ఇప్పటివరకు అమలులో వున్న విధానం ప్రకారం ఒక టెలికాం కంపెనీ,ప్రభుత్వము నుండి తాను కొన్న స్పెక్ట్రమ్ ను ఇంకొక కంపెనీకి షేరింగ్ ఇవ్వకూడదు, అమ్మ కూడదు. కానీ “జాతీయ టెలికాం విధానం,2012” లో ఈ విధానం మారింది. స్పెక్ట్రమ్ షేరింగ్ ను త్వరలో ఆమోదించాలని, ఆ తరువాత స్పెక్ట్రమ్ ట్రేడింగ్ కు కూడా ఆమోదించాలని అన్నది.
స్పెక్ట్రమ్ షేరింగ్ కు సంబంధించిన గైడ్ లైన్స్ ను టెలికాం డిపార్ట్మెంటు డిసెంబరు 2013 లో ప్రకటించింది. ఈ గైడ్లైంస్ ప్రకారం ఒక సర్కిల్ లో స్పెక్ట్రమ్ ను కలిగి వున్న ఒక కంపెనీ తనవద్ద అదనముగా వున్న స్పెక్ట్రమ్ ను అదే సర్కిల్ లో స్పెక్ట్రమ్ వున్నప్పటికి తక్కువగా వున్న కంపెనీ తో షేర్ చేసుకోవచ్చు. స్పెక్ట్రమ్ షేరింగ్ ఒప్పందములో వున్న రెండు కంపెనీలు కలిపి తమ వద్ద వున్న మొత్తము స్పెక్ట్రము పై స్పెక్ట్రమ్ యూసేజి ఛార్జీలు చెల్లించాలి. అయితే ఈ షేరింగు 2 జి స్పెక్ట్రమ్ కే పరిమితం. 3 జి స్పెక్ట్రమ్ షేరింగ్ ను డి ఓ టి అనుమతించలేదు.
ఇప్పుడు స్పెక్ట్రమ్ ట్రేడింగ్ విషయములో కూడా గైడ్ లైన్స్ తుది రూపానికి వచ్చాయి. టెలికాం కమిషన్, ఆ తరువాత ఆర్థిక విషయాల మంత్రివర్గ ఉపసంఘం లు స్పెక్ట్రమ్ ట్రేడింగ్ ను సూత్రప్రాయముగా ఆమోదించాయి. సవివరమయిన గైడ్ లైన్స్ ను తయారు చేసే పనిని టి ఆర్ ఏ ఐ కి అప్ప చెప్పాయి. టి ఆర్ ఏ ఐ ఈ గైడ్ లైన్స్ ను త్వరలో ప్రకటించబోతున్నది. పత్రికలలో వచ్చిన వార్తల ప్రకారం ఈ గైడ్ లైన్స్ లో వుండ బోయే విషయాలు (1) స్పెక్ట్రమ్ ట్రేడింగ్ కు ప్రభుత్వ అనుమతి అవసరం లేదు. ట్రేడింగ్ ఒప్పందం జరగటానికి 6 వారాల ముందు ప్రభుత్వానికి తెలియ జేస్తే చాలు.(2) 2010 లో గాని,ఆ తరువాత గాని వేలములో మార్కెట్ రేట్ ప్రకారం కొన్న స్పెక్ట్రమ్ ను మాత్రమే ట్రేడింగ్ చేయవచ్చు. 2010 కి ముందు ప్రభుత్వము నిర్ణయించిన ధరకు కొన్న స్పెక్ట్రమ్ ను ట్రేడ్ చేయ కూడదు. ఒక వేళ దానిని ట్రేడ్ చేయాలంటే దానికి వేలములో నిర్ణయించబడిన మార్కెట్ రేటు చెల్లించి ట్రేడ్ చేయ వచ్చు. (3) స్పెక్ట్రమ్ ను ట్రేడింగ్ లో కొన్న కంపెనీ యొక్క మొత్తం స్పెక్ట్రమ్ ఆ సర్కిల్ లో వున్న మొత్తము స్పెక్ట్రములో 25 శాతం మించకూడదు, ఒక బ్యాండ్ లో 50 శాతం మించ కూడదు. (4) స్పెక్ట్రమ్ ట్రేడింగ్ సందర్భముగా ట్రేడింగ్ ధరలో 1 శాతం గాని లేదా ట్రేడ్ అయిన స్పెక్ట్రమ్ యొక్క మార్కెట్ విలువలో 1 శాతం కానీ, ఏది ఎక్కువ అయితే అది ప్రభుత్వానికి చెల్లించాలి.
