Friday, January 17, 2014

ఐ టి ఐ నుండి బి ఎస్ ఎన్ ఎల్ 30% ఎక్విప్మెంటు కొనే విధానం మరో సంవత్సరం పొడిగింపు –ప్రభుత్వ ఆదేశం; ఆహార లభ్యత లో అధ్వాన్న స్థితిలో భారతదేశం

ఐ టి ఐ నుండి బి ఎస్ ఎన్ ఎల్ 30% ఎక్విప్మెంటు కొనే విధానం మరో సంవత్సరం పొడిగింపు  –ప్రభుత్వ ఆదేశం
ప్రభుత్వ రంగ సంస్థలయిన బి ఎస్ ఎన్ ఎల్, ఎం టి ఎన్ ఎల్ లు తాము కొనే ఎక్విప్మెంటులో 30 శాతం ఐ టి ఐ నుండి కొనాలని ఇంతకు ముందే వున్న ఆదేశాన్ని ప్రభుత్వము మరొక సంవత్సరం పొడిగించింది. నష్టాలలో వున్న ఐ టి ఐ కి సహకరించేందుకు ఇది అవసరమని ప్రభుత్వము అంటున్నది. ప్రభుత్వము అనేది సమంజసమే. అయితే ప్రభుత్వము ఇదే నిబంధనని ప్రయివేటు టెలికాం కంపెనీలకు ఎందుకు వర్తింప చేయటం లేదు? ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియా వంటి ప్రయివేటు కంపెనీలు కూడా తమ ఎక్విప్మెంటు 30% ఐ టి ఐ నుండి కొనుగోలు చేయాలనే షరతు ఎందుకు విధించటం లేదు?
ప్రపంచ వాణిజ్య సంస్థ సభ్య దేశముగా భారత దేశము కుదుర్చుకున్న  ఒప్పందం ప్రకారం ప్రయివేటు కంపెనీల కొనుగోళ్ళపై ఇటువంటి షరతు విధించ కూడదు. స్వదేశీ సరుకయినా విదేశీ సరుకయినా, ఎవరి తయారీ అయినా సరే, తమకి నచ్చిన సరుకును నచ్చిన సంస్థ నుండి కొనుగోలు చేసే స్వేచ్ఛను ప్రపంచ వాణిజ్య సంస్థ ఒప్పందం ప్రకారం ప్రయివేటు కంపెనీలకు ఇవ్వాలి. కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థలను, ప్రయివేటు రంగ సంస్థలను ఒకే దృష్టితో ప్రభుత్వము చూడ కూడదు. ఐ టి ఐ నుండి 30% ఎక్విప్మెంటు కొనటం ద్వారా బి ఎస్ ఎన్ ఎల్, ఎం టి ఎన్ ఎల్ లు  ఒక సామాజిక బాధ్యత నెరవేరుస్తున్నాయి.  ఇదే విధముగా బి ఎస్ ఎన్ ఎల్, ఏం టి ఎన్ ఎల్ లు అనేక సామాజిక బాధ్యతలు నెరవేరుస్తున్నాయి. ఇందువలన వాటికి నష్టం జరుగుతున్నది. ఆ నష్టానికి పూర్తి పరిహారం  ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. కానీ టెలికాం కంపెనీలన్నింటికీ “సమన్యాయం” కలిగించే పేరుతో ప్రభుత్వము బి ఎస్ ఎన్ ఎల్, ఏం టి ఎన్ ఎల్ లకు ఇస్తున్న సబ్సిడీలను రద్దు చేసింది.  
సామాజిక బాధ్యతలను ప్రయివేటుకంపెనీలు నెరవేర్చనప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలు ఎందుకు నిర్వహించాలి అని కొందరు ఆవేశముతో ప్రశ్నిస్తారు. మరి సామాజిక బాధ్యతలను నిర్వహించాల్సింది ప్రభుత్వ రంగమే కదా! కాబట్టి ప్రభుత్వ రంగం సామాజిక బాధ్యతలను నిర్వహించ వద్దు అని అంటే దానిని ప్రయివేటు పరం చేయమని అన్నట్లే. కాబట్టి ప్రభుత్వ రంగం సామాజిక బాధ్యతలు నెరవేర్చాలి. అందువలన ప్రభుత్వ రంగ సంస్థలకు కలిగే నష్టాలకు ప్రభుత్వము పరిహారం చెల్లించాలి. ఈ సూత్రాన్ని ఆమోదింప చేసేందుకు ట్రేడ్ యూనియన్ ఉద్యమం, ప్రజాతంత్ర ఉద్యమం పోరాడాలి.

