Tuesday, August 20, 2013

సీట్లకోసం భావోద్వేగాలతో ఆడుకోవడం

1969లో ఇలాగే ప్రత్యేక తెలంగాణా డిమాండ్‌ వచ్చినప్పుడు నేను వ్యక్తిగతంగా ప్రభావితుణ్ణి కావడం జరిగింది. అందువల్ల దీన్ని నేను ఎంతో ఆవేదనతో లేవనెత్తుతున్నాను.44 ఏళ్ళ క్రితం ఏమి జరిగిందో 40 ఏళ్ళ క్రితం అదే జరిగింది. ఇప్పుడూ అదే పునరావృతమవుతోంది. రాష్ట్రాలను భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా పునర్నిర్మాణం చేసినప్పటి నుంచీ కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఉండాలా, వద్దా అనే విషయాన్ని ఎప్పుడూ మాటలతో వంచిస్తూనే వచ్చింది. నేను అక్కడ విద్యార్థిగా ఉన్న సమయంలో 1960లలో పోలీసు కాల్పుల్లో 300 మంది మరణించిన అనంతరం చివరకు రాష్ట్రాన్ని విడదీయరాదని వారు నిర్ధారణకు వచ్చారు. రాజ్యాంగ సవరణ తేవడం ద్వారా వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. అప్పుడు రాజ్యాంగంలో 371డి నిబంధనను చేర్చారు. 1969 ఉద్యమ అనంతరం ఆంధ్రాలోని రెండవ భాగంలో పెద్ద ఆందోళన వచ్చింది. అదే జై ఆంధ్రా ఆందోళన. అప్పుడూ అనేక ప్రాణాలు పోయాయి.

 ఆ తరువాత 1973లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ చర్చ ప్రారంభించారు. రాష్ట్రాలను విభజించకుండా వెనుకబాటుతనం సమస్యలను పరిష్కరించేందుకు ఒక పరిష్కారంగా భారత రాజ్యాంగంలో అధికరణం 371డి(ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి సంబంధించి చేసిన ప్రత్యేక ఏర్పాట్లు)ని చేర్చారు. ఆ సవరణలో పొందుపరచిన అంశాలను నేను చదివి వినిపిస్తాను 'భారత రాష్ట్రపతి రాష్ట్రంలోని విభిన్న ప్రాంతాలకు చెందిన ప్రజలకు ప్రభుత్వ ఉద్యోగాలు, విద్య వంటి వాటి విషయంలో సమాన అవకాశాలు, సదుపాయాలు కల్పించేందుకు ఉత్తర్వు ద్వారా చర్యలు చేపట్టవచ్చు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు వేరువేరు ఏర్పాట్లు చేయవచ్చు'. 

ఈ సభలో దాన్ని నేను మళ్ళీ గుర్తు చేయడానికి కారణమేమిటో కూడా చెబుతాను. 1973లో నలభై ఏళ్ళ క్రితం - అంటే కచ్చితంగా 40 సంవత్సరాల క్రితం ఈ సమస్యకు పరిష్కారంగా మనం భారత రాజ్యాంగాన్ని సవరించాం. కానీ ఈ 40 ఏళ్ళ కాలంలోనూ ఈ సమస్య పరిష్కారం కాలేదు. అది ఏ స్థితికి వచ్చిందంటే ఇప్పుడు ప్రత్యేక తెలంగాణా ఏర్పాటు వాస్తవిక రూపం దాల్చింది. ఇప్పుడు ఇదంతా ఎందుకు జరిగింది? 40 ఏళ్ళ పాటు దీన్ని ఎందుకు అమలు చేయలేదు? ఈ విషయంలో దేశానికి, ప్రజలకు ఎవరు జవాబివ్వబోతున్నారు? 40 సంవత్సరాలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ పరిస్థితిని పూర్తిగా తప్పుడు పద్ధతులను అనుసరించాయి. ఈ 40 ఏళ్ళలో అత్యధిక కాలం కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కూడా కాంగ్రెస్‌ పార్టీనే అధికారంలో ఉంది. వారే తెచ్చిన ఈ ఏర్పాట్లను ఎందుకు అమలు చేయలేదు? అదే వారు చేసి ఉంటే నేడు ఈ పరిస్థితి తలెత్తి ఉండేది కాదు. సమస్యలను మీరు చిత్తశుద్ధితో పరిష్కరించి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు.

