Saturday, January 28, 2012

'ఇది నా అరకు డిక్లరేషన్‌ '


 శృంగవరపు కోట వరకు డబల్‌ట్రాక్‌ రోడ్‌ ఉంది. విశాఖలో ప్రజాప్రతినిధుల బృందంతో బస్సులో వెళితే అన్నీ చూడలేను. అదీగాక అది ప్రభుత్వ కార్యక్రమంగా ఉంటుందని కారులో ప్రత్యేకించి వెళ్లాను. విశాఖలో మా విద్యార్థులు తెచ్చిన కారులో ప్రయాణించాను. శృంగవరపు కోట వరకు కారు స్పీడ్‌గా వెళ్లింది. మేమంతా ప్రభుత్వ అతిధులం కాబట్టి ఆ రోడ్డంతా పోలీసులు క్లియర్‌ చేశారు. ఎస్‌.కోట తర్వాత రోడ్డు సింగిల్‌ ట్రాక్‌ అయ్యింది. అది నాకు చాలా అనుకూలమైనది. ఎందుచేతనంటే ఎక్కడ నలుగురు కనబడితే అక్కడే కారు ఆపటం, ఎక్కడ నాలుగు గుడిసెలు కనబడితే అక్కడకు పోవటం, జనంతో కలవటం చేశాను. అది నా పుట్టుక నుంచి వచ్చిన బుద్ధి కదా! ఆడవాళ్లు కనబడితే వారితో మాట్లాడాను. నా పక్కన గిరిజన భాష తెలిసిన అప్పల్నాయుడున్నాడు. మహిళలు కనపడగానే ఏం చదువుకున్నావని అడిగేవాణ్ణి. చదువులేదు ఏంలేదు అని కొందరు సమాధానం చెప్పారు. మరి ఎటుపోతున్నావమ్మా? ఏం పని చేస్తున్నావమ్మా? అని కొందరిని అడిగితే బతకటానికి వెళుతున్నానని సమాధానం చెప్పారు. కట్టెపుల్లలు ఏరుకొచ్చుకునేందుకు వెళుతున్నానని ఒక ఆమె చెప్పింది. ప్రభుత్వం మీకు గ్యాస్‌పొయ్యిలను ఇవ్వలేదా అన్నాను. అంటే నా ప్రశ్న వాళ్లకు అమెరికాలో స్పానిష్‌ వాళ్లను అడిగినట్లనిపించింది. ఎవరో కరువు వచ్చిందా అంటే బిర్యాని దొరకలేదా అని నైజాం నవాబు అడిగినట్లుంది. ఆ ప్రశ్న అడిగితే మమ్మల్ని నైజాం నవాబు ఎలా చూశాడో ఆమె మమ్ముల్ని అలా చూసింది. అయ్యో, ఈమెను ఈ ప్రశ్న ఎందుకు వేశానా అనిపించింది. ఆమె వయసు 20 సంవత్సరాలకు తక్కువగా ఉన్నది. ఎంత మంది పిల్లలమ్మా అని అడిగాను. ముగ్గురు పిల్లలని చెప్పింది. 20 ఏళ్ల లోపే వాళ్ల జీవితం ముగిసింది. కొంచెం దూరం పోతే రోడ్డుపైననే అంత చలి ఉన్నా ఆ మనుషులు గోచి పెట్టుకుని రోడ్డు మీద నడుస్తున్నారు.

కొందరిని మీదేవూరు అని, మీ తండా ఎక్కడుందని అడిగాను. ఒక స్థలంలోనే నివాసమన్నది మాకెక్కడుంది? ఎక్కడ బువ్వ దొరికితే అక్కడికే వలసలు పోవటం మా జీవనం అన్నారు. స్కూళ్లు ఏమైనా వాళ్లకు అందుబాటులో ఉన్నాయా అని అడిగాను. బడులున్నాయి. రెండు మూడు ఆశ్రమ బడులు కనపడ్డాయి. టాయిలెట్స్‌ ఉన్నాయి. కానీ నీళ్లు లేవు. మూత్రం వస్తే ఎటువెళతారని అడిగితే ఆ విద్యార్థిని తలవంచుకుంది. పక్కన ఉన్న మగపిల్లలను అడిగాను. ఆ చెట్ల పక్కన అని చూపించటం జరిగింది. బడి అంటే బోర్డుయని, బెంచీలని, నల్లబల్లలని అనుకుంటాం. అక్కడ బడి అంటే ఆశ్రమ పాఠశాల పిల్లలు కింద కూర్చున్నారు. అక్కడే ఆ మూలనా అన్నం వండుతున్నారు. అది మధ్యాహ్న భోజన పథకం కింద వంట వండుతున్నారు. సత్రపు తిండిలాగా, ఆ బడులు మఠాల తీరుగా ఉన్నాయి. గతంలో సన్యాసులను కూర్చుండపెట్టేది ఇపుడు పిల్లలను కూర్చుండ బెడుతున్నట్లు నాకనిపించింది.

