Monday, January 6, 2014

మనిషి అనగానేమీ?

మనిషి అంటే ఏమిటి? మనిషికి, ఇతర జంతువులకి తేడా ఏమిటి?

మనిషి దైవాంశ సభూతుడు. అతనిలో ఆత్మ వున్నది. చనిపోయిన తరువాత కూడా ఆత్మ వుంటుంది. పాపం చేసిన వారి ఆత్మ నరకానికి పోతుంది, పుణ్యం చేసిన వారి ఆత్మ స్వర్గానికి పోతుంది. ఇదొక నమ్మకం. పాపం చేసిన ఆత్మ తిరిగి శరీర రూపం ధరిస్తుంది. పునర్జన్మ లేకుండా భగవంతునిలో ఐక్యం కావటమే మోక్షం. ఇదొక నమ్మకం.

ఏ నమ్మకమున్న వారయినా మనిషికి శరీరమున్నదనీ, మెదడు వున్నదనీ అంగీకరిస్తారు. మెదడు అనే భాగము మనిషి శరీరములో వున్నందునే అతడు ఆలోచించగలుగుతున్నాడని అందరూ అంగీకరిస్తారు.

మరి మనిషి ప్రత్యేకత ఏమిటి? "ఆత్మ" వుండటమా? మరి జంతువులకు ఆత్మ లేదా? ప్రతిదానిలోనూ ఆత్మని చూడాలని ఒక నమ్మకం. కాబట్టి ఆత్మ వుండటం మనిషి విశిష్టత అని అన లేము.

అయితే మనిషికి విశిష్టమయిన మెదడు వున్నందున అతను ఆలోచించగలుగుతున్నాడు కాబట్టి, ఇతర జీవులలో అటువంటి అభివృద్ధి చెందిన మెదడు లేదు కాబట్టి, అభివృద్ధి చెందిన మెదడున్నందున దానితో  ఆలోచనా శక్తిని పొందిన జంతువు మనిషి అని అనుకోవాలా? మరి మెదడు వుండటమే ఆలోచనా శక్తికి కారణమని అనుకుంటే పుట్టిన శిశువులో మెదడున్నప్పటికి ఆలోచనా శక్తి ఎందుకు లేదు? కాబట్టి మనిషి అంటే అభివృద్ధి చెందిన మెదడు కల జంతువు అనలేము

మనిషి జంతువే. వానరమే పరిణామ క్రమములో నరుడిగా మారింది. మనిషి జన్యువులలో, చింపాంజీ జన్యువులలో 98 శాతం తేడా లేదు. కాబట్టి మనిషి అత్యున్నత అభివృద్ధి చెందిన జంతువు. అయితే ఈ అభివృద్ధి ఏమిటి? తాను తయారు చేసిన పరికరాలతో  ప్రకృతిపై శ్రమించి తన జీవితావసర వస్తువులను తయారు చేయగల ప్రత్యేక లక్షణముగల జంతువు మనిషి.  "Man  is a tool making animal"(మనిషి పరికరాలు తయారు చేయగల జంతువు.)

తాను తయారు చేసిన పరికరాలతో మనిషి ప్రకృతిపై శ్రమించి తన జీవితావసర వస్తువులను తయారు చేసుకుంటాడు. ఆ క్రమములో తనని తాను మార్చుకుంటాడు, అభివృద్ధి చెందుతాడు. దొరికిన రాయి, కర్ర, ఎముక లతో పదునయిన పరికరాలు తయారు చేసి దుంపలు తవ్వటానికి, జంతువులను చంపటానికి, మాంసము కోయటానికి తదితర పనులకు ఉపయోగించటముతో మనిషి చరిత్ర ప్రారంభమయింది.