'రాష్ట్రాన్ని చీల్చవద్దు' అనే విస్పష్ట వైఖరి బహిరంగంగా తీసుకున్న ఏకైక పార్టీ అయిన సిపిఎంకు చెందిన వాణ్ణి అయినందుకు నేను గర్విస్తున్నాను. దేశంలో పెద్ద పోరాటం జరిగిన అనంతరం రూపొందించుకున్న సూత్రం ఆధారంగా ఇది మేము చెబుతున్నాం. మనకు 1947లో స్వాతంత్య్రం వచ్చింది. ఆ తరువాత దాదాపు దశాబ్ద కాలానికి అంటే 1956లో రాష్ట్రాలను పునర్వ్యవస్థీకరించారు. 'ఇండియా అంటే భారత్‌ రాష్ట్రాల సమాఖ్య' అని రాజ్యాంగంలోని మొదటి అధికరణం చెబుతోంది. అప్పుడు 'ఆ రాష్ట్రాలు ఏవి? మనం ఏ రాష్ట్రాలను గురించి మాట్లాడుకుంటున్నాం?' అనే ప్రశ్న ముందుకొచ్చింది. అప్పుడు అసలు మొత్తం చర్చంతా వచ్చింది. అప్పటి మన ప్రధాన మంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ ఎ, బి, సి, డి రాష్ట్రాలు అనే అభిప్రాయాన్ని ముందుకు తెచ్చారు. పరిపాలనా సామర్థ్యం ప్రాతిపదికన రాష్ట్రాలను విభజించాలని పార్లమెంటులో ఆయన చెప్పారు. 1928లో దానిపై ఏర్పాటు చేసిన ఒక కమిటీకి తన తండ్రి మోతీలాల్‌ నెహ్రూ అధ్యక్షునిగా ఉన్న విషయాన్ని ఆయనకు గుర్తుచేయాల్సి వచ్చింది. కాంగ్రెస్‌ పార్టీ సంస్థాగతంగా భాష ప్రాతిపదికన ఉండాలని ఆ కమిటీ ఒక నివేదిక ఇచ్చింది. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన అనంతరం ఆధునిక గణతంత్ర రాజ్యానికి ఇది ప్రాతిపదికగా ఉండాలని కూడా మోతీలాల్‌ చెప్పారు.

కనుక రాష్ట్రాలను భాషా ప్రాతిపదికన పునర్వ్యవస్థీకరించాలనే అభిప్రాయం మన స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా ఉంది. మళ్ళీ 1947 అనంతరం మాత్రమే రాష్ట్రాలను ఏ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలనే సమస్య ఉత్పన్నమైంది. చాలా విచిత్రమైన విషయమేమంటే భాష ప్రాతిపదికన తొలుతగా ఏర్పడింది ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రమే. రాష్ట్రాల ఏర్పాటుకు భాషే ప్రాతిపదిక అంటూ తెలుగు ప్రజలు దేశంలో తొలి శంఖారావం చేశారు. దీనికోసం పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష చేసి అమరుడైన అనంతరం ఈ సమస్య జాతీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. అనంతరం సంయుక్త మహారాష్ట్ర, ఐక్య కేరళ ఉద్యమాలు జరిగాయి. అప్పుడు భాషా ప్రయుక్త రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ ఊపందుకుంది. ఒక పార్టీగా మేము ఆ వైఖరి తీసుకున్నాం. రాష్ట్రాల ఏర్పాటుకు భాషే ప్రాతిపదికగా ఉండాలని మహత్తర త్యాగాలు, గొప్ప ప్రజా ఉద్యమాలు జరిగిన అనంతరం అంతిమంగా దాన్ని మనం అంగీకరించాం.

