Saturday, November 5, 2011

బకాసురిడి భోనానికి బకాసురుడే మిగిత్తే!


అందరూ అయిపోయారు! బకాసురిడి భోజనానికి బకాసురుడే మిగిలాడు!! అలాంటి సీన్‌ ఊహించుకుంటూంటే ఎంత థ్రిల్లింగ్‌గా ఉంటుంది? వాణ్ణి వాడే తింటాడా? తినగలడా? తినగలిగినా చచ్చిపోతాడు. తినకపోతే ఆకలికి చచ్చిపోతాడు. వెరసి, చావటం గ్యారంటీ! ఇదీ నేటి అమెరికా పరిస్థితి. ఇక 'వాల్‌స్ట్రీట్‌' కథ చదవండి
చినికి, చినికి గాలి వాన కావటం అంటే ఇదే. అమెరికాలోని వాల్‌స్ట్రీట్‌లో సెప్టెంబరు 17న కొద్ది మందితో మొదలైన ముట్టడి అనతి కాలంలోనే ప్రపంచ వ్యాపితంగా 86 దేశాల్లో 1500 పట్టణాలకు దావానలంలా విస్తరించింది. అమెరికాలో ఇప్పటికీ 190కి పైగా పట్టణాల్లో ప్రదర్శనలు జరుగుతున్నాయి. ''మన దేశంలో రోజూ సమ్మెలు, రాస్తారోకోలు! ఛీఛీ'' అని విసుక్కునేవారు, ''ఎంచక్కా అమెరికాలో నైతేనా!!'' అని దీర్ఘాలు తీసేవారు బోలెడుమంది. పాపం! ఇటువంటి మధ్యతరగతి అమెరికా 'ఫ్యాన్స్‌'కు నిరాశ మిగుల్చుతూ నేడు అమెరికా అట్టుడుకుతోంది. గత కొన్ని సంవత్సరాల నుండి కార్మికవర్గం, పెన్షనర్లు పెద్దఎత్తున పోరాడుతున్నారు. చాలా సందర్భాల్లో సంస్కరణ వాద సంఘాలైన ఏఎఫ్‌ఎల్‌ - సిఐఓ వంటివే ఆ పోరాటాలకు నాయకత్వం వహించాల్సి వచ్చింది. ''రూల్స్‌'' అతిక్రమించకుండానే అవి జరిగాయి. నేటి స్థితి వేరు. ఉరకలెత్తే యువరక్తం. ప్రభుత్వ గీతలను దాటుతున్నారు. ఒక్కరోజే వాల్‌స్ట్రీట్‌ లో 700 మందిని ట్రాఫిక్‌కు అంతరాయం కల్గించారన్న ఆరోపణపై అరెస్ట్‌ చేసినప్పుడు ''వాల్‌స్ట్రీట్‌ పెద్దలు, కంపెనీల సి.ఇ.ఓ. లు కోట్లమంది జీవితాలను అతలాకుతలం చేస్తే వారికి శిక్షేంటి?'' అని ప్రశ్నిస్తున్నది నేటి అమెరికన్‌ ప్రజ. ముఖ్యంగా యువత.
99 శాతానికి కోపం ఎందుకొచ్చింది?
''మేము 99 శాతం!'' ఇది నేడు అమెరికాలో విస్తారంగా ప్రచారంలో ఉన్న నినాదం. ''దారీ, తెన్నూ లేని కొందరు కుర్రాళ్ళ ఆకతాయి చేష్ట''గా వాల్‌స్ట్రీట్‌ ముట్టడిని మొదట్లో కొట్టేశారు. నిర్ధిష్ట లక్ష్యంతోనే నేడీ ముట్టడి నెలన్నరగా సాగుతున్నది. ఆ దేశంలో విస్తారంగా విద్యాధికులైన, నిరుద్యోగ, అక్షరాశ్యులుండటం, ఇంటర్‌ నెట్‌ వినియోగం 78శాతం ఉండటం కూడ ఈ ఉద్యమ వ్యాప్తిలో, సమాచార మార్పిడిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.
