Friday, January 31, 2014

మోడి ఆర్థిక ప్రణాళిక-ప్రజలకు గొప్ప దురవస్థ

మాటల గారడీ తప్ప కాంగ్రెస్ కి బి జె పి కి ఆర్థిక విధానాలలో తేడా లేదని చెప్పేడానికి రుజువు ఆర్ ఎస్ ఎస్/బిజెపి ల ప్రధానమంత్రి అభ్యర్థి మోడీ ఇటీవల జరిగిన బి జె పి జాతీయ కార్యవర్గ సమావేశములో తన ఆర్థిక ప్రణాళికను వివరిస్తూ చేసిన ప్రసంగం.
2014 లో జరగబోయే ఎన్నికలలో గెలిచి తాము అధికారం లోకి వస్తే ఈ ప్రణాళికని అమలు చేస్తామని మోడి అన్నారు. 5 టి లతో బ్రాండ్ ఇండియా ను నిర్మిస్తామని అన్నారు. ఈ 5 టి లు టేలెంట్(నిపుణత), ట్రెడిషన్(సాంప్రదాయం), ట్రేడ్(వ్యాపారం), టూరిజం, మరియు టెక్నాలజీ. దీని వలన పెట్టుబడులు వచ్చి దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. దీనికి తోడు భారతీయ సంప్రదాయం, కుటుంబ విలువలు, వ్యవసాయం, గ్రామీణ భారతం, మహిళల సాధికారత, పర్యావరణం, యువత, ప్రజాస్వామ్యం, విజ్ఞానం వంటి పదజాలం వాడారు. ఇంతేగాక డ్రగ్స్, నార్కోటిక్స్ వంటి మత్తు పదార్థాలను వినియోగించే పాశ్చాత్య ప్రభావం పట్ల ఏ మాత్రమూ సహనాన్ని ప్రదర్శించమని, కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. 100 అద్భుత నగరాలు నిర్మిస్తామన్నారు. దేశం 4 మూలల్నీ కలిపే బుల్లెట్ రైళ్ళు నడిపిస్తామనీ, మరిన్ని ఐఐటీ లు, ఐఐఎం లు మరియు ఏ ఐ ఏం ఎస్ లు స్థాపిస్తామని, పరిశ్రమల కి అవసరమయిన  మౌలిక సదుపాయాలు పెంచుతామని, పవర్ ప్లాంట్స్ ను పునరుద్ధరిస్తామని, వ్యవసాయ రంగం లో మౌలిక సదుపాయాలు నిర్మిస్తామని, దేశవ్యాపితంగా ఆప్టిక్ ఫైబర్ కేబుల్ వేస్తామని, నదులను అనుసంధానం చేస్తామని, బ్లాక్ మార్కెటింగ్ ను నివారించేందుకు ప్రత్యేక న్యాయాస్థానాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. వీటికి తోడు సాంఘిక సంక్షేమ పథకాలు కొన్ని అమలు చేస్తామన్నారు. ఆరోగ్యం, అవినీతి నిర్మూలన, విద్య, బ్లాక్ మనీ స్వాధీనం  పై కేంద్రీకరిస్తామన్నారు.  ఇదంతా కాంగ్రెస్ చెప్పిన “భారత్ నిర్మాణ్ “అందరికీ ప్రయోజనం కలిగే పెరుగుదల” వంటి నినాదాల లాగానే  వుంది.
ఇవన్నీ ప్రశంసనీయమయిన లక్ష్యాలే అయినప్పటికీ అసలు విషయం వీటిని సాధించటం ఎలా అనేదే. ఇందుకు కావాల్సిన నిధులను ఎవరినుండి వసూలు చేస్తారు? ఎక్కడినుండి వసూలు చేస్తారు? దీని అమలుకు కావాల్సిన యంత్రాంగం ఏ విధంగా వుండాలి? ఇవి అసలు విషయాలు. ఈ అసలు విషయాలకు సంబంధించిన ప్రస్తావన వీరి ప్రణాళికలో లేదు. దీనినే ఫాసిస్టు వాగాడంబరం అంటారు. ఫాసిస్టు వాగాడంబరం లో ప్రేలాపనలు అధికం, సారాంశం సున్నా వుంటుంది.
జార్జి డిమిట్రోవ్ ఫాసిజం గురించి ఒక పదునైన విశ్లేషణ చేశారు. అది ప్రజలకు అవినీతికి అతీతంగా నిజాయితీతో పని చేసే ప్రభుత్వాన్ని హామీ యిస్తుందని, అదే సందర్భంలో వాస్తవానికి ప్రజలను అత్యంత అవినీతిపరమయిన, విషపూరితమయిన శక్తుల దయాదాక్షిణ్యాలకు వదిలివేస్తుందని  అన్నారు. తీవ్ర నిరాశా నిస్పృహలలో వున్న ప్రజానీకపు పరిస్థితి పై అది జూదమాడుతుందని, ఆయా దేశాల ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో వుంచుకుని అందుకు తగిన వాగాడంబరం తో ప్రజలను ఆకర్షించే  ప్రయత్నం చేస్తుందని అన్నారు. మధ్యతరగతిలో అత్యధికులేగాక నిరుద్యోగము, అభద్రత, దారిద్ర్యం   సమస్యలనెదుర్కొంటున్న కార్మిక వర్గములో ఒక విభాగము కూడా వీరి సామాజిక మరియు దురహంకారపూరిత వాగాడంబరానికి మోసపోతారని అన్నారు. 20వ శతాబ్దములో పెట్టుబడిదారీ ప్రపంచం ఎదుర్కొన్న తీవ్రమయిన ఆర్థిక సంక్షోభం నుండి బయట పడేందుకు అంతర్జాతీయ పెట్టుబడి హిట్లర్ ను, అతని ఫాసిస్టు పోకడలను ప్రోత్సహించింది. ఆధునిక చరిత్రలో ఎన్నడూ చూడనటువంటి తీవ్ర హింసాకాండకు ఫాసిజం పాల్పడింది.
అంతర్జాతీయ పెట్టుబడి ఆనాడు హిట్లర్ ను ప్రోత్సహించినట్లే ఈనాడు మన దేశం లో భారత కార్పొరేట్ వర్గాలు మోడీని ప్రోత్సహిస్తున్నాయి. అవి బి జె పి ప్రకటించిన ఈ ఆర్థిక ప్రణాళికను ప్రశంసిస్తున్నాయి. సంపదని అస్థిరత పాలు చేయకుండా ప్రభుత్వము ఒక ప్రోత్సాహకుడిగా వ్యవహరించి పెట్టుబడులను ఆకర్షించి ఉద్యోగావకాశాలను కల్పించేందుకు బి జె పి ఆర్థిక ప్రణాళిక ఉపయోగపడుతుందని ఒక కార్పొరేట్ అధ్యక్షుడు అన్నాడు. చైనాలో అనేక నగరాలను నిర్మించినందున ఆర్థిక ప్రగతి సాధ్యమయిందని, కాబట్టి 100 నగరాలను నిర్మించాలనే ఆలోచన చాలా ప్రశంసనీయమని మరొక కార్పొరేట్ అధిపతి అన్నాడు. ఇది అర్థం లేని మాట. నగరాలు వెలిస్తే ఆర్థిక వ్యవస్థ బాగుపడదు. ఆర్థిక వ్యవస్థ పెరిగితే నగరాలు పెరుగుతాయి. మరొక కార్పొరేట్ ముఖ్యుడు మోడీ ప్రకటించిన “5 టి “ లు దేశం లో మానసిక ఉత్తేజాన్ని సృష్టిస్తాయని అన్నాడు. ప్రజలు భారీగా కలలు కనటానికి, అధికముగా ఖర్చు పెట్టటానికి, ఫ్యాక్టరీలు కట్టటానికి, గణనీయంగా పెట్టుబడులు పెట్టటానికి ఈ “5టి” ల సిద్ధాంతం దారితీస్తుందని అన్నాడు.
