Sunday, August 11, 2013

చరిత్ర చౌరస్తాలో చౌకబారు రాజకీయాలు

ఏది ఏమైనా ఇప్పుడు ఆంటోనీ కమిటీ అన్నది కాంగ్రెస్‌ పల్లవిగా ఉంది. దాని పట్ల ఎవరి వైఖరి వారు తీసుకోవచ్చు. ప్రభుత్వాలకు చెప్పదలచుకున్నది చెప్పొచ్చు. కానీ తాము ప్రకటించిన రాజకీయ విధానం నుంచి తామే వెనక్కు పోయి ప్రజల మనోభావాల పేరిట ఎడతెగని వివాదాలను సాగలాగడం ఎవరికీ మంచిది కాదు. ఈ క్రమంలో పై చేయి కోసం పోటాపోటీ నాటకాలాడుతూ చౌకబారు వాగ్యుద్ధాలకు దిగడం, ప్రాంతాల మధ్య వాతావరణాన్ని దెబ్బతీయడం అసలే మంచిది కాదు. రాజకీయ, రాజ్యాంగ అంశాలపై స్థానిక సమ్మెలతో సాధించేది స్వల్పమని కూడా అర్థం చేసుకోవాలి. ప్రజలు కూడా వాస్తవ పరిస్థితిని, గత నాలుగేళ్ల అనుభవాలను గమనంలో ఉంచుకుని ఎవరికి, దేనికి ఎంత విలువ ఇవ్వాలో నిర్ణయించుకోవాలి.

ఆంధ్రప్రదేశ్‌ విభజనకై కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ విధాన నిర్ణయం ప్రకటించిన తర్వాత గడచిన పది రోజులలోనూ ఆ పార్టీతో సహా ప్రధాన రాజకీయ పక్షాలు పిల్లిమొగ్గలు కొనసాగిస్తున్నాయి. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి రంగంలోకి దిగి విభజన వల్ల సమస్యలు తీవ్రమవుతాయని, వాటిని పరిష్కరించిన తర్వాతనే అడుగు ముందుకేయాలనీ ప్రకటించారు. తాను కూడా సమైక్యాంధ్ర కోసం విభజనకు వ్యతిరేకంగా సంతకాలు చేశానని వెల్లడించారు. ఆయన ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న దామోదర రాజ నరసింహ దళపతి కుట్రదారు కాకూడదంటూ బహిరంగ తిరుగుబాటు చేశారు. మామూలుగా మాట్లాడని కేంద్ర మంత్రి జైపాల్‌ రెడ్డి, పిసిసి మాజీ అధ్యక్షుడు డి శ్రీనివాస్‌, ఎంపి వి హనుమంతరావు, తదితరులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మరో వైపున కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు రాజీనామాకు సిద్ధమేనని గతంలో తాను చేసిన రాజీ వ్యాఖ్యలను సవరించుకుంటే ఉండవల్లి అరుణ్‌కుమార్‌, లగడపాటి రాజగోపాల్‌, తదితర నేతలు విభజనవాదులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పిసిసి అధ్యక్షులు బొత్స సత్యనారాయణ కూడా సమైక్యాంధ్ర తమ నినాదమని గట్టిగా చెప్పారు. అధిష్ఠానం మాటకు కట్టుబడి ఉంటామని చెప్పిన వీరంతా ఈ విధంగా ధిక్కార స్వరం వినిపిస్తుంటే సదరు ఢిల్లీ పెద్దలు మాత్రం ఇదంతా పెద్ద సమస్య కాదన్నట్టు తేలిగ్గా తీసేస్తున్నారు. ఇలాటి వాదనలన్నీ వినడానికి ఆంటోనీ నాయకత్వాన ఒక కమిటీని వేశామని, దాని ముందు వీటిని వివరించవచ్చని అవకాశమిచ్చారు. ముఖ్యమంత్రి మీద చర్యలేమీ ఉండబోవని కూడా దిగ్విజరు సింగ్‌ తేల్చేశారు.