దాన్ని కదిలించ కండి. భాష ప్రాతిపదికన ఏర్పడిన రాష్ట్రాలను కదిలిస్తే కందిరీగల తుట్టెను కదిలించినట్లే అవుతుంది. దాన్ని కదిలిస్తే ఇంక అంతమనేది ఉండదు. ఎందుకంటే ఇంతటి బహుళత్వం, భిన్నత్వం ఏ దేశంలోనూ లేదు. రాష్ట్రాల ఏర్పాటుకు తీసుకున్న కొలబద్దలను మారిస్తే మనం చిక్కుల్లో పడతాం. ఇప్పుడు జరుగుతున్నది అదే. అందువల్ల పరిస్థితితో చెలగాటం వద్దని మేము కాంగ్రెస్‌ పార్టీకి విజ్ఞప్తి చేస్తున్నాం. నాటి హోం మంత్రి, నేటి ఆర్థిక మంత్రి 2009 డిసెంబర్‌ 9న ప్రత్యేక తెలంగాణాపై ఒక ప్రకటన చేశారు. అప్పుడే ప్రభుత్వ ఉద్దేశమేమిటో స్పష్టమైంది. దాన్ని వారు 2013లో అమలు చేయబూనుకున్నారంటే ఈ మధ్య కాలంలో వారు చేసిన కసరత్తు ఏమిటి? నేడు మనకిచ్చిన ప్రకటనలో 'అనేక అంశాలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి' అని ఆయన చెప్పారు. గౌరవనీయులైన ఆర్థిక మంత్రి ఇచ్చిన ప్రకటనను నేను చదువుతున్నాను. 'హోం శాఖ ఒక సమగ్ర పత్రాన్ని తెస్తుంది' అని ఆయన చెప్పారు. దాన్ని ఎప్పుడు తెస్తుంది? నాలుగేళ్ళ క్రితం ఆయనే స్వయంగా ప్రకటన చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ సమగ్రమైందో, అసమగ్రమైందో ఎలాంటి పత్రమూ లేదు. 'నదీ జలాల పంపిణీ, విద్యుదుత్పత్తి, పంపిణీ, పౌరులందరి భద్రత, రక్షణ, ప్రాథమిక హక్కులకు గ్యారంటీ వంటి అంశాలు సహా అన్ని విషయాలనూ అది పరిశీలిస్తుంది. ఈ అంశాలపై ఒక్కసారి కేబినెట్‌ నిర్ణయం తీసుకుంటే అప్పుడు సభలో నిర్మాణాత్మక చర్చకు అవకాశముంటుంది' అని చెప్పారు.

కనుక ఇది చాలా ముఖ్యమైన అంశం. నేను చెప్పదలుచుకున్నదేమంటే వారు 2009, డిసెంబర్‌లో ప్రకటన చేశారు. నిజంగానే వారు దాన్ని అమలుచేయబోతుంటే కొంత కసరత్తు చేసి ఉండాలి. ఈ విషయాలన్నింటి గురించి ఆలోచించి ఉండాలి. వారు అవేమీ చేయలేదు. అందువల్ల ఇప్పుడు ప్రకటన వచ్చిన సమయం చాలా అనుమానాస్పదంగా ఉంది. వాస్తవం ఏమిటి? భారతీయ రాజకీయ వాస్తవం ఏమిటి? ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీకి లభించిన 37, 33 సీట్లు లేకుంటే యుపిఎ-1 ప్రభుత్వం గానీ, యుపిఎ-2 ప్రభుత్వం గానీ ఏర్పడి ఉండేవే కాదు. ఆ సీట్లే లేకపోతే మొదటిసారి మేము బయటి నుంచి మద్దతు ఇచ్చినా, ఇవ్వకపోయినా ఈ ప్రభుత్వాలు ఏర్పడే ఉండేవి కాదు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి ఎలా ఉందంటే ఆ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోవచ్చు. ఆ నష్టాన్ని తగ్గించుకునేందుకు వారు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. ఇది మన దేశ ప్రజలను, రాష్ట్ర ప్రజలను అతలాకుతలం చేస్తోంది. అందువల్ల ఆ రాజకీయ అవకాశవాదం ఇక్కడ స్పష్టంగా కన్పిస్తోంది. 

