మాటల గారడీ తప్ప కాంగ్రెస్ కి బి జె
పి కి ఆర్థిక విధానాలలో తేడా లేదని చెప్పేడానికి రుజువు ఆర్ ఎస్ ఎస్/బిజెపి ల
ప్రధానమంత్రి అభ్యర్థి మోడీ ఇటీవల జరిగిన బి జె పి జాతీయ కార్యవర్గ సమావేశములో తన
ఆర్థిక ప్రణాళికను వివరిస్తూ చేసిన ప్రసంగం.
2014 లో జరగబోయే ఎన్నికలలో గెలిచి
తాము అధికారం లోకి వస్తే ఈ ప్రణాళికని అమలు చేస్తామని మోడి అన్నారు. 5 ‘టి’ లతో బ్రాండ్ ఇండియా ను నిర్మిస్తామని అన్నారు. ఈ 5 ‘టి’ లు టేలెంట్(నిపుణత), ట్రెడిషన్(సాంప్రదాయం), ట్రేడ్(వ్యాపారం), టూరిజం, మరియు టెక్నాలజీ. దీని వలన పెట్టుబడులు
వచ్చి దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. దీనికి తోడు భారతీయ సంప్రదాయం, కుటుంబ విలువలు, వ్యవసాయం,
గ్రామీణ భారతం, మహిళల సాధికారత,
పర్యావరణం, యువత, ప్రజాస్వామ్యం, విజ్ఞానం వంటి పదజాలం వాడారు. ఇంతేగాక డ్రగ్స్,
నార్కోటిక్స్ వంటి మత్తు పదార్థాలను వినియోగించే పాశ్చాత్య ప్రభావం పట్ల ఏ మాత్రమూ
సహనాన్ని ప్రదర్శించమని, కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు.
100 అద్భుత నగరాలు నిర్మిస్తామన్నారు. దేశం 4 మూలల్నీ కలిపే బుల్లెట్ రైళ్ళు
నడిపిస్తామనీ, మరిన్ని ఐఐటీ లు, ఐఐఎం
లు మరియు ఏ ఐ ఏం ఎస్ లు స్థాపిస్తామని, పరిశ్రమల కి
అవసరమయిన మౌలిక సదుపాయాలు పెంచుతామని, పవర్ ప్లాంట్స్ ను పునరుద్ధరిస్తామని, వ్యవసాయ రంగం
లో మౌలిక సదుపాయాలు నిర్మిస్తామని, దేశవ్యాపితంగా ఆప్టిక్
ఫైబర్ కేబుల్ వేస్తామని, నదులను అనుసంధానం చేస్తామని, బ్లాక్ మార్కెటింగ్ ను నివారించేందుకు ప్రత్యేక న్యాయాస్థానాలు ఏర్పాటు
చేస్తామని అన్నారు. వీటికి తోడు సాంఘిక సంక్షేమ పథకాలు కొన్ని అమలు చేస్తామన్నారు.
ఆరోగ్యం, అవినీతి నిర్మూలన, విద్య, బ్లాక్ మనీ స్వాధీనం పై
కేంద్రీకరిస్తామన్నారు. ఇదంతా కాంగ్రెస్
చెప్పిన “భారత్ నిర్మాణ్’ “అందరికీ ప్రయోజనం కలిగే పెరుగుదల”
వంటి నినాదాల లాగానే వుంది.
ఇవన్నీ ప్రశంసనీయమయిన లక్ష్యాలే
అయినప్పటికీ అసలు విషయం వీటిని సాధించటం ఎలా అనేదే. ఇందుకు కావాల్సిన నిధులను
ఎవరినుండి వసూలు చేస్తారు? ఎక్కడినుండి వసూలు చేస్తారు? దీని అమలుకు కావాల్సిన
యంత్రాంగం ఏ విధంగా వుండాలి? ఇవి అసలు విషయాలు. ఈ అసలు
విషయాలకు సంబంధించిన ప్రస్తావన వీరి ప్రణాళికలో లేదు. దీనినే ఫాసిస్టు వాగాడంబరం
అంటారు. ఫాసిస్టు వాగాడంబరం లో ప్రేలాపనలు అధికం, సారాంశం
సున్నా వుంటుంది.
