Friday, January 27, 2012

అసమానతలపై ఓ ఆసక్తికర అధ్యయనం


దేశంలో సరళీకృత ఆర్థిక విధానాల అమలు ఆరంభమై రెండు దశాబ్దాలు గడిచాయి. జిడిపి వృద్ధిరేటు అంత పెరిగిపోయింది, ఇంత పెరిగిపోయింది అన్న మాటలే ఇప్పటివరకు వినిపిస్తున్నాయి. అభివృద్ధి రేటు పెరిగిందన్న దానిలో కొంత నిజం లేకపోలేదు. అయితే ఇలా చెప్పేవారు ఆ అభివృద్ధి ఫలితాలు ఎవరికి దక్కాయన్నదాన్ని మాత్రం అంతగా పట్టించుకోవడం లేదు. అయినప్పటికీ అసలు వాస్తవాల్ని వెల్లడించే సమాచారం, అధ్యయనాలు అనేకం వెలువడుతూనే ఉన్నాయి. పలు అంశాలు యథాలాపంగా కూడ వెల్లడవుతున్నాయి. ఇటీవల కాలంలో ప్రపంచ కుబేరుల జాబితాలో భారతీయులు మొదటి స్థానాలలో నిలబడటం, అలాంటి వారి సంఖ్య ఏడాదికేడాదికి పెరగడం తెలుస్తూనే ఉంది. మరో వైపున దేశంలో పేదరికం గురించి, పౌష్టికాహారలోపం గురించి అనేక వివరాలు వస్తున్నాయి. ఇటీవల పేదరిక రేఖపై ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానానికి సమర్పించిన అఫిడవిట్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. కొద్దిరోజుల క్రితమే ఓ స్వచ్ఛంద సంస్థ తన అధ్యయనంలో నేటికీ దేశంలో 42 శాతం మంది బాలలు పౌష్టికాహారలోపానికి గురవుతున్నారని స్పష్టం చేసింది. ఆ అధ్యయన నివేదికను దేశంలో సరళీకృత ఆర్థిక విధానాల అమలుకు మూలపురుషుడయిన ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ విడుదల చేస్తూ ఈ పరిస్థితి పట్ల తాను సిగ్గుపడుతున్నానని చెప్పడం సంచలనాత్మకం అయింది. అయినా ఇలాంటి దుర్భర పరిస్థితికి కారణం ఏ విధానాలు అన్న విషయం జోలికి ఆయన పోలేదు.

అసమానతల తీవ్రతను వెల్లడించే మరొక నివేదిక తాజాగా వెల్లడయింది. నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ అప్లైడ్‌ ఎకనామిక్స్‌ అండ్‌ రీసెర్చి (ఎన్‌సిఏఇర్‌), సెంటర్‌ ఫర్‌ మాక్రో కన్జ్యూమర్‌ రీసెర్చి (సిఎంసిఆర్‌) ఈ అధ్యయనాన్ని నిర్వహించాయి. అయితే ఈ అధ్యయనం అసలు ఉద్దేశం దేశంలో అసమానతలను పరిశీలించడం కాదు. ఇప్పటివరకు మొత్తం ఆదాయం ఎంత? దానికనుగుణంగా వినియోగ, విలాస వస్తువుల తయారీని ఎంత పెంచవచ్చు అనే అంచనాలు స్థూలంగా వెలువడుతున్నాయి. దానికి భిన్నంగా ప్రస్తుతం ప్రజల ఆదాయాల పరిస్థితి తరగతుల వారీగా ఏమిటి, వారి వారి ఆదాయ స్థాయిని బట్టి వినియోగ ప్రాధాన్యతలు ఎలా ఉన్నాయి, ఎవరికి ఏ వస్తువులను విక్రయించవచ్చు- ఇలాంటి విషయాలను కార్పొరేట్‌ రంగానికి వాస్తవానికి దగ్గరగా విశదీకరించడం ఈ అధ్యయనం లక్ష్యం. కార్పొరేట్‌ అవసరాలకోసమే అయినా వాస్తవ పరిస్థితిని ఈ అధ్యయనం చక్కగా వ్యక్తం చేస్తున్నది. అత్యున్నత ఆదాయ వర్గాల వినియోగం ఏ విధంగా ఉంటున్నది, ఎలా మారబోతుంది, అంత తక్కువ, మధ్యస్థ, మొత్తంగా దిగువ తరగతుల వారి వినియోగం ఎలా ఉంటుంది- ఇలాంటి అంశాలను ఇది వివరిస్తుంది.

