కొందరికే వైబ్రెంట్ గా వుండే ఇండియా
కావాలో, అందరికీ బెటర్ గా వుండే ఇండియా కావాలో
ఏది కావాలో
ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమయింది....సీతారాం యేచూరి
కొందరి లాభాలకే పరిమితమయ్యే వైబ్రెంట్ ఇండియా
కావాలో, దేశ
వ్యాప్తంగా ఉన్న ప్రజలందరి ప్రయోజనాలకు ఉపయోగపడే బెటర్ ఇండియా కావాలో
ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు సీతారాం ఏచూరి
అన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో 'రాజకీయ, ఆర్థిక
సవాళ్లు-భారతదేశ 2014 ఎన్నికలు, ప్రత్యామ్నాయాలు' అనే
అంశంపై జరిగిన సెమినార్‌లో ఆయన ముఖ్యవక్తగా పాల్గొన్నారు. హెచ్‌సియు, గ్రేటర్
హైదరాబాద్ నార్త్ జోన్ ఎస్‌ఎఫ్‌ఐ కమిటీలు నిర్వహించిన ఈ సెమినార్‌లో ఆయన
మాట్లాడారు.
సమాజంలో
కొద్దిమంది సంపదను పెంచుతూ, వారి జీవితాలకు మెరుగులద్దే వైబ్రెంట్ ఇండియా
విధానాల లక్ష్యమని చెప్పారు.భారతదేశంలో వనరులు పుష్కలంగా ఉన్నాయని, వాటి
ఫలితాలు ప్రజలందరికి అందాలంటే ప్రత్యామ్నాయ విధానాల అమలు తప్పనిసరి అన్నారు.
అభివృధ్ధి ఫలాలు అందరికి అందితే ప్రపంచ మేథో సమాజానికి భారతదేశం నాయకత్వం వహించడం
అసాధ్యమేమి కాదని అన్నారు. కాంగ్రెస్, బిజెపిలు
అనుసరిస్తున్న విధానాల ఫలితంగా ప్రస్తుతం సమాజంలోని 20శాతంలోపు
మందికే ఫలితాలు అందుతున్నాయని చెప్పారు. 'ఈ
కొద్ది మొత్తానికే ప్రపంచ వ్యాప్తంగా మేథోరంగంలో భారతీయులు కీలక పాత్ర
పోషిస్తున్నారు. సిలికాన్ వాలీలో తెలుగుకు రెండవ భాష హోదా ఉంది. అదే మిగిలిన 80శాతం
మందికి కూడా అభివృద్ధి ఫలాలు అందితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. అదే జరిగితే
మేథోరంగంలో భారతదేశ నాయకత్వం సాధ్యమే' అని
ఆయన అన్నారు.
అయితే, కాంగ్రెస్, బిజెపిలు
ఈ తరహాలో విధానాలు అమలు చేయడానికి సిద్దం కావడం లేదని చెప్పారు. నినాదాలు
వేరైనప్పటికీ కాంగ్రెస్, బిజెపిలు ఒకేరకమైన ఆర్థిక విధానాలను అమలు
చేస్తున్నాయని, ఫలితంగా కార్పొరేట్ సంస్థల లాభాలు ఏటికేడు
పెరుగుతున్నాయని చెప్పారు. మరోవైపు సమాజంలో అసమానతలు కూడా అదే స్థాయిలో
పెరుగుతున్నాయని అన్నారు. దేశంలోకి పెద్దఎత్తున విదేశీపెట్టుబడులను ఆహ్వానించడం
ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని ఈ రెండు పార్టీలు చెబుతున్నాయని, ఆచరణలో
దానికి భిన్నంగా జరుగుతోందని చెప్పారు. తక్కువ రేటుకు లభించే శ్రమశక్తిని
వినియోగించుకోవడం, వనరులను విచ్చల విడిగా దోచుకోవడం ద్వారా లాభాలను
పెద్దఎత్తున తరలించడానికే విదేశీపెట్టుబడి పరిమితమవుతోందని చెప్పారు. ఈ తరహా
పెట్టుబడి ఎంత పెద్దమొత్తంలో వచ్చినా దేశ ప్రజలకు అందే ప్రయోజనమేమి ఉండదని
అన్నారు. దేశ ప్రజల కొనుగోలు శక్తి పెంచడం, తద్వారా
ఉత్పత్తి, ఉపాధి
అవకాశాలు పెరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ తరహా విధానం వల్ల
దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరి జీవితాల్లో నిజమైన అభివృద్ధి చోటుచేసుకుంటుందని
చెప్పారు.