25 ఏళ్ల కన్నా తక్కువ వయసున్న వారిలో నిరుద్యోగం 13-25 శాతానికి చేరింది. మొత్తం నిరుద్యోగులు 9.1శాతం (కోటీ40లక్షల) మంది. చదువు కోసం విద్యార్ధులు చేస్తున్న అప్పు విపరీతంగా పెరిగిపోతున్నది. గ్రాడ్యుయేషన్‌ కోసం చేసిన అప్పు ప్రతి విద్యార్ధినెత్తిన సగటున 20వేల డాలర్లుంది. అది తీసుకున్న అప్పులో ప్రస్తుతం 15 శాతం ఉంది. మరోపక్క వాల్‌స్ట్రీట్‌ రాయితీలు కొనసాగుతూనే ఉన్నాయి. 1980-2005 మధ్య అమెరికాలో పెరిగిన వ్యక్తిగత ఆదాయాల్లో 80శాతం ఆ ఒక్క శాతం మందికే చేరాయి. నేడు జాతీయదాయంలో 25 శాతం సదరు ఒక్క శాతమే చేజిక్కించుకుంటోంది. వాల్‌స్ట్రీట్‌లోని కంపెనీలు తన సి.ఇ.ఓ.లకు బోనస్‌లు వగైరా గతంలో ఎప్పుడూ లేనంతగా పందారం చేసుకున్నారు. కోట్లాది డాలర్ల ప్రజల సొమ్ముతో బుష్‌ ప్రభుత్వం ఆదుకున్న గోల్డ్‌మాన్‌ శాక్స్‌ సంస్థ సి.ఇ.ఓ. ల్లాయిడ్‌ బ్లాంక్‌ ఫీన్‌ 2010లో ఒక కోటి 32 లక్షల డాలర్లు జీతం తీసుకున్నాడు.
తమ కళ్ళముందే కనబడుతున్న ఈ లూటీ అమెరికన్‌ ప్రజానీకాన్ని కదిలించివేశాయి.
అందుకే యువకులు, విద్యార్ధులూ ప్రారంభించిన ఈ ఉద్యమంలో క్రమంగా కార్మికులు, లే ఆఫ్‌కు గురైన కార్మికులు పాల్గొన్నారు. ట్రాన్స్‌పోర్టు వర్కర్స్‌ యూనియన్‌, యునైటెడ్‌ నర్స్‌ల యూనియన్‌ వంటివి వచ్చి చేరాయి. రెండున్నర కోట్ల మంది సభ్యులున్న ఏ.ఎఫ్‌.ఎల్‌ - సి.ఐ.ఓ పదం కలిపింది.
మౌళిక సమస్యలను చర్చనీయాంశం చేసిన ఉద్యమం
పెట్టుబడిదారీ విధానానికి సంబంధించి అనేక మౌలిక ప్రశ్నలను ఈ ఉద్యమం లేవనెత్తింది. అమెరికాలో నేడు జరుగుతున్న చర్చ ఆహ్వానించ తగ్గదే కాక అనుసరణీయమైంది. ''లేదు, మీ సంక్షోభానికి మూల్యం మేము చెల్లించం!'' అన్న నినాదం 2008లో ఇటలీలో ప్రారంభమై, గ్రీస్‌, ఫ్రాన్స్‌, ఐర్లాండ్‌లు తిరిగి, నేడు సంక్షోభ కారకురాలైన అమెరికాలో ప్రతిధ్వనిస్తున్నది. మాకు డెమోక్రసీ (ప్రజాస్వామ్యం) కావాలి కాని ''కార్పొరేటోక్రసీ'' వద్దు! అన్ననినాదం కూడా అమెరికాలో మారుమ్రోగుతోంది. ఇళ్ళులేక పోవడం, ఉపాధి దొరక్కపోవడం, అభద్రత మొదలైనవన్నీ పెట్టుబడి దారీ విధానం వల్లే వస్తున్నాయి. కాబట్టి పెట్టుబడిదారీ విధానం డౌన్‌ డౌన్‌! అంటున్నారు అమెరికాలోని యువకులు, కార్మికులు. అసలు, ప్రధాన నినాదమైన ''మేము 99 శాతం'' అన్నదే అమెరికన్‌ ప్రజానీకాన్ని పెద్దఎత్తున విజ్ఞానవంతులను చేస్తున్నది.
క్షేత్ర స్థాయిలో జరిగిన పోరాటాల వల్ల వారి ప్రభుత్వం ఏయే హక్కులు ఇచ్చిందో ''వాల్‌స్ట్రీట్‌ ముట్టడి''లో మననం చేసుకుంటు న్నారు. రాజ్యాంగంలో వచ్చిన మార్పులు గుర్తు చేసుకుంటున్నారు. 1913లో 16వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆదాయపన్ను విధించటం మొదలైంది అమెరికాలో. 1920లో మహిళలకు ఓటుహక్కు వచ్చింది. వీటి గురించి చర్చించిన 'జనరల్‌ అసెంబ్లీ' 1868లో నల్లజాతి ప్రజల కోసం చేయబడ్డ 14 సవరణను తర్వాతి కాలంలో ఏ విధంగా పెట్టుబడిదారీ వర్గం తనకు అనుకూలంగా మలుచుకుందో కూడ చెప్పుకున్నారు.
