అభివృద్ధి కావాలంటే విభజనొద్దు
శాసన మండలి లో పి డి ఎఫ్ పక్ష నేత ఎం వి ఎస్ శర్మ
వెనుకబడిన జిల్లాలు, ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే చిత్తశు ద్ధి నిజంగా ఉంటే అందుకు రాష్ట్రాన్ని విభజించాల్సిన అవసరమే లేదని శాసనమండలిలో పిడిఎఫ్ పక్షనేత ఎమ్విఎస్ శర్మ అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని కోరారు. బహుళజాతి కంపెనీలు,అంతర్జాతీయ ద్రవ్య సంస్థ (ఐఎమ్ఎఫ్), ప్రపంచ బ్యాంకు విధానాలను రాష్ట్రంపై సులభంగా రుద్దేందుకు ఉద్దేశింపబడే విధంగా ఉన్న రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లును తాను వ్యతిరేకిస్తున్నానని చెప్పారు. ఈ బిల్లును 'రాష్ట్ర సమగ్రాభివృద్ధి బిల్లు'గా సవరించాలని కోరారు. ఈ అంశాలన్నింటిపైనా సభ్యులు చర్చించాలని విజ్ఞప్తి చేశారు. బిల్లుపై చర్చ సందర్భంగా సోమవారం మండలిలో ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు.
అసమానతల్ని పరిగణనలోకి తీసుకోకపోతే రాష్ట్ర ఐక్యతకు భంగకరమంటూ 1956లో సుందరయ్యగారు హెచ్చరించిన విషయాన్ని ఉటంకించారు. రాష్ట్ర ప్రజల భావోద్వేగాలతో కేంద్రం బంతాట ఆడుతోందని అన్నారు. రాష్ట్రం విడిపోవటం వల్ల సమస్యలపై పోరాడే శక్తి, నిధులు,హక్కులకోసం కేంద్రంపై ఉమ్మడిగా పట్టుపట్టే సత్తువ సన్నగిల్లిపోతుందని హెచ్చరించారు. విభజన తర్వాత ఇరు ప్రాంతాల వారికీ చుక్కలు కనిపించటం ఖాయమని హెచ్చరించారు. ఇరు ప్రాంతాల్లోని పేదలు, శ్రామికులు,దళితులు, గిరిజనులు, బలహీనవర్గాలు, మైనారిటీల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించాలని అన్నారు.'మొట్టమొదటి భాషాప్రయుక్త రాష్ట్రాన్ని నిట్టనిలువునా చీల్చొద్దు, భాషా ప్రయుక్త రాష్ట్రాల నినాదం యధాలాపంగా రాలేదు, ఇది జాతీయవాదం నుండే ఆవిర్భవించింది, ఐక్య కేరళ, ఐక్య కర్నాటక, సంయుక్త మహారాష్ట్ర, విశాలాంధ్ర అనే నినాదాలు అలాగే పుట్టుకొచ్చాయి, సమర్థవంతమైన కేంద్రం, బలమైన రాష్ట్రాల కలయికతోనే ఫెడరలిజం వర్థిల్లుతుంది, అయితే ఆ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించటం వల్లే ఈరోజు ఈ పరిస్థితి దాపురించింది,రాష్ట్రాలు చిన్నవైతే అవి బలహీనపడతాయి, గత 30, 40సంవత్సరాల అనుభవాలు ఇదే చెబుతున్నాయి' అని చెప్పారు.
వెనుకబడిన శ్రీకాకుళం జిల్లా నుండి కూలీలు, పేదలు పొట్టకూటికోసం అండమాన్ నికోబార్ దీవులు, జమ్మూ కాశ్మీర్కు వలసెళుతున్నారని తెలిపారు. శ్రామి కులు, కష్ట జీవుల్లో జాతీ యతే కాదు, అంతర్జాతీయత కూడా ఉందని ఈ సందర్భంగా తెలిపారు. అలాంటి శ్రీకాకుళం జిల్లా కూలీలు తామేం తప్పు చేశాం కాబట్టి విడిపోవాలంటూ ప్రశ్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి భావోద్వేగాలను కూడా గమనించాలని కోరారు. 'విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కూ అంటూ ఆనాడు అందరమూ నినదించాం, ఐక్యంగా ఉండటం వల్లే ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యమైంది, ఆనాడు ఆంధ్రా అంటే 23 జిల్లాలనే అర్థంలో చెప్పుకునేవాళ్లం, ఇప్పుడు ఆంధ్రులు అంటే ఒక గీత గీసే పరిస్థితి వచ్చింది, ఆనాడు మనకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చే బలం ఎక్కడి నుండి వచ్చిందో తెలుసుకోవాలి?' అని ప్రశ్నించారు.