అయితే స్పెక్ట్రమ్ ట్రేడింగు విషయములో బి ఎస్ ఎన్ ఎల్ కు అన్యాయం జరగబోతున్నది. బి ఎస్ ఎన్ ఎల్ కు 2 జి స్పెక్ట్రమ్ 2010 కి ముందే ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియా వంటి వాటితో పాటు కేటాయించటం జరిగింది. 2010 కి ముందు జరిగిన 2జి స్పెక్ట్రమ్ కేటాయింపులకు ప్రయివేటు కంపెనీలు ప్రభుత్వము నిర్ణయించిన ధర చెల్లించగా, సామాజిక బాధ్యతలు నెరవేరుస్తున్న కారణముగా బి ఎస్ ఎన్ ఎల్ ను ఈ చెల్లింపునుండి మినహాయించటం జరిగింది. బి ఎస్ ఎన్ ఎల్ కు మొబైల్ సర్వీసులకు లైసెన్సు 2000 సంవత్సరములో ఇచ్చారు. కాబట్టి లైసెన్సు కాలము 20 సంవత్సరాలు అనగా 2020 వరకు గతములో ఇచ్చిన 2 జి స్పెక్ట్రమ్ బి ఎస్ ఎన్ ఎల్ వద్ద కొనసాగుతుంది. ఇతర ప్రయివేటు కంపెనీలకన్నా బి ఎస్ ఎన్ ఎల్ వద్దనే 2 జి స్పెక్ట్రమ్ అధికముగా వున్నది. బి ఎస్ ఎన్ ఎల్ కు దాదాపు అన్నీ సర్కిల్సులోనూ 10 మెగాహెర్ట్జ్ 2 జి స్పెక్ట్రమ్ వుండగా ప్రయివేటు కంపెనీలకు 10 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ వున్న సర్కిల్సు నామ మాత్రం. కాబట్టి ట్రేడింగ్ కు కావాల్సినంత స్పెక్ట్రమ్ ప్రయివేటు కంపెనీలకన్నా బి ఎస్ ఎన్ ఎల్ వద్దనే ఎక్కువ వున్నది.
కానీ 2010 కి ముందే బి ఎస్ ఎన్ ఎల్ కు ఈ స్పెక్ట్రమ్ ఇచ్చినందున అది అదనముగా వున్నప్పటికి దానిని ట్రేడ్ చేసి సొమ్ము చేసుకునే అవకాశం బి ఎస్ ఎన్ ఎల్ కు 2020 వరకూ లేదు. ఒక వేళ ట్రేడ్ చేయాలంటే 2012 లో జరిగిన వేలములో నిర్ణయించబడిన మార్కెట్ రేటును ఆ స్పెక్ట్రమ్ కు చెల్లించాలి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే 2012 లో జరిగిన వేలములో స్పెక్ట్రమ్ ప్రాథమిక ధర దేశములో వున్న అన్నీ సర్కిల్సుకు కలిపి (మొత్తం 22 సర్కిల్సు) 5 మెగాహెర్ట్జ్ కు ఋ. 14000 కోట్లు.కాబట్టి బి ఎస్ ఎన్ ఎల్ గనుక ట్రేడింగ్ లోకి దిగాలంటే తన వద్ద వున్న 2 జి స్పెక్ట్రమ్ కు ఈ రేటు ప్రకారం 20 సర్కిల్సు కు చెల్లించాలి(ఢిల్లీ, ముంబాయిలలో బి ఎస్ ఎన్ ఎల్ లేదు గనుక అది 22 సర్కిల్సులో 20 సర్కిల్సులో వున్నట్లు లెక్క).