అయితే, ఈ
వాస్తవాలను ఏమాత్రం పట్టించుకోకుండా బిజెపి 'నమో' రాగాన్ని
ఆలపిస్తోందని, మరోవైపు ప్రధానమంత్రి భారీ సంఖ్యలో ఉద్యోగాలు
వస్తాయని ఊదరగొడుతున్నారని అన్నారు. లాభాలే లక్ష్యంగా వచ్చే విదేశీపెట్టుబడి వల్ల
తాత్కాలికంగా ఉపాధి అవకాశాలు కనిపించినా దీర్ఘకాలంలో దుష్పరిణామాలు తప్పవని
అన్నారు. ' ఇక్కడ విస్తారంగా ఉన్న మార్కెట్‌ను, వనరులను
తక్కువ వేతనాలకు వచ్చే శ్రమశక్తిని ఆశించి ఆ పెట్టుబడి వస్తోంది. అయితే, ప్రజల
కొనుగోలు శక్తి పెరగకపోతే ఆ సంస్థల ఉత్పత్తులను ఎవరు కొంటారు? విదేశాల్లో
అమ్ముకుంటామన్నా సాధ్యం కాదు. ఇప్పటికే అక్కడ ఆర్థిక సంక్షోభం రాజ్యమేలుతోంది' అని
అన్నారు. తాజా లెక్కల ప్రకారం భారతదేశంలో శతకోటీశ్వరుల సంఖ్య 50కి
చేరిందని, మొత్తం
జిడిపిలో మూడవ వంతు సంపద వారి వద్దనే ఉందని చెప్పారు. మరోవైపు జనాభాలో 75శాతం
మంది రోజుకు 20 రూపాయల వేతనంతో బతుకులు ఈడుస్తున్నారని అన్నారు.
వీరి జీవితాలను మెరుగుపరచడానికి ప్రభుత్వాలు సిద్దం కావడం లేదని చెప్పారు. అదే
సమయంలో పేద ప్రజలకిస్తున్న సబ్సిడీలను భారంగా పేర్కొంటున్న ప్రభుత్వాలు
సంపన్నులకిస్తున్న రాయితీలను మాత్రం ప్రోత్సహకాలుగా చెబుతున్నారని అన్నారు.
వాస్తవానికి సంపన్నులకిస్తున్న రాయితీలతో దేశంలో
మౌలికవసతులను మెరుగుపరచడం ద్వారా ఉపాధి అవకాశాలను గణనీయంగా పెంచవచ్చని చెప్పారు. 2జి, బొగ్గు
కుంభకోణాల్లో చోటుచేసుకున్న మొత్తంతో దేశంలో చదువుకునే పిల్లలందరికి రెండు
సంవత్సరాల పాటు మధ్యాహ్నాభోజనం,
పుస్తకాలు, దుస్తులు
ఇచ్చి చదువు చెప్పించవచ్చని. రెండు సంవత్సరాల పాటు ప్రజలందరికి ఆహార భద్రతను
కల్పించవచ్చని చెప్పారు.90వ దశకం నుండి దేశంలో అమలవుతున్న ఆర్థిక విధానాలకు
ప్రత్యామ్నాయం అమలు చేయడం ద్వారానే ఇది సాధ్యమవుతుందని చెప్పారు. ప్రత్యామ్నాయ
ఆర్థిక విధానాలు అమలు కావాలంటే ప్రత్యామ్నాయ రాజకీయాలు తప్పనిసరి అని చెప్పారు. 'మీరు
విద్యార్థులు, ఏదో ఒక పార్టీకి ఓటు వేయమని చెప్పడానికి ఇది
వేదిక కాదు. కానీ, ప్రత్యామ్నాయ రాజకీయాల ద్వారానే సమాజంలో మార్పు
వస్తుంది. ఆ దిశలో మీరు ఆలోచించాలి' అని
ఆయన చెప్పారు.
