Saturday, November 12, 2011

మానవ అభివృద్ధి నివేదిక 2011-భారత దేశం స్థానం


ఐక్యరాజ్య సమితి సంస్థ  యుఎన్డిపి(యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం), ఇటీవల "మానవ అభివృద్ధి నివేదిక 2011" ను ప్రకటించింది. భారత దేశం లో ఆర్థిక అభివృద్ధి అత్యధిక ప్రజానీకం జీవన స్థాయిని పెంచటానికి తోడ్పడటం  లేదని నివేదిక మరో సారి రుజువు చేసింది
నివేదిక  ప్రకారం మానవ అభివృద్ధి సూచిక లొ భారత దేశం మొత్తం 187 దేశాలలో 134 స్థానం లో వున్నది. విద్య, ఆరోగ్యం,ఆదాయం లో సాధించిన అభివృద్ధి స్థాయినిబట్టి సూచికని  తయారు చేస్తారు.
ఇతర ఆసియా దేశాలయిన చైనా, శ్రీలంక, మంగోలియా,వియత్నాం, మాల్దీవులు, తదితర దేశాలకన్నా  భారత దెశం మానవ అభివృద్ధి సూచికలో వెనక బడింది.
భారత దేశంలో "బహుముఖ దారిద్ర్యం" లో వున్న వారి సంఖ్య 612 మిలియన్లు. ఇది దేశ జనాభాలో సగానికి పైనేఫ్రపంచంలో మరే దేశంలో నైనా ఇంతమంది బహుముఖ దారిద్ర్యం లో  లేరు. ("బహుముఖ దారిద్ర్య సూచిక” ని ఆరొగ్య సేవలు, పరిశుద్ధమయిన త్రాగు నీరు, వంటకి అవసరమయిన ఇంధనం మరియు గృహనిర్మాణపు స్థాయి తదితరాల ఆధారంగా తయారు చేస్తారు).
లైంగిక అసమానత సూచికలో భారత దేశం 146 దేశాలలో 129 స్థానంలో వున్నది. భారత మహిళలు విద్య, చట్టసభలలో ప్రాతినిధ్యం, కార్మిక శక్తిలొ వాటా విషయంలో పురుషులకన్నా బాగా వెనకబడి వున్నారు.
ప్రాధమిక   సూచికలయిన పుట్టిన శిశువు జీవించే కాలం, సగటు పాఠశాల  విద్యా సంవత్సరాలు తదితరాలలో భారత దేశం శ్రీలంకకన్నా, అంతేగాక బంగ్లాదెశ్ కన్నా వెనకబడింది.
భారత దేశంలో తలసరి సగటు స్థూల జాతీయ ఉత్పత్తి విలువ $ 3296. వియత్నాం లో $ 2953. కానీ మానవ అభివృద్ధి సూచికలో భారత దేశం వియత్నాం కన్నా వెనకబడింది. వియత్నాం లో మానవ అభివృద్ధి స్థాయి విలువ 0.593 కాగా భారత దేశంలో 0.547 మాత్రమే వున్నది. లైంగిక అసమానత స్థాయి విలువ వియత్నాం లో 0.305 కాగా భారత దేశంలో అంతకన్న ఎక్కువగా 0.617 వున్నది. బహుముఖ దారిద్ర్య సూచిక వియత్నాంలో 0.084 కాగా భారత దేశంలో అంతకన్నా ఎక్కువగా 0.283 వున్నది. వాతావరణ సమతుల్యత సూచిక వియత్నాంలో 59.0 వుండగా భారత దేశంలో తక్కువగా 48.3 వున్నది. జీవన సంతృప్తి స్థాయి సూచిక వియత్నాంలో 5.3 కాగా భారత దేశంలో అంతకన్నా తక్కువగా 5.0 గా వున్నది. వయోజన అక్షరాశ్యత వియత్నాంలో 92.8 శాతం కాగా భారత దేశంలో 62.8 శాతమే  వున్నది.
తలసరి స్థూల జాతీయ ఉత్పత్తి భారత దేశం కన్నా వియత్నాం లో తక్కువగా వున్నది. అయినప్పటికి అది మానవ అభివృద్ధి విషయంలొ భారత దేశం కన్న ఎక్కువ స్థాయిని ఎలా సాధించగలిగింది? వియత్నాం ప్రభుత్వము స్థూల జాతీయ ఉత్పత్తిలో 7.2 శాతన్ని విద్య కొసం, మరొ 7.2 శాతాన్ని ఆరోగ్యం కొసం ఖర్చు పెడుతున్నదికానీ ఇందుకు విరుద్ధంగా భారత దేశపు ప్రభుత్వము స్థూల జాతీయ ఉత్పత్తిలో విద్యపై 4.2 శాతాన్ని, ఆరోగ్యంపై మరో 4.2 శాతాన్ని మాత్రమే  ఖర్చు పెడుతున్నది.
కాబట్టి సామాన్య ప్రజానీకం కోసం విద్య, వైద్యం,పారిశుద్ధ్యం తదితరాలకు బద్జెట్టులో  ప్రభుత్వము మరింత  ఎక్కువగా కేటాయించి దానిని సద్వినియోగం చేస్తేనే భారత  దేశం లో మానవ  అభివృద్ధి సూచికలో చెప్పుకోదగిన ప్రగతి సాధ్యమవుతుంది.
----పి.అశోకబాబు, ఉప ప్రధాన కార్యదర్శి, బి ఎస్ ఎన్ ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ 

No comments:

Post a Comment