Thursday, January 5, 2012

2012లో ప్రపంచ ఆర్థిక పరిస్థితి


కొత్త సంవత్సరం ప్రవేశించిందంటే పరిస్థితి ఎలా ఉండబోతుందని అంచనా వేసుకోవడం ఓ ఆనవాయితీ. పరిస్థితి ప్రతికూలంగా ఉన్నపుడు లేదా సందిగ్ధంగా ఉన్నపుడు ఇలాంటి అంచనాల పట్ల ఆసక్తి మరీ అధికంగా ఉంటుంది. గత మూడేళ్లుగా ప్రపంచ వ్యాపితంగా సంక్షోభం కొనసాగుతున్నది. ఈ సంక్షోభం ఎప్పుడు వీడిపోతుందన్నదే ఇప్పుడు ప్రధానాంశంగా ఉంది. అమెరికాలో గృహ రుణ సంక్షోభంతో మొదలయి మొత్తం ప్రపంచాన్నే చుట్టుముట్టింది. సంపన్న దేశాలన్నీ దీని తాకిడికి గురి కాగా, వర్థమానదేశాలూ దీని బారినుండి తప్పించుకోలేకపోయాయి. ఎదుగుతున్న దేశాలు ప్రత్యేకించి చైనా, భారత్‌లు దీని నుండి తప్పించుకున్నాయని భావించినప్పటికీ ఈ రెండు దేశాలలోనూ అభివృద్ధి వేగం మందగించింది. ముఖ్యంగా చైనా అమెరికాకు ఎగుమతులపై ఎక్కువగా ఆధారపడటంతో దేశీయ ఉత్పత్తి రంగం తీవ్ర ప్రభావానికి గురయింది. భారత దేశం విదేశీ మార్కెట్లపై అంతగా ఆధారపడనప్పటికీ చమురు తదితర కీలక ముడిసరుకులకు ఇతర దేశాలపైనే ఆధారపడటంతో డాలరుతో ముడివడిన వాటి ధరలు విపరీతంగా పెరిగిపోవడం పెద్ద చిక్కులను తెచ్చిపెట్టింది. తొలుత ప్రపంచ సంక్షోభం నుండి భారత్‌ దూరంగా ఉన్నట్లు కనిపించినా ఇప్పుడు దాని ప్రభావం భారత్‌పైనా బాగా పడుతున్నది. జిడిపి పెరుగుదల రేటు వేగంగా పడిపోతున్నది. భారత దేశంలో 9 శాతం అభివృద్ధి ఉంటే అది సాధారణ పరిస్థితి, 6 శాతం ఉంటే అది సంక్షోభం అనే పరిస్థితి. అంటే జిడిపి పెరుగుదల 6 శాతం ఉన్నా కొత్త పెట్టుబడులు, ఉపాధి కల్పన బాగా తగ్గిపోతాయి.
ఈ ఏడాది ఆరంభంలో మొత్తంగా చూసుకున్నపుడు అమెరికా ఏదో తంటాలు పడి పరిస్థితి మరింత క్షీణించకుండా జాగ్రత్తపడుతుందని, ఐరోపాలో మాత్రం రెండోసారి సంక్షోభం నెలకొనే పరిస్థితి ఉందని భావిస్తున్నారు. చైనా అభివృద్ధి వేగం మందగిస్తుందని, దీన్నుండి సజావుగా బయటపడేందుకు ఆ దేశ ప్రభుత్వం సామర్ధ్యం సరిపోతుందా లేదా అని సందేహించేవారు కూడ ఉన్నారు. ఐరోపా మళ్లీ సంక్షోభంలో పడినా అది అంత తీవ్రంగా లేకపోతే, చైనా ఇబ్బందుల్లో పడకుండా ఉంటే 2012లో ప్రపంచ జిడిపి పెరుగుదల 2.7 శాతంగా ఉంటుందని ఐహెచ్‌ఎస్‌ గ్లోబల్‌ ఇన్‌సైట్‌ అనే సంస్థ అంచనా వేసింది. ప్రపంచ జిడిపి పెరుగుదల వేగం 2011లో 3.0 శాతం, 2010లో 4.2 శాతం ఉంది. ఐరోపాలో సంక్షోభం మరీ తీవ్రంగా ఉంటే, చైనా ఇబ్బందులు అధికమయితే ప్రపంచ జిడిపి పెరుగుదల వేగం మరింత క్షీణిస్తుందని, మొత్తంగా ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ మరో సంక్షోభంలో చిక్కుకునే అవకాశమూ లేకపోలేదని ఆ సంస్థ భావిస్తున్నది.