శర్మ ఈ విధంగా మాట్లాడున్నప్పుడు టిఆర్ఎస్ సభ్యుడు పాతూరి సుధాకర్రెడ్డి అడ్డుతగిలారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో ఎంతమంది తెలంగాణ వాళ్లున్నారో చెప్పాలని ప్రశ్నించారు. ప్రతిగా శర్మ జవాబిస్తూ 'అక్కడ ఆంధ్రా వాళ్లున్నారు, తెలంగాణ వాళ్లున్నారు, ఒరిస్సా,మహారాష్ట్రవారు కూడా ఉన్నారు, అందరూ హ్యాపీగా పనిచేసుకుంటున్నారు, తాము గుర్తింపు ఎన్నికల్లో గెలవటం ద్వారా కార్మికులకు ఎలా సేవలందించాలోనని వారు ఆలోచిస్తున్నారు' అని జవాబిచ్చారు. సంతృప్తి చెందని సుధాకర్రెడ్డి వాగ్వివాదానికి దిగటంతో శర్మ రెట్టింపు స్వరంతో 'కావాలంటే మీరు స్టీల్ప్లాంట్కు ఎప్పుడైనా రండి,మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం, తెలంగాణవారు అక్కడ నాయత్వంలోనే చాలాకాలం ఉన్నారు,కె.కేశవరావుగారు 15 సంవత్సరాలపాటు యూనియన్కు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు, ఈ వాస్తవాలన్నింటినీ తెలుసుకోండి' అని సమాధానమిచ్చారు.
అనంతరం తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ... ప్రస్తుతం బీహార్లోని రారుబరేలీలో రైలు చక్రాలు తయారు చేసే ఫ్యాక్టరీని, బెంగాల్లో యాక్సిలేటర్ల తయారీ కర్మాగారాన్ని నెలకొల్పుతామంటూ కేంద్రం ప్రకటించింది, అయితే ఈ రెండింటిలో విశాఖ ఉక్కునే వినియోగించాలని నిర్ణయించారని తెలిపారు. ఆ రెండు చోట్లే ఈ ఫ్యాక్టరీలను ఎందుకు నిర్మించాలి, ఖమ్మం జిల్లా బయ్యారంలోనో లేక రాష్ట్రంలోని మరే ఇతర వెనుకబడిన ప్రాంతంలోనో వీటిని నిర్మించవచ్చు కదా? సింగరేణిలో మైనింగ్ యూనివర్శిటీని నిర్మించవచ్చు కదా? అని ప్రశ్నించారు. విభజన గొడవల్లో మునిగిన మనం ఈ ప్రశ్న అడిగే శక్తిని కోల్పోయామని చెప్పారు. ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కేంద్రం బర్తరఫ్ చేసినప్పుడు ఫెడరలిజం స్ఫూర్తితో కేంద్రం కుట్రలను ఐక్యంగా మనం తిప్పికొట్టగలిగాం, దీంతో తిరిగి టిడిపి ప్రభుత్వం నిలబడింది, విభజన జరిగితే ఈ శక్తిని మనం కోల్పోతామని చెప్పారు.
మన రాష్ట్ర ఉమ్మడి సొత్తు అయిన కెజి బేసిన్ గ్యాస్ను గుజరాత్కు, మహారాష్ట్రకు తరలించు కుపోయారు, ఈ విషయంలో పాలకులకు తమ పార్టీ మీద ఉన్న విధేయత ఎక్కువవటంతో రాష్ట్ర ప్రయోజనాలు పక్కకు పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి చెందిన 31 మంది ఎంపీలకన్నా, ముఖేష్ అంబానీ లాబీయింగే కేంద్రంపై ఎక్కువగా పనిచేసిందని విమర్శించారు. సమైక్యంగా ఉన్నప్పుడే ఈ పరిస్థితిని సరిచేసుకోలేని మనం విడిపోయిన తర్వాత ఏం చేయగలమని ప్రశ్నించారు.