భారత దేశం లో వున్న ఆర్థిక విషయాల దినపత్రికలు మోడీ పట్ల అత్యత్సాహాన్ని ప్రదర్శిస్తున్నాయి. భారీ పెట్టుబడులు, 100 నగరాలు, భారీ మౌలిక సదుపాయాలు, వేగవంతమయిన రైళ్ళు వంటి ప్రకటనలను మోడీ చాలా ధైర్యముగా ప్రకటించాడని, రాజకీయనాయకులలో  ఇంతటి ధైర్యం సాధారణముగా వుండదని “ఎకనామిక్ టైంసు” పత్రిక ప్రశించింది. ప్రయివేటు పెట్టుబడులవలననే భారత దేశం అభివృద్ధి చెందిందన్నది. మోడీ ఆర్థిక హృదయం సరయిన స్థానములో వున్నదన్నది. మోడీ స్వరం,  అతను బడాపెట్టుబడిదారుల ప్రవక్తగా,  నయా ఉదారవాద ఆర్థిక విధానాల పట్ల నమ్మకం గల వాడిగా వున్నాడని  నిరూపిస్తున్నదని  ఒక వ్యాఖ్యాత అన్నాడు. ప్రస్తుత ప్రభుత్వం పనికొచ్చే పనులు చేయటం లో సాధారణమయిన వైఖరితో వుంటున్నదనీ, ఆం ఆద్మీ పార్టీ గందరగోళం లో పడిందనీ, కాగా మోడీ చెప్పే పరిష్కారాలు విశ్వాసాన్ని కలిగిస్తున్నాయని ఈ వ్యాఖ్యాత అన్నాడు.
రైతులకు రుణాల రద్దు, గ్రామీణ ఉపాధి, ఆహార భద్రత, విద్యాహక్కు తదితరాల కోసం ఏ స్థాయిలో నయినప్పటికీ ప్రభుత్వాధనాన్ని ఉపయోగించకూడదనీ, ప్రజలకు ఒక మేరకయినా ఊరట కలిగించే ఈ ఖర్చును మాని ఆ సొమ్మును స్వదేశీ విదేశీ పెట్టుబడిదారుల లాభాపేక్షకు వినియోగించాలని భారత కార్పొరేట్ వర్గాల అభిప్రాయం. తమ లాభాపేక్షను కప్పిపుచ్చేందుకు కార్పొరేట్ వర్గాలు చేసే ప్రచారం ఏమిటంటే సంక్షేమ పథకాలపై ప్రభుత్వము ఖర్చు పెట్టకుండా ఆ సొమ్మును కూడా తమకి కేటాయించి తమకి తక్కువ వడ్డీకి అప్పులు ఇస్తే దానితో పెట్టుబడులు పెట్టి దేశాన్ని అభివృద్ధి చేస్తామని. కార్పొరేట్ ప్రవక్తలలో ఒకరు చెప్పినట్లు, కార్పొరేట్సు దృష్టిలో మోడీ ఆర్థిక ప్రణాళిక  ప్రస్తుతం ఆర్థికవేత్తలు  పారిశ్రామికవేత్తలు ఏ సమస్యలనయితే పరిష్కరించాలని  యు పి ఏ ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తున్నారో ఆ సమస్యలను పరిష్కరించేదిగా వున్నది.  పారిశ్రామిక అభివృద్ధి తో కూడిన స్థూల జాతీయ ఉత్పత్తి పునరుద్ధరణ, నిపుణతగల కార్మికవర్గాన్ని రూపొందించటం, ఉద్యోగావకాశాల కల్పనకు సత్వర పట్టణీకరణ, సాంకేతిక పరిజ్ఞానం సహకారముతో వ్యవసాయ సంస్కరణ, ధరలు పెరగటానికికారణమవుతున్న ఆహార ధాన్యాల పంపిణీ వ్యవస్థ వీటన్నింటినీ పరిష్కరించేదిగా మోడి ప్రణాళిక వున్నదని వీరు ప్రశంసిస్తున్నారు.
కానీ మన్మోహన్ సింగ్ అనుసరిస్తున్న విధానాలు ఖచ్చితంగా ఇవే. అధిక పెరుగుదల, సంక్షేమ పథకాలు అని బి జె పి చెప్పేది కాంగ్రెస్ చెప్పే అందరికీ ప్రయోజనం కలిగించే సరళీకరణ విధానాలు అనే నినాదానికి మరో రూపం మాత్రమే. యు పి ఏ విధానాలు వాజపాయి ప్రభుత్వము ప్రారంభించిన రెండు భారత దేశాల మధ్య(సంపన్నులు, పేదలు) అంతరాన్ని  పెంచే విధానాల కొనసాగింపు మాత్రమే. సంపన్నులకు, పేదలకు మధ్య అంతరాన్ని పెంచే విధానాలే  బి జె పి విధానాలు.
ప్రయివేటు కార్పొరేట్సుకు పెట్టుబడులు అందుబాటులోకి తెస్తే వారే దేశాన్ని అభివృద్ధి చేస్తారనే ఈ వాదం చాలా తీవ్రమయిన లోపం వున్న వాదన. పెట్టుబడి ఏదయినా కొంత ఉత్పత్తికి దారి తీస్తుంది. ఆ ఉత్పత్తి మార్కెట్ లో అమ్ముడుపోతేనే పెరుగుదల గాని, పెట్టుబడిదారులకు లాభాలు గాని  సాధ్యం అవుతాయి. అమ్ముడుపోకపోతే పెరుగుదల వుండదు, లాభాలు వుండవు. ఒక ఉత్పత్తి మార్కెట్లో అమ్ముడు పోవాలంటే ప్రజలవద్ద అందుకు తగిన స్థాయిలో కొనుగోలు శక్తి వుండాలి. ప్రజలవద్ద కొనుగోలు శక్తి లేకపోతే అప్పుడు పెట్టుబడిదారులకు ప్రభుత్వము తోడ్పడి అందుబాటులోకి తెచ్చిన పెట్టుబడులు అనుత్పాదకముగా మారి ఇప్పుడు జరుగుతున్న విధంగానే రియల్ ఎస్టేట్, బంగారం, విదేశీ మారక ద్రవ్యాలలో రేట్లు పెరగటానికి దారితీస్తుంది. సంపన్నులు ఈ విధంగా స్పెక్యులేటివ్ లాభాలు సంపాదించటానికి తప్ప ఉత్పాదక రంగాలలో వినియోగించని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి కాంగ్రెస్ విధానాలనే బి జె పి అనుసరిస్తున్నది. ప్రజాసంక్షేమం గురించి మాటలు చెపుతూనే అత్యధిక ప్రజల కడగండ్లు పెంచటానికీ, సంపన్నులకు-పేదలకు మధ్య వ్యత్యాసం మరింత పెరగటానికి ఈ విధానాలు దారి తీస్తాయి.
పెరుగుతున్న ఆర్థిక భారాలనుండి భారత ప్రజలకు విముక్తి కలిగించటానికి కాంగ్రెస్, బి జె పి విధానాలకు ప్రత్యామ్నాయంగా వుండే విధానాలు కావాలి. భారీ స్థాయి అవినీతితో దేశ సంపదను సహజ వనరులను లూటీ చేయటానికి అనుమతిస్తున్న ప్రస్తుత విధానాలకు అంతం పలికి, సంపన్నులకు అధికంగా పన్నుల రాయితీలు కల్పిస్తున్న ప్రస్తుత విధానాలకు అంతం పలికి, అందువలన లభించే సంపదని ప్రభుత్వము భారీ స్థాయిలో దేశ అభివృద్ధికి అవసరమయిన మౌలిక సదుపాయాలను నిర్మించటానికి వినియోగించాలి. దీనివలన గణనీయమయిన స్థాయిలో అదనంగా ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఉద్యోగాలు, పనులు దొరికినప్పుడు ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. అది మన ఆర్థిక వ్యవస్థ అవిచ్ఛిన్నంగా పెరగటానికి అవసరమయిన పునాదిగా వుంటుంది.
మెరుగైన భారత దేశ నిర్మాణానికి భారత ప్రజానీకపు జీవన ప్రమాణాలు మెరుగుపడటానికి ఇటువంటి ప్రత్యామ్నాయ ఆర్థిక విధానాలు అవసరం. ఈ ప్రత్యామ్నాయ విధానాల కోసం పోరాడే శక్తులను  2014 ఎన్నికలలో గెలిపించాలి.బి జె పి, కాంగ్రెస్ లు లేకుండా, ఈ ప్రత్యామ్నాయ విధానాలను అమలుపరచగలిగే ఒక లౌకిక రాజకీయ ప్రత్యామ్నాయం నేటి అవసరం.
(ఇది “పీపుల్స్ డెమోక్రసీ” 26.1.2014 సంచికలో సీతారాం యేచూరి రాసిన సంపాదకీయానికి స్వేచ్ఛానువాదం)