ఆ తోవలో ఒక దుకాణంలోకి పోయి మంచి నీళ్లు ఉన్నాయా అని అడిగాను. సీసాలా అన్నది అవునన్నాను. ఆమె వెంటనే ఓ మద్యం మందు సీసా తీసుకుని వచ్చింది. నేనడిగింది ఈ సీసా మందు కాదు. మంచినీళ్లు బాటిల్స్‌ ఉన్నాయా అని అడిగాను. ఇక్కడ వద్దు సార్‌ బైటకు పోయి తాగుదామన్నాడు. చివరకు రోడ్డంతా పోలీసులున్నారు కాబట్టి ఒక పోలీసు తను గద్దెమీద కూర్చోని తుపాకీ మెడ మీద వేసుకుని నలు దిక్కులా ఆసక్తిగా చూస్తున్నాడు. ఏం చూస్తున్నావని అడిగాను. ఇది ఎంత అద్భుతమైన సన్నివేశం సార్‌ అన్నాడా కానిస్టేబుల్‌. ఆ కానిస్టేబుల్‌ తాను గోదావరి జిల్లా వాణ్ణని చెప్పాడు. బి.ఏ. చదువుని మధ్యలో వదిలి పోలీసు ఉద్యోగంలో చేరానని చెప్పాడు. నువ్వొక్కడివే కూర్చుని పహారా కాస్తుంటే నీకు భయం వేయటం లేదా అని అడిగాను. నాకు ఆనందంగా ఉందని అన్నాడు. చక్కటి సీనరీలున్నాయి. చూసిన కొద్దీ నాకు చూడబుద్ధి అవుతుంది. నేనుండేది రెండు రోజులేగా సార్‌. ఇదొక అద్భుతమైన టూరిస్టు సెంటర్‌గా ఉందన్నాడు. ప్రజల స్థితిగతులు ఒకరకంగా ఉన్నాయి. యాత్రికుల ఆనందం మరోరకంగా ఉంది. ఈ విధంగా నాకు ఎస్‌. కోట నుంచి అనంతగిరి చేరే వరకు రెండు గంటలు పట్టింది. ఇంత సుసంపన్న ప్రదేశంలో ఇంత దరిద్రులుండటం ఏమిటని నాకనిపించింది.

మేము అనంతగిరి చేరేవరకు ఒక 30 మంది మహిళలను తీసుకువచ్చి నిలబెట్టారు. అదొక టూరిజం కేంద్రం. అక్కడ నూటముప్పరు వరకు గదులు వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. అన్ని వసతులున్నాయి. మా మధ్యాహ్న భోజనం అక్కడే ఏర్పాటు చేశారు. ఫైవ్‌స్టార్‌ హౌటల్‌లో ఉండే వసతులకు తలదన్నే విధంగా సౌకర్యాలు, అన్ని రకాల రుచులు, తిండి పదార్థాలు ఏర్పాటు చేశారు. నేను నా జీవితంలో మాంసం వాసన, చేపల వాసనను పీల్చవలసి వచ్చింది. ఇక్కడ కూర్చుంటే లాభం లేదని అక్కడకు దూరంలో నున్న ఆడవాళ్ల దగ్గరకు పోయాను. వారంతా 16 -45 సంవత్సరాల మధ్య వయసున్నవారే. మీరేం చేస్తారని అడిగితే, మీలాంటి టూరిస్టులు వస్తే గిరిజన సంస్కృతికి ప్రతిబింబమైన నృత్యం చేస్తామని చెప్పారు. గిరిజన సంస్కృతి నృత్యం చేస్తూ ఆ కళలను ప్రదర్శిస్తున్న సాంస్కృతిక టీమ్‌ అది. అక్కడున్న ఆ 20 మందిలో ఇద్దరు మాత్రమే బడిముఖం చూశారు. వీళ్లంతా స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పుట్టిన వాళ్లు. అతిథులు రాగానే నాట్యం చేస్తున్నారు. తమ గిరిజన కళలను ప్రదర్శిస్తున్నారు. అది ఇతరులకు ఆనందం కలిగించవచ్చు కానీ నాకు మాత్రం వాళ్ల చప్పుడు నాగుండె మీద బరువేసినట్లయ్యింది. అక్షర జ్ఞానం లేదాయె? సంబంధిత అంశంపై పనిచేసే ఉద్యోగం కాదు. టూరిస్టులు వస్తే వాళ్ల వినోదం కోసం వీళ్లను అడుగులు వేయిస్తుంటే అది ఆనందమా? క్షోభనా ఒక్కసారి ఆలోచించుకోవాలనిపించింది.