పైకి చాలా గజిబిజిగా కనిపించే ఈ వ్యవహారం వాస్తవానికి కాంగ్రెస్‌ మార్కు రాజకీయాల ప్రతిబింబం. రెండు ప్రాంతాలలోనూ తామే ముందుండాలనే తాపత్రయంతో ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వ నేతలను ఇష్టానుసారం మాట్లాడ్డానికి అనుమతించారన్నది ఇక్కడ తేటతెల్లమవుతున్న సత్యం. తమ పార్టీ తరపున ఆంటోనీ కమిటీ వేసి దానికి అందరి అభిప్రాయాలూ చెప్పుకోవాలనడం కూడా ప్రజాస్వామ్య ప్రక్రియ అనిపించుకోదు. నదీజలాలు, ఉద్యోగాలు, మరీ ముఖ్యంగా హైదరాబాదు ప్రతిపత్తిపై అనేక సందేహాలు సృష్టించి వాటికి అధికారిక సమాధానాలు ఇవ్వకుండా ఆంటోనీ కమిటీకి మొర పెట్టుకోమని చెప్పడం అర్థం లేని విషయం. మంత్రులతో సహా ఒక వైపున తమవారే రాజీనామాలు సంధిస్తుంటే, ముఖ్యమంత్రి కూడా భిన్న స్వరం వినిపిస్తుంటే మిగిలిన పార్టీలపై విమర్శలు గుప్పించి తప్పించుకోవడం ఎలా కుదురుతుంది? అందరిలో ఏకాభిప్రాయం వచ్చాకనే నిర్ణయం తీసుకుంటామన్న కాంగ్రెస్‌ పార్టీలోనే ఏకాభిప్రాయం లేకపోగా ఆ గుద్దులాటను అది అందరిపైనా రుద్దడం హాస్యాస్పదం. దిగ్విజరు సింగ్‌ రోజుకో విధంగా చేస్తున్న గీతా ప్రవచనాల సారం ఏమిటో తల పండిన పండితులకు కూడా బోధపడటం లేదు. మాట ఇచ్చాం గనక తప్పేది లేదు అన్న మాట తప్ప మరో అడుగు పడిందీ లేదు. రాష్ట్ర విభజనతో ముడిబడిన రాజ్యాంగ, రాజకీయ అంశాలపై సాధ్యమైనంత స్పష్టత ఇచ్చి ప్రజల సందేహాలను తొలగించే బదులు కాంగ్రెస్‌ ప్రయోజనాల పరిరక్షణకే పాకులాడటం ఇక్కడ పరిస్థితిని క్లిష్టం చేస్తున్నది. ఉదాహరణకు హైదరాబాదుకు ఢిల్లీ తరహా ఆలోచన అన్నారు అంటే ఎలా ఉంటుందనే సందేహం ఉభయ పక్షాలలోనూ ఉంది. కనీస వివరణ రావడం లేదు. నదీ జలాలపై సమస్యలే ఉండవని కొందరు, చాలా ఉంటాయని కొందరు వాదిస్తున్నారు. కేంద్రం ఇస్తున్న వివరణ నాస్తి. ఇదంతా కావాలనే ఉద్రిక్తత పెంచే ప్రయత్నమా అని సందేహాలు కలగడానికి కారణమిదే.

