Saturday, January 11, 2014

ప్రయివేటు టెలికాం కంపెనీల ఆదాయపు లెక్కలను సి ఏ జి ఆడిట్ చేయవచ్చు—ఢిల్లీ హైకోర్టు; నూతన వాతావరణం (వచన కవిత్వం)

ప్రయివేటు టెలికాం కంపెనీల ఆదాయపు లెక్కలను సి ఏ జి ఆడిట్ చేయవచ్చు—ఢిల్లీ హైకోర్టు

లైసెన్సు ఫీజు, స్పెక్ట్రమ్ ఛార్జీ కలిపి ప్రతి సంవత్సరం టెలికాం సర్వీసుల కంపెనీలు ప్రభుత్వానికి రు. 20,000 కోట్లు చెల్లిస్తున్నాయి. లైసెన్సు కండిషన్స్ ప్రకారం ఈ టెలికాం కంపెనీలు సమర్పించే ఆదాయపు లెక్కలు సరిగా వున్నాయా లేదా తనిఖీ చేయటానికి ప్రత్యేక ఆడిటర్లను నియమించవచ్చు. మూడు సంవతసరాల క్రితం వరకూ ప్రభుత్వము కొన్ని టెలికాం కంపెనీల ఆదాయాలను మాత్రమే ఆడిట్ చేసేందుకు ప్రత్యేక ఆడిటర్లను నియమించేది. ప్రయివేట్ టెలికాం కంపెనీల ఆదాయాల ఆడిట్ కు తనను నామినేట్ చేయాలని గత మూడు సంవత్సరాలనుండి సి ఏ జి(కమ్ప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) డి ఓ టి కి లెటర్లు రాశారు. ప్రయివేటు టెలికాం కంపెనీలు తమ ఆదాయం లో కొంత భాగాన్ని లైసెన్సు కండిషన్ ప్రకారం ప్రభుత్వానికి లైసెన్సు ఫీజుగా చెల్లించాలి కాబట్టి అవి ఇచ్చే ఆదాయపు లెక్కలు సరిగా వున్నాయో లేదో సి ఏ జి  పరిశీలించాలని సి ఏ జీ వాదన. కానీ డి ఓ టి ఈ విషయము లో తటపటాయిస్తూ  కాలయాపన చేస్తున్నది. 2009-10 లో సి ఏ జీ ఇక డి ఓ టి తో లాభం లేదనుకుని ఢిల్లీ హైకోర్టులో కేసు వేసింది.

6.1.2013 న సి ఏ జి పిటిషన్ పై ఢిల్లీ హై కోర్టు తీర్పునిచ్చింది. ప్రయివేట్ టెలికాం కంపెనీల ఆదాయాలను ఆడిట్ చేసే అధికారం చట్ట ప్రకారం సి ఏ జి కి వున్నదని ఈ తీర్పులో ఢిల్లీ హై కోర్టు చెప్పింది. ప్రయివేటు టెలికాం కంపెనీల పిటిషన్లను కొట్టి వేసింది.

డి ఓ టి గతము లో నియమించిన ప్రయివేటు ఆడిటర్లు కూడా  ఎయిర్ టెల్ , వోడాఫోన్, రిలయన్స్ కమ్యూనికేషన్సు, టాటా టెలిసర్వీసెస్, ఐడియా లు తమ ఆదాయాన్ని తక్కువగా చూపిస్తున్నాయని అన్నారు. ఈ ఆడిటర్ల నివేదికల ప్రకారం 2006-07,2007-08 సంవత్సరాలలో ఈ ఐదు కంపెనీలు కలిసి తమ ఆదాయాన్ని రు. 10,268 కోట్లు తక్కువగా చూపించాయి. ఈ నివేదికలు వచ్చిన అనంతరం ఈ ఐదు కంపెనీల పై డి ఓ టి, రు.1594 కోట్లు పెనాలిటీ విధించింది.

ప్రయివేటు టెలికాం కంపెనీలు లైసెన్సు ఫీజుగా ఒకే సారి భారీ మొత్తాన్ని చెల్లిస్తామని చెప్పి టెండరు వేసి లైసెన్సు పొందాయి. లైసెన్సు ఆ విధముగా పొందిన అనంతరం తాము అంత మొత్తాన్ని లైసెన్సు ఫీజుగా ఒకే సారి చెల్లించలేమని ఆ నాటి వాజపాయి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి.  టెండరు ప్రకారం లైసెన్సు ఫీజు కట్టనప్పుడు లైసెన్సు రద్దు చేయాలి. కానీ వాజ్ పాయి ప్రభుత్వము ఆ పని చేయకుండా 1999 లో ప్రయివేట్ కంపెనీలకు అనుకూలముగా “నూతన టెలికాం విధానం, 1999” ని ప్రకటించింది. లైసెన్సు ఫీజు ఒకే సారి కట్టనక్కర లేదనీ, తమకి ప్రతి సంవత్సరమూ వచ్చే ఆదాయములో కొంత శాతాన్ని లైసెన్సు ఫీజుగా కట్టవచ్చునని ఈ నూతన విధానములో ప్రకటించింది. దీని వలన ప్రభుత్వ ఖజానాకి రు. 58355 కోట్లు నష్టం వచ్చిందని ఇటీవల పార్లమెంటులో యు పి ఏ ప్రభుత్వము ఒక ప్రశ్నకు జవాబుగా చెప్పింది. అత్యంత నీతిమంతులుగా తమకి తాము చెప్పుకునే బి జె పి, తమ నాయకత్వములో కేంద్ర ప్రభుత్వము వున్నప్పుడు ఇటువంటి అవినీతికరమయిన పద్ధతిలో ప్రయివేటు కంపెనీలకు దేశ సంపదను దోచుకోటానికి అనుమతించింది.  కానీ ప్రయివేటు ఆపరేటర్లు  అంతటితో సంతృప్తి చెందకుండా ఆదాయాలను తక్కువగా చూపించి లైసెన్సు ఫీజు, స్పెక్ట్రామ్ చార్జీలను తక్కువగా చెల్లించే అక్రమానికి పాల్పడ్డారు.

ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు వీరికి చెంపపెట్టుగా వుంది. ఈ కంపెనీల ఆదాయాలను ఆడిట్ చేసే అధికారము రాజ్యాంగ సంస్థ అయిన ఆడిటర్ జనరల్ కు వున్నదని చెప్పింది. అయితే ప్రయివేటు ఆపరేటర్లు  మాత్రం తమ ఆదాయాలను ఆడిట్ చేసే అధికారామ్ సి ఏ జి కి లేదని, తాము ఢిల్లీ హైకోర్టు తీర్పుకు వ్యతిరేకముగా సుప్రీం కోర్టులో అప్పీలు చేసే విషయం పరిశీలిస్తున్నామనీ అంటున్నారు.
ప్రభుత్వాలు అవి కాంగ్రెస్ వి అయినా, బి జె పి వి అయినా ప్రజల సొమ్మును కార్పొరెట్సు కు ధారాదత్తం చేస్తున్నాయి. బి జె పి హయాములో పైన తెలియజేసిన లైసెన్సు ఫీజు కుంభకోణం జరగగా కాంగ్రెస్ హయాములో 2జి కుంభ కోణం జరిగింది.
కాబట్టి లోక్ పాల్ ల్ చట్టం పరిధిలో ప్రభుత్వమునుండి కాంట్రాక్టు/భాగస్వామ్యం/లైసెన్సు పొందిన ప్రయివేటు కంపెనీలను కూడా చేర్చాలని లోక్ పాల్  పై పార్లమెంటులో జరిగిన చర్చలలో సి పి ఏం, తదితర వామపక్షాలు డిమాండ్ చేశాయి. సవరణను ప్రతిపాదించాయి. కానీ కాంగ్రెస్, బి జె పి లు రెండూ కలిసి ఈ సవరణను ఓడించి కార్పొరేట్సు ను లోక్ పాల్ పరిధిలోకి రాకుండా చేశాయి. అవినీతికి మూలకారణమయిన కార్పొరేట్సును ఆ విధముగా కాపాడాయి.

ప్రజల ఆస్తులను, సహజ వనరులను కొల్లగొట్టేందుకు  కార్పొరేట్సుకు సహకరిస్తూ  కాంగ్రెస్, బి జె పి తదితర పెట్టుబడిదారీ భూస్వామ్య వర్గాల పార్టీలు ఆశ్రిత పెట్టుబడిదారీ విధానాన్ని బలపరుస్తున్నాయి. వీరు చెప్పే  స్వేచ్చా మార్కెట్, నీతి నియమాలు మోసపూరిత సంగాలు మాత్రమే. చేసేది మాత్రం ప్రజల సొమ్మును, సహజ వనరులను  కొల్లగొట్టేందుకు స్వదేశీ విదేశీ బడా పెట్టుబడిదారులకు సహకరించటమే. ఇటువంటి దివాళా కోరు విధానాలను తిప్పి కొట్టి ప్రత్యామ్నాయ విధానాల కోసం జరిగే ఉద్యమాన్ని మనము బలపరచాలి.
నూతన వాతావరణం
 రానున్న మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఉష్ణోగ్రతలు
సాధారణం కంటే ఎక్కువగా వుంటాయి
                పశ్చిమ రాష్ట్రాల నుండి మత రసాయన గాలులు
                దేశం లోని ఇతర ప్రాంతాలకు  వీచవచ్చు
                గుజరాత్ తీరం లో ఏర్పడిన వాయుగుండం
                గంటకి వెయ్యి కిలోమీటర్ల వేగంతో
               ఎన్నికలు జరగనున్న అన్నీ రాష్ట్రాల తీరాలను తాక వచ్చు
ఆహారం, నీరు, చదువు, వసతి, ఉపాధి వంటి మాటలు పాతబడి
హిందుత్వ, గౌరవ యాత్ర, సాంస్కృతిక జాగరణవంటి పదాలు వినవలసి రావచ్చు
వర్ష పాతాన్ని ఎప్పటివలే కాక ప్రజల కళ్ళలో కొలవ వలసి రావోచ్చు
             దయ, జాలి, సోదర భావన, బాధ్యత, నీతి
             వంటి భావనలు ఇగిరి పోవచ్చు
             గాలిలో ఒక్క శాతం ప్రేమ కూడా ఉండక పోవచ్చు
             అసెంబ్లీ,  స్టాక్ ఎక్చేంజీ హర్మ్యాలు తప్ప—దేశంలోని
             ఇళ్ళు, గుడిసెలకి అదనపు జాగ్రత్తలు అవసరం
ఎదిరించి నిలిస్తే పరిమళిస్తుంది మానవత్వం
నవతరానికి చూపుదాం సమతా మార్గం
                          -------దేవీ ప్రియ



No comments:

Post a Comment