Friday, April 25, 2014

గుజరాత్ అభివృద్ధి నమూనా అసలు స్వరూపం

అభివృద్ధి అంటే జి డి పి (స్థూల జాతీయ ఉత్పత్తి) అభివృద్ధి మాత్రమే కాదు. అభివృద్ధి జరగాల్సింది మనుషులకు. కాబట్టి అభివృద్ధిని గురించి చర్చించేటప్పుడు స్థూల జాతీయ ఉత్పత్తి పెరుగుదల పై మాత్రమే గాక మానవ అభివృద్ధి పై కూడా చర్చించాలి.

కార్పొరేట్ మీడియా బ్రహ్మాండమని ప్రచారం(మార్కెటింగ్) చేస్తున్న గుజరాత్ నమూనా అభివృద్ధి నిజముగా అంత గొప్పదేమీ  కాదు. మానవ అభివృద్ధికి సంబంధించి అనేక రాష్ట్రాలకన్నా అది వెనక బడి వునండి. జి డి పి అభివృద్ధి రేటులో కూడా అది మొదటి స్థానం లో లేదు. నరేంద్ర మోడి గుజరాత్ లో సాధించినట్లుగా చెప్పబడుతున్న అభివృద్ధి కి సంబంధించి వాస్తవాలేమిటో తెలుసుకుందాం.

