Sunday, August 11, 2013

దళపతులూ, జన గతులూ!

పాత కాలంలో జానపద చిత్రాల్లో, కథల్లో కూడా ఎక్కువసార్లు కుట్రలు చేసేది ఎవరంటే సేనాధిపతులే! విప్లవకారులను నాశనం చేయడానికి సైన్యాలను పంపిస్తుంటారు గానీ సైన్యమే కుట్ర చేసి రాజులను, చక్రవర్తులను కూలదోయడం చరిత్ర పొడుగునా కనిపించే సత్యం. సోదరులూ కుమారులూ బావలూ మరుదలూ మామలూ అల్లుళ్లూ ఒకరేమిటి రాజ్యాధికారం దగ్గరకు వచ్చేసరికి పదవీ వ్యామోహం ఎంత పనైనా చేయిస్తుంది. అసలు కుట్ర చేసే అవకాశం ఉండాలంటేనే అధికార పీఠానికి దగ్గరగా ఉండాలి కదా! అధికారం అన్నాక దొంతరలుంటాయి. ఆ దొంతరల్లో ఎప్పుడు ఏది, ఎవరిని కాటేసేదీ చివరి వరకూ తెలియదు. ఆధునిక ప్రజాస్వామ్యంలోనూ రాత్రికి రాత్రి ప్రభుత్వాలు కూలిపోతాయన్నా, మారిపోతాయన్నా ఈ దళపతుల దగాకోరు రాజకీయాలే కారణం. బహుశా ఇవన్నీ తెలిసే ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజ నరసింహులు దళపతి కుట్రదారుడు కాకూడదని నర్మగర్భంగా తమ ప్రభుత్వాధినేతపై ధ్వజమెత్తారు. కాగా సదరు దళపతి కిరణ కుమారులు కూడా మీరు చేసే విభజనతో సమస్యలు తీవ్రమైపోతాయని అత్యున్నత అధిష్ఠానం నిర్ణయాన్నే ఆక్షేపించినట్టు మాట్లాడారు. ఇందులో ఎవరు ఎవరి మీద కుట్ర చేసినట్టు? లేక వీరంతా కలసి ప్రజల మీద కుట్ర చేసినట్టా? ఎ హౌస్‌ హాఫ్‌ డివైడెడ్‌ అగైనెస్ట్‌ ఇట్‌ సెల్ఫ్‌ అన్నది ఒకప్పుడు అమెరికా అధ్యక్షుడు అబ్రహాం లింకన్‌ అన్న ప్రఖ్యాత వర్ణన. ఇక్కడ కూడా పరస్పరం విడిపోయినట్టు మాట్లాడుతున్న ఈ నేతలు, ఉపనేతలు నిజంగా విడిపోయారా లేక విడిపోయినట్టు మాట్లాడుతూ రెండు వైపుల నుంచీ తామే యు ద్ధం చేస్తు న్నారా? అదీ అసలైన ప్రశ్న.