ఈ సందర్భంగా ఆయన 1920
నుండి దేశంలో చోటుచేసుకున్న మూడు ఆలోచనాధోరణులను ప్రస్తావించారు. సెక్యులర్, డెమోక్రటిక్
దేశాన్ని నిర్మిస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పిందని, అది
మాత్రమే చాలదని వాటితో పాటు ప్రజలందరికి సమానఅవకాశాలు ఇచ్చే సోషలిజంను
తీసుకురావాలని వామపక్షం చెప్పిందని తెలిపారు. వీటికి భిన్నంగా హిందూరాజ్‌ను
నిర్మించాలని ఆర్‌ఎస్‌ఎస్ చెప్పిందని అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ వాదులు చెప్పిన
హిందూరాజ్ విధానం చివరకు భారతదేశాన్ని రెండు ముక్కలు చేసిందని చెప్పారు.
సెక్యులర్, డెమోక్రటిక్ అన్న కాంగ్రెస్ పార్టీ క్రమేణా
పెట్టుబడిదారి విధానం వైపు మొగ్గు చూపిందని, సమాన
అవకాశాలను సృష్టించడంలో అదికూడా విఫలమైందని ఆచరణలో తేలిందని అన్నారు. ఆర్థిక, రాజకీయ,సామాజిక
రంగాల్లో ప్రత్యామ్నాయ విధానాల అమలుతోనే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన
తెలిపారు. (ప్రజాశక్తి, 19.1.2014)
జ్యోతి బసు శత జయంతి సంవత్సరం సందర్భముగా అశోక్ మిత్రా
వ్యాసం
“మరుగున పడ్డ చరిత్రను వెలికి తీయాలి”
జ్యోతిబసు శతజయంతి సంవత్సరంలో ఆయన గురించి చాలా
విశేషాలు మన ముందుకొస్తున్నాయి. సభలు, సమావేశాలు, ఉపన్యాసాల్లో
పార్టీ అగ్ర నేతగా, జాతీయ నాయకుడిగా ఆయన విజయాల గురించి విస్తృతంగా
చర్చ జరుగుతోంది. అయితే ఇదంతా ఆయన జీవితపు ఆఖరి కొన్ని దశాబ్దాలకు సంబంధించే
ఉంటోంది. సాధించిన విజయాలపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకృతమవుతోంది. 1960ల
నుంచి ఆయన అనుదినం వార్తా శీర్షికల్లో ఉన్నారు. లబ్ధప్రతిష్టుడైన రాజకీయ నాయకునిగా, ప్రధాన
వామపక్ష పార్టీ అగ్రనాయకుల్లో ఒకరుగా ఉన్నారు. తులనాత్మకంగా విజయవంతంగా సాగిన
కాలపు ఇతివృత్తం ఒక వామపక్ష కార్యకర్తకు కాస్త ఉత్సాహం లేక సంతృప్తి కలిగించవచ్చు.
ఇప్పుడు మనము చాలా సంక్లిష్ట సమయంలో ఉన్నాము. జ్యోతిబసు మనకు, దేశ
ప్రజలకు బలంగా ఆకర్షించిన దక్షతగల నాయకత్వం అందించారు. ఇదంతా నిజమైనప్పటికీ
ఇటువంటి ఊరట కలిగించే సంస్మరణ వల్ల తీవ్ర సంక్షోభంలో ఉన్న వామపక్షవాదులకు కించిత్
పథనిర్దేశం దొరుకుతుందనైతే అనిపించటం లేదు. ఇంకా చెప్పాలంటే జ్యోతిబసు రాజకీయ
జీవితపు తొలి అధ్యాయం చాలా ఎక్కువ అవసరం. అప్పటికి ఇంకా ఆయన పేరు ప్రాచుర్యంలోకి
రాలేదు. ఆయన వేదికలపై కన్పించ లేదు. తీవ్ర అధ్యయనం, కఠోర
పరిశ్రమ ద్వారా తనను ఒక ఆదర్శవాదిగా తీర్చిదిద్దుకునే ప్రయత్నంలో దీక్ష బూని
ఉన్నారు.