Thursday, January 30, 2014

4 జి సర్వీసులు అందించబోతున్న ప్రయివేటు టెలికాం కంపెనీలు-మరి బి ఎస్ ఎన్ ఎల్ పరిస్థితి ఏమిటి?


టెలికాం కంపెనీలకు మొబైల్ సర్వీసులపై వచ్చే ఆదాయములో వాయిస్ కాల్స్ పై వచ్చే ఆదాయమే అత్యధికం. కానీ క్రమంగా డేటా సర్వీసుల పై (మొబైల్ ఫోన్ లో ఇంటర్నెట్) ఆదాయం పెరుగుతున్నది. భవిష్యత్తులో డేటా సర్వీసులపై వచ్చే ఆదాయం గణనీయముగా పెరుగుతుంది. కాబట్టి పోటీలో నిలబడ దలచుకున్న టెలికాం కంపెనీలు డేటా సర్వీసుల పై కేంద్రీకరిస్తున్నాయి. అందుకు వీలుగా తగిన స్పెక్ట్రమ్ బ్యాండ్ ను కొనటానికి, నెట్ వర్కును అప్గ్రేడ్ చేయటానికీ ప్రయత్నిస్తున్నాయి.
డేటా సర్వీసులను 2 జి స్పెక్ట్రమ్ ద్వారా ఇస్తే స్పీడు తక్కువగా వుంటుంది. 3 జి పై అయితే అంతకన్నా ఎక్కువ స్పీడ్ వుంటుంది. 4 జి అయితే మరింత ఎక్కువ స్పీడ్ వుంటుంది. మొబైల్ ఫోన్ లో ఇంటర్నెట్ చూసే వాళ్ళు ఎంత ఎక్కువ వీలయితే అంత ఎక్కువ స్పీడ్ తో డేటా సర్వీసులు కావాలనుకుంటారు.
ప్రస్తుతం ప్రయివేటు టెలికాం కంపెనీల వద్ద, బి ఎస్ ఎన్ ఎల్ వద్ద 3 జి స్పెక్ట్రమ్ వున్నది. కానీ 4 జి స్పెక్ట్రమ్ కొన్ని కంపెనీలకు మాత్ర్రమే వున్నది. 4 జి సర్వీసులు ఇవ్వటానికి ఉపయోగ పడే 2300,2600  మెగాహెట్జ్ బ్యాండ్స్ స్పెక్ట్రమ్ వేలం 2010 లో జరిగింది. ఈ బ్యాండ్స్ నే బి డబ్ల్యూ ఏ స్పెక్ట్రమ్ బ్యాండ్స్ అని కూడా ఆంటారు. అయితే ప్రభుత్వము అప్పుడు ఈ బ్యాండ్స్ లో బి ఎస్ ఎన్ ఎల్ కు ఇచ్చిన బి డబ్ల్యూ ఏ స్పెక్ట్రమ్ నాసిరకంది ఇచ్చారు. దానిని ఉపయోగించి 4 జి సర్వీసులు ఇవ్వాలంటే అందుకవసరమయిన టెక్నాలజీకి చాలా ఎక్కువగా పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. అయినప్పటికి దానికి వేలములో నిర్ణయించబడిన మార్కెట్ రేటును బి ఎస్ ఎన్ ఎల్ నుండి ప్రభుత్వము వసూలు చేసింది. గిట్టుబాటు కానీ ఈ స్పెక్ట్రమ్ ను బి ఎస్ ఎన్ ఎల్ ప్రభుత్వానికి తిరిగి ఇచ్చింది. అందుకోసం బి ఎస్ ఎన్ ఎల్ చెల్లించిన రు. 6700 కోట్లను బి ఎస్ ఎన్ ఎల్ కు వాపసు ఇవ్వాలని ప్రభుత్వము నిర్ణయించింది. కానీ 2010 లో జరిగిన వేలములో ప్రయివేటు కంపెనీలు మంచి నాణ్యమయిన బి డబ్ల్యూ ఏ స్పెక్ట్రమ్ ను పొందాయి.
 ఆ వేలములో ఇన్ఫోటెల్ 22 సర్కిల్సుకు (అంటే దేశములో అన్నీ సర్కిల్సుకు) బి డబ్ల్యూ ఏ స్పెక్ట్రమ్ ను కొన్నది.  ఆ తరువాత ఈ కంపెనీని ముకేష్ అంబానీ కంపెనీ “రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్” కొన్నది. కాబట్టి రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ కు ఈ విధముగా దేశ వ్యాపితముగా అన్నీ సర్కిల్సులో 4 జి సర్వీసులు ఇవ్వటానికి వీలయిన స్పెక్ట్రమ్ లభించింది. ఎయిర్టెల్ 4 సర్కిల్సులో,  ఎయిర్సెల్ 8 సర్కిల్సులో కొన్నాయి. కాల్కమ్ అనే అమెరికా కంపెనీ 4 సర్కిల్సులో బి డబ్ల్యూ ఏ స్పెక్ట్రమ్ ను కొని ఆ తరువాత తన కంపెనీ భారత శాఖలో 51 శాతం పైగా ఎయిర్టెల్ కు అమ్మలని నిర్ణయించింది. ఈ కార్యక్రమం 2014 కు పూర్తవుతుంది. ఈ విధముగా ఎయిర్టెల్ కు మరో 4 సర్కిల్సు లో బి డబ్ల్యూ ఏ స్పెక్ట్రమ్ దొరుకుతుంది. తికోణ అనే మరొక బ్రాడ్ బ్యాండ్ కంపెనీ 5 సర్కిల్సులో బి డబ్ల్యూ ఏ స్పెక్ట్రమ్ ను కొన్నది. ఈ విధముగా ప్రస్తుతం రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ కు దేశం లో అన్నీ సర్కిల్సులో, ఎయిర్టెల్ కు 8 సర్కిల్సులో, ఎయిర్సెల్ కు 8 సర్కిల్సులో, తికోణ కు 5 సర్కిల్సులో బి డబ్ల్యూ ఏ స్పెక్ట్రమ్ వున్నది. దీనితో అవి 4 జి సర్వీసులు ఇయ్యవచ్చు. 4 జి సర్వీసుల స్పీడు 3 జి కన్నా 10 నుండి 12 రెట్లు ఎక్కువగా వుంటుంది.
త్వరలో రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ అన్ని సర్కిల్సులో 4 జి సర్వీసులు దానితో పాటు వాయిస్ సర్వీసులు ప్రారంభించబోతున్నది. ఎయిర్టెల్ ఇప్పటికే కలకత్తా, బెంగళూరు, పూనా వంటి కొన్ని నగరాలలో 4 జి సర్వీసులు ప్రారంభించింది. తమిళనాడు సర్కిల్ లో ఎయిర్సెల్ త్వరలో 4జి సర్వీసులు ప్రారంభించబోతున్నది. వోడాఫోన్ దగ్గర 4 జి సర్వీసులకు పనికి వచ్చే బి డబ్ల్యూ ఏ స్పెక్ట్రమ్ ప్రస్తుతం లేదు. అయినప్పటికి అది తన నెట్ వర్కు ను ఇంటర్నెట్ ప్రోటోకాల్ సామర్థ్యం గల నెట్ వర్క్ గా అప్ గ్రేడ్  చేసేందుకు పూనుకుంటున్నది. ఇందుకు సంవత్సరానికి రు.5000 కోట్ల చొప్పున రెండు మూడు సంవత్సరాలు పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. అందుకు అది సిద్ధముగా వున్నది. ఆ విధముగా నెట్ వర్క్ ను అప్గ్రేడ్ చేసిన అనంతరం అది వాయిస్ కాల్స్ తో పాటు డేటా సర్వీసులను కూడా ఎక్కువ స్పీడ్ తో ఇవ్వటానికి వీలవుతుంది. ఫిబ్రవరి 2014 లో జరిగే స్పెక్ట్రమ్ వేలము లో పాల్గొని అందులో 2 జి సర్వీసులకు ప్రస్తుతం వినియోగిస్తున్న 1800 ఎం‌హెచ్‌జెడ్ బ్యాండ్ నే 5 మెగాహెర్ట్జ్ కొని దానితో 4 జి సర్వీసులు ఇచ్చే ఆలోచనతో ఐడియా సెల్యులార్ వున్నది.
 2జి సర్వీసులకు వినియోగిస్తున్న 900/1800 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ బ్యాండ్ తోనే 4 జి సర్వీసులు ఇయ్య వచ్చు. అయితే ఇంతకు ముందు ఇవ్వబడిన 900/1800 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ బ్యాండ్ ను 2 జి సర్వీసులకు మాత్రమే వినియోగించాలానే  షరతు వున్నది. ఇప్పుడు ప్రభుత్వము 2012 లో జరిగిన, ఆ తరువాత జరిగే వేలములో అమ్మబడే 1800 మెగాహెర్ట్జ్ బ్యాంక్డ్ స్పెక్ట్రమ్ ను 2 జి సర్వీసులకే గాక 4 జి సర్వీసులు ఇవ్వటానికి కూడా వినియోగించవచ్చునని నిబంధనలను సడలించింది. దీనినే స్పెక్ట్రమ్ లిబరలైజేషన్ అంటారు. కాబట్టి ఈ స్పెక్ట్రమ్ లిబరలైజేషన్ విధానం ప్రకారం ఈ సంవత్సరం జరిగే  వేలము లో 1800 మెగాహెర్ట్జ్ బ్యాండ్ స్పెక్ట్రమ్ ను కొని దానితోనే 4జి సర్వీసులు ఇచ్చే ప్రయత్నము లో ఐడియా వున్నది.

కానీ బి ఎస్ ఎన్ ఎల్ పరిస్థితి ఏమిటి? 4 జి సర్వీసులు ఇచ్చే వీలున్న బి డబ్ల్యూ ఏ స్పెక్ట్రమ్ ను అది పైన తెలియజేసిన కారణాలవలన ప్రభుత్వానికి వాపసు ఇచ్చింది. కాబట్టి అది ప్రస్తుతము 2 జి సర్వీసులను ఇస్తున్న 900/1800 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ బ్యాండును వినియోగించి 4 జి సర్వీసులను ఇయ్య వచ్చు. ఈ బ్యాండ్స్ స్పెక్ట్రమ్ బి ఎస్ ఎన్ ఎల్ వద్ద పుష్కలముగా వున్నది. కానీ బి ఎస్ ఎన్ ఎల్ కు ఈ బ్యాండ్ స్పెక్ట్రమ్ ను 2010 కి ముందే కేటాయించటం జరిగినందున దానిని 2 జి కి తప్ప మరి ఏ ఇతర సర్వీసులు ఇవ్వటానికి కూడా వినియోగించకూడదనే నిబంధన వర్తిస్తుంది. ఒక వేళ ఈ బ్యాండ్ తోనే 4 జి సర్వీసులు ఇవ్వాలంటే అందుకు ఈ బ్యాండు స్పెక్ట్రమ్  కు 2012 లో జరిగిన వేలములో నిర్ణయించబడిన ధరను బి ఎస్ ఎన్ ఎల్ చెల్లించాల్సి వుంటుంది. ఇది అనేక వేల కోట్ల రూపాయిలు అవుతుంది. అంత చెల్లించగలిగే పరిస్థితి నష్టాలలో వున్న బి ఎస్ ఎన్ ఎల్ కు లేదు. ప్రభుత్వము రూల్సు సడలించి ఈ చెల్లింపుతో నిమిత్తము లేకుండా అనుమతిస్తేనే ఇప్పుడు తనవద్ద వున్న 900/1800 మెగాహెర్ట్జ్ బ్యాండ్ స్పెక్ట్రమ్ ను ఉపయోగించి 4 జి సర్వీసులిచ్చి పోటీలో నిలబడగలగటం బి ఎస్ ఎన్ ఎల్ కు సాధ్యమవుతుంది.

Wednesday, January 29, 2014

బి ఎస్ ఎన్ ఎల్ మొబైల్ రెవెన్యూ లో పెరుగుదల; దేశ సంపద, ప్రజాప్రయోజనాలు, రాజకీయ కర్తవ్యం; ‘సైనిక’ న్యాయం

బి ఎస్ ఎన్ ఎల్ మొబైల్ రెవెన్యూ లో పెరుగుదల
జి ఎస్ ఏం మొబైల్ సర్వీసులపై బి ఎస్ ఎన్ ఎల్ కు వచ్చిన రెవెన్యూ 2012 ఏప్రిల్-డిసెంబరు కాలము తో పోలిస్తే 2013 ఏప్రిల్-డిసెంబరు కాలం లో పెరిగింది. వివరాలు:
వివరం
2012 ఏప్రిల్ నుండి డిసెంబరు వరకు మొత్తం ఆదాయం
(కోట్ల రూపాయిలు)
2013 ఏప్రిల్ నుండి డిసెంబరు వరకు మొత్తం ఆదాయం
(కోట్ల రూపాయిలు)
పెరుగుదల శాతం
బి ఎస్ ఎన్ ఎల్ మొత్తముగా
7391.72
7894.39
6.8 శాతం
సౌత్ జోన్ లో
ఆంధ్ర ప్రదేశ్ సర్కిల్
80.98
87.33
7.85శాతం
చెన్నై సర్కిల్
18.62
18.68
0.33 శాతం
కర్ణాటక సర్కిల్
55.61
71.16
27.96 శాతం
కేరళ సర్కిల్
79.37
96.79
21.95
తమిళనాడు సర్కిల్
67.01
72.55
8.27 శాతం

