స్పెక్ట్రమ్ యూసేజ్ ఛార్జీ నిర్ణయం పై టెలికాం కంపెనీల మధ్య వివాదం-ప్రభుత్వ నిర్ణయం
రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ ముకేష్ అంబానీది. 2010 లో అది 4 జి స్పెక్ట్రమ్ (బి డబ్ల్యూ ఏ స్పెక్ట్రమ్) ను దేశ వ్యాపితముగా అన్నీ సర్కిల్సు కూ అక్రమ మార్గములో సంపాదించింది. ఇన్ఫోటెల్ బ్రాడ్ బ్యాండ్ సర్వీసెస్ లిమిటెడ్ అనే టెలికాం కంపెనీ వున్నట్లు కూడా ఎవరికీ తెలియదు. కానీ ఆ సంస్థ 2010 లో జరిగిన బి డబ్ల్యూ ఏ స్పెక్ట్రమ్ వేలములో పాల్గొన్నది. దేశం మొత్తం అన్నీ సర్కిల్సుకు కలిపి రు. 12750 కోట్లకు బి డబ్ల్యూ ఏ స్పెక్ట్రమ్ ను వేలములో కొన్నది. జూన్ 2010 లో ఈ విధముగా బి డబ్ల్యూ ఏ స్పెక్ట్రమ్ ను పొందిన వెంటనే ఈ కంపెనీని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ కొన్నది. ఈ లావా దేవీ లో ఇన్ఫోటెల్ బ్రాడ్ బ్యాండ్ సర్వీసెస్ లిమిటెడ్ కంపెనీ ప్రమోటర్సుకు రు. 4800 కోట్లు లాభం వచ్చింది. ఈ విధముగా అక్రమ పద్ధతిలో రిలయన్స్ జియో ఇన్ప్ఫోకామ్ లిమిటెడ్, 4 జి స్పెక్ట్రమ్ ను సంపాదించినది. ఇది త్వరలో 4 జి సర్వీసులను ప్రారంభించ బోతున్నది.
2010 లో 4 జి స్పెక్ట్రమ్ ను వేలము వేసినప్పుడు ప్రభుత్వము అందుకు సంబంధించిన టెండరులో 4 జి స్పెక్ట్రమ్ ను ఉపయోగించుకుంటున్నందుకు ప్రతి సంవత్సరము 4 జి సర్వీసులపై వచ్చిన ఆదాయములో 1 శాతం “స్పెక్ట్రమ్ యూసేజ్ ఛార్జీ” గా చెల్లించాలని వున్నది. కాబట్టి దీని ప్రకారం 4 జి స్పెక్ట్రమ్ పై రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ చెల్లించిన యుసెజ్ ఛార్జీ ఆదాయములో 1 శాతం మాత్రమే.
ఇప్పుడు అమలులో వున్న విధానం ప్రకారం ఎయిర్టెల్, వోడాఫోన్,ఐడియా, బి ఎస్ ఎన్ ఎల్ మొదలయిన కంపెనీలు గతములో తీసుకున్న స్పెక్ట్రమ్ కు 3 నుండి 8 శాతం వరకూ స్పెక్ట్రమ్ యూసేజి చార్జీ చెల్లించాలి. కానీ ఇటీవలి కాలములో టి ఆర్ ఏ ఐ, స్పెక్ట్రమ్ యూసేజి చార్జి పై చేసిన సిఫార్సు ప్రకారం సంవత్సరానికి ఒకే రీతిగా 3 శాతం చెల్లించాలి. దీనిని అమలు చేస్తే ఇప్పుడున్న టెలికాం కంపెనీలు 3 నుండి 8 శాతం బదులు 3 శాతం మాత్రమే చెల్లిస్తే సరి పోతుంది. కానీ లైసెన్సు కండిషన్ ప్రకారం 1 శాతం మాత్రమే చెల్లించాల్సిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్, 3 శాతం చెల్లించాల్సి వస్తుంది.
టెలికాం కంపెనీలు వాటి వాటి ప్రయోజనాలకి అనుకూలముగా అవి లాబీయింగ్ చేస్తున్నాయి. టి ఆర్ ఏ ఐ సిఫార్సు ప్రకారం తమకు స్పెక్ట్రమ్ యూసేజి చార్జి ని 3 నుండి 8 శాతం అని కాకుండా కేవలం 3 శాతమే విధించాలనీ, అదే సందర్భములో ఈ సిఫార్సుననుసరించి రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ నుండి 1 శాతం కాకుండా 3 శాతం వసూలు చేయాలని వాదిస్తున్నాయి. ఇందుకు వ్యతిరేకముగా రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ కంపెనీ, తనకి లైసెన్సు కండిషన్ ప్రకారం 1 శాతమే స్పెక్ట్రమ్ చార్జి వుండాలనీ, లైసెన్సు కండిషన్ మధ్యలో మారదనీ అంటున్నది. అదే విధముగా ఎయిర్టెల్, వోడాఫోన్ తదితర కంపెనీల లైసెన్సు కండిషన్ లో స్పెక్ట్రమ్ చార్జి 3 నుండి 8 శాతం చెల్లించాలాని వున్నది కాబట్టి దానిని మార్చకూడదని వాదిస్తున్నది.