మరి కొందరి అంచనాలు మరీ నిరాశాజనకంగా ఉన్నాయి. ఐఎంఎఫ్‌ చీఫ్‌ ఎకానమిస్ట్‌ ఆలివర్‌ బ్లాంచర్డ్‌ ఆర్థిక మెరుగుదల అభివృద్ధి చెందిన దేశాలలో స్తంభించిపోతుందని, 2012లో పరిస్థితి 2008లో కన్నా అధ్వానంగా ఉండవచ్చని అంటున్నారు. అయితే ఆయన ఐఎంఎఫ్‌కు చెందిన మనిషి కావడంతో ఈ అంచనాతోనే ఆగిపోలేదు. ఇది తీవ్రమైన స్థూల ఆర్థిక పరిస్థితులను సృష్టిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం నిర్ణయాత్మకమైన విధానాల ద్వారా జోక్యం చేసుకొని ప్రైవేటురంగ ఆశలను సంతృప్తి పరిస్తే సానుకూల పరిస్థితి ఏర్పడుతుందని చెప్పుకొచ్చారు. అంటే లోటు తగ్గించే పేరుతో ప్రజలకు ఇచ్చే రాయితీలను, సబ్సిడీలను, సంక్షేమ చర్యలను ఉపసంహరించుకోవడం లేదా తగ్గించడం, అభివృద్ధిని ప్రోత్సహించే పేరుతో ప్రైవేటు రంగానికి రాయితీలను ముమ్మరం చేయడం లాంటి ఐఎంఎఫ్‌ తరహా ఔషధాలను అమలుచేయాలన్నది ఆయన ఉద్దేశం. కాని ఇలాంటి పరిష్కారాలు ప్రజల కొనుగోలు శక్తిని మరింత తగ్గించి పరిస్థితిని మరింత క్షీణింపచేస్తాయన్న సంగతిని ఆయన విస్మరిస్తున్నారు. యూరోజోన్‌లో ప్రభుత్వాలు పొదుపు చర్యలను ముమ్మరంగా చేపట్టిన ఫలితంగా సంక్షోభం మరింత తీవ్రమైన వాస్తవాన్ని మనం చూడాల్సి ఉంది.
సంక్షోభం నుండి పుంజుకోవడం, పుంజుకోలేకపోవడం అన్న సంగతి ఎలా ఉన్నప్పటికీ ఉపాధి కల్పన పరిస్థితి మాత్రం దాదాపు అన్ని దేశాలలోనూ ఒకే విధంగా నాసిరకంగా ఉంది. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) 2011 సెప్టెంబరులో జి 20 దేశాల గురించిన నివేదిక ప్రకారం కేవలం అతి కొద్ది దేశాలలో ప్రత్యేకించి అర్జెంటీినా, బ్రెజిల్‌, టర్కీ, ఇండోనీషియాలలో మాత్రమే ఉపాధికల్పన స్థాయి 2008 మొదటి త్రైమాసిక స్థాయికన్నా ఎక్కువగా ఉన్నాయి. అంటే సంక్షోభం ఆరంభంలో ఉన్న దాని కన్నా అధ్వాన్నంగా ఉపాధి కల్పన పరిస్థితి నేడుంది. మరి కొన్ని దేశాలలో అమెరికా, ఐరోపా యూనియన్‌ దేశాలతో సహా ఉత్పత్తి, ఉపాధి కల్పన రెండూ కూడ 2008 సంక్షోభం నాటి కన్నా తక్కువగా ఉన్నాయి. దక్షిణాఫ్రికాలో ఉత్పత్తి పుంజుకున్నా ఉపాధి కల్పన మాత్రం హీనస్థితిలోనే ఉంది. అంటే ఒక వైపున ఉపాధి కల్పన అతి బలహీనంగా ఉన్న సమయంలోనే ఆర్ధిక మెరుగుదల కూడ అంతంత మాత్రంగా ఉండేపరిస్థితి. సంపన్న దేశాలు, ఎదుగుతున్న (ఎమర్జింగ్‌) దేశాల పరిస్థితే ఇలా ఉంటే, వర్థమాన దేశాల పరిస్థితి మరీ దారుణంగా మారే అవకాశం కనిపిస్తున్నది. సంపన్న దేశాలలో క్షీణించిన పరిస్థితికి ప్రతిగా చైనా, బ్రెజిల్‌, రష్యా లాంటి దేశాలు పుంజుకుంటే సరిపోతుందని భావించడానికి అవకాశం లేదు. సంక్షోభం తీవ్రంగా ఉన్న అమెరికా, ఐరోపాలలో పడిపోయిన గిరాకీకి మారుగా ఈ దేశాలనుండి వచ్చే గిరాకీ సరిపోదు. నిజానికి ఇప్పుడు ప్రపంచ సంక్షోభం నుండి బయటపడేస్తాయనుకుంటున్న దేశాలలో సైతం పరిస్థితి క్షీణిస్తుంది.