అధికార పక్షం సంగతి ఇలా ఉంటే తెలుగుదేశం విషయం కూడా భిన్నం కాదు. వర్కింగ్‌ కమిటీ ప్రకటన వచ్చిన తర్వాత 36 గంటల పాటు చంద్రబాబు నాయుడు పెదవి విప్పలేదు. ఆ తర్వాత కొత్త రాజధానికి అయిదు లక్షల కోట్ల రూపాయల వరకూ అవసరమన్న అంశంపై కేంద్రీకరించి మాట్లాడారు. తక్కిన రాజకీయాంశాలు తర్వాత చెబుతామన్నారు. ఆయన ఏమైనా చెప్పేలోపలే ఆ పార్టీ సీమాంధ్ర ఎంఎల్‌ఎలు, ఎంపిలు రాజీనామాలు ప్రకటించారు. పార్టీ విధానానికి వ్యతిరేకం కాదంటూనే కేంద్రం ఏకపక్షంగా వ్యవహరించిందనే ఆరోపణతో ముందుకొచ్చారు. ఇలా పది రోజులు గడిచిన తర్వాత, ఇంకా చెప్పాలంటే ముఖ్యమంత్రి కిరణ్‌ వ్యాఖ్యల తర్వాత చంద్రబాబు ప్రధానికి లేఖ సంధించారు. సీమాంధ్ర ప్రజల భయాందోళనలుగా చెబుతున్నవి పొందుపరుస్తూ స్పష్టత కోసం ప్రభుత్వం తరపున ఏదైనా ప్రకటన చేయాలని కోరారు. వర్కింగ్‌ కమిటీ కాంగ్రెస్‌కు సంబంధించింది గనక తాము ప్రధానిని అడగడంలో తప్పేముందని తెలుగుదేశం నాయకులు వాదిస్తున్నారు గాని నిజానికి సీమాంధ్ర ప్రాంతంలో వైసిపి ముందుకు పోతున్నట్టు, తాము ఇరకాటంలో పడుతున్నట్టు పార్టీ వారి నుంచి వచ్చిన ఒత్తిడి వల్లనే చంద్రబాబు ఈ లేఖా వ్యూహం ప్రారంభించారని అర్థమవుతూనే ఉంది. తెలంగాణా ప్రాంతంలో తెలుగు దేశం రెండవ స్థానంలోనైనా వస్తుంది గాని మౌనం వల్ల తాము పూర్తిగా దెబ్బ తినిపోతామని వారు గగ్గోలు పెడుతుంటే అధ్యక్షుడు ఎలా ఉపేక్షిస్తాడని ఒక నాయకుడు నాతో అన్నారు. ఇది గతంలో ఆయన తీసుకున్న యూ టర్న్‌కు మరో రూపం మాత్రమేనని ప్రత్యర్థులు విమర్శలు మొదలు పెట్టారు. ఈ లోగా ఆత్మగౌరవ యాత్ర పేరిట మరో పర్యటన ప్రారంభించాలనుకుంటున్నట్టు సూచనలు వెలువరించారు. ఇటీవల పంచాయతీ ఎన్నికలతో కాస్త మెరుగుపడిందనుకున్న పార్టీ పరిస్థితి ఈ పరిణామాలతో మొదటికి వచ్చిందనేది తెలుగుదేశంలో కనిపించే ఆందోళన. అయితే దాన్ని అధిగమించడానికి స్పష్టమైన విధానాలతో గట్టిగా నిలబడటం తప్ప మరింత తడబాటుకు లోనవడం, మరోసారి తర్జనభర్జన పడటం ఎలా ఉపయోగపడుతుంది? విశ్వసనీయత మరింత దెబ్బతినొచ్చు.

