5.1.2013న శ్రీహరికోట రాకెట్ కేంద్రం
నుండి మొదటిసారిగా క్రయోజనిక్ ఇంజన్ సహాయముతో ఎగిరే రాకెట్ ద్వారా జిశాట్
ఉపగ్రహాన్ని భారత దేశం అంతరిక్షం లోకి పంపించింది. ఇప్పటివరకూ మనము వాడుతున్న
రాకెట్లు ఘన, ద్రవ ఇంధనాలతో పని చేసే ఇంజన్లు వున్న రాకెట్లు. ఇప్పుడు ప్రయోగించిన
రాకెట్ లో ఈ ఇంజన్లతోపాటు క్రయోజనిక్ ఇంధనముతో పని చేసే ఇంజన్ కూడా వున్నది.
క్రయోజనిక్ ఇంజన్ లో వాడిన ఇంధనాన్ని క్రయోజనిక్ ఇంధనం అంటారు. క్రయోజనిక్ అంటే
శీతల జనితం అని. హైడ్రోజన్ వాయువు -239.950
సెంటీగ్రేడ్ వద్ద ద్రవముగా మారుతుంది. ఆక్సిజన్ వాయువు -118.60సెంటీగ్రేడ్
వద్ద ద్రవముగా మారుతుంది (నీరు మంచుగా గడ్డ కట్టేది 00 సెంటీగ్రేడ్
వద్ద). ఈ రెండు వాయువులను ఇంతకన్నా ఎక్కువ శీతల స్థితిలో -252.870 , -1850సెంటీగ్రేడ్ వద్ద చల్లార్చి ద్రవముగా మార్చి వాటిని
ఇంధనముగా వాడారు. దీనికి అవసరమయిన సాంకేతిక పరిజ్ఞానం మన దగ్గర లేనందున రష్యా
వాళ్ళు మనకి ఇవ్వటానికి 1993 లో అంగీకరించారు. కానీ, క్షిపణి
పరిజ్ఞాన నియంత్రణ ఒప్పందాన్ని ఇది ఉల్లంఘించినట్లవుతుందని అమెరికా చేసిన ఒత్తిడి
వలన వెనక్కి తగ్గారు. అప్పటినుండి ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని మన దేశములోనే స్వయముగా
అభివృద్ధి చేసేందుకు మన శాస్త్రజ్ఞులు ప్రయత్నించి 20 సంవత్సరాల తరువాత ఇప్పుడు సఫలీకృతులయ్యారు.
ఈ క్రయోజనిక్ ఇంజన్ సాంకేతిక
పరిజ్ఞానాన్ని మనము సాధించినందున ఇకనుండీ మన దేశానికి సమాచార ఉపగ్రహాలను రోదసీ
కక్ష్య లోకి పంపించ గల సామర్థ్యం లభించింది. దీని వలన ఇతర దేశాల సమాచార ఉపగ్రహాలను
కూడా మనము రోదసిలోకి పంపించి ఆర్థికముగా లాభము పొంద వచ్చు. అందుకనే అమెరికా వాళ్ళు మనకి ఈ సాంకేతిక
పరిజ్ఞానం లభించకుండా వుండేందుకు అన్ని విధాలా ప్రయత్నించారు.
క్రయోజనిక్ సాంకేతిక పరిజ్ఞానం మనకి
లభించకుండా అడ్డుపడినట్లే అమెరికా మనకి అణు ఇంధనం, సాంకేతిక పరిజ్ఞానం రాకుండా అడ్డు
పడింది. వివక్షతతో కూడిన అణ్వస్త్ర నిరోధక ఒప్పందం పై భారత్ సంతకం చేయలేదు కాబట్టి
ఈ పరిజ్ఞానం మనకి ఇవ్వకూడదన్నది. దానితో మన అణు శాస్త్ర వేత్తలు స్వదేశీ
పరిజ్ఞానముతో భారజల అణు రియాక్టర్లు రూపొందించారు. ఫాస్ట్ బ్రీడ్ టెక్నాలజీని
అభివృద్ధి చేశారు.ఈ పరిజ్ఞానం ద్వారా అణు వ్యర్థాలను తిరిగి ఇంధనముగా మార్చే
క్రమాన్ని రూపొందించే పనిలో ఉన్నారు. కల్పక్కం లోని ఇందిరా గాంధీ అణు పరిశోధనా శాల
దీనికి వేదిక. భారత దేశములో యురేనియం నిల్వలు తక్కువ. కాబట్టి మనకు దొరికే థోరియం నుండి అణు
ఇంధనాన్ని తయారు చేసే సాంకేతిక పరిజ్ఞానం మనము అభివృద్ధి చేసుకుంటే అణు ఇంధనంలో మనం అగ్ర రాజ్యంగా మారతాం. కల్పక్కం లో థోరియంని అణు ఇంధనముగా మార్చేందుకు ఒక చిన్న
ప్రోటోటైపు అణు రియాక్టరును కూడా నిర్మించారు. అణు ఇంధనం, అణు
పరిజ్ఞానం లో స్వయం సమృద్ధి సాధిస్తామనే నమ్మకం ఏర్పడింది.