25.1.2013 న జరిగిన టెలికాం కమిషన్ సమావేశము దీనిపై నిర్దిష్టముగా చెప్పకుండా 3 ప్రత్యామ్నాయాలను సిఫార్సు చేసింది. (1) టెలికాం కంపెనీలు ఇది వరకు తీసుకున్న స్పెక్ట్రమ్ కు 3 నుండి 8 శాతం చెల్లించాలి. ఇప్పుడు ఫిబ్రవరిలో జరగబోయే వేలములో తీసుకునే స్పెక్ట్రమ్ కు 3 శాతం చెల్లించాలి.(2) ఇంతకు ముందు తీసుకున్న, ఇక ముందు తీసుకోబోయే స్పెక్ట్రమ్ కు కలిపి ఏక రీతిగా 5 శాతం చెల్లించాలి.(3) ప్రస్తుతమున్న విధానాన్నే కొనసాగించాలి. 4 జి స్పెక్ట్రమ్ కలిగి వున్న రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్,తికోణ కంపెనీలు 4 జి ఒక్క దానికే అయితే 1 శాతం, 4 జి మరియు 2 జి సర్వీసులు కూడా ఇస్తే రెండింటికీ కలిపి ఏకరీతిగా 3 శాతం చెల్లించాలనీ టెలికాం కమిషన్ సిఫార్సు చేసింది.
అయితే భారత అటార్నీ జనరల్ జి.ఈ.వాహన్వతి మరియు ఆర్థిక మంత్రిత్వ శాఖల అభిప్రాయం ప్రకారం 4 జి స్పెక్ట్రమ్ కు లైసెన్సు కండిషన్ ప్రకారం 1 శాతమే స్పెక్ట్రమ్ ఛార్జీ వసూలు చేయాలి.కాబట్టి అటార్నీ జనరల్ మరియు ఆర్థిక మంత్రిత్వ శాఖలు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ కు అనుకూలముగా వుండగా టెలికాం కమిషన్ ఇతర టెలికాం కంపెనీలకు అనుకూలముగా వున్నది.
27.1.2013 న జరిగగిన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ ఉపసంఘం తుది నిర్ణయం ప్రకటించినది. దీని ప్రకారం ఇకనుండి కొనే స్పెక్ట్రమ్ కు యూసేజి ఛార్జీ, ఆదాయములో 5శాతం చెల్లించాలి. అయితే 4 జి కి మాత్రం టెండర్ కండిషన్ ప్రకారం 1 శాతమే చెల్లించాలి. ఇంతకు ముందే వున్న స్పెక్ట్రమ్ కు ఇప్పటివరకు వున్న 3 నుండి 8 శాతం రేటు మరియు కొత్తగా నిర్ణయించిన 5 శాతం రేటు-ఈ రెండింటి సగటు రేటు చెల్లించాలి.
4 జి స్పెక్ట్రమ్ కు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ 1 శాతం స్పెక్ట్రమ్ చార్జి చెల్లించాలని ప్రభుత్వము తీసుకున్న నిర్ణయం అన్యాయమని తమ వలెనే రిలయన్స్ జియో కూడా 4 జి స్పెక్ట్రమ్ తో వాయిస్ సర్వీసులు కూడా ఇస్తుంది కాబట్టి దానిపై కూడా 5 శాతం స్పెక్ట్రమ్ చార్జి విధించాలని ఎయిర్టెల్, వోడాఫోన్ తదితర కంపెనీలు వాదిస్తున్నాయి.
అయితే వీటన్నింటికన్నా బి ఎస్ ఎన్ ఎల్ కే ఎక్కువ సమస్య వుంటుంది. ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియా వంటి పాత ప్రయివేటు కంపెనీల లైసెన్సు అనేక సర్కిల్సు లో 2014, 2015 లలో అయిపోతుంది. కాబట్టి అవి ఫిబ్రవరి లో జరిగే వేలములో స్పెక్ట్రమ్ ను కొత్తగా కొంటాయి. కొత్తగా కొన్న స్పెక్ట్రమ్ కు మంత్రివర్గ నిర్ణయం ప్రకారం 5 శాతమే స్పెక్ట్రమ్ యూసేజి చార్జి చెల్లించాలి. కానీ బి ఎస్ ఎన్ ఎల్ కు లైసెన్సు ఆలస్యముగా 2000 లో ఇచ్చినందున దాని లైసెన్సు కాలం 2020 వరకూ వుంటుంది. కాబట్టి బి ఎస్ ఎన్ ఎల్ కు ఇప్పుడున్న స్పెక్ట్రమ్ 2020 వరకూ కొనసాగుతుంది. కానీ దాని పై అది కొత్త, పాత రేట్ల సగటును చెల్లించాల్సి వుంటుంది. ఇది 5 శాతం కన్నా ఎక్కువగా వుంటుంది.
కాబట్టి ప్రభుత్వము తీసుకున్న నిర్ణయం వలన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ కు అధిక ప్రయోజనం చేకూరుతుండగా ఇతర ప్రయివేటు కంపెనీలకు స్వల్ప ప్రయోజనం లభూస్తుంది. కానీ బి ఎస్ ఎన్ ఎల్ కు అదనముగా కొంత భారం పడుతుంది.
No comments:
Post a Comment