'అతిపెద్ద సంస్థగా గిన్నిస్బుక్ రికార్డుల్లోకి ఎక్కిన ఎపిఎస్ ఆర్టీసిని ప్రపంచ బ్యాంకు ఆదేశాలతో ముక్కలుగా చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తే కార్మికులు ఐక్యంగా ఉద్యమించారు, ఫలితంగా ప్రభుత్వం వెనక్కు తగ్గాల్సి వచ్చింది, స్టీల్ప్టాంట్, బిహెచ్ఇఎస్లో పెట్టుబడుల ఉపసంహరణను ఐక్యతతో అడ్డుకున్నాం, అలాంటి ఐక్యతే ఇప్పుడూ కావాలంటే రాష్ట్రం విడిపోకూడదు, మన ఐక్యతను నిలబెట్టుకోకపోవటం వల్లే రాష్ట్రానికి రావాల్సిన రైల్వేజోన్ (విశాఖ జోన్) రాకుండా పోయింది,ఈ జోన్ డిమాండ్ను రాష్ట్రానికి చెందిన 42 మంది ఎంపీలు లేవనెత్తినా కేంద్రం పట్టించుకోలేదు, అదే సమయంలో కొల్కత్తాలో 2 వేల మంది కార్మికులున్న మెట్రోరైల్ ప్రాజెక్టుకు కొత్త జోన్ను ఏర్పాటు చేశారు,విచిత్రమేమిటంటే సమైక్య రాష్ట్రంలో జోన్ ఏర్పాటును పట్టించుకోని కేంద్రం, ఇప్పుడు రాష్ట్రాన్ని విభజిస్తున్నాం కాబట్టి జోన్ను ఏర్పాటు చేస్తామంటోంది, సమైక్య రాష్ట్రంలోనే దీన్ని ఏర్పాటు చేస్తే ఎవరొద్దన్నారు?' అని ప్రశ్నించారు.
'అతిపెద్ద సంస్థగా గిన్నిస్బుక్ రికార్డుల్లోకి ఎక్కిన ఎపిఎస్ ఆర్టీసిని ప్రపంచ బ్యాంకు ఆదేశాలతో ముక్కలుగా చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తే కార్మికులు ఐక్యంగా ఉద్యమించారు, ఫలితంగా ప్రభుత్వం వెనక్కు తగ్గాల్సి వచ్చింది, స్టీల్ప్టాంట్, బిహెచ్ఇఎస్లో పెట్టుబడుల ఉపసంహరణను ఐక్యతతో అడ్డుకున్నాం, అలాంటి ఐక్యతే ఇప్పుడూ కావాలంటే రాష్ట్రం విడిపోకూడదు, మన ఐక్యతను నిలబెట్టుకోకపోవటం వల్లే రాష్ట్రానికి రావాల్సిన రైల్వేజోన్ (విశాఖ జోన్) రాకుండా పోయింది,ఈ జోన్ డిమాండ్ను రాష్ట్రానికి చెందిన 42 మంది ఎంపీలు లేవనెత్తినా కేంద్రం పట్టించుకోలేదు, అదే సమయంలో కొల్కత్తాలో 2 వేల మంది కార్మికులున్న మెట్రోరైల్ ప్రాజెక్టుకు కొత్త జోన్ను ఏర్పాటు చేశారు,విచిత్రమేమిటంటే సమైక్య రాష్ట్రంలో జోన్ ఏర్పాటును పట్టించుకోని కేంద్రం, ఇప్పుడు రాష్ట్రాన్ని విభజిస్తున్నాం కాబట్టి జోన్ను ఏర్పాటు చేస్తామంటోంది, సమైక్య రాష్ట్రంలోనే దీన్ని ఏర్పాటు చేస్తే ఎవరొద్దన్నారు?' అని ప్రశ్నించారు.