1886 లో (అంటే చికాగోలో కార్మికుల రక్తం చిందిన సం||) ఒక కేసులో ఈ 14వ సవరణకు ఒక కోర్టు గుమాస్తా ''మరో సవరణ'' ప్రతిపాదించాడు. ''రాజ్యాంగంలో చేయబడ్డ ఈ14వ సవరణ వ్యక్తులకే కాక కార్పొరేషన్లకు కూడ వర్తిస్తుందని, వాటికి కూడ సమాన అవకాశాలు కల్పించాలని కోర్టు భావిస్తున్నది'' అని ఒక నోట్‌రాశాడు. ఆ కేసు తీర్పు అసలా విషయాన్నే ప్రస్తావించ లేదు. కాని ఆ తర్వాత మరో కేసులో జడ్జి విలియమ్‌ డగ్లస్‌ ''శాంతక్లారా కేసు మన దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన కేసు. కార్పొరేషన్లు ఇక నుండి రాజ్యాంగబద్ధ హక్కులు కల్గి ఉంటాయి'' అని తీర్పు చెప్పాడు. ఈ వరసలోనే 2010లో కార్పొరేషన్లు ప్రజల్ని ప్రలోభపెట్టేందుకు ఇష్టమొచ్చినంత మొత్తాల్ని ఎన్నికల్లో ఉపయోగించుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. 2008 లో ''ఫార్ట్యూన్‌ 100'' కంపెనీల లాభం 60వేల కోట్ల డాలర్లు. వారి లాభాల్లో ఒక్క శాతాన్ని ఎన్నికల్లో వెచ్చించినా 600 కోట్ల డాలర్లు. ఇది 2008 ఎన్నికల్లో మొత్తం పార్లమెంటు సభ్యులందరూ పెట్టిన ఖర్చుకంటే ఎక్కువ. ఇటువంటి ఎన్నో మౌళిక సమస్యలను ఈ ఉద్యమం ముందుకు తెస్తున్నది.
కొన్ని సృజనాత్మక పద్ధతులు
ప్రధాన మీడియా ఈ వాల్‌స్ట్రీట్‌ ఆక్రమణకు బ్లాక్‌ఔట్‌ చేస్తుందని ఊహించే దాని నిర్వాహకులు ఇంటర్‌నెట్‌ను అటు ప్రచారానికే కాక ఇటు ఆర్గనైజర్‌ గాకూడా వాడుతున్నారు. మొదట్లో పట్టించుకోని మీడియా (మన దేశంతో సహా) తర్వాత తప్పనిసరై ప్రసారం చేస్తున్నది.
వాల్‌స్ట్రీట్‌లోని జుకొట్టిపార్క్‌ను మొట్టమొదట ఆక్రమించుకుని దానికి ''లిబర్టీ ప్లాజా' అని పేరు పెట్టుకున్నారు. వాల్‌ స్ట్రీట్‌ ముట్టడికి సంఘీభావంగా అక్టోబర్‌ 15 విశ్వ వ్యాపితంగా ఇచ్చిన పిలుపు ''సమిష్టిగా ఆక్రమిద్దాం'' (ఆక్యుపై టుగెదర్‌) ఈ పిలుపులోనే తమ హక్కును తాము తిరిగి పొందాలన్న కాంక్ష బలంగా వినిపించింది.
న్యూయార్క్‌ లోని వాల్‌స్ట్రీట్‌ సమీపంలో మైకులు వాడటం నిషిద్ధం. ఉపన్యాసకులు మధ్యలో నిలబడి బిగ్గరగా చెప్పే మాటలను అతను / ఆమె చుట్టూ వున్న వారు బిగ్గరగా ఒకేసారి అరవడం వల్ల మరో వంద / రెండు వందల మందికి వినపడ్తుంది. వాళ్ళు మళ్ళీ అదే పద్ధతి అనుసరించడంతో తర్వాత వేల మందికి వినిపిస్తుంది. నిశ్చలంగా వున్న నీటిలో ఒక రాయి వేస్తే చుట్టూ తరంగాలు వెళ్ళినట్లు చేస్తున్నారు. దీన్నే ''మానవ మైక్రో ఫోన్‌'' లంటున్నారు.