1930, 1940, 1950లలో
దేశం మొత్తం మీద, బెంగాల్లోనూ వామపక్షవాదులు ఒక గణనీయ శక్తిగా
లేరు. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ప్రధాన వామపక్ష పార్టీ ప్రజాయుద్ధం విధానం
చేపట్టడం వల్ల దేశంలోని చాలా మందికి అది కంటగింపుగా తోచింది. నిర్మాణం
చేపట్టేందుకు చాలా ఇబ్బందులు,
విపత్తులు ఎదురయ్యాయి. అందులోనే సంపన్న
కుటుంబాలకు చెందిన ఆదర్శవాదులైన కొందరు యువతీయువకులు వామపక్ష రాజకీయ పంథా చేపట్టి
రెండడుగులు ముందుకు, ఒక అడుగు వెనక్కు, కొన్నిసార్లు
ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు వేస్తూ కార్మిక ఉద్యమాలు, రైతు
సంఘాలు ఎలా నిర్మించారో, మధ్య తరగతివారి సమస్యల లోతుల్లోకి వెళ్ళి
విజయవంతమైన ఉద్యమాలకు బీజం వేశారో, ఆ
కథలన్నీ ఇప్పుడు చాలా ఎక్కువ అవసరం. రోజులు మారాయని ఒప్పుకుంటాను. అంతర్జాతీయంగా, జాతీయంగా
పూర్వరంగం మారిపోయింది. ఒక విధంగా వామపక్ష ఉద్యమాలు నిర్మించటం గత శతాబ్దపు మూడవ, నాల్గవ
దశాబ్దాల్లో ఇంకా సులువుగా ఉండేది. ఇప్పుడు చాలా కష్టం. కానీ ఆ కారణం చేతనే
జ్యోతిబసులాంటి మహోన్నత నాయకుల తొలి జీవిత గమనాన్ని ఇంకా లోతుగా శోధించటం అవసరం.
ఆ రోజుల్లో వామపక్ష ఉద్యమంలోకి దూకినప్పుడు యువత
ఎప్పుడూ పరిపాలనలో అత్యున్నత స్థాయికి చేరుకుంటామని కలలో కూడా అనుకోలేదు.
పార్లమెంటరీ ప్రజాస్వామ్య మార్గంలో పశ్చిమబెంగాల్లో అధికారంలోకి రాగల్గుతుందనేది ఆ
రోజుల్లో అనూహ్యమైనది. ఉద్యమాల్లో దూకినవారు తమ క్షేత్ర స్థాయి త్యాగం, విశాలతత్వం, సామాజిక
లేక రాజకీయ గుణసంపదతో తమను తాము అర్పించుకోవటానికే వచ్చారు. తాము ఆదర్శప్రాయులైన, విధేయత
గల పార్టీ కార్యకర్తలుగా మారటానికి వారు తమను తాము తయారు చేసుకున్నారు. పార్టీ
ప్రయోజనం, ఆదర్శం
తప్ప వారు ఇంకే వైపూ దృష్టి పెట్టే ప్రసక్తే ఉండేది కాదు. ఒక సుదూరమైన కల సామాజిక
విప్లవం. అదే వారి చైతన్యాన్ని ఆవహించింది. ఆ కల కంటున్నది కమూనిస్టు పార్టీ.
అందుకు పార్టీతో తాము మమేకం కావాలి.
ఇప్పుడు
మరలా మనం ఇంచుమించు అలాంటి పరిస్థితికే చేరాము. వామపక్ష శక్తుల నిర్మాణం బలహీనం
నుంచి మరింత బలహీనమవుతోంది. అయినా కొన్ని ఆందోళనలు నిర్మించే ప్రయత్నం జరుగుతోంది.
కానీ సాధారణ ప్రజలు ఏమంత చూడటం లేదు. దేశవ్యాప్తంగా వర్గ దోపిడీ భయంకర రూపం
దాల్చింది. తమను అడ్డుకునేవారు ఎవరూ లేరనేది పాలకుల ధీమాగా ఉంది. వామపక్ష వాణి
కనుమరుగవుతోంది. లాటిన్ అమెరికాను మినహాయిస్తే ప్రపంచమంతటా వామపక్ష చైతన్యం
ఆందోళన కలిగించేలా తగ్గుముఖం పట్టింది. ఈ పరిస్థితిలో సాధారణ ప్రజలు నిస్సహాయ
స్థితిలో ఉన్నారు. ఎవరి వైపు చూడాలి, ఎవరిని
నమ్మాలి అనే విషయంలో వారికి ఏమీ పాలుపోవటం లేదు. అందుకే వామపక్ష కార్యకర్తలు
ఊహాజనిత కలలు కని ప్రయోజనం లేదని తెలుసుకోవాలి.
