Tuesday, August 20, 2013

సీట్లకోసం భావోద్వేగాలతో ఆడుకోవడం

1969లో ఇలాగే ప్రత్యేక తెలంగాణా డిమాండ్‌ వచ్చినప్పుడు నేను వ్యక్తిగతంగా ప్రభావితుణ్ణి కావడం జరిగింది. అందువల్ల దీన్ని నేను ఎంతో ఆవేదనతో లేవనెత్తుతున్నాను.44 ఏళ్ళ క్రితం ఏమి జరిగిందో 40 ఏళ్ళ క్రితం అదే జరిగింది. ఇప్పుడూ అదే పునరావృతమవుతోంది. రాష్ట్రాలను భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా పునర్నిర్మాణం చేసినప్పటి నుంచీ కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఉండాలా, వద్దా అనే విషయాన్ని ఎప్పుడూ మాటలతో వంచిస్తూనే వచ్చింది. నేను అక్కడ విద్యార్థిగా ఉన్న సమయంలో 1960లలో పోలీసు కాల్పుల్లో 300 మంది మరణించిన అనంతరం చివరకు రాష్ట్రాన్ని విడదీయరాదని వారు నిర్ధారణకు వచ్చారు. రాజ్యాంగ సవరణ తేవడం ద్వారా వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. అప్పుడు రాజ్యాంగంలో 371డి నిబంధనను చేర్చారు. 1969 ఉద్యమ అనంతరం ఆంధ్రాలోని రెండవ భాగంలో పెద్ద ఆందోళన వచ్చింది. అదే జై ఆంధ్రా ఆందోళన. అప్పుడూ అనేక ప్రాణాలు పోయాయి.

 ఆ తరువాత 1973లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ చర్చ ప్రారంభించారు. రాష్ట్రాలను విభజించకుండా వెనుకబాటుతనం సమస్యలను పరిష్కరించేందుకు ఒక పరిష్కారంగా భారత రాజ్యాంగంలో అధికరణం 371డి(ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి సంబంధించి చేసిన ప్రత్యేక ఏర్పాట్లు)ని చేర్చారు. ఆ సవరణలో పొందుపరచిన అంశాలను నేను చదివి వినిపిస్తాను 'భారత రాష్ట్రపతి రాష్ట్రంలోని విభిన్న ప్రాంతాలకు చెందిన ప్రజలకు ప్రభుత్వ ఉద్యోగాలు, విద్య వంటి వాటి విషయంలో సమాన అవకాశాలు, సదుపాయాలు కల్పించేందుకు ఉత్తర్వు ద్వారా చర్యలు చేపట్టవచ్చు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు వేరువేరు ఏర్పాట్లు చేయవచ్చు'. 

ఈ సభలో దాన్ని నేను మళ్ళీ గుర్తు చేయడానికి కారణమేమిటో కూడా చెబుతాను. 1973లో నలభై ఏళ్ళ క్రితం - అంటే కచ్చితంగా 40 సంవత్సరాల క్రితం ఈ సమస్యకు పరిష్కారంగా మనం భారత రాజ్యాంగాన్ని సవరించాం. కానీ ఈ 40 ఏళ్ళ కాలంలోనూ ఈ సమస్య పరిష్కారం కాలేదు. అది ఏ స్థితికి వచ్చిందంటే ఇప్పుడు ప్రత్యేక తెలంగాణా ఏర్పాటు వాస్తవిక రూపం దాల్చింది. ఇప్పుడు ఇదంతా ఎందుకు జరిగింది? 40 ఏళ్ళ పాటు దీన్ని ఎందుకు అమలు చేయలేదు? ఈ విషయంలో దేశానికి, ప్రజలకు ఎవరు జవాబివ్వబోతున్నారు? 40 సంవత్సరాలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ పరిస్థితిని పూర్తిగా తప్పుడు పద్ధతులను అనుసరించాయి. ఈ 40 ఏళ్ళలో అత్యధిక కాలం కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కూడా కాంగ్రెస్‌ పార్టీనే అధికారంలో ఉంది. వారే తెచ్చిన ఈ ఏర్పాట్లను ఎందుకు అమలు చేయలేదు? అదే వారు చేసి ఉంటే నేడు ఈ పరిస్థితి తలెత్తి ఉండేది కాదు. సమస్యలను మీరు చిత్తశుద్ధితో పరిష్కరించి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు.