వాళ్ళు పోస్టర్లు రూపొందిస్తున్న తీరు అద్భుతం. ''యుద్ధం ఆ ఒక్క శాతాన్ని మేపుతుంది'', ''నేను పన్నులు కడ్తున్నా, మరి బహుళజాతి కంపెనీలు కడ్తున్నాయా?'' ''వాళ్ళకి బెయిలవుట్‌ లిచ్చారు, మమ్మల్ని తెగనమ్మారు'', ''మేము చాలామందిమి, వారు కొద్దిమందే'' వంటి పోస్టర్లు నేడు అమెరికాలో దర్శనమిస్తాయి. మిచిగన్‌లోని టీచర్ల సంఘం ఇటీవల ఒక వీడియో విడుదల చేసింది. 180 కోట్ల డాలర్లు ఇటీవల కార్పొరేట్‌ పన్నులు తగ్గించిన ప్రభుత్వం విద్యపై 100 కోట్ల డాలర్లు ఖర్చు తగ్గించినందుకు నిరసనగా కంపెనీ సి.ఇ.ఓ. లు నేరుగా క్లాస్‌ రూంలోకి వెళ్ళి పిల్లలు రాసుకుంటున్న బల్లల్ని ఎత్తుకు పోయే సీన్‌ని ఆ వీడియోలో చూపించారు. ఇటువంటి ఎన్నో సృజనాత్మక పద్ధతులు ఈ ఉద్యమంలో ఉన్నాయి.
కార్పొరేట్‌ నియంతలపై తిరుగుబాటు !
పశ్చిమాసియా ఉద్యమాలతో తాము ప్రేరణ పొందినట్లు ఈ వాల్‌స్ట్రీట్‌ ముట్టడి నిర్వాహకులు చెప్పుకుంటున్నారు. ఇది అమెరికాలో ''తెహ్రీర్‌స్క్వేర్‌'' (ఈజిప్టు తిరుగుబాటుకు కేంద్రం) అంటున్నారు. అది ఈజిప్టు అయినా, లిబియా అయినా, ఇరాక్‌ అయినా 20-30 సంవత్సరాలుగా అధికారం చెలాయించిన ''నియంతలను'' కూలదోసేందుకు ఆయా దేశాల ప్రజలు తిరుగుబాట్లు చేశారని అమెరికా ప్రధాన వార్తా సంస్థ అసోసియేటెడ్‌ ప్రెస్‌ వంటివి వార్తను ''తయారు చేస్తే'' అన్ని దేశాల మీడియా దాన్నే మనకు చెప్పింది. చూపింది. మరి ప్రతి నాలుగేళ్ళకొకసారి ఎన్నికలు జరుగుతూ, ''అత్యంత ప్రజాస్వామ్య'' దేశంగా చెప్పుకుంటున్న అమెరికాలో ''తెహ్రీర్‌ స్క్వేర్‌'' ఎందుకు పుట్టింది? ఈ ఉద్యమంలో బలహీనతలు కూడ అనేకం వున్నాయి. ''అమెరికాలో కార్పొరేట్‌ శక్తులు లేకుండానే పెట్టుబడిదారీ విధానాన్ని నిర్మించవచ్చు'' అని కొందరు విద్యాధికులు నమ్ముతున్నారు. సరిగ్గా దశాబ్దం క్రితం 1999లో సియాటిల్‌లో సాగినట్లే ''మాకు నాయకులు లేరు'' ఇంటర్నెట్‌ ద్వారానే మేము ఎంతటి డిమాండ్లైనా సాధిస్తామ''నే ఆలోచన కొందరికుంది. (నోమీక్లీన్‌ పుస్తకం ఫెన్సెస్‌ Ê విండోస్‌ 'పరిచయం' ఈ విశ్వాసంతోనే ప్రారంభమౌతోంది.) ''పెట్టుబడిదారీ విధానాన్ని కూలదోయండి కార్మిక రాజ్యాన్ని నెలకొల్పండి'' అని నేడు అమెరికాలో నినదిస్తున్న వారు బహుళ జాతి గుత్త కంపెనీల స్వామ్యంలో వున్న, ప్రపంచ సామ్రాజ్యవాదానికి మొనగాడుగా వున్న అమెరికాలో పెట్టుబడిదారీ విధానాన్ని కూలదోయటం అంత తేలికా?!ఈ సాధ్యాసాధ్యాల మాట అలా ఉంచితే ఈ ఉద్యమం పెట్టుబడిదారీ విధాన డొల్లతనాన్ని బహిర్గత మొనర్చిందనేది అందరూ అంగీకరించే సార్వత్రిక సత్యం.
ఆర్‌. సుధాభాస్కర్‌ (రచయిత సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)(Prajasakti 5-11-2011)

No comments:

Post a Comment