ఇక్కడ మీరు ఒక సూత్రబద్ధమైన వైఖరి తీసుకోవాలి. మీ సూత్రబద్ధమైన వైఖరి ఏమిటి? 2009 డిసెంబర్‌లో అప్పటి హోం మంత్రి ఏదైతే ప్రకటించారని చెప్పారో దాన్నే మీరు ఇప్పుడు అమలు చేస్తున్నారు. ఈ నాలుగేళ్ళలో మీరు చేసిందేమీ లేదు. ఈ నిర్ణయంతో తాను ఆశ్చర్యపోయానని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఒక ప్రకటన చేశారు. ఓడ కెప్టెన్‌ గందరగోళపరిచే విధంగా మాట్లాడరాదని ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఉప ముఖ్యమంత్రి అంటున్నారు. మంత్రులు కార్యాలయాలకు రాగలిగే, హాజరయ్యే పరిస్థితి లేదు. ఎమ్మెల్యేలు ముఖం చాటేస్తున్నారు. అక్కడ ఏమి జరుగుతోందో తెలియని పూర్తి అయోమయ స్థితిలో ప్రజలున్నారు. వారు సృష్టించిన పరిస్థితి ఇదే. ప్రభుత్వం ఇదే చేయాలనుకుంటే, నేడు మనం చర్చిస్తున్న ఆర్థిక మంత్రి ప్రకటన ఇదే అయితే, వారు ముందుగానే నిర్ణయం తీసుకున్నాకే ఎందుకు ప్రకటించలేదు? ఇప్పుడొకసారి, అప్పుడొకసారి ప్రకటించడమెందుకు? ముందుగానే ఎందుకు ప్రకటించలేదు? అదే కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ అవకాశవాదం. అంతమనేదే కన్పించని ఈ ఆందోళన మూలంగా మన పిల్లలు తమ పాఠశాల, కళాశాల చదువుల్ని కోల్పోతున్నారు.

పరిష్కరించాల్సిన వివాదాస్పద సమస్యలు అనేకం ఉన్నాయని నేను మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలంటే ప్రభుత్వం అనుసరిస్తున్న రీతిలో అస్తవ్యస్తంగా, హడావుడి పద్ధతుల్లో చేయాలనుకుంటే కుదిరేది కాదు. దానికి సక్రమమైన సంప్రదింపులు అవసరం. ఈ పత్రంలో ప్రభుత్వం పునరుద్ఘాటించిన విధంగా కేంద్ర కేబినెట్‌ ఈ సమస్యలపై ఏవైనా నిర్ధారణలకు వచ్చి ఉంటే వాటిని అఖిలపక్ష కమిటీ ముందుంచండి లేదా ఈ పార్లమెంటు ముందు పెట్టాలి. అప్పుడు వాటిపై మనం చర్చించేందుకు అవకాశముంటుంది. అయితే ఆ పని సాధ్యమైనంత వెనువెంటనే చేయాలి. ఎన్నికలు రావచ్చని, ప్రవర్తనా నియమావళి అమలులోకి రావచ్చని కూడా అర్థమవుతున్నది. అలాటప్పుడు మీరు రాష్ట్ర ఏర్పాటును ప్రకటించజాలరు. అందువల్ల మీరు తొందరలో పడ్డారు. ఆ తొందరలో ఇప్పటికే ఉన్నవాటికి అదనంగా మరిన్ని సమస్యలను సృష్టిస్తున్నారు.
 అందువల్ల ఈ సమస్యను చేపట్టాలంటే మీరు సంప్రదింపులు జరపండి. అందరినీ విశ్వాసంలోకి తీసుకోండి. అదొక్కటే మార్గమని నేను భావిస్తున్నాను. ఈ పద్ధతిని ప్రభుత్వం గట్టిగా పరిశీలించాలని కోరుకుంటున్నాను. మీ ద్వారా నేను ఈ సూచన చేస్తున్నాను. సంబంధిత మంత్రి దీనికి సమాధానమిస్తే, సమస్యలకు స్పష్టంగా జవాబిస్తే సంతోషిస్తాను. చివరగా ప్రజల మనోభావాలు, ఉద్రేకాలతో ఆడుకోవద్దని కోరుతున్నాను. తెలంగాణాలో కొన్ని సీట్లు గెలుచుకోవడం ద్వారా నష్టాలను తగ్గించుకోవాలనుకుంటే ఉభయ భ్రష్టత్వం ప్రాప్తిస్తుందని ప్రభుత్వం, కాంగ్రెస్‌ పార్టీ గుర్తుంచుకోవాలి. అందువల్ల దేశ సమైక్యత, ప్రజల ఐక్యత దృష్ట్యా ప్రజల భావోద్వేగాలతో ఆడుకోవద్దు. సక్రమంగా వ్యవహరించండి. అందరినీ సంప్రదించండి. అందరినీ పరిగణనలోకి తీసుకుని అప్పుడు నిర్ణయం తీసుకోండి.