మొత్తం కుటుంబాలను 20 శాతం చొప్పున ఐదు విభాగాలుగా ఈ అధ్యయనం విభజించింది. ఒక్కొక్క విభాగం వాటా మొత్తం ఆదాయంలో ఎంత, మొత్తం వ్యయంలో ఎంత, మిగులులో ఎంత- ఇలా పలు అంశాలను పరిశీలించింది. ఈ అధ్యయనం ప్రకారం అందరికన్నా దిగువన 20 శాతం తరగతి ఆదాయం మొత్తం ఆదాయంలో 6 శాతంగాను, వ్యయంలో 9 శాతంగాను ఉంది. తగులే తప్ప మిగులనేది వీరికి లేదు. అందరికన్నా ఎగువ 20 శాతం తరగతి ఆదాయం మొత్తం ఆదాయంలో 51 శాతంగాను, వ్యయంలో 40 శాతం గాను, మిగులులో 55 శాతంగాను ఉంది. అతి సంపన్న తరగతి మొత్తం ఆదాయంలో సగానికిపైగానే పొందుతుండగా, అతి పేద తరగతి ఆదాయం కేవలం 6 శాతం మాత్రమే. పైగా మనం ఇక్కడ చెప్పుకుంటున్న అతి సంపన్న ఆదాయ తరగతిలో అంబానీలు, టాటాలు, బిర్లాలు లాంటి వారంతా ఉంటారు. అలాంటి తరగతి సగటు ఆదాయం పరిగణనలోకి తీసుకున్నప్పటికీ, అతి పేద తరగతి సగటు ఆదాయం కన్నా ఎనిమిది రెట్లు అధికంగా ఉంది.

గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య ఆదాయ అసమానతలను కూడ ఈ అధ్యయనం బేరీజు వేసింది. ఉదాహరణకు అతి సంపన్న 20 శాతం తరగతికి పట్టణ ప్రాంతాలలో 100 రూపాయల ఆదాయం వస్తున్నదనుకుంటే, అతి సంపన్న 20 శాతం తరగతికి గ్రామీణ ప్రాంతాలలో 51 రూపాయలు మాత్రమే ఆదాయం లభిస్తున్నది. మధ్య 20 శాతం వారికి సైతం పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య ఆదాయాలలో అసమానత తీవ్రంగానే ఉంది. మధ్య 20 శాతం మందికి పట్టణ ప్రాంతాలలో 30 రూపాయలు ఆదాయం లభిస్తున్నదనుకుంటే, గ్రామీణ ప్రాంతాలలో 15 శాతం మాత్రమే లభిస్తున్నది. నిరుపేద తరగతిలో మాత్రం పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య ఆదాయ అసమానతలు నామమాత్రమే. పట్టణ ప్రాంతాలలో 11 రూపాయలు లభిస్తే, గ్రామీణ ప్రాంతాలలో 7 రూపాయలు లభిస్తున్నాయి. పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య రోడ్లు, ఇతర రవాణా కమ్యూనికేషన్‌ సదుపాయాలు అభివృద్ధి చెందటంతో దేశవ్యాపితంగా వినియోగవస్తువులకు గిరాకీ వారి వారి ఆదాయ స్థాయిలను బట్టి అధికంగానే ఉందని కూడ ఈ అధ్యయనం అభిప్రాయపడింది.

ఇప్పుడు మనం చెప్పుకుంటున్న అతి సంపన్న 20 శాతం తరగతి ఆదాయం మొత్తం ఆదాయంలో 51 శాతం ఉంటే, అది 1993-94లో 37 శాతమే. ఈ వాటా 2014-15 నాటికి 59 శాతానికి పెరుగుతుందని అంచనా. అంటే అతి సంపన్నుల ఆదాయాలు ఎంత వేగంగా పెరుగుతున్నాయో స్పష్టంగా అవగతమవుతున్నది. ఇదే సంస్థ మరొక విధంగా కూడ అతి సంపన్నుల ఆదాయాన్ని పరిశీలించింది. అతి సంపన్నుల్లో ఒక శాతం వారి ఆదాయం ఎంత ఉంటుందనేది అంచనా వేసింది. నేడు అతి సంపన్న ఒక శాతం జాబితాలో చేరాలంటే ఏ కుటుంబానికైనా రు.12.5 లక్షల వార్షికాదాయం ఉండాలి. ప్రపంచ ప్రమాణాలతో పోల్చుకుంటే ఇది ఓ రకంగా తక్కువే. అమెరికాలో ఒక శాతం అత్యున్నత ఆదాయ తరగతి కుటుంబానికి 5 నుండి 7 లక్షల డాలర్లు లభించాలి. కనిష్టంగా 5 లక్షల డాలర్లు తీసుకున్నా రూపాయల్లో అది రు.2.6 కోట్లు అవుతుంది. అంటే భారత్‌లో అతి సంపన్న ఒక శాతంలోని కుటుంబం సగటు ఆదాయం కన్నా ఇది 20 రెట్లు ఎక్కువ. కొనుగోలు శక్తి సమానీకరణతో చూసుకున్నప్పటికీ 10 రెట్లు అధికంగా ఉంటుంది.