ఆదాయము తగ్గిన సర్కిల్సు=అస్సామ్ (0.29 శాతం), బీహార్(4.35 శాతం), ఝార్ఖండ్ (32.23 శాతం), మధ్యప్రదేశ్(2.62 శాతం), మహారాష్ట్ర(1.40 శాతం), హర్యానా(4.11 శాతం), ఉత్తరాంచల్(11.91 శాతం).
దేశ సంపద, ప్రజాప్రయోజనాలు, రాజకీయ కర్తవ్యం
ప్రపంచీకరణ షరతులతో అమలవుతున్న పథకాల వల్ల దేశంలో సహజ వనరుల దోపిడీ తీవ్రమయింది. విధానాలలో భాగమే సహజవనరుల దోపిడీ. అన్నీ రంగాలలో విదేశీ పెట్టుబడులను అనుమతించే విషయములో కాంగ్రెస్, బి జె పి లు ఒకే వైఖరితో ఉండటాన్ని ప్రజలు గమనించాలి. దేశం లోని గనులు, జలాలు, సహజ సంపదలను దోపిడీ వర్గాలకు కట్టబెట్టటం లో వాటి వైఖరి ఒకటే. ఈ విధానాల పట్ల ప్రాంతీయ పార్టీలకు కూడా భిన్నాభిప్రాయం లేదు. ఈ విధానాలపై ప్రజల్లో అసంతృప్తి పెరిగేకొద్దీ వారిని పక్కదారి పట్టించేందుకు కుల, మత, ప్రాంతీయ తత్వాలను రెచ్చగొట్టి కాలం గడుపుకోవాలాని ప్రయత్నిస్తున్నాయి. బి జె పి కి అదనముగా మరో వ్యూహమున్నది. మాట తత్వాన్ని రెచ్చగొట్టటం తో పాటు దేశాన్ని ముక్కలు చేసి రాష్ట్రాలను బలహీనం చేసి కేంద్రీకృత నిరంకుశ రాజ్యాన్ని ఏర్పాటు చేయాలనే వ్యూహం తో అది వుంది. అది దేశానికి, ప్రజాస్వామ్యానికి ముప్పు కలిగిస్తుంది. దేశములో వున్న ప్రధాన సమస్యలకి పరిష్కారం ఏమిటో చెప్పకుండా కేవలం అవినీతికి వ్యతిరేకాముగా మాట్లాడుతూ ఆదేసందర్భములో అవినీతికి, అన్నీ సమస్యలకు  మూలమయిన కార్పొరేట్ ఆధిపత్యాన్ని వ్యతిరేకించకుండా అవినీతికి వ్యతిరేకముగా పోరాడుతున్నామని చెప్పే కబుర్లు నమ్మదగినవి కావు.
అందుకనే కాంగ్రెస్, బి జె పి లను ఓడించటం కర్తవ్యంగా ముందుకు వెళ్ళాలి. ప్రపంచీకరణ విధానాలను  వ్యతిరేకిస్తూ ప్రత్యామ్నాయ  విధానాల కోసం పోరాడుతున్న వామ పక్ష ప్రజాతంత్ర శక్తులను బలపరచాలి.
సైనిక న్యాయం
పుష్కర కాలం కిందట దేశాన్ని కుదిపేసిన పత్రిబల్‌ ఎన్‌కౌంటర్‌ వివాదం ఇప్పుడు మరోసారి చర్చనీయాంశమవుతోంది. సైన్యం 2000 సంవత్సరంలో జమ్మూకాశ్మీర్‌లోని అనంతనాగ్‌ జిల్లాకు చెందిన ఐదుగురిని ఉగ్రవాదుల ముద్రవేసి ఎన్‌కౌంటర్‌ పేరిట కాల్చి చంపింది. దాన్ని నిరసించిన జనంపై పోలీసులు జరిపిన కాల్పుల్లో మరో తొమ్మిది మంది బలయ్యారు. అనంతరం సిబిఐ చేపట్టిన దర్యాప్తులో డిఎన్‌ఎ పరీక్షల్లో మృతులు పాకిస్థాన్‌కు చెందిన వారు కాదని, జమ్మూకాశ్మీర్‌ పౌరులేనని నిర్థారణయ్యింది. అందుకు కారణమైన ఐదుగురు సైనికాధికారులు నిందితులుగా అత్యున్నత దర్యాప్తు సంస్థ నిగ్గు తేల్చింది. అయితే సిబిఐ ఛార్జిషీటు దాఖలు చేయడానికి ఉన్నత సైన్యాధికారుల ముందస్తు అనుమతిని పొందాలని సాయుధ దళాల (ప్రత్యేక అధికారాల) చట్టం (ఎఎఫ్‌ఎస్‌పిఎ) చెబుతున్న నిబంధన పాటించనందున అది చెల్లదని సదరు నిందితులు న్యాయస్థానాల్లో అభ్యంతరం లేవనెత్తడం తీవ్రమైన విషయం. కింది కోర్టులన్నీ ఈ వాదనను తిరస్కరించినా ఇటీవల సుప్రీంకోర్టు నిందితులైన సైనికాధికారులను నిర్దోషులుగా తేల్చడం ఇప్పుడు తాజా వివాదమైంది. మరోవైపు సైనిక న్యాయస్థానం (కోర్ట్‌ మార్షల్‌) కూడా సైనికాధికారుల తప్పు లేదని చెప్పడం మరో వింత. డిఎన్‌ఎ పరీక్షలో మృతులు జమ్మూకాశ్మీర్‌కు చెందినవారని నిర్ధారణ కాగా కోర్టు మార్షల్‌ వారిని పాకిస్తానీయులని చెప్పడం మరోవింత. ఎఎఫ్‌ఎస్‌పి చట్టం తొలి నుంచీ వివాదాస్పదమే. జమ్మూకాశ్మీర్‌లోని ప్రజలు వ్యతిరేకించటమే గాక దేశమంతటా గల లౌకిక, ప్రజాతంత్రవాదులు ఆ చట్టం పట్ల అనేక అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆ నిరసనల సెగతో కేంద్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్‌ జీవన్‌రెడ్డి కమిటీ కూడా ఆ చట్టం అమానవీయమైనదని, దాన్ని రద్దు చేయాలని సిఫార్సు చేసింది. కాశ్మీర్‌ అంతర్జాతీయ సరిహద్దుల్లో ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే దాన్ని ఉపయోగిస్తే కొంత అర్థం చేసుకోవచ్చు. కానీ భారతీయ పౌరులను నిర్దాక్షిణ్యంగా చంపేసిన సైనికాధికారులకు ఆ చట్టమే రక్షణ కవచంగా ఉపయోగపడడం ఘోరం. ఆ చట్టంలోని లొసుగులే ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా నిందితులు నిర్దోషులుగా బయటపడడానికి దోహదపడడం దురూహ్యం. తమవారిని దారుణంగా చంపేస్తున్నారనీ, రకరకాల సాకులతో తమను వేధిస్తున్నారని జమ్మూకాశ్మీర్‌ ప్రజల్లో సైన్యం పట్ల తీవ్ర వ్యతిరేకత నెలకొన్నది. ఇలాటి నేపథ్యంలో ఈ తీర్పుతో పరిస్థితి మరింత దిగజారుతుంది. ఎఎఫ్‌ఎస్‌పిఎను అడ్డం పెట్టుకొని పత్రీబల్‌ ఎన్‌కౌంటర్‌ కేసును మూసేయడానికి వీలులేదు. ఇప్పటికైనా కేంద్రం తగు విధంగా జోక్యం చేసుకుని ఆ కేసులో విచారణ కొనసాగించి శిక్షాస్మృతి ప్రకారం దోషులకు శిక్షలు పడేలా చూడాలి. అలా చేస్తేనే జమ్మూకాశ్మీర్‌ ప్రజానీకానికి భారత ప్రభుత్వం పట్ల కొంతైనా విశ్వాసం కలుగుతుంది.(ప్రజాశక్తి 29.1.2014 తేదీ సంపాదకీయం)






Tuesday, January 28, 2014

స్పెక్ట్రమ్ యూసేజ్ ఛార్జీ నిర్ణయం పై టెలికాం కంపెనీల మధ్య వివాదం-ప్రభుత్వ నిర్ణయం

స్పెక్ట్రమ్ యూసేజ్ ఛార్జీ నిర్ణయం పై టెలికాం కంపెనీల మధ్య వివాదం-ప్రభుత్వ నిర్ణయం  

రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ ముకేష్ అంబానీది. 2010 లో అది 4 జి స్పెక్ట్రమ్ (బి డబ్ల్యూ ఏ స్పెక్ట్రమ్) ను దేశ వ్యాపితముగా అన్నీ సర్కిల్సు కూ అక్రమ మార్గములో సంపాదించింది. ఇన్ఫోటెల్ బ్రాడ్ బ్యాండ్ సర్వీసెస్ లిమిటెడ్ అనే టెలికాం కంపెనీ వున్నట్లు కూడా ఎవరికీ తెలియదు. కానీ ఆ సంస్థ 2010 లో జరిగిన బి డబ్ల్యూ ఏ స్పెక్ట్రమ్ వేలములో పాల్గొన్నది. దేశం మొత్తం అన్నీ సర్కిల్సుకు కలిపి రు. 12750 కోట్లకు బి డబ్ల్యూ ఏ స్పెక్ట్రమ్ ను వేలములో కొన్నది. జూన్ 2010 లో ఈ విధముగా బి డబ్ల్యూ ఏ స్పెక్ట్రమ్ ను పొందిన  వెంటనే ఈ కంపెనీని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ కొన్నది. ఈ లావా దేవీ లో ఇన్ఫోటెల్ బ్రాడ్ బ్యాండ్ సర్వీసెస్ లిమిటెడ్ కంపెనీ ప్రమోటర్సుకు రు. 4800 కోట్లు లాభం వచ్చింది. ఈ విధముగా అక్రమ పద్ధతిలో రిలయన్స్ జియో ఇన్ప్ఫోకామ్ లిమిటెడ్, 4 జి స్పెక్ట్రమ్ ను సంపాదించినది. ఇది త్వరలో 4 జి సర్వీసులను ప్రారంభించ బోతున్నది.

2010 లో 4 జి స్పెక్ట్రమ్ ను వేలము వేసినప్పుడు ప్రభుత్వము అందుకు సంబంధించిన టెండరులో 4 జి స్పెక్ట్రమ్ ను ఉపయోగించుకుంటున్నందుకు ప్రతి సంవత్సరము 4 జి సర్వీసులపై వచ్చిన ఆదాయములో 1 శాతం “స్పెక్ట్రమ్ యూసేజ్ ఛార్జీ” గా చెల్లించాలని వున్నది. కాబట్టి దీని ప్రకారం 4 జి స్పెక్ట్రమ్ పై రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ చెల్లించిన యుసెజ్ ఛార్జీ ఆదాయములో 1 శాతం మాత్రమే.

ఇప్పుడు అమలులో వున్న విధానం  ప్రకారం ఎయిర్టెల్, వోడాఫోన్,ఐడియా, బి ఎస్ ఎన్ ఎల్ మొదలయిన కంపెనీలు గతములో తీసుకున్న స్పెక్ట్రమ్ కు 3 నుండి 8 శాతం వరకూ స్పెక్ట్రమ్ యూసేజి చార్జీ చెల్లించాలి. కానీ ఇటీవలి కాలములో టి ఆర్ ఏ ఐ,  స్పెక్ట్రమ్ యూసేజి చార్జి పై చేసిన సిఫార్సు ప్రకారం సంవత్సరానికి ఒకే రీతిగా 3 శాతం చెల్లించాలి. దీనిని అమలు చేస్తే ఇప్పుడున్న టెలికాం కంపెనీలు 3 నుండి 8 శాతం బదులు 3 శాతం మాత్రమే చెల్లిస్తే సరి పోతుంది. కానీ లైసెన్సు కండిషన్ ప్రకారం 1 శాతం మాత్రమే చెల్లించాల్సిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్, 3 శాతం చెల్లించాల్సి వస్తుంది.