  1. గుజరాత్ కన్నా ఎక్కువ అభివృద్ధిని సాధించిన రాష్ట్రాలున్నాయి: 2004-05 నుండి 2011-12 వరకు గుజరాత్ లో సగటున సంవత్సరానికి 10.08 శాతం అభివృద్ధి జరిగింది. ఇదే కాలములో మహారాష్ట్రలో 10.75 శాతం, తమిళనాడులో 10.27 శాతం, అభివృద్ధి జరిగింది. కాబట్టి గుజరాత్ లో ఎక్కడా లేని స్థాయిలో   అభివృద్ధి జరిగిందనే ప్రచారం వాస్తవం కాదు.
  2. కార్మికుల రక్త మాంసాలను పీల్చిపిప్పి చేసే క్రూరమయిన అభివృద్ధి నమూనా:  మోడి అభివృద్ధి నమూనా  కార్మికులకు అతి తక్కువ వేతనాలివ్వటం పై, అతి తక్కువ నెలసరి వినిమయ ఖర్చు తో ప్రజలు జీవన యాత్ర సాగించటం పై ఆధారపడిన నమూనా. కార్మికుల రక్త మాంసాలను పీల్చి  పిప్పి చేసే క్రూరమయిన నమూనా. ఇందుకు సంబంధించిన వివరాలు:
i.              లేబర్ బ్యూరో అక్టోబరు 2013 నివేదిక ప్రకారం గుజరాత్ లో వ్యవసాయ కార్మికుల వేతనాలు అఖిల భారత సగటుకన్నా తక్కువ వున్నాయి. అఖిల భారత సగటు కూలి దున్నటానికి రు.230, నాట్లకు రు.186, కలుపుతీతకు రు.178, కోతకు రు. 199 వుండగా గుజరాత్ లో వరుసగా రు. 166, రు. 122, రు.129, రు.136 మాత్రమే వున్నది.
ii.             ఎన్ ఎస్ ఎస్ ఓ (నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్) రిపోర్టు నం. 554 ప్రకారం పట్టణాలలో రెగ్యులర్ కార్మికుల అఖిల భారత సగటు వేతనం పురుషులకు రు. 469.87, మహిళలకు రు.366.15 కాగా గుజరాత్ లో రు.326.34 మరియు రు.271.86 మాత్రమే వున్నది. పట్టణాలలో క్యాజువల్ కార్మికుల  అఖిల భారత సగటు వేతనం  పురుషులకు రు.182.04, మహిళలకు రు.110.62 వుండగా గుజరాత్ లో రు. 160.04, రు.88.84 మాత్రమే  వున్నది.
iii.            NSSO NSS KI (68/1.0) మరియు 458 రిపోర్టుల ప్రకారం రోజుకి రు.40 కన్నా తక్కువ ఖర్చుతో జీవనం సాగిస్తున్నవారు గుజరాత్ లో గ్రామాలలో 40 శాతం వున్నారు. రోజుకి రు.55 కన్నా తక్కువ ఖర్చుతో జీవనం కొనసాగిస్తున్న వారు గుజరాత్ లో పట్టణాలలో 30 శాతం వున్నారు. పట్టణాలలో అఖిల భారత స్థాయిలో తలసరి నెలవారీ వినిమయ ఖర్చు రు. 2477 కాగా గుజరాత్ లో అంతకన్నా  తక్కువగా రు.2472 వున్నది. గ్రామీణ ప్రజల విమయ ఖర్చు లో 17 పెద్ద రాష్ట్రాలలో గుజరాత్ 2000 లో 4వ స్థానములో వుండగా 2012 నాటికి 8వ స్థానానికి దిగజారింది. పట్టణ ప్రాంత ప్రజల వినిమయ ఖర్చులో 2000 లో 7వ స్థానములో వుండగా 2012 నాటికి 9వ స్థానానికి దిగజారింది.
  1. ఉద్యోగిత పెరుగుదల అఖిల భారత స్థాయికన్నా తక్కువ:  తాను ప్రధాన మంత్రి అయితే యువతకి  బ్రహ్మాండమయిన అవకాశాలు కల్పిస్తానని మోడి తన దగ్గర ఏదో మంత్రదండమున్నట్లు కోతలు కొస్తున్నాడు.  కానీ 2001 మరియు 2011 జనాభా లెక్కల నివేదికల ప్రకారం 2001-2011 మధ్య కాలములో కార్మికుల సంఖ్య అఖిల భారత స్థాయిలో 1.2 శాతం పెరగగా  గుజరాత్ లో 0.4 శాతమే పెరిగింది. మహిళా కార్మికుల సంఖ్య  ఈ కాలములో అఖిల భారత స్థాయిలో 1 శాతం పెరగగా గుజరాత్ లో 1 శాతం తగ్గింది! జనాభా పెరుగుదలతో పోలిస్తే 2001-2011 మధ్య కార్మికుల సంఖ్య అఖిల భారత స్థాయిలో 2.1 శాతం పెరిగితే గుజరాత్ లో 2.8 శాతం తగ్గింది.
  2. విద్యపై పెట్టె ఖర్చు అఖిల భారత సగటుకన్నా తక్కువ:  తాను ప్రధానమంత్రి  అయితే విజ్ఞాన వంతమయిన ఆర్థిక వ్యవస్థని(నాలెడ్జ్ ఎకానమీ) ని దేశానికి ప్రసాదిస్తానని మోడి కోతలు కోస్తున్నాడు. కానీ గుజరాత్ లో అతని   ప్రభుత్వము విద్య పై పెట్టె ఖర్చు అఖిలభారత స్థాయికన్నా తక్కువగా వున్నది. రిజర్వు బ్యాంకు నివేదిక ప్రకారం విద్య పై దేశం మొత్తముగా అన్నీ రాష్ట్రాలు పెడుతున్న సగటు ఖర్చు అవి పెట్టె మొత్తం ఖర్చులో 14.8 శాతం కాగా గుజరాత్ లో మొత్తం ఖర్చులో 13.2 శాతమే వున్నది. కేంద్ర మానవ వనరుల శాఖ 2010-11 సంవత్సరానికి ప్రకటించిన గణాంకాల ప్రకారం 10 వ తరగతి లోపు డ్రాప్ అవుట్ అవుతున్న పిల్లలు అఖిల భారత స్థాయిలో 49 శాతం కాగా  గుజరాత్ లో 58 శాతం వున్నది.
  3. ఆరోగ్యం పై పెట్టె ఖర్చు అఖిల భారత సగటు కన్నా తక్కువ: రిజర్వు బ్యాంకు రిపోర్టు ప్రకారం ఆరోగ్యం పై పెట్టె ఖర్చుని ప్రభుత్వము పెట్టె  మొత్తం ఖర్చులో శాతం గా చూస్తే 17 పెద్ద రాష్ట్రాలలో గుజరాత్ 16 వ స్థానం లో వున్నది. అన్నీ రాష్ట్రాలు పెట్టె మొత్తం ఖర్చులో ఆరోగ్యం పై పెట్టె ఖర్చు 4 శాతం కాగా గుజరాత్ లో 3.4 శాతమే వున్నది.
  4. మానవ అభివృద్ధి సూచికలో 12వ స్థానం: ఆనాటి కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు రఘురాం రాజన్(ప్రస్తుత రిజర్వు బ్యాంకు గవర్నర్)   అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వము నియమించిన కమిటీ,  ప్రజల వినిమయ ఖర్చు మరియు దారిద్ర్యం ఆధారముగా తయారు చేసిన నివేదిక ప్రకారం మానవ అభివృద్ధి సూచికలో  గుజరాత్ 12వ స్థానం లో వుంది. మొదటి మూడు స్థానాలలో గోవా, కేరళ, తమిళనాడు వున్నాయి.
  5. రైతుల ఆత్మ హత్యలు: ఒక్క 2012 ఆగస్టు-డిసెంబరు కాలములోనే గుజరాత్ లో 40 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.
  6. మత కలహాలు: గుజరాత్ లో 2002 లో మోడి వైఖరివలన మత కలహాలు ప్రజ్వరిల్లి  2000 మంది చనిపోయారు. ఇంతటి స్థాయిలో మత కలహాలు జరిగిన పాలన సుపరిపాలన ఎలా అవుతుంది? అయినప్పటికి మోడిది సుపరిపాలన అని కార్పొరేట్ మీడియా మార్కెటింగ్ చేస్తున్నది. 2002 లో జరిగిన ఘోర హింసాకాండని మర్చి పోవాలని, ఆ తరువాత అక్కడ మత కలహాలు జరగలేదని ప్రచారం జరుగుతున్నది. కానీ వాస్తవం ఏమిటి?  లోక్ సభ లో ప్రభుత్వము 2012 లో ఇచ్చిన సమాచారం ప్రకారం గుజరాత్ లో 2009 నుండి మార్చి 2012 వరకు మత కలహాలకు సంబంధించిన ఘటనలు 181 జరిగాయి. ఈ ఘర్షణలలో 32 మంది చనిపోయారు. ఈ కాలం లో దేశం మొత్తంగా మత కలహాలలో చనిపోయిన వారిలో ఇది 10 శాతం.
  7. కార్పొరేట్సుకు  అడ్డగోలుగా భారీ రాయితీలు
Ø  2003-04 లో మోడి ప్రభుత్వము ఆదాని గ్రూప్ కు ముంద్రా పోర్టు మరియు సెజ్ పేరుతో 6700 హెక్టార్ల భూమిని కేటాయించింది. ఇందుకోసం రైతుల నుండి విస్తారమయిన భూఖండాలను స్వాధీనం చేసుకుని ఆదాని గ్రూప్ కు అప్పగించింది. చదరపు మీటరుకు సగటున రు.10 చొప్పున ఈ భూమిన ఆదాని లకు ధారాదత్తం చేసింది. ఆదాని గ్రూపు ఆతరువాత ఈ భూమిలో రోడ్లు వేసి డెవలప్ చేసి సబ్-ప్లాట్సు గా  విభజించి ప్రభుత్వ రంగ సంస్థలతో సహా అనేక కంపెనీలకు చదరపు మీటరుకు వేల రూపాయల లెక్కన అమ్మింది. ఈ వ్యవహారములో గుజరాత్ ప్రభుత్వ ఖజానాకి రు.10,000 కోట్ల నష్టం వచ్చిందని అంచనా.
Ø  టాటా గ్రూప్ కు నానో కార్ల ఫ్యాక్టరీని గుజరాత్ లో పెట్టటానికి మోడి ప్రభుత్వము ఇచ్చిన రాయితీల విలువ రు.33,000 కోట్లు.