ఆహార లభ్యత లో అధ్వాన్న స్థితిలో భారత్
 ప్రపంచవ్యాప్తంగా గల దేశాల్లో ఆహార సూచిని బట్టి చూసినట్లయితే భారత్‌ చాలా అధ్వాన్న స్థితిలో వుందని చెప్పవచ్చు. జాబితాలో కింద నుండి 30 దేశాల జాబితాలో భారత్‌కు చోటు దక్కింది. పోషకాహార లోపం సమస్యలు, ఆహార పదార్ధాల ధరలు, ఆహారం నాణ్యత, ప్రజలు తీసుకునే ఆహారం కారణంగా తలెత్తే అనారోగ్య సమస్యలు, పరిస్థితులు వీటిని ఆధారంగా చేసుకుని సర్వే నిర్వహించారు. ఈ జాబితాలో కింది స్థాయి దేశాల్లో ఎక్కువగా ఆఫ్రికా దేశాలు వున్నాయి. వాటితో పాటు భారత్‌, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, లావోస్‌ దేశాలు కూడా వున్నాయి. అంతర్జాతీయ సహాయ, దాతృత్వ సంస్థ అయిన ఆక్స్‌ఫామ్‌ ఈ గ్లోబల్‌ ఫుడ్‌ ఇండెక్స్‌ను రూపొందించింది. ప్రపంచ దేశాల్లో ఆకలి, దారిద్య్రం సమూలంగా నిర్మూలించేందుకు ఈ సంస్థ ఇతోధికంగా కృషి చేస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆహార, వ్యవసాయ సంస్థ, అంతర్జాతీయ కార్మిక సంస్థ వంటి ఎనిమిది సంస్థల నుండి అంతర్జాతీయ స్థాయి సమాచారాన్ని సేకరించి దీన్ని రూపొందించారు. జాబితాలో కింద నుండి 29, 28 స్థానాల్లో వరుసగా భారత్‌, పాకిస్తాన్‌లు వున్నాయి. ఈ దేశాలు ఆహార సూచి 97గా వుంది. బంగ్లాదేశ్‌ జాబితాలో 24వ స్థానంలో వుండి 102 ర్యాంకింగ్‌తో వుంది. లావోస్‌ 112వ ర్యాంక్‌తో వుంది. మొదటి టాప్‌ టెన్‌ ర్యాంకులు యురోపియన్‌ దేశాలకే దక్కాయి. మొదటి స్థానంలో నెదర్లాండ్స్‌ వుండగా, తర్వాత ఫ్రాన్స్‌, స్విట్జర్లాండ్‌, డెన్మార్క్‌, స్వీడన్‌, ఆస్ట్రియాలు వరుసగా వున్నాయి. ఒక్క 12వ స్థానంలో ఆస్ట్రేలియా మినహాయిస్తే, వాస్తవానికి మొదటి 20 స్థానాలు కూడా పశ్చిమ యూరప్‌ దేశాలే వున్నాయి. అన్నింటికన్నా అథమ స్థాయిలో ఇథియోపియా వుంది. పోషకాహర లోపం ఎక్కువగా వున్న దేశాలు జాబితాలో భారత్‌, బురుండి, ఎమెన్‌, ఎరిత్రియా, మడగాస్కర్‌, తైమూర్‌ వంటి దేశాల సరసన వుంది. బరువు తక్కువ వున్న పిల్లలు ఎక్కువ నిష్పత్తిలో వున్న దేశాల్లో కూడా భారత్‌ అగ్ర స్థానంలోనే వుంది. ఈ జాబితాలో భారత్‌ తప్ప మరే ఆసియా దేశమూ కూడా లేదు. ఇకపోతే, ఆహార నాణ్యత, అందుబాటులో ఆహార పదార్థాలు విషయానికొస్తే భారత్‌ పరిస్థితి మరీ అంత చెడ్డగా అయితే లేదు. ప్రతి ఒక్కరికీ సరిపడా ఆహారం వున్నప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా గల దేశాల్లో ప్రతి ఎనిమిది మందిలో ఒకరు ఆకలితోనే నిద్ర పోతూ వుంటారు. ఇంకా 90కోట్ల మందికి తినడానికి సరిపడనంతా లేదు. కాగా వంద కోట్ల మంది ప్రజలు ఊబకాయంతో బాధపడుతున్నారు. ఇవి చూస్తుంటే ప్రపంచ దేశాల్లో ఆహార పంపిణీ వ్యవస్థ ఎంత అసమానంగా వుందో అర్ధమవుతోంది. 
ఆహార ఉత్పత్తిపై వాతావరణ మార్పుల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆక్స్‌ఫామ్‌ కోరుతోంది. అలాగే ఆహార ఉత్పత్తుల నుండి జీవ ఇంధనానికి పంటల మార్పిడిని కూడా నివారించాలని కోరుతోంది. ఊబకాయం, డయాబెటిస్‌ వంటి సమస్యలను పరిష్కరించేందుకు ఆహార పరిశ్రమపై ఆంక్షలు విధించాలని కోరుతోంది. ఆహార లభ్యతను దెబ్బతీస్తున్న అక్రమ వాణిజ్య ఒప్పందాలను పరిష్కరించాలని, ఆహారం నిల్వ, రవాణా కోసం మౌలిక రంగాల్లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని కోరుతోంది.(ప్రజాశక్తి 17.1.2014)



No comments:

Post a Comment