Sunday, January 26, 2014

సత్తాక జయంతి


ఓ సుస్వతంత్రమా! ఓ మోహ మంత్రమా!

నీ రూపు కనబడేనా-ఎందైన-ఎపుడైన

నీ రేక తేటబడునా-ఓ సుస్వతంత్రమా...

 

నీ నామ జపమాల నిష్ఠతో త్రిప్పితిమి

-కంటక పథాలలో కటిక చీకట్లలో 

కక్కసల చెఱలలో-ఓ సుస్వతంత్రమా...

 

నీ మోము భయభూతధూమాగ్ని వలయమో

కళ్యాణ పాత్రమో-కనక శతపత్రమో

కనుపించునా మాకు ఓ సుస్వతంత్రమా...

 

నిండి తొణికిసలాడు నీ భుజాభాండంబు

-మము బలిమి లాగేను-మధుర రసమున్నదో-

మరుల విషమున్నదో-ఓ సుస్వతంత్రమా...

 

నీ కుశల ఖేలనము నిఖిల సుఖ రూపకమో

-జగడాల జూదమో-జాతర్లు సలిపేరు

జాతులును రాజ్యాలు-ఓ సుస్వతంత్రమా...

 

నరుని స్వాతంత్ర్యమై నారీ స్వతంత్రమై

-అర్థ స్వతంత్రమై వ్యక్తి స్వతంత్రమై

తెగునే నీ సూత్రంబు- ఓ సుస్వతంత్రమా...

 

జన్మ హక్కుల చిక్కి స్వార్జితంబుల చీలి

రాజ్యసీమలనిరికి-పూజ్యమగు నీ పొలము

పండునో ఎండునో-ఓ సుస్వతంత్రమా...

 

స్వకుటుంబ కలహాలు-జాతిమత భేదాలు

-నీ తలకు చుట్టేరు నీతివేత్తలు నేడు

నిజమో అబద్ధమో ఓహో స్వతంత్రమా...

 

పంచభూతంబులును భాగాలు పంచుకొని

-తెగి స్వతంత్రించితే-దిక్కేది ఈ లోక

తీర్థ యాత్రకు రేపు-ఓహో స్వతంత్రమా..

                      ------రాయప్రోలు సుబ్బారావు (30.1.1951)

భారత సర్వ సత్తాక గణతంత్ర సోషలిస్టు లౌకిక రాజ్యము 26.1.1950 న ఏర్పడిన సంవత్సరము తరువాత రాయప్రోలు సుబ్బారావు గారు 30.1.1951 న రాసిన  గేయం ఇది.