'రాష్ట్రాన్ని చీల్చవద్దు' అనే విస్పష్ట వైఖరి బహిరంగంగా తీసుకున్న ఏకైక పార్టీ అయిన సిపిఎంకు చెందిన వాణ్ణి అయినందుకు నేను గర్విస్తున్నాను. దేశంలో పెద్ద పోరాటం జరిగిన అనంతరం రూపొందించుకున్న సూత్రం ఆధారంగా ఇది మేము చెబుతున్నాం. మనకు 1947లో స్వాతంత్య్రం వచ్చింది. ఆ తరువాత దాదాపు దశాబ్ద కాలానికి అంటే 1956లో రాష్ట్రాలను పునర్వ్యవస్థీకరించారు. 'ఇండియా అంటే భారత్‌ రాష్ట్రాల సమాఖ్య' అని రాజ్యాంగంలోని మొదటి అధికరణం చెబుతోంది. అప్పుడు 'ఆ రాష్ట్రాలు ఏవి? మనం ఏ రాష్ట్రాలను గురించి మాట్లాడుకుంటున్నాం?' అనే ప్రశ్న ముందుకొచ్చింది. అప్పుడు అసలు మొత్తం చర్చంతా వచ్చింది. అప్పటి మన ప్రధాన మంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ ఎ, బి, సి, డి రాష్ట్రాలు అనే అభిప్రాయాన్ని ముందుకు తెచ్చారు. పరిపాలనా సామర్థ్యం ప్రాతిపదికన రాష్ట్రాలను విభజించాలని పార్లమెంటులో ఆయన చెప్పారు. 1928లో దానిపై ఏర్పాటు చేసిన ఒక కమిటీకి తన తండ్రి మోతీలాల్‌ నెహ్రూ అధ్యక్షునిగా ఉన్న విషయాన్ని ఆయనకు గుర్తుచేయాల్సి వచ్చింది. కాంగ్రెస్‌ పార్టీ సంస్థాగతంగా భాష ప్రాతిపదికన ఉండాలని ఆ కమిటీ ఒక నివేదిక ఇచ్చింది. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన అనంతరం ఆధునిక గణతంత్ర రాజ్యానికి ఇది ప్రాతిపదికగా ఉండాలని కూడా మోతీలాల్‌ చెప్పారు.

కనుక రాష్ట్రాలను భాషా ప్రాతిపదికన పునర్వ్యవస్థీకరించాలనే అభిప్రాయం మన స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా ఉంది. మళ్ళీ 1947 అనంతరం మాత్రమే రాష్ట్రాలను ఏ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలనే సమస్య ఉత్పన్నమైంది. చాలా విచిత్రమైన విషయమేమంటే భాష ప్రాతిపదికన తొలుతగా ఏర్పడింది ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రమే. రాష్ట్రాల ఏర్పాటుకు భాషే ప్రాతిపదిక అంటూ తెలుగు ప్రజలు దేశంలో తొలి శంఖారావం చేశారు. దీనికోసం పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష చేసి అమరుడైన అనంతరం ఈ సమస్య జాతీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. అనంతరం సంయుక్త మహారాష్ట్ర, ఐక్య కేరళ ఉద్యమాలు జరిగాయి. అప్పుడు భాషా ప్రయుక్త రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ ఊపందుకుంది. ఒక పార్టీగా మేము ఆ వైఖరి తీసుకున్నాం. రాష్ట్రాల ఏర్పాటుకు భాషే ప్రాతిపదికగా ఉండాలని మహత్తర త్యాగాలు, గొప్ప ప్రజా ఉద్యమాలు జరిగిన అనంతరం అంతిమంగా దాన్ని మనం అంగీకరించాం.