-సీతారాం ఏచూరి (రాజ్యసభలో 12.8.2012 న చేసిన ప్రసంగం స్వల్ప సంక్షిప్తీకరణతో) 
  




Thursday, August 15, 2013

అవకాశవాదం లో పోటాపోటీ

కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ రాష్ట్రాన్ని విభజిస్తామని చేసిన ప్రకటన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్‌, తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌సిపిలు చేస్తున్న రాజకీయ సర్కస్‌ ఫీట్లు చూస్తే కొంత మందికి వినోదకరంగా, కొంత మందికి విషాదకరంగా ఉండి ఉండవచ్చు. కానీ ఎవరికీ సంతృప్తికరంగా మాత్రం లేదు. స్వార్థపూరిత ఎన్నికల దృష్టి తప్ప రాష్ట్ర ప్రజల ప్రయోజనం వాటికి పట్టడంలేదు. ఏమాత్రం నిజాయితీ ఉన్నా గందరగోళానికి, అస్పష్టతకు తావులేకుండా అవకాశవాదాన్ని పక్కనపెట్టి స్పష్టమైన వైఖరులతో ముందుకు వచ్చి ఉండేవి.
రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి వేస్తున్న పిల్లిమొగ్గలు చూస్తే ఎక్కడి ఆట అక్కడ ఆడుతున్నట్టు ఎవరికైనా అర్థం అవుతుంది. విభజన నిర్ణయానికి ముందు జరిగిన వార్‌ రూం సమావేశాల చర్చల్లో తలమున కలయ్యారు. అధినేత్రి సోనియాను ప్రత్యేకంగా పలుమార్లు కలిశారు. హుషారుగా ఉన్న ముఖ్యమంత్రి అని ఒక రోజు, దిగాలుగా ఉన్న ముఖ్యమంత్రి అని ఒక రోజు మీడియాలో ఎన్ని కథనా లొచ్చినా కాంగ్రెస్‌ అధిష్ఠానం చేసిన విభజన ప్రక్రియలో పాలుపం చుకున్నారనేది యదార్థం. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో విభజనకు వ్యతిరేకత పెరుగుతున్న సంకేతాలు కనబడిన వెంటనే తాను సమైక్యత కోసం గట్టిగా వాదించానని చూపించుకోవడానికి తాపత్రయ పడ్డారు. తాను సమర్పించిన నివేదికలోని ఒక భాగాన్ని మీడియాకు లీకు చేయించారు. ముఖ్యమంత్రి రాజీనామాకు సిద్ధమవుతున్నారన్న కథనాన్ని కూడా మీడియాలో చొప్పించారు. అధిష్టానం కన్నెర్ర చేయడంతో అది మీడియా సృష్టించిన పుకారేనని అధికారికంగా ఖండించారు. ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ పెట్టి విభజన వల్ల వచ్చే తీవ్ర సమస్యల గురించి ఆవేశపూరితంగా మాట్లాడారు. అధిష్టానాన్ని ధిక్కరించి సమైక్యత గురించి మాట్లాడి, రాష్ట్రంలో ఉన్న ఒకే ఒక్క మగాడిగా ఒక సహచరుని నుంచి ప్రశంసలను కొట్టేశారు. బహిరంగంగా ప్రెస్‌లో మాట్లాడడంపై అధిష్టానం ఆగ్రహించడంతో మళ్ళీ సర్దుకున్నారని మీడియాలో కథనాలొచ్చాయి. ముఖ్యమంత్రి వ్యవహారమంతా ఉరుములు, మెరుపులు తప్ప వాన కాదని ఎవరికైనా అర్థమవుతుంది. కోస్తా, రాయలసీమలో విస్తృతంగా వ్యక్తమవుతున్న సమైక్యతా భావం నుంచి దూరం కాకుండా ఉండాలన్న భావం ముఖ్యమంత్రిలో ఉండవచ్చు. అటువంటి భావం నిజాయితీగా ఉంటే రాష్ట్ర విభజన ప్రకటించినప్పుడే బహిరంగంగా వ్యతిరేకత ప్రకటించవచ్చు. అధిష్ఠానవర్గం నిర్ణయం మార్చుకోకపోతే ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవచ్చు. పార్టీ చేసిన నిర్ణయాన్ని అమలు చేయడం ఇష్టంలేకపోతే పార్టీ నుంచే వైదొలగవచ్చు. ఇవేమీ చేయకుండా పదవిలో, పార్టీలో ఉంటూనే ఎన్ని మాట్లాడినా సమైక్యవాదులను మోసగించడమే.