స్వతంత్రం వచ్చిన తరువాత,  సర్వ సత్తాక గణతంత్ర సోషలిస్టు లౌకిక రాజ్యముగా ఏర్పడిన  తరువాత మన దేశము అనేక విషయాలలో కొంత అభివృద్ధి సాధించింది. అయినప్పటికీ దారిద్ర్యం,నిరుద్యోగం వంటి ప్రధాన సమస్యలు పరిష్కారం కాలేదు. ప్రపంచములో దరిద్రుల  సంఖ్య అధికముగా వున్న దేశముగా ఇప్పటికీ మన దేశం వున్నది. నిరుద్యోగ సమస్య ఇప్పటికీ వెంటాడుతున్నది. “నరుని స్వాతంత్ర్యమై నారీ స్వతంత్రమై అర్థ స్వతంత్రమై వ్యక్తి స్వతంత్రమై తెగునే నీ సూత్రంబు- ఓ సుస్వతంత్రమా...”  అని కవి వ్యక్తము చేసిన సందేహం ఇప్పటికీ సందేహముగానే వున్నది. పేదరికం, నిరుద్యోగం ఎదుర్కొంటున్న వారికి అర్థ స్వతంత్రం, వ్యక్తి స్వతంత్రం లేనట్లే. మహిళలు అనేక రంగాలలో గతం కన్నా తమ పాత్ర నిర్వహిస్తున్నప్పటికీ ఇప్పటికీ మన సమాజం నారీ స్వాతంత్ర్యాన్ని మనస్ఫూర్తిగా గుర్తించటం లేదు. పురుషాధిపత్యం కొనసాగుతున్నది,కొన్ని సందర్భాలలో మరింత బలపడుతున్నది. అనేక రంగాలలో సాధించిన స్వావలంబన సరళీకరణ, ప్రయివేటీకరణ, ప్రపంచీకరణ విధానాల వలన దెబ్బ తింటున్నది. మత తత్వ శక్తులు (బి జె పి,శివసేన, ఆర్ ఎస్ ఎస్, ఏం ఐ ఏం వంటివి) దేశ రాజకీయాలలో గణనీయముగా పెరిగి లౌకిక స్ఫూర్తికి ప్రమాదం తెస్తున్నాయి. ఇప్పటికీ అణగారిన కులాల పట్ల  వివక్షత, మైనారిటీల పట్ల వివక్షత కొనసాగుతున్నది.  కార్పొరేట్లు కాంగ్రెస్, బి జె పి తదితర బూర్జువా భూస్వామ్య పార్టీలను ప్రత్యక్షముగా శాసించే పరిస్థితి ఏర్పడింది. స్వదేశీ కార్పొరేట్లు విదేశీ కార్పొరేట్లతో కుమ్మక్కై అవినీతికర అక్రమ పద్ధతులలో దేశ సంపదను లూటీ చేయటం జరుగుతున్నది. అవినీతికి విరుగుడుగా చెప్పబడుతున్న లోక్పాల్ చట్టం పరిధిలోకి అవినీతికి మూల కారణమయిన కార్పొరేట్లను తెచ్చేందుకు పార్లమెంటులో వామ పక్షాలు చేసిన ప్రయత్నాన్ని  కాంగ్రెస్, బి జె పి, తదితరపార్టీలు వ్యతిరేకించి అది జరగనీయలేదు. అవినీతికి మూల కారణమయిన కార్పొరేట్లను కాపాడుతూ తామే అవినీతికి వ్యతిరేకముగా పోరాడుతున్న మొనగాళ్ళుగా కాంగ్రెస్, బి జె పి లు విపరీతంగా ప్రచారం చేసుకుంటున్నాయి.

ఈ పరిస్థితి మారి మన రాజ్యాంగ ఉపోద్ఘాతములో చెప్పినట్లు ప్రతి పౌరునికి ఆర్థిక, సాంఘిక, రాజకీయ అవకాశాలు సమంగా లభించాలంటే మన దేశ రాజకీయాలను, ఆర్థిక విధానాలను కార్పొరేట్లు, కుల, మత, ప్రాంతీయ దురహంకారులు శాసించే పరిస్థితి అంతమవ్వాలి. దేశ సార్వభౌమత్వాన్ని, స్వావలంబనను,ప్రజల ప్రాథమిక సమస్యలను పరిష్కరించే, లౌకిక తత్వాన్ని-సామాజిక న్యాయాన్ని- మహిళలకు సమానతను పెంపొందించే ప్రత్యామ్నాయ విధానాలు కావాలి. అటువంటి ప్రత్యామ్నాయ విధానాల కోసం నిలబడే శక్తులయిన వామ పక్షాలు, ప్రజాతంత్ర శక్తులు బలపడాలి. ప్రత్యామ్నాయ విధానాల కోసం జరిగే పోరాటాలలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనటం ద్వారానే ఈ ప్రత్యామ్నాయ శక్తి బలపడుతుంది. ఈ లోగా ఈ సంవత్సరం ఏప్రిల్-మే నెలలలో జరిగే సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్, బి జె పి కూటములను ఓడించేందుకు వామపక్ష లౌకిక శక్తులు బలపడేందుకు ప్రతి ఒక్కరూ సహకరించి మన దేశ రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవాల్సిన అవసరం వున్నది.

 

 

No comments:

Post a Comment