కొద్దికాలం క్రితం వామపక్షాలు ప్రముఖ స్థాయికి
చేరుకున్నాయి. అయితే అక్కడి నుంచి వారిని తోసివేయటం జరిగింది. అవలీలగా మరలా అదే
శిఖరాన్ని చేరుకోవటం సాధ్యం అనే పగటి కలల్లో ఉండక పోవటమే మేలు. వామపక్షాలు మరలా
మొదటి నుంచీ మొదలుబెట్టాల్సిన పరిస్థితి ఉంది. కొంచెం కొంచెంగా, ఓపికతో, తనను
పూర్తిగా నిమగం చేయటానికి సిద్ధపడి కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాలి. జ్యోతిబసు
తొలి జీవిత గమనాన్ని కాస్త విస్తృతంగా వామపక్షవాదులు అవగాహన చేసుకోవటం అవసరం. ఆయన
ఒక్కరే కాదు కదా, ఆయనలాంటి ఇంకా వందలాది మంది సంపన్న కుటుంబాల
నుంచి వచ్చిన యువతీయువకులు ఒక కష్టకాలంలో వామపక్ష రాజకీయ మార్గం పట్టారు.
వ్యక్తిగత భవిష్యత్తు గురించి తలపెట్టకుండా విజ్ఞతతో ముందుకొచ్చారు. వారి జీవితాల
నుంచి నేటి వామపక్ష కార్యకర్తలు నేర్చుకోవలసింది ఎంతో ఉంది.
జ్యోతిబసు తొలి జీవితం గురించి విస్తృతంగా, ధారావాహికంగా
వివరాలు ఎంత ప్రయత్నించి వెతికినా దొరికే పరిస్థితి లేదు. ఆయన బాల్యం, కిశోర, ప్రథమ
యౌవన దశల్లో కలకత్తాలో సంపన్న కుటుంబాల పిల్లలు ఎలాగైతే రోజులు గడిపారో జ్యోతిబసు
కూడా అలాగే గడిపారని చాలామంది అభిప్రాయం. స్వదేశీ ఉద్యమం లేక విప్లవ తిరుగుబాటుకు
సంబంధించి బహుశా ఆయనకు ఏ ఆసక్తీ లేదని వారి ఆలోచన. బాల్యంలో లోరేటోలో, తరువాత
సెయింట్ జేవియర్స్ స్కూల్,
తరువాత ప్రెసిడెన్సీ కాలేజీలో, ఆ
తరువాత ధనికుడైన తండ్రి బారిష్టర్ చదువుకోసం ఇంగ్లాండ్‌కు పంపటం ఉన్నాయి. ఆ
సమయంలో ఆయన ఇండియన్ సివిల్ సర్వీస్ పరీక్షలో కూర్చోవాలని కూడా అస్పష్టంగా చర్చ
జరిగిందట. జ్యోతిబసు మొదటి ఇరవై ఏళ్ళ వరకూ రాజకీయాలకు దరిదాపుల్లో లేరట.