టెలికాం కంపెనీలు వాటి వాటి  ప్రయోజనాలకి అనుకూలముగా అవి లాబీయింగ్ చేస్తున్నాయి. టి ఆర్ ఏ ఐ సిఫార్సు ప్రకారం తమకు స్పెక్ట్రమ్ యూసేజి చార్జి ని 3 నుండి 8 శాతం అని కాకుండా కేవలం 3 శాతమే విధించాలనీ, అదే సందర్భములో ఈ సిఫార్సుననుసరించి రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ నుండి 1 శాతం కాకుండా 3 శాతం వసూలు చేయాలని వాదిస్తున్నాయి. ఇందుకు వ్యతిరేకముగా రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ కంపెనీ, తనకి లైసెన్సు కండిషన్ ప్రకారం 1 శాతమే స్పెక్ట్రమ్ చార్జి వుండాలనీ, లైసెన్సు కండిషన్ మధ్యలో మారదనీ అంటున్నది. అదే విధముగా ఎయిర్టెల్, వోడాఫోన్ తదితర కంపెనీల లైసెన్సు కండిషన్ లో స్పెక్ట్రమ్ చార్జి 3 నుండి 8 శాతం చెల్లించాలాని వున్నది కాబట్టి దానిని మార్చకూడదని వాదిస్తున్నది.

25.1.2013 న జరిగిన టెలికాం కమిషన్ సమావేశము దీనిపై నిర్దిష్టముగా చెప్పకుండా 3 ప్రత్యామ్నాయాలను సిఫార్సు చేసింది. (1) టెలికాం కంపెనీలు ఇది వరకు తీసుకున్న స్పెక్ట్రమ్ కు 3 నుండి 8 శాతం చెల్లించాలి. ఇప్పుడు ఫిబ్రవరిలో జరగబోయే వేలములో తీసుకునే స్పెక్ట్రమ్ కు 3 శాతం చెల్లించాలి.(2) ఇంతకు ముందు తీసుకున్న, ఇక ముందు తీసుకోబోయే స్పెక్ట్రమ్ కు కలిపి ఏక రీతిగా 5 శాతం చెల్లించాలి.(3) ప్రస్తుతమున్న విధానాన్నే కొనసాగించాలి. 4 జి స్పెక్ట్రమ్ కలిగి వున్న రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్,తికోణ కంపెనీలు 4 జి ఒక్క దానికే అయితే 1 శాతం, 4 జి మరియు 2 జి సర్వీసులు కూడా ఇస్తే రెండింటికీ కలిపి ఏకరీతిగా 3 శాతం చెల్లించాలనీ టెలికాం కమిషన్ సిఫార్సు చేసింది.

అయితే భారత  అటార్నీ జనరల్ జి.ఈ.వాహన్వతి మరియు ఆర్థిక మంత్రిత్వ శాఖల అభిప్రాయం ప్రకారం 4 జి స్పెక్ట్రమ్ కు లైసెన్సు కండిషన్ ప్రకారం 1 శాతమే స్పెక్ట్రమ్ ఛార్జీ వసూలు చేయాలి.కాబట్టి అటార్నీ జనరల్ మరియు ఆర్థిక మంత్రిత్వ శాఖలు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ కు అనుకూలముగా వుండగా టెలికాం కమిషన్ ఇతర టెలికాం కంపెనీలకు అనుకూలముగా వున్నది.

27.1.2013 న జరిగగిన  ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ ఉపసంఘం తుది నిర్ణయం ప్రకటించినది. దీని ప్రకారం  ఇకనుండి కొనే  స్పెక్ట్రమ్  కు యూసేజి ఛార్జీ,  ఆదాయములో 5శాతం చెల్లించాలి. అయితే 4 జి కి మాత్రం టెండర్ కండిషన్ ప్రకారం 1 శాతమే చెల్లించాలి. ఇంతకు ముందే వున్న స్పెక్ట్రమ్ కు ఇప్పటివరకు వున్న 3 నుండి 8 శాతం రేటు మరియు కొత్తగా నిర్ణయించిన 5 శాతం రేటు-ఈ రెండింటి సగటు రేటు చెల్లించాలి.

4 జి స్పెక్ట్రమ్ కు  రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ 1 శాతం స్పెక్ట్రమ్ చార్జి చెల్లించాలని ప్రభుత్వము తీసుకున్న నిర్ణయం అన్యాయమని తమ వలెనే రిలయన్స్ జియో కూడా 4 జి స్పెక్ట్రమ్ తో వాయిస్ సర్వీసులు కూడా ఇస్తుంది కాబట్టి దానిపై కూడా 5 శాతం స్పెక్ట్రమ్ చార్జి విధించాలని ఎయిర్టెల్, వోడాఫోన్ తదితర కంపెనీలు వాదిస్తున్నాయి.

అయితే వీటన్నింటికన్నా బి ఎస్ ఎన్ ఎల్ కే ఎక్కువ సమస్య వుంటుంది. ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియా వంటి పాత ప్రయివేటు కంపెనీల లైసెన్సు అనేక సర్కిల్సు లో 2014, 2015 లలో అయిపోతుంది. కాబట్టి అవి ఫిబ్రవరి లో జరిగే వేలములో స్పెక్ట్రమ్ ను కొత్తగా కొంటాయి. కొత్తగా కొన్న స్పెక్ట్రమ్ కు మంత్రివర్గ నిర్ణయం ప్రకారం 5 శాతమే స్పెక్ట్రమ్ యూసేజి చార్జి చెల్లించాలి. కానీ బి ఎస్ ఎన్ ఎల్ కు లైసెన్సు ఆలస్యముగా 2000 లో ఇచ్చినందున దాని లైసెన్సు కాలం 2020 వరకూ వుంటుంది. కాబట్టి బి ఎస్ ఎన్ ఎల్ కు ఇప్పుడున్న స్పెక్ట్రమ్  2020 వరకూ కొనసాగుతుంది. కానీ దాని పై అది కొత్త, పాత రేట్ల సగటును చెల్లించాల్సి వుంటుంది. ఇది 5 శాతం కన్నా ఎక్కువగా వుంటుంది.

కాబట్టి ప్రభుత్వము తీసుకున్న నిర్ణయం వలన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ కు అధిక ప్రయోజనం చేకూరుతుండగా ఇతర ప్రయివేటు కంపెనీలకు స్వల్ప ప్రయోజనం లభూస్తుంది. కానీ బి ఎస్ ఎన్ ఎల్ కు అదనముగా కొంత భారం పడుతుంది.

 

Monday, January 27, 2014

కొత్త విధానం “స్పెక్ట్రమ్ షేరింగ్”, “స్పెక్ట్రమ్ ట్రేడింగ్”-బి ఎస్ ఎన్ ఎల్ కు జరగ బోతున్న అన్యాయం

ఇప్పటివరకు అమలులో వున్న విధానం ప్రకారం ఒక టెలికాం కంపెనీ,ప్రభుత్వము నుండి తాను కొన్న స్పెక్ట్రమ్ ను ఇంకొక కంపెనీకి షేరింగ్ ఇవ్వకూడదు,  అమ్మ కూడదు. కానీ “జాతీయ టెలికాం విధానం,2012” లో ఈ విధానం మారింది. స్పెక్ట్రమ్ షేరింగ్ ను త్వరలో ఆమోదించాలని, ఆ తరువాత స్పెక్ట్రమ్ ట్రేడింగ్ కు కూడా ఆమోదించాలని అన్నది.

స్పెక్ట్రమ్ షేరింగ్ కు సంబంధించిన గైడ్ లైన్స్ ను టెలికాం డిపార్ట్మెంటు డిసెంబరు 2013 లో ప్రకటించింది. ఈ గైడ్లైంస్ ప్రకారం ఒక సర్కిల్ లో స్పెక్ట్రమ్ ను కలిగి వున్న ఒక కంపెనీ తనవద్ద అదనముగా వున్న స్పెక్ట్రమ్ ను అదే సర్కిల్ లో స్పెక్ట్రమ్ వున్నప్పటికి తక్కువగా వున్న కంపెనీ తో షేర్ చేసుకోవచ్చు. స్పెక్ట్రమ్ షేరింగ్ ఒప్పందములో వున్న రెండు కంపెనీలు కలిపి తమ వద్ద వున్న మొత్తము స్పెక్ట్రము పై స్పెక్ట్రమ్ యూసేజి ఛార్జీలు చెల్లించాలి.  అయితే ఈ షేరింగు 2 జి స్పెక్ట్రమ్ కే పరిమితం. 3 జి స్పెక్ట్రమ్ షేరింగ్ ను డి ఓ టి అనుమతించలేదు.

ఇప్పుడు స్పెక్ట్రమ్ ట్రేడింగ్ విషయములో కూడా గైడ్ లైన్స్ తుది రూపానికి వచ్చాయి. టెలికాం కమిషన్, ఆ తరువాత ఆర్థిక విషయాల మంత్రివర్గ ఉపసంఘం లు స్పెక్ట్రమ్ ట్రేడింగ్ ను సూత్రప్రాయముగా ఆమోదించాయి. సవివరమయిన గైడ్ లైన్స్  ను తయారు చేసే పనిని టి ఆర్ ఏ ఐ కి అప్ప చెప్పాయి. టి ఆర్ ఏ ఐ ఈ గైడ్ లైన్స్  ను త్వరలో ప్రకటించబోతున్నది. పత్రికలలో వచ్చిన వార్తల ప్రకారం ఈ గైడ్ లైన్స్ లో వుండ బోయే విషయాలు (1) స్పెక్ట్రమ్ ట్రేడింగ్ కు ప్రభుత్వ అనుమతి అవసరం లేదు. ట్రేడింగ్ ఒప్పందం జరగటానికి 6 వారాల ముందు ప్రభుత్వానికి తెలియ జేస్తే చాలు.(2) 2010 లో గాని,ఆ తరువాత గాని వేలములో మార్కెట్ రేట్ ప్రకారం కొన్న స్పెక్ట్రమ్ ను మాత్రమే ట్రేడింగ్ చేయవచ్చు. 2010 కి ముందు ప్రభుత్వము నిర్ణయించిన ధరకు కొన్న స్పెక్ట్రమ్ ను ట్రేడ్ చేయ కూడదు. ఒక వేళ దానిని ట్రేడ్  చేయాలంటే దానికి వేలములో  నిర్ణయించబడిన మార్కెట్ రేటు చెల్లించి ట్రేడ్ చేయ వచ్చు. (3) స్పెక్ట్రమ్ ను ట్రేడింగ్ లో కొన్న  కంపెనీ యొక్క మొత్తం స్పెక్ట్రమ్ ఆ సర్కిల్ లో వున్న మొత్తము స్పెక్ట్రములో 25 శాతం మించకూడదు, ఒక  బ్యాండ్ లో 50 శాతం మించ కూడదు. (4) స్పెక్ట్రమ్ ట్రేడింగ్ సందర్భముగా ట్రేడింగ్ ధరలో 1 శాతం గాని లేదా ట్రేడ్ అయిన స్పెక్ట్రమ్ యొక్క మార్కెట్ విలువలో 1 శాతం కానీ, ఏది ఎక్కువ అయితే అది ప్రభుత్వానికి చెల్లించాలి.