సరిగ్గా ఈ సమయంలోనే అమెరికా-భారత్
అణు ఒప్పందం జరిగింది. మద్దతిస్తున్న వామ పక్షాలు మద్దతును ఉపసంహరించినా, ప్రభుత్వము పడి పోయినా పరవాలేదు, కానీ అణు ఒప్పందం జరగాల్సిందేనని
యు పి ఏ-1 హయాములో ప్రధాన మంత్రి మన్మోహన్ సింగు అన్నారు. మన అభివృద్ధికి అమెరికా అణు
రియాక్టర్లు, అణు ఇంధనం అత్యవసరమని పాలక వర్గాలు, కార్పొరేట్ మీడియా ప్రచారం చేశాయి. మనకు క్రయోజనిక్ పరిజ్ఞానాన్ని ఇవ్వటానికి
గత 20 ఏళ్ళుగా నిరాకరిస్తూ వచ్చిన అమెరికా మరి అణు రియాక్టర్లను, అణు ఇంధన పరిజ్ఞానాన్ని ఇస్తానని ఎందుకు అన్నది? అణు ఇంధన పరిజ్ఞానం ఇవ్వటానికి అంగీకరించిన అమెరికా
క్రయోజనిక్ పరిజ్ఞానాన్ని ఇవ్వనని ఎందుకన్నది? ఇతరులు ఇస్తామంటే
ఎందుకు అడ్డుపడింది?
మనకు క్రయోజనిక పరిజ్ఞానం నిరాకరించటం
వెనుక, అణు
ఇంధనం అణు రియాక్టర్లు ఇవ్వటానికి అంగీకరించటం వెనుక, అమెరికా స్వార్థమే వున్నది. భారత్ కు క్రయోజనిక్ పరిజ్ఞానాన్ని 1993 లో రష్యా
ఇస్తానాని అన్నప్పుడే అమెరికా అడ్డుపడక పోతే మనము పదేళ్ళ ముందే ఉపగ్రాలను రోదసిలోకి
పంపే వ్యాపారం లో అమెరికా కంపెనీలతో పోటీ పడగలిగే వాళ్ళం. అందువలన దానిని అమెరికా వ్యతిరేకించింది.
అయితే తమ దేశములో పనికి రావని, ప్రమాదకరమని వినియోగించటం మాని
వేసిన ఏడు లక్షల కోట్ల రూపాయిల విలువయిన అణు రియాక్టర్లను, అణు
ఇంధనాన్నీ అమ్ముకుని లాభ పడాలి కాబట్టి, అందుకోసం అణ్వస్త్ర నిరోధక
ఒప్పందాన్ని బై పాస్ చేసి వాటిని మనకు అమ్మటానికి అమెరికా మనతో అణు ఒప్పందం కుదుర్చుకున్నది.
కాబట్టి అమెరికా తనకి ఏది ప్రయోజనమనుకుంటే
అదే చేస్తున్నది. కానీ మన పాలకులు మాత్రం స్వదేశీ, విదేశీ కార్పొరేట్సు లాభాపేక్షకు లొంగి ప్రమాదకరమయిన
అణు ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. అణు పరిశోధనపై శీత కన్ను వేశారు.
(ఇది ప్రజాశక్తి 7.1.2014 సంచికలో ప్రచురితమయిన ఎస్.వెంకటరావు గారి వ్యాసానికి సంక్షిప్త స్వేచ్ఛానుసరణ)
No comments:
Post a Comment