దాన్ని కదిలించ కండి. భాష ప్రాతిపదికన ఏర్పడిన రాష్ట్రాలను కదిలిస్తే కందిరీగల తుట్టెను కదిలించినట్లే అవుతుంది. దాన్ని కదిలిస్తే ఇంక అంతమనేది ఉండదు. ఎందుకంటే ఇంతటి బహుళత్వం, భిన్నత్వం ఏ దేశంలోనూ లేదు. రాష్ట్రాల ఏర్పాటుకు తీసుకున్న కొలబద్దలను మారిస్తే మనం చిక్కుల్లో పడతాం. ఇప్పుడు జరుగుతున్నది అదే. అందువల్ల పరిస్థితితో చెలగాటం వద్దని మేము కాంగ్రెస్‌ పార్టీకి విజ్ఞప్తి చేస్తున్నాం. నాటి హోం మంత్రి, నేటి ఆర్థిక మంత్రి 2009 డిసెంబర్‌ 9న ప్రత్యేక తెలంగాణాపై ఒక ప్రకటన చేశారు. అప్పుడే ప్రభుత్వ ఉద్దేశమేమిటో స్పష్టమైంది. దాన్ని వారు 2013లో అమలు చేయబూనుకున్నారంటే ఈ మధ్య కాలంలో వారు చేసిన కసరత్తు ఏమిటి? నేడు మనకిచ్చిన ప్రకటనలో 'అనేక అంశాలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి' అని ఆయన చెప్పారు. గౌరవనీయులైన ఆర్థిక మంత్రి ఇచ్చిన ప్రకటనను నేను చదువుతున్నాను. 'హోం శాఖ ఒక సమగ్ర పత్రాన్ని తెస్తుంది' అని ఆయన చెప్పారు. దాన్ని ఎప్పుడు తెస్తుంది? నాలుగేళ్ళ క్రితం ఆయనే స్వయంగా ప్రకటన చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ సమగ్రమైందో, అసమగ్రమైందో ఎలాంటి పత్రమూ లేదు. 'నదీ జలాల పంపిణీ, విద్యుదుత్పత్తి, పంపిణీ, పౌరులందరి భద్రత, రక్షణ, ప్రాథమిక హక్కులకు గ్యారంటీ వంటి అంశాలు సహా అన్ని విషయాలనూ అది పరిశీలిస్తుంది. ఈ అంశాలపై ఒక్కసారి కేబినెట్‌ నిర్ణయం తీసుకుంటే అప్పుడు సభలో నిర్మాణాత్మక చర్చకు అవకాశముంటుంది' అని చెప్పారు.

కనుక ఇది చాలా ముఖ్యమైన అంశం. నేను చెప్పదలుచుకున్నదేమంటే వారు 2009, డిసెంబర్‌లో ప్రకటన చేశారు. నిజంగానే వారు దాన్ని అమలుచేయబోతుంటే కొంత కసరత్తు చేసి ఉండాలి. ఈ విషయాలన్నింటి గురించి ఆలోచించి ఉండాలి. వారు అవేమీ చేయలేదు. అందువల్ల ఇప్పుడు ప్రకటన వచ్చిన సమయం చాలా అనుమానాస్పదంగా ఉంది. వాస్తవం ఏమిటి? భారతీయ రాజకీయ వాస్తవం ఏమిటి? ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీకి లభించిన 37, 33 సీట్లు లేకుంటే యుపిఎ-1 ప్రభుత్వం గానీ, యుపిఎ-2 ప్రభుత్వం గానీ ఏర్పడి ఉండేవే కాదు. ఆ సీట్లే లేకపోతే మొదటిసారి మేము బయటి నుంచి మద్దతు ఇచ్చినా, ఇవ్వకపోయినా ఈ ప్రభుత్వాలు ఏర్పడే ఉండేవి కాదు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి ఎలా ఉందంటే ఆ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోవచ్చు. ఆ నష్టాన్ని తగ్గించుకునేందుకు వారు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. ఇది మన దేశ ప్రజలను, రాష్ట్ర ప్రజలను అతలాకుతలం చేస్తోంది. అందువల్ల ఆ రాజకీయ అవకాశవాదం ఇక్కడ స్పష్టంగా కన్పిస్తోంది. 