మన గొడవల్లో మనం పడిపోయి అతి ప్రధానమైన 'ఆహార భద్రతా చట్టం' గురించి పూర్తిగా మరిచిపోయామని చెప్పారు. రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని, ప్రయోజనాలను కాపాడుకోలేని ఈ అశక్తత ఎందుకు వచ్చిందంటూ ప్రశ్నించారు. ప్రజా ప్రాధాన్యాలన్నీ పక్కకుపోయాయని చెప్పారు. బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు తీరని విఘాతం కలుగుతుందని తెలిసినా పట్టించుకునే నాథుడే లేకపోయాడని అన్నారు. ఇతర రాష్ట్రాల్లోని నేతలు తమ ప్రజల ప్రయోజనాలకోసం కేంద్రంపై ఉమ్మడిగా పోరాడుతోంటే మనం అందులో విఫలమయ్యాయని తెలిపారు. గత ఇరవై ఏళ్ల నుండి ప్రపంచీకరణ శరవేగంగా ముందుకొచ్చింది, అప్పటి నుండి ప్రజా వ్యతిరేక విధానాలు అమలవుతున్నాయి, అన్ని రంగాలనూ కబళించేందుకు ప్రయివేటీకరణ శక్తులు అర్రులు చాస్తున్నాయని చెప్పారు. టిడిపి హయాంలో విద్యుత్రంగాన్ని ముక్కలు చేయాలంటూ ఆదేశించిన ప్రపంచబ్యాంకు, తాజాగా కౌలు రైతుల చట్టంలో మార్పులు చేయాలంటూ ఆదేశించిందని తెలిపారు. రాజీవ్ విద్యా మిషన్కు సంబంధించి కేంద్రం చెప్పినట్లు వినకపోతే రాష్ట్రాలకు నిధులు రావన్నారు. రాష్ట్రంలోని కాంట్రాక్టు,ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, కంప్యూటర్ టీచర్లకు నెలల తరబడి వేతనాలు చెల్లించలేని పరిస్థితి నెలకొంది, మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు కూడా ఇవ్వటం లేదని చెప్పారు. సెజ్ల్లో ఆధునిక వెట్టిచాకిరీ కొనసాగుతోందని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రజల అభివృద్ధికోసం రాష్ట్రాల అధికారాలు పెరగాలని కోరుకోవాలి తప్ప తరగాలని కోరుకోవద్దని సూచించారు.
ఏ అసంతృప్తి, అన్యాయం జరిగిందని విభజన కోరుతున్నారో ఆ సమస్యలు ప్రస్తుత బిల్లువల్ల నెరవేరే అవకాశం లేదని చెప్పారు. పైగా మున్ముందు వాటిని కొనసాగించే విధంగా ఉందని తెలిపారు. నిర్లక్ష్యానికి గురైన ఉత్తరాంధ్ర,రాయలసీమ, మహబూబ్నగర్లాంటి ప్రాంతాల ప్రస్తావనే లేదన్నారు. రాష్ట్రం విభజన తర్వాత తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల అభివృద్ధికోసం ఈ బిల్లులో రోడ్మ్యాప్ ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రధానమైన వెలిగొండ,తోటపల్లి, వంశధార, ఎస్ఎల్బిసి, గాలేరు, నగరి,ప్రాణహిత-చేవెళ్ల తదితర ప్రాజెక్టుల ప్రస్తావనే లేదన్నారు. మౌలిక సదుపాయాలను పరిశీలిస్తామంటూ బిల్లులో పేర్కొన్న కేంద్రం ఈ అంశంపై స్పష్టమైన హామీ ఇవ్వలేదన్నారు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
వెనుకబడిన ప్రాంతాలు, వర్గాలు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఉన్నాయి, మరి వీరి అభివృద్ధికి చర్యలేవి?అని ప్రశ్నించారు. అభివృద్ధి లేని విభజన వల్ల ఎవరికి ప్రయోజనం కలుగుతుందని ప్రశ్నించారు. టిడిపివారు హైటెక్ సిటీకట్టి, దానికి రోడ్లేశామని చెబుతున్నారు, అదే నిజమైన అభివృద్ధా? అని అన్నారు. వాస్తవానికి హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టింది పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలే,అందువల్ల లాభాలు కూడా వాళ్ల జేబుల్లోకే వెళ్లాయి,వీటివల్ల సామాన్య ప్రజలకు ఏమైనా దక్కిందా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఈ పరిస్థితికి కాంగ్రెస్, టిడిపిదే బాధ్యతని చెప్పారు. ఫలితంగా రాష్ట్రం 'కెప్టెన్ లేని ఓడలాగా' తయారయ్యిందని శర్మ ఆవేదన వ్యక్తం చేశారు.
(ప్రజాశక్తి 21.1.2014)
No comments:
Post a Comment