కోస్తా, రాయలసీమలకు చెందిన కాంగ్రెస్‌ మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, నాయకుల వ్యవహార సరళి కూడా ఏమాత్రం భిన్నంగా లేదు. ప్రజలను వంచిస్తున్నారు. మంత్రులు, శాసనసభ్యులు రాజీనామాలు చేస్తున్నట్టు ప్రకటిస్తున్నారు. ప్రస్తుతం ఏమాత్రం ఉపయోగంలేని పదవులకు రాజీనామా చేయడం వారికి పెద్దగా ఇబ్బంది కలిగించడంలేదు. కానీ పార్టీకి, పార్టీ పదవులకు మాత్రం అతుక్కొనే ఉన్నారు. రాష్ట్ర విభజన నుంచి వెనక్కిపోయేది లేదని కాంగ్రెస్‌ అధిష్ఠాన వర్గం పదేపదే చెబుతుంటే అధిష్ఠానాన్ని ఒప్పించి తీరుతామని మీడియా ముందు అదరగొట్టేస్తున్నారు. విభజించిన పార్టీ పేరు మీదే సమైక్యత కోసం జరుగుతున్న ఉద్యమాల్లో పాల్గొంటున్నారు. తాము చేసిన పాపానికి తమ ప్రత్యర్థులు కారణమని చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎంఐఎం, సిపిఎంలు మినహా మిగతా పార్టీలన్నీ విభజనను కోరినందునే తాము విభజనకు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని, ఇప్పుడు తమనొక్కరినే దోషులుగా చిత్రీకరించడం అన్యాయమని నంగనాచి కబుర్లు చెబుతున్నారు. మిగిలిన పార్టీలన్నీ విభజనకు అనుకూలంగా చెప్పకపోతే విభజన అనేది జరిగేదే కాదని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ఫోరం నేత శైలజానాథ్‌ ఈ వాదనకు అక్షర రూపం కూడా కల్పిం చారు. కేంద్రంలో, రాష్ట్రంలో పరిపా లిస్తున్నది కాంగ్రెస్‌ పార్టీ. విభజనైనా, సమై క్యత అయినా నిర్ణయం తీసు కోవాల్సింది కూడా కాంగ్రెస్‌ పార్టీయే. నిర్ణయం తీసుకున్నదీ కాంగ్రెస్‌ పార్టీయే. ఎవరి బలవంతం మీదనో నిర్ణయం తీసుకు న్నామని చెప్పడం సిగ్గుచేటు. గత దశాబ్దం నుంచి నిర్ణయం తీసుకోని కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు ఎవరి బలవంతం మీదనో తీసుకున్నామని చెప్పుకోవడం విడ్డూరం. ఇప్పుడైనా కోస్తా, రాయలసీమ కాంగ్రెస్‌ నాయకులకు నిజాయితీ ఉంటే డొంక తిరుగుడు వాదనలు కట్టిపెట్టి నిజాయితీతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయాన్ని నిజంగా వ్యతిరేకిస్తుంటే ఆ పార్టీ నిర్ణయాన్ని మార్పించేందుకు పూనుకోవాలి. ప్రజల్లో చేరి మోసగించే ప్రయత్నం మానుకోవాలి. పార్టీ నిర్ణయం మార్చలేమనుకుంటే ఆ పార్టీలో ఉండాలో, లేదో తేల్చుకోవాలి. పార్టీ నిర్ణయం నచ్చకపోయినా ఆ పార్టీని వీడడం కుదరదనుకుంటే నోరుమెదపకుండా కూర్చోవాలి. ప్రజలను వంచించే హక్కు వారికి లేదు.