అడవులలో చిటారు కొమ్మలలో చేతులతో చెట్ల కొమ్మలు పట్టుకుని ఒక కొమ్మనుండి మరొక కొమ్మకు దూకగల చింపాంజీకి చుట్టాలుగా వున్న నరవానరాలు వాతావరణ మార్పులవలన ఆ అడవులు అంతరించి పచ్చ గడ్డి మైదానాలలో సంచరించాల్సిన అవసరం ఏర్పడింది. క్రమముగా ఆ నరవానరాలు నిటారుగా నిలబడటం నేర్చుకున్నాయి. దానివలన వాటి చేతులు మరింత స్వేచ్చ పొందాయి. చేతులతో నడవటమూ, దూకటమేగాక, కర్రలను, రాళ్ళను పట్టుకోటము, వాటితో పండ్లు కోయటము, దుంపలు తవ్వటము, జంతువులను కొట్టటము సాధ్యమయింది. అయితే ఈ నరవానరాలు గుంపుగా వుంటేనే క్రూర మృగాలను తట్టుకుని నిలబడగలుగుతాయి. కాబట్టి అవి సమిష్టి జీవనము లక్షణముగా కలిగి వున్నాయి. క్రమముగా బొటన వేలుతో మిగతా వేళ్ళలో దేనినయినా సరే, పట్టుకోగలగటం సాధ్యమయింది. దీనివలన చేతి నైపుణ్యం మరింత పెరిగింది. సమిష్టిగా ఇతర జంతువులనుండి తమని తాము కాపాడుకోటానికి, ఇతర జంతువులపై దాడి చేయటానికి ఒకరికొకరు సంకేతాలు చెప్పుకోవాల్సిన పరిస్థితులలో అందుకు అవసరమయిన వివిధ ధ్వనులు  చేయటానికి వీలుగా వాటి స్వర పేటిక క్రమముగా అభివృద్ధి అయింది. ఇంతేగాక రాతిని రాతితో కొట్టటము వలన అవి పదును తేలి పరికరాలుగా తయారయ్యాయి.పరికరాల తయారీలో అనుభవాన్ని ఒకరికొకరు పంచుకోటం అవసరమయింది. తరువాతి తరానికి ఆ అనుభవాన్ని నేర్పటం అవసరమయింది. ఈ క్రమములో అవి చేసిన ధ్వనులనుండి నెమ్మదిగా భాష అభివృద్ధి చెందింది. భాష వలన ఊహా శక్తి పెరిగింది. ఆలోచన పెరిగింది. భాష లేకుండా ఆలోచన సాధ్యము కాదు. ఏ ఆలోచననయినా ఏదో ఒక భాషలో ఆలోచించాల్సిందే.ఈ విధముగా ముందుగానే వూహించి ఆ వూహ ప్రకారం పరికరాన్ని తయారు చేసి దానితో తమకి కావాల్సిన జీవితావసర వస్తువులు తయారు చేసుకోగలిగే దశకి నర వానరము చేరుకుని నరుడయింది. అయితే ఇది ఒంటరిగా జరగ లేదు. సమిష్టి జీవనముతోనే ఇదంతా చేయటం సాధ్యమయింది.  సమిష్టి శ్రమ వలన వానరుడు నరుడయ్యాడు. ఆ శ్రమ క్రమములోనే అతని మెదడు పరిమాణం పెరిగింది. భాష అభివృద్ధి చెందింది. ఆలోచన అభివృద్ధి చెందింది. జీవ పరిణామములో 5 కోట్ల సంవత్సరాల క్రితం వానరాలు ఆవిర్భవించాయి. కోటి సంవత్సరాల క్రితం నరవానరాలు(తోక లేని కోతులు) ఆవిర్భవించాయి. నరవానరాలనుండి మానవుని ఆవిర్భావక్రమము దాదాపు 48 లక్షల సంవత్సరాలలో జరిగింది. ఆధునిక మానవుని( జంతు శాస్త్ర పరిభాషలో "హోమో సెపియన్స్") ఆవిర్భావం 2 లక్షల సంవత్సరాల క్రితం ఆఫ్రికాలో జరిగింది. ప్రపంచములో అన్ని దేశాల వాళ్ళూ వాళ్ళ ప్రస్తుత రంగూ, రూపం ఏ విధముగా వున్నా సరే, ఈ ఆఫ్రికాలో రెండు లక్షల సంవత్సరాల క్రితం ఆవిర్భవించిన మానవుల సంతానమే. ఈ మొత్తం పరిణామము వాతావరణ మార్పుల వలన, జన్యువులలో వచ్చిన మార్పుల వాలన, శ్రమ పాత్ర వలన (నిటారుగా నిలబడగలగటం, చేతులను పనులకు వినియోగించటం) జరిగింది.