జార్జి డిమిట్రోవ్ ఫాసిజం గురించి ఒక
పదునైన విశ్లేషణ చేశారు. అది ప్రజలకు అవినీతికి అతీతంగా నిజాయితీతో పని చేసే
ప్రభుత్వాన్ని హామీ యిస్తుందని, అదే సందర్భంలో వాస్తవానికి ప్రజలను అత్యంత అవినీతిపరమయిన, విషపూరితమయిన శక్తుల దయాదాక్షిణ్యాలకు వదిలివేస్తుందని అన్నారు. తీవ్ర నిరాశా నిస్పృహలలో వున్న
ప్రజానీకపు పరిస్థితి పై అది జూదమాడుతుందని, ఆయా దేశాల ప్రత్యేక
పరిస్థితులను దృష్టిలో వుంచుకుని అందుకు తగిన వాగాడంబరం తో ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తుందని అన్నారు. మధ్యతరగతిలో
అత్యధికులేగాక నిరుద్యోగము, అభద్రత, దారిద్ర్యం
సమస్యలనెదుర్కొంటున్న కార్మిక వర్గములో
ఒక విభాగము కూడా వీరి సామాజిక మరియు దురహంకారపూరిత వాగాడంబరానికి మోసపోతారని
అన్నారు. 20వ శతాబ్దములో పెట్టుబడిదారీ ప్రపంచం ఎదుర్కొన్న తీవ్రమయిన ఆర్థిక
సంక్షోభం నుండి బయట పడేందుకు అంతర్జాతీయ పెట్టుబడి హిట్లర్ ను, అతని ఫాసిస్టు పోకడలను ప్రోత్సహించింది. ఆధునిక చరిత్రలో ఎన్నడూ
చూడనటువంటి తీవ్ర హింసాకాండకు ఫాసిజం పాల్పడింది.
అంతర్జాతీయ పెట్టుబడి ఆనాడు హిట్లర్
ను ప్రోత్సహించినట్లే ఈనాడు మన దేశం లో భారత కార్పొరేట్ వర్గాలు మోడీని
ప్రోత్సహిస్తున్నాయి. అవి బి జె పి ప్రకటించిన ఈ ఆర్థిక ప్రణాళికను ప్రశంసిస్తున్నాయి.
సంపదని అస్థిరత పాలు చేయకుండా ప్రభుత్వము ఒక ప్రోత్సాహకుడిగా వ్యవహరించి
పెట్టుబడులను ఆకర్షించి ఉద్యోగావకాశాలను కల్పించేందుకు బి జె పి ఆర్థిక ప్రణాళిక
ఉపయోగపడుతుందని ఒక కార్పొరేట్ అధ్యక్షుడు అన్నాడు. చైనాలో అనేక నగరాలను
నిర్మించినందున ఆర్థిక ప్రగతి సాధ్యమయిందని, కాబట్టి 100 నగరాలను నిర్మించాలనే ఆలోచన చాలా ప్రశంసనీయమని మరొక
కార్పొరేట్ అధిపతి అన్నాడు. ఇది అర్థం లేని మాట. నగరాలు వెలిస్తే ఆర్థిక వ్యవస్థ
బాగుపడదు. ఆర్థిక వ్యవస్థ పెరిగితే నగరాలు పెరుగుతాయి. మరొక కార్పొరేట్ ముఖ్యుడు
మోడీ ప్రకటించిన “5 టి “ లు దేశం లో మానసిక ఉత్తేజాన్ని సృష్టిస్తాయని అన్నాడు. ప్రజలు
భారీగా కలలు కనటానికి, అధికముగా ఖర్చు పెట్టటానికి, ఫ్యాక్టరీలు కట్టటానికి, గణనీయంగా పెట్టుబడులు
పెట్టటానికి ఈ “5టి” ల సిద్ధాంతం దారితీస్తుందని అన్నాడు.
భారత దేశం లో వున్న ఆర్థిక విషయాల
దినపత్రికలు మోడీ పట్ల అత్యత్సాహాన్ని ప్రదర్శిస్తున్నాయి. భారీ పెట్టుబడులు, 100 నగరాలు, భారీ మౌలిక సదుపాయాలు, వేగవంతమయిన రైళ్ళు వంటి
ప్రకటనలను మోడీ చాలా ధైర్యముగా ప్రకటించాడని,
రాజకీయనాయకులలో ఇంతటి ధైర్యం సాధారణముగా
వుండదని “ఎకనామిక్ టైంసు” పత్రిక ప్రశించింది. ప్రయివేటు పెట్టుబడులవలననే భారత
దేశం అభివృద్ధి చెందిందన్నది. మోడీ ఆర్థిక హృదయం సరయిన స్థానములో వున్నదన్నది.