మీడియాలో తరచుగా దర్శనమిచ్చే కాంగ్రెస్‌ నాయకులు తులసిరెడ్డి ప్రపంచమంతా గ్లోబలైజేషన్‌ దారిపడుతుంటే రాష్ట్రాన్ని విభజించడమేమిటని ఆశ్చర్యపోతున్నారు. ఇంత మాత్రం తెలివితేటలు కాంగ్రెస్‌ అధిష్ఠానవర్గానికి ఎందుకు లేదన్న అనుమానం ఆయనకుంటే అధిష్ఠానాన్నే అడిగి ఉండాల్సింది. గ్లోబలైజేషనే విభజనవాదాన్ని ప్రోత్సహిస్తుందన్న నిజం ఆయనకు తెలిసినట్టులేదు. తెలిసినా మర్చిపోదల్చుకున్నట్టుంది. ప్రపంచబ్యాంకు 2000లో విడుదల చేసిన ప్రపంచాభివృద్ధి నివేదికలో ప్రపంచం అంతా విలీనమవుతున్న కాలంలో దేశాలకు, పెద్ద రాష్ట్రాలకు ప్రాధాన్యత లేకుండా స్థానిక స్థాయికి ప్రాధాన్యత పెరిగిందని విశ్లేషణ చేసింది. అంతర్జాతీయ పెట్టుబడికి దోచుకోవడానికి ఎక్కడా ఏ ఆటంకాలుండకూడదు. బహుళజాతి కంపెనీలకు, రిలయన్స్‌ వంటి దేశీయ కార్పొరేట్‌ గుత్త సంస్థలకు బలమైన రాష్ట్రాలు ఆటంకాలుగా ఉండకూడదు. అందుకే రాష్ట్రాలు ముక్కలు కావాలని అవి కోరుకుంటున్నాయి. గ్లోబలైజేషన్‌ గురించి చప్పట్లు కొడుతున్న తులసిరెడ్డి లాంటి నాయకులకు రాష్ట్రాలను ముక్కలు చేయడం దాంట్లో భాగమేనన్న విషయం తెలియకపోవడం విచిత్రమే.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తన ఆవేదననంతా వెళ్ళగక్కుతూ ప్రధానమంత్రికి సుదీర్ఘమైన లేఖ రాశారు. రాష్ట్ర విభజనను ప్రకటించిన 10 రోజుల తర్వాత లేఖ రాసినా, దానిలో తెలుగుదేశం పార్టీలోని అయోమయమే కన్పించింది. తెలుగుజాతి ఐక్యంగా ఉండాలన్న ఆకాంక్షను వ్యక్తం చేస్తున్న అధినేత, రాష్ట్ర విభజన ఏ రకంగా తెలుగు ప్రజల ఐక్యతను కాపాడుతుందో వివరిస్తే బాగుండేది. తమ పార్టీ రాజకీయ వైఖరిని స్పష్టం చేసేదానికన్నా కోస్తా, రాయల సీమలలో వెల్లువెత్తుతున్న సమైక్య వాం ఛను అస్పష్టమైన అనునయింపు మాట లతో సంతృప్తి పరచాలనే ఆదుర్దా కనిపిస్తుంది. గతంలో రాష్ట్ర విభజనను సమర్థించడం తప్పు అనుకుంటే ఆ విషయాన్ని ఒప్పుకుని సమైక్యత కోరుకుంటున్నట్టుగా ప్రకటించాలి. లేదా ఇప్పటికీ విభజనకు మద్దతివ్వడం సరైందనుకుంటే ఆ విషయాన్ని స్పష్టంగా, సూటిగా చెప్పిన తర్వాత ఇంకేమైనా మాట్లాడవచ్చు. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తెలుగుదేశం నాయకులు రాష్ట్ర సమైక్యత గురించి చేస్తున్న విన్యాసాలు నిజాయితీతో కూడినవి అనుకుంటే వారు తమ పార్టీ వైఖరిని మార్చుకోమని నాయకత్వాన్ని కోరాలి. లేదా పార్టీ వైఖరి మార్చుకోకపోతే పార్టీలో ఉండాలో, లేదో తేల్చుకోవాలి. అలా చేయకుండా కాంగ్రెస్‌ వంచనను, ద్రోహాన్ని, అప్రజాస్వామిక వైఖరిని ఎంత ఖండించినా, ఆ ఖండనలో ఎంత వాస్తవం ఉన్నా తమ అవకాశవాదం, విభజనలో తమ వంతు పాత్ర నుంచి తప్పించుకోలేరు.