కాగా ఎయిర్టెల్, వోడాఫోన్ తదితర ప్రయివేటు కంపెనీలు 2014, 2015 సంవత్సరాలలో లైసెన్సు కాలం ముగుస్తుంది గనుక అవి మళ్ళీ స్పెక్ట్రమ్ ను కొనాలి. 2014 ఫిబ్రవరిలో జరిగే స్పెక్ట్రమ్ వేలములో పాల్గొని అవి తమకు కావాల్సిన స్పెక్ట్రమ్ ను కొంటాయి. కాబట్టి ప్రభుత్వము వాటికి మేలు కలిగించేందుకు ఇప్పుడు జరగబోయే వేలములో ప్రాథమిక ధరను 5 మెగాహెర్ట్జ్ కు 2012 లో నిర్ణయించబడిన రు.14000 కు బదులు రు. 8824 కోట్లుగా నిర్ణయించింది. ఈ విధముగా ప్రయివేటు కంపెనీలు తక్కువ ధరకు స్పెక్ట్రమ్ ను కొని ఆ తరువాత దానిని ట్రేడ్ చేసే అవకాశం ఏర్పడింది. కానీ బి ఎస్ ఎన్ ఎల్ కనుక తన వద్ద వున్న స్పెక్ట్రమ్ ను ట్రేడ్ చేయాలంటే అది ఆ స్పెక్ట్రమ్ కు 2012 లో నిర్ణయించబడిన అధిక రేటు ప్రకారం చెల్లించాలి. గత 4 సంవత్సరాలుగా నష్టాలలో వుంటున్న బి ఎస్ ఎన్ ఎల్ కు ఇంత మొత్తాన్ని చెల్లించటం సాధ్యము కాదు. అందువలన తన వద్ద ట్రేడ్ చేయగల స్పెక్ట్రమ్ అధికముగా వున్నప్పటికీ చేయలేని పరిస్థిటి బి ఎస్ ఎన్ ఎల్ కు ఎదురవుతుంది.
కాబట్టి స్పెక్ట్రమ్ ట్రేడింగ్ విధానము ప్రయివేటు కంపెనీలకు అనుకూలముగా, ప్రభుత్వ రంగ సంస్థలయిన బి ఎస్ ఎన్ ఎల్, ఏం టి ఎన్ ఎల్ లకు వ్యతిరేకముగా వుండబోతున్నది. అసలు స్పెక్ట్రమ్ ట్రేడింగునే అనుమతించ కూడదు. తమ వద్ద స్పెక్ట్రమ్ అధికముగా వున్నదని ఏదయినా కంపెనీ అనుకుంటే ఆ విధముగా అధికముగా వున్న దానిని ప్రభుత్వానికి వాపసు ఇచ్చి వేయాలి. ప్రభుత్వమే ఆ విధముగా లభించిన స్పెక్ట్రమ్ ను వేలం వేయాలి. కానీ ప్రయివేటు కంపెనీల మేలు కోసము, ప్రభుత్వ రంగ సంస్థలకు హాని కలిగించటానికి స్పెక్ట్రమ్ ట్రేడింగ్ ను అనుమతించబోతున్నది. ఒక వేళ ట్రేడింగ్ కు అనుమతించినా సామాజిక బాధ్యతల నిర్వహణలో నష్టాలను ఎదుర్కొంటున్న బి ఎస్ ఎన్ ఎల్ కు గతములో ఇచ్చిన స్పెక్ట్రమ్ ను ఎటువంటి చెల్లింపుతో పని లేకుండా ట్రేడ్ చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వము కల్పించాలి.
No comments:
Post a Comment