అయితే స్పెక్ట్రమ్ ట్రేడింగు విషయములో బి ఎస్ ఎన్ ఎల్ కు అన్యాయం జరగబోతున్నది. బి ఎస్ ఎన్ ఎల్ కు 2 జి స్పెక్ట్రమ్ 2010 కి ముందే ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియా వంటి వాటితో పాటు కేటాయించటం జరిగింది. 2010 కి ముందు జరిగిన 2జి స్పెక్ట్రమ్ కేటాయింపులకు ప్రయివేటు కంపెనీలు ప్రభుత్వము నిర్ణయించిన ధర చెల్లించగా, సామాజిక బాధ్యతలు నెరవేరుస్తున్న కారణముగా బి ఎస్ ఎన్ ఎల్ ను ఈ చెల్లింపునుండి మినహాయించటం జరిగింది. బి ఎస్ ఎన్ ఎల్ కు మొబైల్ సర్వీసులకు లైసెన్సు 2000 సంవత్సరములో ఇచ్చారు. కాబట్టి లైసెన్సు కాలము 20 సంవత్సరాలు అనగా 2020 వరకు గతములో  ఇచ్చిన 2 జి స్పెక్ట్రమ్ బి ఎస్ ఎన్ ఎల్ వద్ద కొనసాగుతుంది. ఇతర ప్రయివేటు కంపెనీలకన్నా బి ఎస్ ఎన్ ఎల్ వద్దనే 2 జి స్పెక్ట్రమ్ అధికముగా వున్నది. బి ఎస్ ఎన్ ఎల్ కు దాదాపు అన్నీ సర్కిల్సులోనూ 10 మెగాహెర్ట్జ్ 2 జి స్పెక్ట్రమ్ వుండగా ప్రయివేటు కంపెనీలకు 10  మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ వున్న సర్కిల్సు నామ మాత్రం. కాబట్టి ట్రేడింగ్ కు కావాల్సినంత స్పెక్ట్రమ్ ప్రయివేటు కంపెనీలకన్నా బి ఎస్ ఎన్ ఎల్ వద్దనే ఎక్కువ వున్నది.

కానీ 2010 కి ముందే బి ఎస్ ఎన్ ఎల్ కు ఈ స్పెక్ట్రమ్ ఇచ్చినందున అది అదనముగా వున్నప్పటికి దానిని ట్రేడ్ చేసి సొమ్ము చేసుకునే అవకాశం బి ఎస్ ఎన్ ఎల్ కు 2020 వరకూ లేదు. ఒక వేళ ట్రేడ్ చేయాలంటే 2012 లో జరిగిన వేలములో నిర్ణయించబడిన మార్కెట్ రేటును  ఆ స్పెక్ట్రమ్ కు చెల్లించాలి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే 2012 లో జరిగిన వేలములో స్పెక్ట్రమ్ ప్రాథమిక ధర దేశములో వున్న అన్నీ సర్కిల్సుకు కలిపి (మొత్తం 22 సర్కిల్సు) 5 మెగాహెర్ట్జ్ కు ఋ. 14000 కోట్లు.కాబట్టి బి ఎస్ ఎన్ ఎల్ గనుక ట్రేడింగ్ లోకి దిగాలంటే తన వద్ద వున్న 2 జి స్పెక్ట్రమ్ కు ఈ రేటు ప్రకారం 20 సర్కిల్సు కు చెల్లించాలి(ఢిల్లీ, ముంబాయిలలో బి ఎస్ ఎన్ ఎల్ లేదు గనుక అది 22 సర్కిల్సులో 20 సర్కిల్సులో వున్నట్లు లెక్క).  

 కాగా ఎయిర్టెల్, వోడాఫోన్ తదితర ప్రయివేటు కంపెనీలు 2014, 2015 సంవత్సరాలలో లైసెన్సు కాలం ముగుస్తుంది గనుక అవి మళ్ళీ స్పెక్ట్రమ్ ను కొనాలి. 2014 ఫిబ్రవరిలో జరిగే స్పెక్ట్రమ్ వేలములో పాల్గొని అవి తమకు కావాల్సిన స్పెక్ట్రమ్ ను కొంటాయి. కాబట్టి ప్రభుత్వము వాటికి మేలు కలిగించేందుకు ఇప్పుడు జరగబోయే వేలములో ప్రాథమిక ధరను 5 మెగాహెర్ట్జ్ కు 2012 లో నిర్ణయించబడిన రు.14000 కు బదులు రు. 8824 కోట్లుగా నిర్ణయించింది. ఈ విధముగా ప్రయివేటు కంపెనీలు తక్కువ ధరకు స్పెక్ట్రమ్ ను కొని ఆ తరువాత దానిని ట్రేడ్ చేసే అవకాశం ఏర్పడింది. కానీ బి ఎస్ ఎన్ ఎల్ కనుక తన వద్ద వున్న స్పెక్ట్రమ్ ను ట్రేడ్ చేయాలంటే అది ఆ స్పెక్ట్రమ్ కు 2012 లో నిర్ణయించబడిన అధిక రేటు ప్రకారం చెల్లించాలి. గత 4 సంవత్సరాలుగా నష్టాలలో వుంటున్న బి ఎస్ ఎన్ ఎల్ కు ఇంత మొత్తాన్ని చెల్లించటం సాధ్యము కాదు. అందువలన తన వద్ద ట్రేడ్ చేయగల స్పెక్ట్రమ్ అధికముగా వున్నప్పటికీ చేయలేని పరిస్థిటి బి ఎస్ ఎన్ ఎల్ కు ఎదురవుతుంది.

కాబట్టి స్పెక్ట్రమ్ ట్రేడింగ్ విధానము ప్రయివేటు కంపెనీలకు అనుకూలముగా, ప్రభుత్వ రంగ సంస్థలయిన బి ఎస్ ఎన్ ఎల్, ఏం టి ఎన్ ఎల్ లకు వ్యతిరేకముగా వుండబోతున్నది. అసలు స్పెక్ట్రమ్ ట్రేడింగునే అనుమతించ కూడదు. తమ వద్ద స్పెక్ట్రమ్ అధికముగా వున్నదని ఏదయినా కంపెనీ అనుకుంటే ఆ విధముగా అధికముగా వున్న దానిని ప్రభుత్వానికి వాపసు ఇచ్చి వేయాలి. ప్రభుత్వమే ఆ విధముగా లభించిన స్పెక్ట్రమ్ ను వేలం వేయాలి. కానీ ప్రయివేటు కంపెనీల మేలు కోసము, ప్రభుత్వ రంగ సంస్థలకు హాని కలిగించటానికి స్పెక్ట్రమ్ ట్రేడింగ్ ను అనుమతించబోతున్నది. ఒక వేళ ట్రేడింగ్ కు అనుమతించినా సామాజిక బాధ్యతల నిర్వహణలో నష్టాలను ఎదుర్కొంటున్న బి ఎస్ ఎన్ ఎల్ కు గతములో ఇచ్చిన స్పెక్ట్రమ్ ను ఎటువంటి చెల్లింపుతో పని లేకుండా ట్రేడ్ చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వము కల్పించాలి.

Sunday, January 26, 2014

సత్తాక జయంతి


ఓ సుస్వతంత్రమా! ఓ మోహ మంత్రమా!

నీ రూపు కనబడేనా-ఎందైన-ఎపుడైన

నీ రేక తేటబడునా-ఓ సుస్వతంత్రమా...

 

నీ నామ జపమాల నిష్ఠతో త్రిప్పితిమి

-కంటక పథాలలో కటిక చీకట్లలో 

కక్కసల చెఱలలో-ఓ సుస్వతంత్రమా...

 

నీ మోము భయభూతధూమాగ్ని వలయమో

కళ్యాణ పాత్రమో-కనక శతపత్రమో

కనుపించునా మాకు ఓ సుస్వతంత్రమా...

 

నిండి తొణికిసలాడు నీ భుజాభాండంబు

-మము బలిమి లాగేను-మధుర రసమున్నదో-

మరుల విషమున్నదో-ఓ సుస్వతంత్రమా...

 

నీ కుశల ఖేలనము నిఖిల సుఖ రూపకమో

-జగడాల జూదమో-జాతర్లు సలిపేరు

జాతులును రాజ్యాలు-ఓ సుస్వతంత్రమా...

 

నరుని స్వాతంత్ర్యమై నారీ స్వతంత్రమై

-అర్థ స్వతంత్రమై వ్యక్తి స్వతంత్రమై

తెగునే నీ సూత్రంబు- ఓ సుస్వతంత్రమా...

 

జన్మ హక్కుల చిక్కి స్వార్జితంబుల చీలి

రాజ్యసీమలనిరికి-పూజ్యమగు నీ పొలము

పండునో ఎండునో-ఓ సుస్వతంత్రమా...

 

స్వకుటుంబ కలహాలు-జాతిమత భేదాలు

-నీ తలకు చుట్టేరు నీతివేత్తలు నేడు

నిజమో అబద్ధమో ఓహో స్వతంత్రమా...

 

పంచభూతంబులును భాగాలు పంచుకొని

-తెగి స్వతంత్రించితే-దిక్కేది ఈ లోక

తీర్థ యాత్రకు రేపు-ఓహో స్వతంత్రమా..