Ø  సూరత్ లో వున్న నవ్ సారి వ్యవసాయ విశ్వవిద్యాలయం కు చెందిన విలువయిన భూమిని చత్రాల ఇండియా హోటల్ గ్రూప్ కు సెవెన్ స్టార్ హోటల్ అభివృద్ధికి ఇచ్చింది. ఈ భూమి విలువ చదరపు మీటరుకు లక్ష రూపాయిలు వుండగా చత్రాలా గ్రూప్ కు రు.15,000క కే కేటాయించింది.
Ø  లార్సేన్ & టౌబ్రో గ్రూప్ కు సూరత్ లో హాజీరా పారిశ్రామిక ప్రాంతం లో వున్న 8 లక్షల చదరపు మీటర్ల విలువయిన భూమిని వేలముతో పని లేకుండా చదరపు మీటరు రు.1 కి కట్టబెట్టింది.ఈ భూమి మార్కెట్ విలువ చదరపు మీటరు రు.3500 వుంటుందని అంచనా.
ఇటువంటి వ్యవహారాలు అనేకం గుజరాత్ లో జరిగాయి. మోడి పాలన అవినీతికి అతీతమయిన పాలన అని చేసే ప్రచారం లో నిజాయితీ లేదు. కార్పొరేట్సుకు ఇచ్చిన ఈ అక్రమ రాయితీలన్నీ అవినీతిగాక మరేమిటి?

