Wednesday, February 10, 2016

ఆర్థిక వ్యవస్థ బాగుంది...బాగాలేదు...ఏమైనా సంస్కరణలు వేగంగా అమలు చేయాలి!(కార్పొరేట్ల మనోగతం)



ప్రభుత్వ లెక్కల ప్రకారం 2015 జూలై –సెప్టెంబరు త్రైమాసికం లో  భారత దేశ స్థూల జాతీయ ఉత్పత్తి (జి డి పి) 7.4 శాతం పెరిగింది. 2015 అక్టోబరు-డిసెంబరు త్రైమాసికం లో  7.3 శాతం పెరుగుతుంది. ఇది చైనా పెరుగుదల 6.8 శాతం కన్నా ఎక్కువ.
కానీ ఈ లెక్కలను ఎవరు నమ్మటం లేదు. బడా పెట్టుబడిదారులు, ఆర్థిక వేత్తలలో అత్యధికులు  అసలే నమ్మటం లేదు. జి డి పి లెక్కలకు, ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న వాస్తవాలకు పొంతన లేదు. ఒక సంవత్సరం క్రితం వరకు భారత ఆర్థిక వ్యవస్థ పెరుగుదల 5 శాతం లోపే వుంటూ వచ్చింది. కానీ జి డి పి లెక్కల ఫార్ములా మార్చటం తో అభివృద్ధి బ్రహ్మాండముగా జరిగినట్లు కనిపిస్తున్నది! కానీ వాస్తవాలేమిటి?
గత 13నెలలుగా ఎగుమతులు వరుసగా తగ్గుతూ వస్తున్నాయి. గ్రామీణ వేతనాల పెరుగుదల చాలా స్వల్పముగా వున్నందున, వరుసగా 2 సార్లు కరువు వచ్చినందున గ్రామీణ ప్రజల ఖర్చు చాలా బలహీనముగా వున్నది. కార్పొరేట్ కంపెనీల ఆర్డర్సులో పెరుగుదల లేదు. పైగా తయారయిన సరుకులు, వాటి , అమ్మకాల మధ్య నిష్పత్తి లో పెరుగుదల లేదు. ఫ్యాక్టరీలు తమ సామర్థ్యం లో 30 శాతాన్ని అమ్మకాలు లేనందున వినియోగించటం లేదు. బ్యాంకులకు చెల్లించాల్సిన బకాయిలు పేరుకు పోయినందున కొత్తగా అప్పులివ్వటం లేదు. దీని వలన వడ్డీ రేట్లు తగ్గించినా ఉపయోగం లేకుండా పోయింది.
 మరి బయట పడటం ఎట్లా? కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 7వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం వేతనాలు పెరిగితే మార్కెట్ లో కొనుగోలు శక్తి పెరిగి దాని ఫలితముగా పెట్టుబడులు పెట్టటం పెరుగుతుందని ఒక ఆశాభావం!కానీ కార్పొరేట్సు దృష్టిలో ప్రజల కొనుగోలు శక్తి గాని, మార్కెట్ గాని చెప్పుకోతగిన విధముగా పెరగదు. అందుకని వారు కార్మిక సంస్కరణలు ( తక్కువ వేతనాలతో పని చేయించుకునేందుకు కార్మిక హక్కుల రద్దు), బ్యాంకింగు సంస్కరణలు (వడ్డీ రేట్లు తగ్గించి కార్పొరేట్లకు అప్పులివ్వటం, బ్యాంకులలో డిజిన్వెస్ట్మెంటు పెద్ద ఎత్తున జరపటం, విదేశీ పెట్టుబడులను ఆహ్వానించటం), భూ సంస్కరణలు ( భూమి పంచటం కాదు, రైతులనుండి భూమిని బలవంతముగా లాక్కుని కార్పొరేత్సుకు నామమాత్రపు ధరలకు అప్పగించటం), పన్నుల సంస్కరణలు ( మరింత పెద్ద ఎత్తున పన్ను రాయితీలను కార్పొరేట్సుకు అందించటం) పెద్ద ఎత్తున అమలు చేయాలని మోడి ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మోడి ప్రభుత్వము అనుకూలముగా వున్నా రాజకీయ పరిస్థితులు అందుకు పూర్తిగా సహకరించే విధముగా లేవని వాపోతున్నారు. ఇప్పుడున్న అతి స్వల్ప పెరుగుదల మరింతగా పెరగాలంటే ఈ సంస్కరణలు వేగముగా జరగాలని, మోడి ప్రభుత్వము వెంటనే ఇందుకు ఉపక్రమించాలని కార్పొరేట్ల కోరిక!
సారాంశ ఏమిటంటే ప్రజల కొనుగోలు శక్తిని తద్వారా మార్కెట్లను పెంచే చర్యలెవీ తీసుకోకుండా కార్మిక హక్కుల కత్తిరింపు, రైతుల భూములు లాక్కోటం, బ్యాంకుల ప్రయివేటీకరణ, పన్ను రాయితీల పెంపుదల తదితర ప్రజావ్యతిరేక చర్యలు మారింతగా అమలు జరిపి తమ లాభాలు పెంచాలని కార్పొరేట్ల కోరిక. వారి విశ్వాస పాత్రుడు మోడి కి కూడా ఈ ప్రజావ్యతిరేక చర్యలు చేపట్టాలనే వున్నది. అందుకు ఉపక్రమించే ప్రయత్నాలలో వున్నది.
ఉత్పత్తిని పెంచేందుకు పెరిగిన ఉత్పత్తి వలన మరింతగా పెరిగే సరుకులు అమ్ముడు పోవాలి. అందుకు ప్రజల కొనుగోలు శక్తి పెరగాలి. కానీ ప్రజల కొనుగోలు శక్తి పెరగకుండా కార్మికులను, రైతులను మరింత పీడించటం ద్వారా తమ లాభాలు పెంచుకోవాలాని దుర్మార్గ పూరిత అంతర్జాతీయ ఫైనాన్సు పెట్టుబడితో  మరింతగా కుమ్మక్కవుతున్న భారత బడా పెట్టుబడిదారుల వ్యూహం. కార్మిక వర్గం, రైతాంగం, అన్ని  రంగాల ప్రజలు ఈ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకముగా ఉద్యమించాలి.

No comments:

Post a Comment