కానీ
జ్యోతిబసు తన వ్యక్తిగత సంభాషణలో పూర్తిగా వేరే కథ చెప్పారు. ఆయన పెదనాన్న ఒకరు
ఇంగ్లీషువాడికి ఎంతటి భక్తుడంటే విదేశీ ప్రభువులు ఆయన్ను సామాన్య మున్సిఫ్ పదవి
నుంచి ఒక్క ఉదుటున హైకోర్టు న్యాయమూర్తిని చేసేశారు. అరెస్టయిన సాయుధ
విప్లవకారులను విచారించటానికి ఏర్పాటైన ట్రిబ్యునల్‌కు జ్యోతిబసు పెదనాన్న
న్యాయమూర్తి అయ్యాడు. విచారణకు సాక్ష్యాలు, రుజువులుగా
ప్రవేశ పెట్టబడిన విప్లవకారుల వద్ద దొరికిన ఉత్తేజకరమైన పత్రాలు పుస్తకాలన్నీ
పెదనాన్న ఇంటికి తెచ్చేవాడు. జ్యోతిబాబు గుంభనంగా చెప్పిందేమంటే వాటన్నింటినీ
చదవడం వల్ల ఆయన హృదయాంతరాల్లో వామపక్ష ఆలోచనలు మొలకెత్త సాగాయి.చాలా ఆసక్తి
కల్గించే అంశమేమంటే ఆయన చేతికి అందేలా వేరే ఏ సమాచారం లేదు. ఈ విషయాలు ఎక్కడా
లిఖిత రూపంలో లేవు. కొద్దిమంది జ్ఞాపకాల్లో ఈ సంభాషణ ఉండి ఉండవచ్చు. ఆ వ్యక్తులంతా
మరణిస్తే ఆ జ్ఞాపకాల ఖజానా అంతరించిపోతుంది. జ్యోతిబసు జీవితంపై పరిశోధన
చేయాలనుకున్నవారు ఈ విషయాలను పరిశీలించాలని నేను అభ్యర్థిస్తున్నాను.
1930ల
శేషార్థంలో ఇంగ్లాండ్‌లో ఆయన పక్కా కమ్యూనిస్టు అయిపోవటం గురించి వివరణలో కూడా
చాలా సమాచార లోపం ఉంది. జ్యోతిబసుతో భూపేశ్ గుప్త, స్నేహాంశు
ఆచార్యల పరిచయం ఎలా అయింది, వారు ముగ్గురూ ఇంకా కొంతమందితో సహా కృష్ణ మీనన్‌గారి
ఇండియా లీగ్ సభ్యులు ఎలా అయ్యారు, ఎవరి
ప్రేరణ వల్ల బ్రిటిష్ కమ్యూనిస్టు పార్టీ కార్యాలయానికి చేరి విప్లవ ఆదర్శం
తీసుకున్నారు వంటి అస్పష్టమైన కథలన్నీ అక్కడా, ఇక్కడా
ఉటంకించబడి ఉన్నాయి. కానీ క్రమబద్ధంగా, ధారావాహికంగా
పొందు పరిచి ఉన్న ఏ రచనా కానరాలేదు. ఇప్పటికీ సమయం ఉంది. ఎవరైనా చిత్తశుద్ధిగల
పరిశోధకులు లండన్, ఇంగ్లాండ్‌లోని ఇతరత్రా గ్రంథాలయాలు, కార్యాలయాల
అన్వేషణ, పరిశోధనలో
నిమగమైతే పుంఖానుపుంఖాలుగా ఉన్న చరిత్ర కొంత వెలికితీయటం సాధ్యమౌతుందేమో.అది ఒక
అద్భుతమైన సమయం. ఆ సమయంలో సంపన్నుల పిల్లలు ఐరోపా, దాన్తోపాటే
మొత్తం ప్రపంచం చూసి వామపక్ష భావజాలంతో ప్రేరణ పొందారు. కానీ పాత సంఘటనల గురించి
పొందికగా తెలుసుకోవటం అవసరం. దీన్నుంచి నేటి తరం గుణపాఠాలు తీసుకోగలదు.