అమెరికాతో పోలిక సంగతి ఎలా ఉన్నప్పటికీ అతి సంపన్న తరగతి వాటా వినియోగంలోనూ అధికంగానే 40 శాతంగా ఉంది. అదే సమయంలో మిగులు కూడ ఎక్కువగా ఉండటం వల్ల పొదుపు, మదుపులో కూడ వీరి వాటా అధికంగా 76 శాతంగా ఉంది. ఇదే సమయంలో మధ్య తరగతి వారి వినియోగం వాటా వారి ఆదాయంతో పోల్చుకున్నపుడు అధికంగానే 17 శాతంగా ఉంది. మిగులులో మధ్యతరగతి వారి వాటా 7 శాతమే. అందరికన్నా దిగువ తరగతి వారికి ఆదాయం అతి తక్కువ కావడంతో వినియోగంలో వారి వాటా 9 శాతమే. మిగులు అనేదే వారి వద్ద ఉండదు.

ఉన్నతశ్రేణివారు తమ మొత్తం వ్యయంలో 40 శాతాన్ని ఆహారంపై ఖర్చు పెడుతున్నారు. ఇదే మధ్యతరగతి వారు 42.5 శాతం వ్యయాన్ని ఆహారంపై పెడుతున్నారు. మధ్యతరగతికి ఎగబాకాలనుకునే దిగువ మధ్య తరగతి ఆహారంపై 47.5 శాతం వెచ్చిస్తున్నది. అందరికన్నా దిగువ తరగతి వారు తమ మొత్తం వ్యయంలో 57.3 శాతాన్ని ఆహారంపైనే వెచ్చిస్తున్నారు. అతి సంపన్న తరగతి వారు గృహ సదుపాయంపై పెద్దగా వెచ్చించడం లేదు. మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వారు మాత్రమే వరుసగా 4.7 శాతం, 5.2 శాతాన్ని వెచ్చిస్తున్నారు. అతి దిగువ తరగతి వారు సైతం గృహసదుపాయంపై 4.2 శాతం ఖర్చుపెడుతున్నారు. అతి సంపన్నులకు ఇప్పటికే అభిరుచులకు తగిన గృహాలు ఉంటాయి కాబట్టి వారు దానికి కొత్తగా ప్రాధాన్యతనివ్వడం లేదు.

అతి సంపన్న, మధ్య, దిగువ మధ్య తరగతుల వారు మొత్తంగా అధిక ప్రాధాన్యతనిచ్చే అంశం ఒకటుంది. అది విద్య. అతి సంపన్న తరగతి 8.8 శాతాన్ని, మధ్య తరగతి 9.2 శాతాన్ని, దిగువ మధ్య తరగతి 8.1 శాతాన్ని విద్యపై ఖర్చు చేస్తున్నాయి. నిరుపేద తరగతి వారు తమ వ్యయంలో 5.7 శాతాన్ని మాత్రమే విద్యపై పెట్టగలుగుతున్నారు. ఇంటి యజమాని విద్యాస్థాయి కూడ విద్యపై పెట్టే ఖర్చుపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. ఇంటి యజమాని ప్రాథమిక విద్యాస్థాయి మాత్రమే కలిగిన వాడయితే 22 శాతం ప్రభావం, డిగ్రీ అంతకు పైన చదువుకున్నవారయితే 264 శాతం ప్రభావం ఉంటుందని ఈ అధ్యయనం పేర్కొంటున్నది. రవాణా సదుపాయాలకు ఉన్నత, మధ్య, దిగువ మధ్య తరగతి ముగ్గురూ దాదాపు సమానంగానే తమ వ్యయంలో కేటాయిస్తున్నారు. సంపన్న వర్గాలు 14.7 శాతాన్ని, మధ్య తరగతి 13.5 శాతాన్ని, దిగువ మధ్య తరగతి 11.6 శాతాన్ని వెచ్చిస్తున్నాయి.

ఈ విధంగా ఎన్‌సిఎఇఆర్‌, సిఎంసిఆర్‌ల అధ్యయనం వారెందుకు చేసినప్పటికీ ఆదాయ అంతరాలు గత రెండు దశాబ్దాల కాలంలో ఎంతగా పెరిగిందీ, ఇటీవల కాలంలో వాటి తీవ్రత ఎంత వేగం పుంజుకున్నదీ కళ్ళకు కట్టినట్టు చూపుతున్నది. సరళీకరణ సమర్థకులు ఈ అంశాన్ని ఎంతవరకు గుర్తిస్తారో చూడాలి. 
-గుడిపూడి విజయరావు
  (Prajasakti, 27/1/2012)

No comments:

Post a Comment