షన్ తీసుకునే 44 లక్షల  పెన్షనర్లలో 22 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుంది.

అందరికీ రక్షిత పెన్షన్ విధానం వుండాలని కార్మిక సంఘాలు అనేక పోరాటాలు చేశాయి. ఈ పోరాటాలలో భాగముగా 2013 ఫిబ్రవరి 20,21 సార్వత్రిక సమ్మె జరిగినది. ఈ సమ్మేలో బి ఎస్ ఎన్ ఎల్ ఈ యు కూడా పాల్గొన్నది. ఈ పోరాటాల ఫలితముగానే ప్రభుత్వము ఈ ప్రతిపాదనతో ముందుకు వచ్చింది. 2014 ఎన్నికలలో తనకు ప్రయోజనము కలగాలని కూడా యు పి ఏ ప్రభుత్వము ఈ ప్రతిపాదనను ముందుకు తెస్తున్నది. ఏమయినప్పటికి కార్మిక వర్గం డిమాండుకు, ప్రభుత్వ ప్రతిపాదనకూ చాలా తేడా వున్నది. కాబట్టి ఇటువంటి ఓదార్పు ప్రతిపాదనలను లెక్క చేయకుండా కార్మిక వర్గము తన పోరాటాన్ని కొనసాగించాల్సిన అవసరం వున్నది.

No comments:

Post a Comment