టూరిజంలో సంపాదించే డబ్బుతో ఈ స్థానికుల జీవితాలను మెరుగుపరిచే ప్రయత్నం ఏమన్నా చేస్తే మనమీద వారికి ఎక్కువ నమ్మకం కలిగేది. మనది టూరిజం పరిశ్రమ కదా! అది టూరిస్టుల కోసం, మార్కెట్‌ కోసమే కానీ ప్రజల కోసం కాదు అని అనిపించింది. కాబట్టి నేను అక్కడ నుంచి వెళ్లిపోయాను. అక్కడ నుంచి 30 కిలో మీటర్ల దూరంలో అరుకులోయ ఉంది. అక్కడే మా బస. దానికి 10 కిలోమీటర్ల దూరంలో చోటికీ అనే గ్రామంలో గ్రామసభ ఏర్పాటు చేశారు. ఒకవైపున ప్రజలు రెండోవైపున ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలున్నారు. మధ్యలో అధికారులున్నారు. మా అందరికీ నాయకత్వం వహిస్తున్న స్పీకర్‌ ఉన్నారు. ఆ సభ సందర్భంలో వర్షం కురుస్తోంది. అయితే అది మామూలు వర్షం కాదు. ప్రశ్నల వర్షం. అప్పటికే ఆర్డర్‌, ఆర్డర్‌, సప్లిమెంటరీస్‌...అని స్పీకర్‌ అన్నారు. అయ్యా గవర్నరుగారొచ్చి పోయారు. మీరొచ్చారు. 80 మంది చట్టసభల ప్రతినిధులు వచ్చారు. ఇన్ని రోజుల నుంచి మా ప్రాంతంలోని సంపదను మేం ముట్టుకోలేదు. అవి ముట్టుకుంటే పాపం అని, అది దైవ సంపద అని మా పెద్దలు చెప్పారు. మలేరియా వచ్చినా చనిపోయాం, నీళ్లు లేకున్నా మాడిపోయాం. కానీ ఇపుడు ఆ గుట్టలను తవ్వితే గాలి కూడా పీల్చుకోలేమంటున్నారు. దాన్ని ఆపుదల చేస్తారా? చెప్పమని అడిగారు.

దీనికి సమాధానం చెప్పమని స్పీకర్‌ కలెక్టర్‌ను అడిగాడు. ''ఇందుకు సంబంధించి జిందాల్‌ కంపెనీతో ఒప్పందాలు జరిగాయి. బాక్సైట్‌ తవ్వకాలకు ఒకరకంగా అనుమతి లభించింది. కానీ అటవీశాఖ అనుమతి కోసం తవ్వకాలు ఎదురుచేస్తున్నాయని'' కలెక్టర్‌ చెప్పాడు.

బాక్సైట్‌ తవ్వకాలు తవ్వితే కాలుష్యం ఏర్పడుతుందంటున్నారు. ఆ కాలుష్యాన్ని మీరు నిలుపుదల చేస్తారా? అని ఒక గిరిజనుడు అడిగాడు. అక్కడున్న సంబంధిత కాలుష్య నియంత్రణాధికారిని సమాధానం చెప్పమన్నారు. అటవీశాఖ అనుమతి లభించాక ఆ కాలుష్యం గురించి అధ్యయనం చేస్తామన్నారు. ఈ విధంగా ప్రజలను భయం ఆవరించి ఉన్నది. బైటకు రాగానే విలేకరులు ప్రశ్నలతో మా వెంటపడ్డారు.ఇక్కడ సమస్యలు అధ్యయనం చేయటాని కొచ్చామని చెప్పాను. ఈ అధ్యయనం చేసి మార్కెట్‌ వాళ్లకు రోడ్డు సాఫీ చేసి రెడ్‌ కార్పెట్‌ పరచేందుకు వచ్చారా అని విలేకరులు ప్రశ్నించారు. ప్రజల ఆవేదనను అర్థం చేసుకుని గిరిజనుల సమస్యను ప్రజల సమస్యగా మార్చటానికై ప్రజా ఉద్యమాలకు నాంది పలికేందుకే వచ్చానన్నాను. ఇవాళ నా ముందున్న ప్రశ్న ఏమిటంటే పాలకులు చేస్తున్న పని మార్కెట్‌ వైపా? ప్రజలవైపా? ప్రభుత్వాలు నెలకొల్పుతున్న పరిశ్రమలు వాటినుంచి వెలువడే కాలుష్యం పర్యావరణాన్ని కాటేస్తుంది కదా. స్వచ్ఛమైన గాలిని కలుషితం చేస్తున్నామన్న ఆందోళన నన్ను వెంటాడింది. ఇవన్నీ చూస్తుంటే మన పాలకుల అడుగులు ప్రజల ఆరోగ్యం వైపా? మార్కెట్‌ లాభాల వైపా? అన్న ఆలోచనలతో నాబుర్ర వేడెక్కింది. ఈ సందర్భంలో ఒక ప్రజా ప్రతినిధిగా ప్రజల జీవించే హక్కు అయిన బతుకువైపా? 'అభివృద్ధి' వైపా? అని నన్ను నా అంతరాత్మ అడిగింది. ప్రజలు జీవించే హక్కు కాపాడటమే నాకు ముఖ్యం, ఆ తరువాతే అభివృద్ధి అని నాలో నేను అనుకున్నాను. ఇదే నా అరుకులోయ డిక్లరేషన్‌.

-చుక్కా రామయ్య
(prajasakti, 28-1-2012)
(రచయిత ప్రముఖ విద్యావేత్త,
శాసనమండలి సభ్యులు)

No comments:

Post a Comment