జ్యోతిబసు దేశానికి తిరిగి వచ్చారు. ముజఫర్ అహ్మద్‌ను
కలిసి పార్టీ పూర్తికాల కార్యకర్త అయ్యారు. ఆయనకు కార్మికోద్యమంలో పని చేయమని
నిర్దేశించటం జరిగింది. ముఖ్యంగా రైల్వే కార్మికుల సంఘం పనితో ఆయన సంబంధం
పెట్టుకున్నారు. కొద్ది రోజుల క్రితం వివిధ పార్టీ నాయకులు, కార్యకర్తల
నుంచి జ్యోతిబాబు కార్మిక ఉద్యమ పాత్ర ఉన్న ఆ రోజుల వృత్తాంతం వినే అవకాశం
కలిగింది. ఒక స్టేషన్లో దిగి ఓ కామ్రేడ్ గుడిసెలో మకాం వేశారు. కొద్ది కొద్దిగా
హిందీ మాట్లాడటం నేర్చుకున్నారు. కార్మిక వర్గంతో కలిసి సీదాసాదాగా భోజనం పంచుకుని
తినటం అలవాటు చేసుకున్నారు. భుజంపై ఒక హ్యావర్‌స్యాక్ వేసుకుని మొత్తం బెంగాల్, అస్సాంలో
వారాలు, నెలల
తరబడి తిరిగారు. ఎన్నో కొత్త అనుభవాల ఆధారంగా తన నైపుణ్యాన్ని పెంచుకున్నారు. ఆ
నైపుణ్యాన్ని ఇతర కామ్రేడ్లకు పంచటానికి ప్రయత్నించారు.
పరిమళ్
మిత్ర, అబుల్
హసన్ వంటి పాత కామ్రేడ్ల వద్ద నేను అనేక విషయాలు విన్నాను. జ్యోతిబాబు మొదట్లో
ఆకట్టుకునేలా ఉపన్యసించగలిగేవారు కాదు. కానీ అలాగైతే కుదరదు గనుక కఠోరమైన నిరంతర
కృషితో గొప్ప వక్తగా తయారయ్యారు. అతని వాక్పటిమకు తరువాతి కాలంలో మనం ముగ్థ
మోహితులయ్యాం. అది ఒక మరవలేని కథ.కేవలం రైల్వే కార్మికులే కాదు, 1940ల మొదట్లో ఆయన ఓడరేవు కార్మికులు, జనపనార
కార్మికుల సంఘాల ఏర్పాటుకు కొంత బాధ్యత వహించారు. 1948-49లో
పార్టీని మరలా నిషేధించినప్పుడు కొంత కాలం ఆయన ఖిదిర్‌పూర్ రేవు ప్రాంతంలో
రహస్యంగా గడిపారు. ఆ విషయాన్ని ఇంద్రజిత్ గుప్త, మరి
కొంతమంది నుంచి తెలుసుకోగలిగాను. తెభాగా ఉద్యమ కాలంలో ఆయన సుందర్‌బన్ ప్రాంతమంతా
రైతు సంఘాలతో కలిసి పని చేశారు. కాకద్వీప్ రైతు నాయకుడు గుణదర్ మాయితి గ్రామంలో
రాత్రి బస చేసిన కథ వ్యక్తిగత సంభాషణల్లో ఎన్నోసార్లు ప్రస్తావించారు.
కానీ రైల్వే కార్మికులను సమీకరించటమే ఆయన ప్రధాన
బాధ్యతనే దాంట్లో ఏ సందేహమూ లేదు. ఇతర కామ్రేడ్లు గతించారు. రైల్వే కార్మిక సంఘాల
కాగితాలు, దస్త్రాలు
ఎక్కడ ఉన్నాయో లేక అదీ లేదో తెలుసుకోవడం చాలా అవసరం.అవి ఎందుకు అవసరమంటే... ఒకవేళ
రైల్వే కార్మికుల సంఘంలో జ్యోతిబసు ప్రత్యేకమైన నైపుణ్యం కనబర్చకుండా ఉండి ఉంటే
బహుశా ఆయనను 1946లో శాసనసభ ఎన్నికల్లో రైల్వే కార్మికుల
నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా ప్రకటించేవారు కాదేమో. ఆయన కాంగ్రెస్ అభ్యర్థి
హుమాయున్ కబీర్‌ను ఓడించి శాసనసభలో అడుగు పెట్టారు. కార్మికుల కేంద్రాల నుంచి
అప్పట్లో ప్రత్యక్ష ఎన్నికలు ఉండేవి కాదు. వివిధ రైల్వే స్టేషన్లలో కార్మికులు తమ
ప్రతినిధులను ఎన్నుకునేవారు. ఈ ప్రతినిధులు కలిసి ఒక ఎలక్టరల్ కాలేజ్‌గా
ఏర్పడేవారు. ఆ ఎలక్టరల్ కాలేజ్ ఓట్లలో ఎవరు ముందుంటే వారే గెల్చినట్టు
ప్రకటించేవారు. ఆ ఎన్నికల్లో నాకు గుర్తున్నంతవరకు జ్యోతిబసు 87-78 ఓట్లతో అంటే తొమ్మిది ఓట్ల తేడాతో గెలిచారు.