ఇక రాజీనామాలు ప్రారంభించిన వైసిపి తన దూకుడు మరింత పెంచింది. అసలు వారి రాజీనామాలు సమైక్యత కోసమని చెప్పకుండా కేంద్రంపై దాడితో సరిపెట్టిన వైసిపి తెలంగాణాలో పరిణామాలు చూసిన కొద్దీ మరింత ముందుకే పోవాలని భావిస్తున్నట్టు కనిపిస్తుంది. ఈ క్రమంలో పార్టీ అధినేతలైన జగన్‌, విజయమ్మ కూడా రాజీనామా చేశారంటే ఈ వ్యూహం ఎంత ఉధృతంగా అమలు చేయాలనుకుంటున్నదీ తెలుస్తుంది. ప్రాంతీయ పార్టీగా చక్రం తిప్పాలనుకున్న వైసిపి ఉప ప్రాంతీయ పార్టీగా లేక రేపు ఏర్పడనున్న కొత్త రాష్ట్రానికే పరిమితమైన పార్టీగా తన స్థానాన్ని కుదించుకోవడానికి సిద్ధమైంది. అధినేత ఇప్పటికీ జైలు నుంచి విడుదల కాకపోవడం వల్ల ఎదురైన ఇబ్బందిని ప్రాంతీయ పాత్రతో అధిగమించాలని పాచికలు వేస్తున్నది. వాస్తవానికి వైసిపి మొదటి నుంచీ తెలంగాణా సమస్యపై కేంద్రమే నిర్ణయం తీసుకోవాలని దాటవేత వైఖరిని ప్రదర్శించింది. తీరా ఆ సమయం వచ్చాక అడ్డం తిరిగింది. పోనీ స్పష్టంగా సమైక్యత అని చెప్పిందా అంటే అదీ లేదు. మొత్తంపైన ఇది ఒక ప్రాంతంలో బలం పెంచుకునే రాజకీయ క్రీడ మాత్రమేనని స్పష్టమై పోయింది. అయితే ఆ పార్టీ నేతలు తమ పాత్రను సమర్థించుకుంటూ ఇతరులపై విరుచుకుపడటం ఇందులో అదనపు విశేషం.
ఈ సమయంలో నిజానికి చాలా సంతోషంగా ఉండాల్సిన టిఆర్‌ఎస్‌ నేతలు కూడా ఆచితూచి అడుగేస్తున్నారంటే కాంగ్రెస్‌ ఎత్తుగడల పట్ల వారికి ఉన్న ఆందోళనే కారణం. తెలంగాణా ఏర్పాటు ప్రకటిస్తే పార్టీని విలీనం చేస్తామని కెసిఆర్‌ చాలాసార్లు ప్రకటించారు. అది తమ రాజకీయ త్యాగానికి గుర్తు అని కూడా నేతలు చెప్పేవారు. అయితే కాంగ్రెస్‌ కమిటీ అలాటి నిర్ణయం ప్రకటించినప్పటికీ టిఆర్‌ఎస్‌ ఆశించినట్టు ఆ సంప్రదింపులలో, ప్రక్రియలో వారిని భాగస్వాములను చేయలేదు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్టు ఇదంతా వైఎస్‌ రాజశేఖ రెడ్డి ప్రారంభించాడన్న వాస్తవాన్ని ముందుకు తెచ్చి టిఆర్‌ఎస్‌నూ వైసిపినీ ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేసింది. విలీనం కోసం ఇచ్చిన మాటను గుర్తు చేస్తూనే సేనాని లేకుండా సేనను కలిపేసుకున్నట్టు టిఆర్‌ఎస్‌ కీలక నేతలకు గాలం వేస్తున్నది. ప్రకటన వచ్చిన రోజునే విజయశాంతి, తర్వాత విజయరామారావు వంటి వారు బారులు తీరారు. పంచాయతీ ఎన్నికలలోనే ప్రభావం చూపిన ఈ ఎత్తుగడ విభజన నిర్ణయం తర్వాత టిఆర్‌ఎస్‌కు మరీ గుదిబండగా మారింది. ముందే మాట్లాడితే కెసిఆర్‌ నాయకత్వాన్ని సంతృప్తి పర్చడానికి చాలా మూల్యం చెల్లించవలసి ఉంటుంది గనక ఆయన అనివార్యంగా తమలోకి వచ్చే వాతావరణం కల్పించాలన్నది కాంగ్రెస్‌ ఎత్తుగడగా ఉంది. ఈ క్రమంలో అసౌకర్యానికి గురైన కెసిఆర్‌ ఒక దశలో గత తరహా వ్యాఖ్యలు చేసి విమర్శలు కొని తెచ్చుకోవడమే గాక కాస్త ఉద్రిక్తతకూ కారణమైనారు. తర్వాత సర్దుకున్నప్పటికీ ఆదిలోనే హంసపాదులా జరగాల్సిన నష్టం జరిగింది. ఈ కారణం చేతనే ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై తీవ్ర స్పందన అంటూనే హెచ్చరికలు, బెదిరింపుల వంటి వాటికి పోకుండా అవహేళనలు, అంకెలకే పరిమితమైనారు. కెసిఆర్‌ కన్నా దామోదర రాజ నరసింహ వ్యాఖ్యలే ఒక రకంగా తీవ్రంగా ఉన్నాయి.