మోడీ స్వరం, అతను బడాపెట్టుబడిదారుల
ప్రవక్తగా, నయా
ఉదారవాద ఆర్థిక విధానాల పట్ల నమ్మకం గల వాడిగా వున్నాడని నిరూపిస్తున్నదని ఒక వ్యాఖ్యాత అన్నాడు. ప్రస్తుత ప్రభుత్వం పనికొచ్చే
పనులు చేయటం లో సాధారణమయిన వైఖరితో వుంటున్నదనీ, ఆం ఆద్మీ
పార్టీ గందరగోళం లో పడిందనీ, కాగా మోడీ చెప్పే పరిష్కారాలు
విశ్వాసాన్ని కలిగిస్తున్నాయని ఈ వ్యాఖ్యాత అన్నాడు.
రైతులకు రుణాల రద్దు, గ్రామీణ ఉపాధి, ఆహార భద్రత, విద్యాహక్కు తదితరాల కోసం ఏ స్థాయిలో నయినప్పటికీ
ప్రభుత్వాధనాన్ని ఉపయోగించకూడదనీ, ప్రజలకు ఒక మేరకయినా ఊరట కలిగించే
ఈ ఖర్చును మాని ఆ సొమ్మును స్వదేశీ విదేశీ పెట్టుబడిదారుల లాభాపేక్షకు
వినియోగించాలని భారత కార్పొరేట్ వర్గాల అభిప్రాయం. తమ లాభాపేక్షను
కప్పిపుచ్చేందుకు కార్పొరేట్ వర్గాలు చేసే ప్రచారం ఏమిటంటే సంక్షేమ పథకాలపై
ప్రభుత్వము ఖర్చు పెట్టకుండా ఆ సొమ్మును కూడా తమకి కేటాయించి తమకి తక్కువ వడ్డీకి
అప్పులు ఇస్తే దానితో పెట్టుబడులు పెట్టి దేశాన్ని అభివృద్ధి చేస్తామని.
కార్పొరేట్ ప్రవక్తలలో ఒకరు చెప్పినట్లు, కార్పొరేట్సు
దృష్టిలో మోడీ ఆర్థిక ప్రణాళిక ప్రస్తుతం
ఆర్థికవేత్తలు పారిశ్రామికవేత్తలు ఏ
సమస్యలనయితే పరిష్కరించాలని యు పి ఏ
ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తున్నారో ఆ సమస్యలను పరిష్కరించేదిగా వున్నది. పారిశ్రామిక అభివృద్ధి తో కూడిన స్థూల జాతీయ
ఉత్పత్తి పునరుద్ధరణ, నిపుణతగల కార్మికవర్గాన్ని రూపొందించటం, ఉద్యోగావకాశాల కల్పనకు సత్వర పట్టణీకరణ, సాంకేతిక
పరిజ్ఞానం సహకారముతో వ్యవసాయ సంస్కరణ, ధరలు
పెరగటానికికారణమవుతున్న ఆహార ధాన్యాల పంపిణీ వ్యవస్థ వీటన్నింటినీ పరిష్కరించేదిగా
మోడి ప్రణాళిక వున్నదని వీరు ప్రశంసిస్తున్నారు.
కానీ మన్మోహన్ సింగ్ అనుసరిస్తున్న
విధానాలు ఖచ్చితంగా ఇవే. అధిక పెరుగుదల, సంక్షేమ పథకాలు అని బి జె పి చెప్పేది కాంగ్రెస్ చెప్పే అందరికీ ప్రయోజనం
కలిగించే సరళీకరణ విధానాలు అనే నినాదానికి మరో రూపం మాత్రమే. యు పి ఏ విధానాలు
వాజపాయి ప్రభుత్వము ప్రారంభించిన రెండు భారత దేశాల మధ్య(సంపన్నులు, పేదలు) అంతరాన్ని పెంచే విధానాల
కొనసాగింపు మాత్రమే. సంపన్నులకు, పేదలకు మధ్య అంతరాన్ని
పెంచే విధానాలే బి జె పి విధానాలు.