గుజరాత్ అభివృద్ధిలో మొదటి స్థానం లో లేదు. మానవ అభివృద్ధిలో వెనకబడి వుంది. కార్మికులపై తీవ్రమయిన దోపిడి జరుగుతున్నది. కార్పొరేట్సుకు భారీ రాయితీలు అడ్డగోలుగా అవినీతికరంగా ఇవ్వబడుతున్నాయి. ప్రజల మధ్య మత కలహాలు విపరీతముగా రెచ్చగొట్టబడ్డాయి. చెప్పుకోతగిన ఘనత(మత కలహాలలో తప్ప) దేనిని నరేంద్ర మోడి సాధించలేదు. అయినప్పటికి అతనిని  వికాస పురుషుడని, అతను ప్రధాన మంత్రి అయితే దేశం ఎదుర్కొంటున్న సమస్యలన్నీ పరిష్కారమయిపోతాయని కార్పొరేట్ మీడియా దుర్బుద్ధితో ప్రచారము  చేస్తున్నది. కార్పొరేట్లు తమ దోపిడి నిర్నిబంధముగా కొనసాగేందుకు కాంగ్రెస్ లేదా బిజెపి అధికారం లోకి రావాలని కోరుకుంటారు. కాంగ్రెస్ ను ప్రజలు తిరస్కరించే పరిస్తితి వున్నది కాబట్టి తమ దోపిడి విశృంఖలముగా కొనసాగేందుకు నరేంద్ర మోడిని, బి జె పి ని ముందుకు తెచ్చి ప్రజలని మోసం చేసే కార్యక్రమం చేస్తున్నది. నరేంద్ర మోడి ద్వారా తాము దేశాన్ని ప్రత్య్క్షముగా పాలించవచ్చని కార్పొరేట్ల ఉద్దేశం. రాజ్యాధికారం, కంపెనీల అధికారం మమేకం కావటం ఫాసిజం. నరేంద్ర మోడి ప్రధాన మంత్రి అయితే జరిగే ప్రమాదం ఇదే. కార్పొరేట్ల ఈ కుట్రలను తిరస్కరించాలి. 

No comments:

Post a Comment