దాంతో ఆయన వ్యక్తిగత జీవిత చరిత్ర, వామపక్ష
ఉద్యమ చరిత్ర సమూలంగా మారిపోయాయి.
శాసనసభకు చేరుకుని జోతిబాబు కేవలం కార్మిక
నాయకుడిగానే మిగిలిపోలేదు. అప్పటి సభలో కేవలం ముగ్గురు సభ్యులు మాత్రమే ఉన్నారు.
ఆయన శాసనసభలో పార్టీ నాయకుడు. అయితేనేమి, ఏ
సమస్యనైనా చర్చించటానికి జ్యోతిబాబు సిద్ధమే. ఆయన్ను మాట్లాడనివ్వకుండా చేయటం
సాధ్యమయ్యేది కాదు. రాష్ట్ర ప్రజలు వివిధ సమస్యలతో సతమతమౌతున్నారు. కాందిశీకుల
ప్రవాహం వచ్చి పడుతున్నది. ధరల పెరుగుదల, ఉపాధిలేమి, పోలీసు
జులుం, మతపరమైన
విద్వేషాలు, ఇలా వివిధ అంశాలపై పార్టీ దృక్పథం ఇతర అన్ని
పార్టీల కంటే భిన్నం. పార్టీ వైఖరిని శాసనసభలో తెలియచేయాలి, రాష్ట్ర
ప్రజలకు తెలియచేయాలి, జ్యోతిబసే తెలియచేయాలి. ఆయన ఒక్కరే వందమంది
పెట్టు. కార్మిక నాయుకుడు జ్యోతిబసు అనతికాలంలోనే రాష్ట్ర నాయకుడయ్యారు. ఆయన రైతుల
నాయకుడు కూడా, మధ్య- నిమ్న తరగతి ప్రతినిధి, కాందిశీకుల
భరోసా. ఆయన మాట్లాడే తీరు, బలమైన గొంతు, స్పష్టమైన
ఉచ్ఛారణ, పోటీపడగల
సాహసం, కేవలం
రాష్ట్ర ప్రజలనే కాకుండా మొత్తం దేశానికే చమక్కు. అప్పటి నుంచే జ్యోతిబాసు జాతీయ
నాయకుడిగా పరిణామక్రమం ప్రారంభమైంది.కాకపోతే రైల్వే కార్మిక నిర్మాణంలో అలా విజయం
సాధించి ఉండకపోతే, ఈ చరిత్ర బహుశా రాయబడి ఉండేది కాదు.
పేద, దోపిడీకి
గురవుతున్న ప్రజల్లో సాహసం నింపి ఎర్ర జెండా క్రింద ఎలా సమీకరించాలో, ఆ
మొదటి గగుర్పొడిచే కథకు చాలా చారిత్రక విలువ ఉంది. పాత తరం నాయకులు, కార్యకర్తలు
కొందరు అక్కడా ఇక్కడా నిశ్శబ్దంగా శేష జీవితం గడుపుతున్నారు. వారి జ్ఞాపకాలను
క్రోడీకరించి ఉంచటం అవసరం. అలాగే రాష్ట్రంలో, అసోం, బంగ్లాదేశ్‌లో
వివిధ రైల్వే కార్యాలయాలు, గిడ్డంగుల్లో ముక్క ముక్కలైపోతున్న కాగితాలు, పత్రాల
పరిశోధన, వీరి-
వారి- అతడి వ్యక్తిగత డైరీల అన్వేషణ, ఉమ్మడి
పార్టీ రహస్య, ప్రచురితమైన పత్రాలు, అవి
ఎక్కడ దాగి ఉన్నా వాటిని వెలికి తీయటం తప్పక అవసరం.
డాక్టర్ అశోక్ మిత్రా
(వ్యాసకర్త జ్యోతిబసు మంత్రివర్గంలో ఆర్థిక శాఖా మంత్రిగా పని చేశారు)
(ప్రజాశక్తి 19.1.2014)
No comments:
Post a Comment