ప్రయివేటు కార్పొరేట్సుకు పెట్టుబడులు
అందుబాటులోకి తెస్తే వారే దేశాన్ని అభివృద్ధి చేస్తారనే ఈ వాదం చాలా తీవ్రమయిన
లోపం వున్న వాదన. పెట్టుబడి ఏదయినా కొంత ఉత్పత్తికి దారి తీస్తుంది. ఆ ఉత్పత్తి
మార్కెట్ లో అమ్ముడుపోతేనే పెరుగుదల గాని, పెట్టుబడిదారులకు లాభాలు గాని సాధ్యం అవుతాయి. అమ్ముడుపోకపోతే పెరుగుదల వుండదు, లాభాలు వుండవు. ఒక ఉత్పత్తి మార్కెట్లో అమ్ముడు పోవాలంటే ప్రజలవద్ద
అందుకు తగిన స్థాయిలో కొనుగోలు శక్తి వుండాలి. ప్రజలవద్ద కొనుగోలు శక్తి లేకపోతే అప్పుడు
పెట్టుబడిదారులకు ప్రభుత్వము తోడ్పడి అందుబాటులోకి తెచ్చిన పెట్టుబడులు
అనుత్పాదకముగా మారి ఇప్పుడు జరుగుతున్న విధంగానే రియల్ ఎస్టేట్, బంగారం, విదేశీ మారక ద్రవ్యాలలో రేట్లు పెరగటానికి
దారితీస్తుంది. సంపన్నులు ఈ విధంగా స్పెక్యులేటివ్ లాభాలు సంపాదించటానికి తప్ప
ఉత్పాదక రంగాలలో వినియోగించని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి కాంగ్రెస్ విధానాలనే
బి జె పి అనుసరిస్తున్నది. ప్రజాసంక్షేమం గురించి మాటలు చెపుతూనే అత్యధిక ప్రజల
కడగండ్లు పెంచటానికీ, సంపన్నులకు-పేదలకు మధ్య వ్యత్యాసం మరింత
పెరగటానికి ఈ విధానాలు దారి తీస్తాయి.
పెరుగుతున్న ఆర్థిక భారాలనుండి భారత
ప్రజలకు విముక్తి కలిగించటానికి కాంగ్రెస్, బి జె పి విధానాలకు ప్రత్యామ్నాయంగా వుండే విధానాలు కావాలి. భారీ స్థాయి
అవినీతితో దేశ సంపదను సహజ వనరులను లూటీ చేయటానికి అనుమతిస్తున్న ప్రస్తుత
విధానాలకు అంతం పలికి, సంపన్నులకు అధికంగా పన్నుల రాయితీలు కల్పిస్తున్న
ప్రస్తుత విధానాలకు అంతం పలికి, అందువలన లభించే సంపదని
ప్రభుత్వము భారీ స్థాయిలో దేశ అభివృద్ధికి అవసరమయిన మౌలిక సదుపాయాలను
నిర్మించటానికి వినియోగించాలి. దీనివలన గణనీయమయిన స్థాయిలో అదనంగా ఉద్యోగావకాశాలు
లభిస్తాయి. ఉద్యోగాలు, పనులు దొరికినప్పుడు ప్రజల కొనుగోలు
శక్తి పెరుగుతుంది. అది మన ఆర్థిక వ్యవస్థ అవిచ్ఛిన్నంగా పెరగటానికి అవసరమయిన
పునాదిగా వుంటుంది.
మెరుగైన భారత దేశ నిర్మాణానికి భారత ప్రజానీకపు
జీవన ప్రమాణాలు మెరుగుపడటానికి ఇటువంటి ప్రత్యామ్నాయ ఆర్థిక విధానాలు అవసరం. ఈ
ప్రత్యామ్నాయ విధానాల కోసం పోరాడే శక్తులను
2014 ఎన్నికలలో గెలిపించాలి.బి జె పి, కాంగ్రెస్ లు లేకుండా, ఈ ప్రత్యామ్నాయ విధానాలను
అమలుపరచగలిగే ఒక లౌకిక రాజకీయ ప్రత్యామ్నాయం నేటి అవసరం.
(ఇది “పీపుల్స్ డెమోక్రసీ” 26.1.2014
సంచికలో సీతారాం యేచూరి రాసిన సంపాదకీయానికి స్వేచ్ఛానువాదం)
No comments:
Post a Comment