అత్యధిక వర్థమాన దేశాలు ఐరోపా దేశాల దిగుమతులు తగ్గిపోవడం వల్ల నేరుగాను, అమెరికా దిగుమతులు తగ్గిపోవడం వల్ల కొంత తక్కువగాను ప్రభావితం అవుతాయి. ఉదాహరణకు అభివృద్ధిచెందుతున్న ఆసియా దేశాల ప్రత్యేకించి చైనా దేశపు మాన్యుఫాక్చరింగ్‌ ఎగుమతులు ఐరోపా సంక్షోభం వల్ల బాగా తగ్గిపోయాయి. ఎగుమతులపై ఆ దేశం ఎక్కువగా ఆధారపడటంతో దేశీయ గిరాకీ కూడ పడిపోయి దాని ప్రభావం ఆర్ధికవ్యవస్థపై కూడ పడుతున్నది. అంతేకాదు చైనా మాన్యుఫాక్చరింగ్‌ ఉత్పత్తి ఇతర ఆసియా దేశాల నుండి దిగుమతిచేసుకునే ముడిసరుకులు, మధ్యంతర వస్తువులపై కూడ ఆధారపడి ఉంది. ఆ విధంగా ఆయా ఆసియా దేశాల ఎగుమతులు కూడ తగ్గిపోతున్నాయి. చాల వర్థమాన దేశాలు మరో రకంగా కూడ దెబ్బతింటున్నాయి. ఇది ఫైనాన్స్‌ రంగ ప్రపంచీకరణ ఫలితంగా ఏర్పడింది. అంతర్జాతీయ బ్యాంకులు, ఇతర ఫైనాన్స్‌ సంస్థలు వర్థమాన దేశాలలో పెట్టిన పెట్టుబడులను వేగంగా ఉపంసహరించుకుంటున్నాయి. ఆర్థిక ప్రగతి తిరోగమన పథంలో ఉన్న దశలో తమ నష్టాలను భర్తీ చేసుకోవడానికి ఈ దేశాలలోని వాటాలను అమ్ముకొని లాభాలు చేసుకోవాలని ఆ సంస్థలు భావిస్తున్న కారణంగా ఈ పరిస్థితి ఏర్పడుతున్నది. ఇలా ఒక్కసారిగా ఫైనాన్స్‌ పెట్టుబడి ఉపసంహరించుకోబడటం వర్థమాన దేశాల ఫైనాన్స్‌ రంగాలను అతలాకుతలం చేస్తున్నది. ఆ దేశాల కరెన్సీ విలువలు అకస్మాత్తుగా పడిపోతున్నాయి. ఫలితంగా అవి అనివార్యంగా చేసుకోవలసిన ముడిచమురు లాంటి దిగుమతులకు అధిక మొత్తాలు చెల్లించాల్సి వస్తున్నది. దేశీయ కరెన్సీ పడిపోయినా ఆ మేరకు ఎగుమతులకు గిరాకీ అధికమయి పరిస్థితి మెరుగయ్యే పరిస్థితి కూడ ఇప్పుడు లేదు. ఎందువల్లనంటే ఆ ఎగుమతులను స్వీకరించాల్సిన సంపన్న దేశాలలో ఆర్ధిక సంక్షోభం వల్ల ఎగుమతులకు గిరాకీ ఏమీ ఉండటం లేదు. ఈ పరిస్థితి భారత దేశంలో మనం స్పష్టంగా చూస్తూనే ఉన్నాము. రూపాయి విలువ ఎన్నడూ లేనంత అతి వేగంగా, దారుణంగా పడిపోయింది. ఎగుమతులు పెరగడం లేదు. దిగుమతుల బిల్లు తడిసిమోపెడవుతున్నది. మొత్తంగా ఆర్థిక వ్యవస్థ సమతుల్యత కోల్పోయే పరిస్థితి ఏర్పడింది.
ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్న మరొక ముఖ్యమైన అంశం ఉంది. ఇది చైనా ఆర్ధిక వ్యవస్థపై నేరుగా ప్రభావం చూపుతుంది. చైనాలో గృహనిర్మాణం బుడగకు రంధ్రం పడింది. ఫలితంగా రియల్‌ ఎస్టేట్‌ ధరలు తీవ్రంగా పడిపోయాయి. దాన్ని అనుసరించి ఇనుము, ఉక్కు, సిమెంటు తదితర నిర్మాణ రంగ సంబంధిత ఉత్పత్తులకు గిరాకీ పడిపోయింది. అందుచేత చైనా ప్రభుత్వం కుటుంబరుణాలను పెంచడం ద్వారా ఆర్థిక వ్యవస్థలో గిరాకీని పెంచడం అనే విధానం నుండి వైదొలగి దేశీయ వినియోగాన్ని పెంచడానికి చురుగ్గా సమర్ధవంతమైన చర్యలు తీసుకుంటే తప్ప ఆర్ధికాభివృద్ధి పడిపోకుండా నివారించజాలదని నిపుణులు భావిస్తున్నారు. ఇలాగే ఇతర ఎమర్జింగ్‌ దేశాలలో కూడ వేగవంతమైన ఆర్ధికాభివృద్ధి రుణ ఆధారిత గిరాకీ పెంపుదల వల్లనే ఏర్పడింది. ఇప్పుడు అలాంటి దేశాలన్నీ ఒకే రకమైన పరిస్థితిని ఎదుర్కొంటాయి.
రాబోయే కాలంలో అమెరికాతో సహా జపాన్‌, అత్యధిక ఐరోపా దేశాల ప్రభుత్వ రుణాలు మరింత పెరిగే పరిస్థితే ఉంది. ఐరోపాలో అత్యధిక రుణగ్రస్త దేశాలయిన గ్రీస్‌, ఐర్‌లాండ్‌, పోర్చుగల్‌ లాంటి దేశాలపైనే కాకుండా ఐరోపాలోని నాలుగు అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థల్లో మూడుదేశాలయిన ఇటలీ, స్పెయిన్‌, ఫ్రాన్స్‌లపైన కూడ పొదుపు చర్యలు అమలుచేయాలన్న వత్తిడి పెరుగుతున్నది. మధ్య ఆసియాలో ఎలాంటి కీలక పరిణామం జరిగినా దాని ప్రభావం చమురు ధరలపై పడుతుంది. లిబియా లాంటి చిన్న దేశంపై అమెరికా దురాక్రమణ వల్లనే ముడిచమురు ధర బ్యారల్‌కు 25 డాలర్లు పెరిగింది. ఇప్పుడు ఇరాన్‌పై అమెరికా కాలుదువ్వుతున్నది. అదే జరిగితే మధ్యఆసియా చమురు సరఫరాలపై తీవ్రప్రభావం పడుతుంది.
మొత్తంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులు ఇంత నిరాశాజనకంగా, ఆందోళనకరంగా ఉన్నాయి కాబట్టే ఐఎంఎఫ్‌తో సహా అనేక మంది 2012లో ఆర్ధిక స్థితి పట్ల ఇంతటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు
-గుడిపూడి విజయరావు  (Prajasakti, 5-1-2012)

No comments:

Post a Comment