ఉభయులూ అదే పార్టీలో, అదే ప్రభుత్వంలో కొనసాగుతున్నారు. దాన్ని పడగొడతామని ఒక్కరూ అనడం లేదు. పోనీ వీరి అధిష్ఠానమైనా పరస్పరం కీచులాడు కుంటున్నందుకు, తమ నిర్ణయాన్ని ధిక్కరించి క్రమ శిక్షణ తప్పినందుకు ఏమైనా అంటుందా? రాజగురు వంటి దిగ్విజయ సింహులు మా వాళ్లు మంచి బాలలు అన్నట్టు కితాబులిచ్చేస్తున్నారు. వారు తమ వాదనలు చెప్పుకోవడానికే మార్క్‌ ఆంటోనీ వంటి మహామహుని నేతృత్వంలో కమిటీ వేసుకున్నాం, వచ్చి చెప్పేసుకోండని అవకాశం కల్పిస్తున్నారు. సార్వభౌములకు కనిపించని కుట్ర సామంతులకు కనిపించినట్టు అధినేతలకు అగుపించని కుట్ర ఉప నేతలకు గోచరించడం మరో విచిత్రం. అంటే పాతకాలపు జానపద చిత్రాల్లో కూడా కుట్ర దారులంతా ఎవరి పాత్ర వారు పోషిస్తూ ఎప్పటికేం చెప్పాలో అది చెబుతూ కథను రక్తి కట్టిస్తుంటారు. ఇంత తతంగం ఎందుకంటే ప్రతిపక్ష చంద్రులూ, జగన్మోహనులూ గందరగోళపడాలి. తమ ఎత్తులకు చిత్తయి పోవాలి. అంతే. ఇదంతా ఒక ఆధునిక రాచరిక రాజకీయ క్రీడ. కాకుంటే చదరంగంలో పావుల్లా ఈ క్రీడలో నలిగిపోయేది తెలుగు ప్రజలే. తెలంగాణా, కోస్తా, రాయలసీమ ప్రాంతమేదైతేనేం ఒకోసారి ఒకరు. రాజ నరసింహులు అన్నట్టు ఎప్పుడూ దళపతులు కుట్ర చేయకూడదు. జనపతులు అసలే చేయకూడదు. కానీ ఈ రాష్ట్ర రంగ స్థలంపై ఎడతెగని రాజకీయ నాటకం సాగిపోతూనే ఉంది. రాజు మంచి వాడే సేనాపతి లేదా దళపతి చెడ్డవాడు, యజమాని మంచివాడే మేనేజర్‌ లేదా సూపర్‌ వైజర్‌ చెడ్డవాడు అన్నది వర్గ సామరస్య కథల్లో సర్వసాధారణ వ్యవహారం. ముందడుగు అనే చిత్రంలో ఇలాటి సందేశమే ఇస్తే కొడవటిగంటి కుటుంబరావుకు ఒళ్లు మండి సినిమాల్లో వింత అభ్యుదయం అని ఒక వ్యాసం రాశారు. అత్యున్నత స్థాయిలో అవకాశవాదాలనూ కాలాంతక వ్యూహాలనూ పసిగట్టకుండా ప్రాంతాల పేరిట పరస్పర వైషమ్యాలు పెంచుకోవడం అలాటి వ్యవహారమే అవుతుంది. ఇప్పటి వరకూ మాత్రమే గాక ఇంకా ఈ రాష్ట్రాన్ని సంయుక్తంగా పాలిస్తున్న వారు ఒకరినొకరు ఎంతగా తిట్టుకున్నా, దుమ్మెత్తిపోసుకున్నా ఏం విలువ? అత్యంత విధేయులుగా అధికార పీఠం సంపాదించిన వారు అనూహ్యమైన భిన్న స్వరం వినిపించి కూడా లక్షణంగా కొనసాగగలిగితే ఎలా విశ్వసించడం? ఇలాటి సమయంలోనే కారల్‌ మార్క్స్‌ చెప్పిన సూక్తి 'ప్రతి మనిషీ ప్రతి దాన్నీ విమర్శనాత్మకంగా చూడాలి' అన్నది గుర్తుకు వస్తుంది. కులం, మతం, ప్రాంతం వంటి రేఖలు ఏవైనా కావచ్చు. వాటన్నిటినితో పాటు వాటన్నిటినీ మించి కూడా వర్గం రాజకీయార్థికాధికారం అనే అంశాలు ఉంటాయి. అన్నిటినీ శాసిస్తుంటాయి. ఆ క్రమంలో మరణ శాసనాలూ రాస్తుంటాయి. దారుణ వ్యూహాలూ రచిస్తుంటాయి. చెప్పే మాటలకూ, జరిగే పరిణామాలకూ పొంతన కుదరక, లంగరు అందక ప్రజలు అల్లాడిపోతారు.అప్పుడు మళ్లీ వారే ఆపద్బంధువులమంటూ వస్తారు. ఇదంతా ఒక పెద్ద కుట్రే. మరి దళపతులు కుట్రదారులు కాకూడదనుకుంటే ఇలాటి మాయాజాలం కట్టిపెట్టాల్సి ఉంటుంది. ప్రజాస్వామికంగా, పారదర్శకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. చేసేది ఏమిటో చేసెయ్యి సూటిగా అన్నట్టు ఉండాలి గాని కోటలో పాగా వెయ్యడమూ, వేసిన పాగా పోకుండా చూసుకోవడమే ఏకైక లక్ష్యం కాకూడదు. అలా అయిన తర్వాత మిగిలేది కుట్రలూ, కుహకాలే! రాజకీయ రంగస్థలంపై ఇప్పుడు చూస్తున్న జుగుప్సాకర ప్రహసనాలన్నీ ఆ ప్రతిరూపాలే. వీటికి స్వస్తిచెప్పడం ఎప్పుడంటే ఏ మాట వెనక ఎవరి ఏ ప్రయోజనం ఉందో ప్రజలు గ్రహించినప్పుడు. ఆగ్రహించినప్పుడు
 (సంపాదకీయం, ప్రజాశక్తి, 11.8.2013)


No comments:

Post a Comment