                      ------రాయప్రోలు సుబ్బారావు (30.1.1951)

భారత సర్వ సత్తాక గణతంత్ర సోషలిస్టు లౌకిక రాజ్యము 26.1.1950 న ఏర్పడిన సంవత్సరము తరువాత రాయప్రోలు సుబ్బారావు గారు 30.1.1951 న రాసిన  గేయం ఇది.

స్వతంత్రం వచ్చిన తరువాత,  సర్వ సత్తాక గణతంత్ర సోషలిస్టు లౌకిక రాజ్యముగా ఏర్పడిన  తరువాత మన దేశము అనేక విషయాలలో కొంత అభివృద్ధి సాధించింది. అయినప్పటికీ దారిద్ర్యం,నిరుద్యోగం వంటి ప్రధాన సమస్యలు పరిష్కారం కాలేదు. ప్రపంచములో దరిద్రుల  సంఖ్య అధికముగా వున్న దేశముగా ఇప్పటికీ మన దేశం వున్నది. నిరుద్యోగ సమస్య ఇప్పటికీ వెంటాడుతున్నది. “నరుని స్వాతంత్ర్యమై నారీ స్వతంత్రమై అర్థ స్వతంత్రమై వ్యక్తి స్వతంత్రమై తెగునే నీ సూత్రంబు- ఓ సుస్వతంత్రమా...”  అని కవి వ్యక్తము చేసిన సందేహం ఇప్పటికీ సందేహముగానే వున్నది. పేదరికం, నిరుద్యోగం ఎదుర్కొంటున్న వారికి అర్థ స్వతంత్రం, వ్యక్తి స్వతంత్రం లేనట్లే. మహిళలు అనేక రంగాలలో గతం కన్నా తమ పాత్ర నిర్వహిస్తున్నప్పటికీ ఇప్పటికీ మన సమాజం నారీ స్వాతంత్ర్యాన్ని మనస్ఫూర్తిగా గుర్తించటం లేదు. పురుషాధిపత్యం కొనసాగుతున్నది,కొన్ని సందర్భాలలో మరింత బలపడుతున్నది. అనేక రంగాలలో సాధించిన స్వావలంబన సరళీకరణ, ప్రయివేటీకరణ, ప్రపంచీకరణ విధానాల వలన దెబ్బ తింటున్నది. మత తత్వ శక్తులు (బి జె పి,శివసేన, ఆర్ ఎస్ ఎస్, ఏం ఐ ఏం వంటివి) దేశ రాజకీయాలలో గణనీయముగా పెరిగి లౌకిక స్ఫూర్తికి ప్రమాదం తెస్తున్నాయి. ఇప్పటికీ అణగారిన కులాల పట్ల  వివక్షత, మైనారిటీల పట్ల వివక్షత కొనసాగుతున్నది.  కార్పొరేట్లు కాంగ్రెస్, బి జె పి తదితర బూర్జువా భూస్వామ్య పార్టీలను ప్రత్యక్షముగా శాసించే పరిస్థితి ఏర్పడింది. స్వదేశీ కార్పొరేట్లు విదేశీ కార్పొరేట్లతో కుమ్మక్కై అవినీతికర అక్రమ పద్ధతులలో దేశ సంపదను లూటీ చేయటం జరుగుతున్నది. అవినీతికి విరుగుడుగా చెప్పబడుతున్న లోక్పాల్ చట్టం పరిధిలోకి అవినీతికి మూల కారణమయిన కార్పొరేట్లను తెచ్చేందుకు పార్లమెంటులో వామ పక్షాలు చేసిన ప్రయత్నాన్ని  కాంగ్రెస్, బి జె పి, తదితరపార్టీలు వ్యతిరేకించి అది జరగనీయలేదు. అవినీతికి మూల కారణమయిన కార్పొరేట్లను కాపాడుతూ తామే అవినీతికి వ్యతిరేకముగా పోరాడుతున్న మొనగాళ్ళుగా కాంగ్రెస్, బి జె పి లు విపరీతంగా ప్రచారం చేసుకుంటున్నాయి.

ఈ పరిస్థితి మారి మన రాజ్యాంగ ఉపోద్ఘాతములో చెప్పినట్లు ప్రతి పౌరునికి ఆర్థిక, సాంఘిక, రాజకీయ అవకాశాలు సమంగా లభించాలంటే మన దేశ రాజకీయాలను, ఆర్థిక విధానాలను కార్పొరేట్లు, కుల, మత, ప్రాంతీయ దురహంకారులు శాసించే పరిస్థితి అంతమవ్వాలి. దేశ సార్వభౌమత్వాన్ని, స్వావలంబనను,ప్రజల ప్రాథమిక సమస్యలను పరిష్కరించే, లౌకిక తత్వాన్ని-సామాజిక న్యాయాన్ని- మహిళలకు సమానతను పెంపొందించే ప్రత్యామ్నాయ విధానాలు కావాలి. అటువంటి ప్రత్యామ్నాయ విధానాల కోసం నిలబడే శక్తులయిన వామ పక్షాలు, ప్రజాతంత్ర శక్తులు బలపడాలి. ప్రత్యామ్నాయ విధానాల కోసం జరిగే పోరాటాలలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనటం ద్వారానే ఈ ప్రత్యామ్నాయ శక్తి బలపడుతుంది. ఈ లోగా ఈ సంవత్సరం ఏప్రిల్-మే నెలలలో జరిగే సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్, బి జె పి కూటములను ఓడించేందుకు వామపక్ష లౌకిక శక్తులు బలపడేందుకు ప్రతి ఒక్కరూ సహకరించి మన దేశ రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవాల్సిన అవసరం వున్నది.

 

 

Thursday, January 23, 2014

అభివృద్ధి కావాలంటే విభజనొద్దు

అభివృద్ధి కావాలంటే విభజనొద్దు
శాసన మండలి లో పి డి ఎఫ్ పక్ష నేత ఎం వి ఎస్ శర్మ
వెనుకబడిన జిల్లాలుప్రాంతాలను అభివృద్ధి చేయాలనే చిత్తశు ద్ధి నిజంగా ఉంటే అందుకు రాష్ట్రాన్ని విభజించాల్సిన అవసరమే లేదని శాసనమండలిలో పిడిఎఫ్ పక్షనేత ఎమ్విఎస్ శర్మ అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని కోరారు. బహుళజాతి కంపెనీలు,అంతర్జాతీయ ద్రవ్య సంస్థ (ఐఎమ్ఎఫ్)ప్రపంచ బ్యాంకు విధానాలను రాష్ట్రంపై సులభంగా రుద్దేందుకు ఉద్దేశింపబడే విధంగా ఉన్న రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లును తాను వ్యతిరేకిస్తున్నానని చెప్పారు. ఈ బిల్లును 'రాష్ట్ర సమగ్రాభివృద్ధి బిల్లు'గా సవరించాలని కోరారు. ఈ అంశాలన్నింటిపైనా సభ్యులు చర్చించాలని విజ్ఞప్తి చేశారు. బిల్లుపై చర్చ సందర్భంగా సోమవారం మండలిలో ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు.
అసమానతల్ని పరిగణనలోకి తీసుకోకపోతే రాష్ట్ర ఐక్యతకు భంగకరమంటూ 1956లో సుందరయ్యగారు హెచ్చరించిన విషయాన్ని ఉటంకించారు. రాష్ట్ర ప్రజల భావోద్వేగాలతో కేంద్రం బంతాట ఆడుతోందని అన్నారు. రాష్ట్రం విడిపోవటం వల్ల సమస్యలపై పోరాడే శక్తినిధులు,హక్కులకోసం కేంద్రంపై ఉమ్మడిగా పట్టుపట్టే సత్తువ సన్నగిల్లిపోతుందని హెచ్చరించారు. విభజన తర్వాత ఇరు ప్రాంతాల వారికీ చుక్కలు కనిపించటం ఖాయమని హెచ్చరించారు. ఇరు ప్రాంతాల్లోని పేదలుశ్రామికులు,దళితులుగిరిజనులుబలహీనవర్గాలుమైనారిటీల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించాలని అన్నారు.'మొట్టమొదటి భాషాప్రయుక్త రాష్ట్రాన్ని నిట్టనిలువునా చీల్చొద్దుభాషా ప్రయుక్త రాష్ట్రాల నినాదం యధాలాపంగా రాలేదుఇది జాతీయవాదం నుండే ఆవిర్భవించిందిఐక్య కేరళఐక్య కర్నాటకసంయుక్త మహారాష్ట్రవిశాలాంధ్ర అనే నినాదాలు అలాగే పుట్టుకొచ్చాయిసమర్థవంతమైన కేంద్రంబలమైన రాష్ట్రాల కలయికతోనే ఫెడరలిజం వర్థిల్లుతుందిఅయితే ఆ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించటం వల్లే ఈరోజు ఈ పరిస్థితి దాపురించింది,రాష్ట్రాలు చిన్నవైతే అవి బలహీనపడతాయిగత 30, 40సంవత్సరాల అనుభవాలు ఇదే చెబుతున్నాయిఅని చెప్పారు.
వెనుకబడిన శ్రీకాకుళం జిల్లా నుండి కూలీలుపేదలు పొట్టకూటికోసం అండమాన్ నికోబార్ దీవులుజమ్మూ కాశ్మీర్కు వలసెళుతున్నారని తెలిపారు. శ్రామి కులుకష్ట జీవుల్లో జాతీ యతే కాదుఅంతర్జాతీయత కూడా ఉందని ఈ సందర్భంగా తెలిపారు. అలాంటి శ్రీకాకుళం జిల్లా కూలీలు తామేం తప్పు చేశాం కాబట్టి విడిపోవాలంటూ ప్రశ్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి భావోద్వేగాలను కూడా గమనించాలని కోరారు. 'విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కూ అంటూ ఆనాడు అందరమూ నినదించాంఐక్యంగా ఉండటం వల్లే ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యమైందిఆనాడు ఆంధ్రా అంటే 23 జిల్లాలనే అర్థంలో చెప్పుకునేవాళ్లంఇప్పుడు ఆంధ్రులు అంటే ఒక గీత గీసే పరిస్థితి వచ్చిందిఆనాడు మనకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చే బలం ఎక్కడి నుండి వచ్చిందో తెలుసుకోవాలి?' అని ప్రశ్నించారు.
శర్మ ఈ విధంగా మాట్లాడున్నప్పుడు టిఆర్ఎస్ సభ్యుడు పాతూరి సుధాకర్రెడ్డి అడ్డుతగిలారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో ఎంతమంది తెలంగాణ వాళ్లున్నారో చెప్పాలని ప్రశ్నించారు. ప్రతిగా శర్మ జవాబిస్తూ 'అక్కడ ఆంధ్రా వాళ్లున్నారుతెలంగాణ వాళ్లున్నారుఒరిస్సా,మహారాష్ట్రవారు కూడా ఉన్నారుఅందరూ హ్యాపీగా పనిచేసుకుంటున్నారుతాము గుర్తింపు ఎన్నికల్లో గెలవటం ద్వారా కార్మికులకు ఎలా సేవలందించాలోనని వారు ఆలోచిస్తున్నారుఅని జవాబిచ్చారు. సంతృప్తి చెందని సుధాకర్రెడ్డి వాగ్వివాదానికి దిగటంతో శర్మ రెట్టింపు స్వరంతో 'కావాలంటే మీరు స్టీల్ప్లాంట్కు ఎప్పుడైనా రండి,మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాంతెలంగాణవారు అక్కడ నాయత్వంలోనే చాలాకాలం ఉన్నారు,కె.కేశవరావుగారు 15 సంవత్సరాలపాటు యూనియన్కు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారుఈ వాస్తవాలన్నింటినీ తెలుసుకోండిఅని సమాధానమిచ్చారు.