పాలక పార్టీలకే అలవాటైన ద్వంద్వ విధానం కొన్ని వామపక్ష కార్మిక సంఘాలకు కూడా పాకడం ఈసారి మీడియాను ఆకర్షించింది. ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రెండు చోట్ల రెండు రకాలుగా సమ్మె నోటీసులివ్వడం విచిత్ర పరిణామం. తెలంగాణాపై తగిన కసరత్తు లేకుండా కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ ప్రకటన చేసిందని వ్యాఖ్యానించిన సిపిఐ రాష్ట్ర విస్తృత సమావేశం విడుదల చేసిన సుదీర్ఘ నివేదిక ఆసక్తి కలిగించింది. విభజనను వ్యతిరేకిస్తూ వచ్చిన మజ్లిస్‌ కేంద్ర ప్రకటన తర్వాత మద్దతు తెలిపింది. మొదట్లో కాస్త మెతగ్గా మాట్లాడిన కేంద్ర మంత్రులు తర్వాత గొంతు పెంచారు. సిపిఎం రాష్ట్ర కమిటీ మాత్రం అన్ని పార్టీలూ రెండు ప్రాంతాల్లో ఒకే వైఖరి తీసుకుని చట్టసభల్లో సమస్య పరిష్కారానికి ప్రయత్నించాలే తప్ప ప్రజల మధ్య వైషమ్యాలు పెంచరాదని కోరింది. తొలి భాషా రాష్ట్ర విభజన ద్వారా కాంగ్రెస్‌ దేశంలో మరిన్ని రాష్ట్రాల విచ్ఛిన్నానికి తెర తీసినట్టయిందని సిపిఎం పొలిట్‌ బ్యూరో వ్యాఖ్యానించింది. అందుకు తగినట్టుగానే ఇరవైకి పైగా రాష్ట్రాలలో విభజన కోర్కెలు ముందుకొచ్చినట్టు హోం శాఖ ప్రకటించింది.
ఏది ఏమైనా ఇప్పుడు ఆంటోనీ కమిటీ అన్నది కాంగ్రెస్‌ పల్లవిగా ఉంది. దాని పట్ల ఎవరి వైఖరి వారు తీసుకోవచ్చు. ప్రభుత్వాలకు చెప్పదలచుకున్నది చెప్పొచ్చు. కానీ తాము ప్రకటించిన రాజకీయ విధానం నుంచి తామే వెనక్కు పోయి ప్రజల మనోభావాల పేరిట ఎడతెగని వివాదాలను సాగలాగడం ఎవరికీ మంచిది కాదు. ఈ క్రమంలో పై చేయి కోసం పోటాపోటీ నాటకాలాడుతూ చౌకబారు వాగ్యుద్ధాలకు దిగడం, ప్రాంతాల మధ్య వాతావరణాన్ని దెబ్బతీయడం అసలే మంచిది కాదు. రాజకీయ, రాజ్యాంగ అంశాలపై స్థానిక సమ్మెలతో సాధించేది స్వల్పమని కూడా అర్థం చేసుకోవాలి. ప్రజలు కూడా వాస్తవ పరిస్థితిని, గత నాలుగేళ్ల అనుభవాలను గమనంలో ఉంచుకుని ఎవరికి, దేనికి ఎంత విలువ ఇవ్వాలో నిర్ణయించుకోవాలి. ముఖ్యంగా సంకుచిత రాజకీయ వ్యూహాలకు, ఎన్నికల రాజకీయాలకు తమను సమిధలుగా ఉపయోగించే వారి పట్ల జనం అప్రమత్తంగా ఉండాలి. 
-తెలకపల్లి రవి(ప్రజాశక్తి, 11.8.2013)

  

1 comment:

  1. this is a political vendetta by parties as well as politicians. No permanent stand on one word either. Keep changing their stand time to time....Gopal Rao

    ReplyDelete