పేదరికం, మానవ హక్కులు సమస్యలపై
పని చేసే స్వతంత్ర అంతర్జాతీయ సంస్థ “ఆక్స్ ఫామ్”. ఈ సంస్థ 20.1.2014 న ప్రపంచములో
భయంకరముగా పెరిగిన ఆర్థిక అంతరాలపై ఒక నివేదికను ప్రకటించింది. దీని ప్రకారం ప్రపంచ జనాభాలో 1 శాతం వద్ద ప్రపంచ సంపదలో
46 శాతం వున్నది. ప్రపంచ జనాభాలో క్రింది 50 శాతం వద్ద ఎంత సంపద వున్నదో అంతకన్నా ఎక్కువ
సంపద కేవలం 85 మంది వద్ద వున్నది. అమెరికా
జనాభాలో 10 శాతం జనాభాకి జాతీయ ఆదాయములో 50.4
శాతం సమకూరుతున్నది. ఆర్థిక సంక్షోభం ప్రారంభమయిన తరువాత అమెరికాలో 2009-12 సంవత్సరాలలో
జరిగిన పెరుగుదల లో 95 శాతం, 1 శాతం సంపన్నులకు దక్కింది.
90 శాతం మంది అంతకు ముందు వున్న
దానికన్నా సంపదను కోల్పోయారు. యూరపులో 10 మంది అతి సంపన్నుల సంపద 2008-10 మధ్య కాలములో
యూరపియన్ యూనియన్ దేశాలు ఆర్థిక సంక్షోభము నుండి కోలుకోటానికి అమలు చేసిన ఉద్దీపన పథకాలకు
అయిన ఖర్చుకన్నా ఎక్కువ. చైనా, ఇండియా,
పాకిస్తాన్, నైజీరియా లలో గత 30 సంవత్సరాలలో 10 శాతం సంపన్నులకు
జాతీయ ఆదాయములో లభించిన వాటా, 40 శాతం పేదలకు లభించిన దాని కన్నా
ఎక్కువ. ప్రపంచ స్థాయిలో 68.7 శాతం జనాభా వద్ద 3 శాతం సంపద వుండగా 22.9 శాతం జనాభా
వద్ద 13.7 శాతం, 7.7 శాతం జనాభా వద్ద 42.3 శాతం, 0.7 శాతం జనాభా వద్ద 41 శాతం సంపద వున్నది. సంపద కేంద్రీకరణ పెరిగిన కొద్దీ, అసమానతలు పెరిగే కొద్ది సంపన్నులు రాజకీయాలను, ప్రభుత్వాలను
శాసించి విధానాలను, చట్టాలను తమకి అనుకూలముగా మార్చుకోటం జరుగుతున్నది.
ప్రజల సంపదను, సహజ వనరులను లూటీ చేయటం పెరుగుతున్నది. రియల్ ఎస్టేట్, కంస్ట్రక్షన్, మైనింగ్, టేలికమ్యూనికేషన్స్
రంగాలలో దోచుకోటం తీవ్రమవుతున్నది. అవినీతికర మార్గాలలో ఇది జరుగుతున్నది. జవాబుదారీ
తనం లోపిస్తునంది. సంపన్నులపై విధించే పన్నులు
తగ్గుతున్నాయి. కార్మిక సంఘాలకు బేరమాడే శక్తి తగ్గుతున్నది. జాతీయ ఆదాయములో వేతనాల
శాతం తగ్గుతున్నది. ఇంతేగాక సంపన్నులు చట్టాలను తమకు అనుకూలముగా వక్రీకరించి ప్రజాస్వామ్యాన్ని
ధ్వంసం చేస్తున్నారు. సంపన్నుల సంపద పెంచే ఈ విధానాలలో భాగముగా సాంఘిక సంక్షేమ పథకాలు, ప్రజా ప్రయోజనాలకై చేసే ఖర్చును ప్రభుత్వాలు తగ్గిస్తున్నాయి.
దీని కారణముగా అంతరాలు మరింత పెరుగుతున్నాయి.
గత దశాబ్ద
కాలములో లాటిన్ అమెరికా దేశాలలో (దక్షిణ అమెరికా ఖండములో వున్న దేశాలు) ఆర్థిక అసమానతలు తగ్గుతున్నాయి. ఆ దేశాలలో ప్రభుత్వాలు సంపన్నులపై
పన్నులు పెంచి తద్వారా పెరిగిన ఆదాయమును విద్య, వైద్యం, ప్రజా సంక్షేమం, కనీస వేతనాల పెరుగుదల, ఉద్యోగ అవకాశాల కల్పనకు వినియోగిస్తున్నాయి. గత 20 సంవత్సరాలలో లాటిన్ అమెరికా
దేశాలలో సంక్షేమ పాతకాలపై ఖర్చు 66 శాతం పెరిగింది.
భయంకరముగా
పెరుగుతున్న ఆర్థిక అసమానతల తగ్గింపుకు ఈ క్రింది
చర్యలు చేపట్టాలని ఆక్స్ ఫామ్ ప్రపంచ దేశాలకు
సిఫార్సు చేసింది:
- పన్ను ఎగవేతకు విదేశాలలో కృత్రిమ
కంపెనీలను సృష్టించే కార్యక్రమాలను అనుమతించ రాదు.
- సంపన్నులు తమకి అనుకూలముగా ప్రభుత్వ
విధానాలను తయారు చేయించుకోగలిగే పరిస్థితిని అనుమతించ రాదు. సంపన్నుల రాజకీయ బలానికి
అడ్డుకట్ట వేయాలి.
- పెట్టిన పెట్టుబడులకు సంబంధించిన
వాస్తవాలు బహిరంగముగా తెలియ జేయాలి.
- అభివృద్ధికర పనుల విధానం (ఆదాయం పెరిగిన
కొద్దీ పన్నును పెంచటం) అమలు చేయాలి.
- ప్రభుత్వాలు విద్యా, వైద్యం, సాంఘిక సంక్షేమం, తదితరాలకు అధికముగా ఖర్చు చేయాలి.
కనీస వేతనాలు అమలు పరచాలి. కార్మికులకు
హక్కులు కల్పించాలి. మహిళలకు సమాన హక్కులు కల్పించాలి.
ఇదీ ఈ నివేదిక సారాంశం.
No comments:
Post a Comment