అనంతరం తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ... ప్రస్తుతం బీహార్లోని రారుబరేలీలో రైలు చక్రాలు తయారు చేసే ఫ్యాక్టరీనిబెంగాల్లో యాక్సిలేటర్ల తయారీ కర్మాగారాన్ని నెలకొల్పుతామంటూ కేంద్రం ప్రకటించిందిఅయితే ఈ రెండింటిలో విశాఖ ఉక్కునే వినియోగించాలని నిర్ణయించారని తెలిపారు. ఆ రెండు చోట్లే ఈ ఫ్యాక్టరీలను ఎందుకు నిర్మించాలిఖమ్మం జిల్లా బయ్యారంలోనో లేక రాష్ట్రంలోని మరే ఇతర వెనుకబడిన ప్రాంతంలోనో వీటిని నిర్మించవచ్చు కదాసింగరేణిలో మైనింగ్ యూనివర్శిటీని నిర్మించవచ్చు కదాఅని ప్రశ్నించారు. విభజన గొడవల్లో మునిగిన మనం ఈ ప్రశ్న అడిగే శక్తిని కోల్పోయామని చెప్పారు. ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కేంద్రం బర్తరఫ్ చేసినప్పుడు ఫెడరలిజం స్ఫూర్తితో కేంద్రం కుట్రలను ఐక్యంగా మనం తిప్పికొట్టగలిగాందీంతో తిరిగి టిడిపి ప్రభుత్వం నిలబడిందివిభజన జరిగితే ఈ శక్తిని మనం కోల్పోతామని చెప్పారు.
మన రాష్ట్ర ఉమ్మడి సొత్తు అయిన కెజి బేసిన్ గ్యాస్ను గుజరాత్కుమహారాష్ట్రకు తరలించు కుపోయారుఈ విషయంలో పాలకులకు తమ పార్టీ మీద ఉన్న విధేయత ఎక్కువవటంతో రాష్ట్ర ప్రయోజనాలు పక్కకు పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి చెందిన 31 మంది ఎంపీలకన్నాముఖేష్ అంబానీ లాబీయింగే కేంద్రంపై ఎక్కువగా పనిచేసిందని విమర్శించారు. సమైక్యంగా ఉన్నప్పుడే ఈ పరిస్థితిని సరిచేసుకోలేని మనం విడిపోయిన తర్వాత ఏం చేయగలమని ప్రశ్నించారు.
'అతిపెద్ద సంస్థగా గిన్నిస్బుక్ రికార్డుల్లోకి ఎక్కిన ఎపిఎస్ ఆర్టీసిని ప్రపంచ బ్యాంకు ఆదేశాలతో ముక్కలుగా చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తే కార్మికులు ఐక్యంగా ఉద్యమించారుఫలితంగా ప్రభుత్వం వెనక్కు తగ్గాల్సి వచ్చిందిస్టీల్ప్టాంట్బిహెచ్ఇఎస్లో పెట్టుబడుల ఉపసంహరణను ఐక్యతతో అడ్డుకున్నాంఅలాంటి ఐక్యతే ఇప్పుడూ కావాలంటే రాష్ట్రం విడిపోకూడదుమన ఐక్యతను నిలబెట్టుకోకపోవటం వల్లే రాష్ట్రానికి రావాల్సిన రైల్వేజోన్ (విశాఖ జోన్) రాకుండా పోయింది,ఈ జోన్ డిమాండ్ను రాష్ట్రానికి చెందిన 42 మంది ఎంపీలు లేవనెత్తినా కేంద్రం పట్టించుకోలేదుఅదే సమయంలో కొల్కత్తాలో 2 వేల మంది కార్మికులున్న మెట్రోరైల్ ప్రాజెక్టుకు కొత్త జోన్ను ఏర్పాటు చేశారు,విచిత్రమేమిటంటే సమైక్య రాష్ట్రంలో జోన్ ఏర్పాటును పట్టించుకోని కేంద్రంఇప్పుడు రాష్ట్రాన్ని విభజిస్తున్నాం కాబట్టి జోన్ను ఏర్పాటు చేస్తామంటోందిసమైక్య రాష్ట్రంలోనే దీన్ని ఏర్పాటు చేస్తే ఎవరొద్దన్నారు?' అని ప్రశ్నించారు.
మన గొడవల్లో మనం పడిపోయి అతి ప్రధానమైన 'ఆహార భద్రతా చట్టంగురించి పూర్తిగా మరిచిపోయామని చెప్పారు. రాష్ట్ర ప్రజల సంక్షేమాన్నిప్రయోజనాలను కాపాడుకోలేని ఈ అశక్తత ఎందుకు వచ్చిందంటూ ప్రశ్నించారు. ప్రజా ప్రాధాన్యాలన్నీ పక్కకుపోయాయని చెప్పారు. బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు తీరని విఘాతం కలుగుతుందని తెలిసినా పట్టించుకునే నాథుడే లేకపోయాడని అన్నారు. ఇతర రాష్ట్రాల్లోని నేతలు తమ ప్రజల ప్రయోజనాలకోసం కేంద్రంపై ఉమ్మడిగా పోరాడుతోంటే మనం అందులో విఫలమయ్యాయని తెలిపారు. గత ఇరవై ఏళ్ల నుండి ప్రపంచీకరణ శరవేగంగా ముందుకొచ్చిందిఅప్పటి నుండి ప్రజా వ్యతిరేక విధానాలు అమలవుతున్నాయిఅన్ని రంగాలనూ కబళించేందుకు ప్రయివేటీకరణ శక్తులు అర్రులు చాస్తున్నాయని చెప్పారు. టిడిపి హయాంలో విద్యుత్రంగాన్ని ముక్కలు చేయాలంటూ ఆదేశించిన ప్రపంచబ్యాంకుతాజాగా కౌలు రైతుల చట్టంలో మార్పులు చేయాలంటూ ఆదేశించిందని తెలిపారు. రాజీవ్ విద్యా మిషన్కు సంబంధించి కేంద్రం చెప్పినట్లు వినకపోతే రాష్ట్రాలకు నిధులు రావన్నారు. రాష్ట్రంలోని కాంట్రాక్టు,ఔట్సోర్సింగ్ ఉద్యోగులుకంప్యూటర్ టీచర్లకు నెలల తరబడి వేతనాలు చెల్లించలేని పరిస్థితి నెలకొందిమహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు కూడా ఇవ్వటం లేదని చెప్పారు. సెజ్ల్లో ఆధునిక వెట్టిచాకిరీ కొనసాగుతోందని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రజల అభివృద్ధికోసం రాష్ట్రాల అధికారాలు పెరగాలని కోరుకోవాలి తప్ప తరగాలని కోరుకోవద్దని సూచించారు. 

ఏ అసంతృప్తిఅన్యాయం జరిగిందని విభజన కోరుతున్నారో ఆ సమస్యలు ప్రస్తుత బిల్లువల్ల నెరవేరే అవకాశం లేదని చెప్పారు. పైగా మున్ముందు వాటిని కొనసాగించే విధంగా ఉందని తెలిపారు. నిర్లక్ష్యానికి గురైన ఉత్తరాంధ్ర,రాయలసీమమహబూబ్నగర్లాంటి ప్రాంతాల ప్రస్తావనే లేదన్నారు. రాష్ట్రం విభజన తర్వాత తెలంగాణసీమాంధ్ర ప్రాంతాల అభివృద్ధికోసం ఈ బిల్లులో రోడ్మ్యాప్ ఏమైనా ఉందాఅని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రధానమైన వెలిగొండ,తోటపల్లివంశధారఎస్ఎల్బిసిగాలేరునగరి,ప్రాణహిత-చేవెళ్ల తదితర ప్రాజెక్టుల ప్రస్తావనే లేదన్నారు. మౌలిక సదుపాయాలను పరిశీలిస్తామంటూ బిల్లులో పేర్కొన్న కేంద్రం ఈ అంశంపై స్పష్టమైన హామీ ఇవ్వలేదన్నారు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

వెనుకబడిన ప్రాంతాలువర్గాలు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఉన్నాయిమరి వీరి అభివృద్ధికి చర్యలేవి?అని ప్రశ్నించారు. అభివృద్ధి లేని విభజన వల్ల ఎవరికి ప్రయోజనం కలుగుతుందని ప్రశ్నించారు. టిడిపివారు హైటెక్ సిటీకట్టిదానికి రోడ్లేశామని చెబుతున్నారుఅదే నిజమైన అభివృద్ధాఅని అన్నారు. వాస్తవానికి హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టింది పారిశ్రామికవేత్తలువ్యాపారవేత్తలే,అందువల్ల లాభాలు కూడా వాళ్ల జేబుల్లోకే వెళ్లాయి,వీటివల్ల సామాన్య ప్రజలకు ఏమైనా దక్కిందాఅని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఈ పరిస్థితికి కాంగ్రెస్టిడిపిదే బాధ్యతని చెప్పారు. ఫలితంగా రాష్ట్రం 'కెప్టెన్ లేని ఓడలాగాతయారయ్యిందని శర్మ ఆవేదన వ్యక్తం చేశారు.
(ప్రజాశక్తి 21.1.2014)