కాబట్టి మనిషిని సృష్టించింది అతని శ్రమ. శ్రమ క్రమములోనే భాష, ఆలోచన ఆవిర్భవించాయి. కాబట్టి మనిషి సారాంశము ముందుగానే ఆలోచించి తన ఆలోచనకి అనుగుణమయిన వస్తువులను (భౌతిక వస్తువులు, సేవలు, రచనలు, కళలు, శాస్త్ర విజ్ఞానం) సృష్టించటం. కాబట్టి మనిషికి నిజమయిన ఆత్మ అతనికి తన అభిరుచి ప్రకారం పని చేసే అవకాశం లభించి దానివలన సృష్టించిన వస్తువు లో తనని చూసుకుని ఆనందించగలగటం. ఇది ఇతర మనుషులతో సామాజిక సంబంధములోనే సాధ్యమవుతుంది. కానీ నేటి సమాజములో కోట్లాది మందికి పనే దొరకటం లేదు. కాబట్టి వారు తమ మానవతని కోల్పోతున్నట్లే. కొద్దిమందికి శ్రమించాల్సిన అవసరం లేదు.  ఇతరుల శ్రమని దోచుకోటమే వారి పని. వారు కూడా శ్రమ నుండి దూరమైనందున  మానవతని కోల్పోయినట్లే. శ్రామికులకు తమ శ్రమ పై కానీ, దాని ఫలితం పై కానీ అధికారం లేదు. తమ శ్రమని జీతానికి అమ్ముకుంటారు కాబట్టి,  ఫలితం తమది కాదు కాబట్టి వారికి శ్రమ పై ఆసక్తి వుండదు. ఆ విధముగా వారు కూడా మానవతని కోల్పోయారు. కాబట్టి ప్రస్తుత సమాజములో మనిషి పరాయీకరణ చెందాడు. మానవతకి సంబంధించిన అంశాలు అతి తక్కువగా వుంటున్నాయి.

మనిషి లో మానవత సంపూర్ణముగా వికసించాలంటే మనిషి పరాయీకరణ చెందుతున్న నేటి సామాజిక సంబంధాలు మారాలి. అంటే వ్యవస్థ మారాలి. కాబట్టి ఎవరయితే వ్యవస్థ మారాలని కోరుకుని అందుకోసం కృషి చేస్తారో వారే నిజమయిన మానవతా వాదులు. వ్యవస్థని ఆమోదించి, మనిషి పరాయీకరణ చెందటాన్ని ఆమోదించి, ఆ పరిధిలోనే మంచి చేద్దామనుకునే వాళ్ళు కారుణ్య దృక్పథము కల వారవుతారే గాని  మానవతా వాదులు కాజాలరు.

కాబట్టి సమిష్టిలో భాగముగా మనస్ఫూర్తిగా పని చేసి ఆ పని ఫలితములో తన సృజనాత్మక శక్తిని చూసుకుని ఆనందించగలగటం మనిషి సారాంశం. అయితే ఆ సారాంశం వాస్తవ రూపం దాల్చటానికి, మనిషిని సరుకుగా, దోపిడీదారుగా మార్చిన నేటి పెట్టుబడిదారీ సంబంధాలు అడ్డం  వస్తున్నాయి.

కాబట్టి మనిషి సారాంశాన్ని ధృవీకరించే నూతన సమాజాన్ని నిర్మించేందుకు జరిగే  పోరాటం లో భాగస్వాములు కావటమే ఈ యుగం లో మానవతా వాదుల కర్తవ్యం.





No comments:

Post a Comment