ఇక్కడ మీరు ఒక సూత్రబద్ధమైన వైఖరి తీసుకోవాలి. మీ సూత్రబద్ధమైన వైఖరి ఏమిటి? 2009 డిసెంబర్‌లో అప్పటి హోం మంత్రి ఏదైతే ప్రకటించారని చెప్పారో దాన్నే మీరు ఇప్పుడు అమలు చేస్తున్నారు. ఈ నాలుగేళ్ళలో మీరు చేసిందేమీ లేదు. ఈ నిర్ణయంతో తాను ఆశ్చర్యపోయానని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఒక ప్రకటన చేశారు. ఓడ కెప్టెన్‌ గందరగోళపరిచే విధంగా మాట్లాడరాదని ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఉప ముఖ్యమంత్రి అంటున్నారు. మంత్రులు కార్యాలయాలకు రాగలిగే, హాజరయ్యే పరిస్థితి లేదు. ఎమ్మెల్యేలు ముఖం చాటేస్తున్నారు. అక్కడ ఏమి జరుగుతోందో తెలియని పూర్తి అయోమయ స్థితిలో ప్రజలున్నారు. వారు సృష్టించిన పరిస్థితి ఇదే. ప్రభుత్వం ఇదే చేయాలనుకుంటే, నేడు మనం చర్చిస్తున్న ఆర్థిక మంత్రి ప్రకటన ఇదే అయితే, వారు ముందుగానే నిర్ణయం తీసుకున్నాకే ఎందుకు ప్రకటించలేదు? ఇప్పుడొకసారి, అప్పుడొకసారి ప్రకటించడమెందుకు? ముందుగానే ఎందుకు ప్రకటించలేదు? అదే కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ అవకాశవాదం. అంతమనేదే కన్పించని ఈ ఆందోళన మూలంగా మన పిల్లలు తమ పాఠశాల, కళాశాల చదువుల్ని కోల్పోతున్నారు.

పరిష్కరించాల్సిన వివాదాస్పద సమస్యలు అనేకం ఉన్నాయని నేను మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలంటే ప్రభుత్వం అనుసరిస్తున్న రీతిలో అస్తవ్యస్తంగా, హడావుడి పద్ధతుల్లో చేయాలనుకుంటే కుదిరేది కాదు. దానికి సక్రమమైన సంప్రదింపులు అవసరం. ఈ పత్రంలో ప్రభుత్వం పునరుద్ఘాటించిన విధంగా కేంద్ర కేబినెట్‌ ఈ సమస్యలపై ఏవైనా నిర్ధారణలకు వచ్చి ఉంటే వాటిని అఖిలపక్ష కమిటీ ముందుంచండి లేదా ఈ పార్లమెంటు ముందు పెట్టాలి. అప్పుడు వాటిపై మనం చర్చించేందుకు అవకాశముంటుంది. అయితే ఆ పని సాధ్యమైనంత వెనువెంటనే చేయాలి. ఎన్నికలు రావచ్చని, ప్రవర్తనా నియమావళి అమలులోకి రావచ్చని కూడా అర్థమవుతున్నది. అలాటప్పుడు మీరు రాష్ట్ర ఏర్పాటును ప్రకటించజాలరు. అందువల్ల మీరు తొందరలో పడ్డారు. ఆ తొందరలో ఇప్పటికే ఉన్నవాటికి అదనంగా మరిన్ని సమస్యలను సృష్టిస్తున్నారు.
 అందువల్ల ఈ సమస్యను చేపట్టాలంటే మీరు సంప్రదింపులు జరపండి. అందరినీ విశ్వాసంలోకి తీసుకోండి. అదొక్కటే మార్గమని నేను భావిస్తున్నాను. ఈ పద్ధతిని ప్రభుత్వం గట్టిగా పరిశీలించాలని కోరుకుంటున్నాను. మీ ద్వారా నేను ఈ సూచన చేస్తున్నాను. సంబంధిత మంత్రి దీనికి సమాధానమిస్తే, సమస్యలకు స్పష్టంగా జవాబిస్తే సంతోషిస్తాను. చివరగా ప్రజల మనోభావాలు, ఉద్రేకాలతో ఆడుకోవద్దని కోరుతున్నాను. తెలంగాణాలో కొన్ని సీట్లు గెలుచుకోవడం ద్వారా నష్టాలను తగ్గించుకోవాలనుకుంటే ఉభయ భ్రష్టత్వం ప్రాప్తిస్తుందని ప్రభుత్వం, కాంగ్రెస్‌ పార్టీ గుర్తుంచుకోవాలి. అందువల్ల దేశ సమైక్యత, ప్రజల ఐక్యత దృష్ట్యా ప్రజల భావోద్వేగాలతో ఆడుకోవద్దు. సక్రమంగా వ్యవహరించండి. అందరినీ సంప్రదించండి. అందరినీ పరిగణనలోకి తీసుకుని అప్పుడు నిర్ణయం తీసుకోండి.
-సీతారాం ఏచూరి (రాజ్యసభలో 12.8.2012 న చేసిన ప్రసంగం స్వల్ప సంక్షిప్తీకరణతో) 
  




No comments:

Post a Comment