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేతలు జగన్‌, విజయమ్మ కూడా సుదీర్ఘమైన బహిరంగ లేఖను సంధించారు. ఆ లేఖలో కూడా విభజనకు అనుకూలమా? ప్రతికూలమా అనే విషయాన్ని వారు స్పష్టం చేయలేదు. కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటామని గతంలో చెప్పిన మాటకు ఇంకా పార్టీ కట్టుబడి ఉన్నదా? దాని నుంచి వెనక్కి తగ్గిందా? పేర్కొనలేదు. విభజన జరిగితేనే మంచిదని మనసు లోపల ఉంచుకుని సమైక్యత కోసం ప్రజల్లో వ్యక్తమవుతున్న ఆకాంక్షకు అనుగుణంగా బయట మాట్లాడుతున్నట్లుగా ఉన్నది. ఆ పార్టీ శాసనసభ్యులు అందరికన్నా ముందు సమైక్య రాష్ట్రం కోసం రాజీనామాలు చేసినట్టుగా ప్రచారం చేసుకుం టున్నారు. కోస్తా, రాయలసీమల్లో సమైక్య రాష్ట్రం విషయంలో అందరూ అవకాశవాదంగా వ్యవహరిస్తుంటే తామే నిజాయితీతో ఉన్నట్టు చెప్పు కుంటున్నారు. పార్టీ పుట్టక ముందు వైఎస్‌ఆర్‌ వ్యవహరించిన అవకాశవాదాన్ని కాంగ్రెస్‌ ఖాతాలో వేసినా, ఇప్పుడు వైఎస్‌ఆర్‌సిపి చేస్తున్న హడావిడి వెనకా అవకాశవాదమే ఉన్నది.
రాష్ట్ర విభజన జరగాలని చాలా కాలం నుంచి చెబుతున్న బిజెపి కూడా తన అవకాశవాద ముఖాన్ని ప్రదర్శిస్తున్నది. కోస్తా, రాయలసీమల్లో సమైక్యతా వాంఛ తీవ్రంగా ప్రజల్లో వ్యక్తం అవుతుండడాన్ని గమనించి వారిని సంతృప్తి పరిచేందుకు మోడి హైదరాబాద్‌ రాక సందర్భంగా చేసిన ప్రయత్నం అందరూ గమనించవచ్చు. గుజరాత్‌లో గుజరాతీలు, తెలుగు ప్రజలు కలిసి బ్రతకగా లేనిది ఇక్కడ తెలంగాణా, కోస్తా, రాయలసీమ ప్రజలు ఎందుకు కలిసి బ్రతకలేరు అని ఆయన అమాయకంగా ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత బిజెపిదే. విభిన్న భాషల ప్రజలు కలిసి బ్రతుకుతుంటే ఒకే భాష ప్రజలను విడదీయాలని బిజెపి ఎందుకు కోరుతుందో బిజెపియే చెప్పాల్సి ఉంది. ఒకవైపున ప్రత్యేక తెలంగాణా బిల్లును వెంటనే పార్లమెంటులో పెట్టాలని డిమాండ్‌ చేస్తూ మరోవైపున ఇక్కడ అనునయ వ్యాఖ్యలు పలుకుతూ బిజెపి కూడా తన ఎన్నికల రాజకీయాలను ప్రదర్శించుకుంది.
తాము మాత్రమే నిజాయితీగా ఉన్నామని తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌సిపిలు ఎన్నికల లాభం కోసం అవకాశవాదంతో వ్యవహరిస్తున్నాయని కాంగ్రెస్‌ నాయకులు చెబుతుంటే - కాంగ్రెస్‌, వైఎస్‌ఆర్‌సిపీలే ఎన్నికల యావతో వ్యవహరిస్తున్నాయని తెలుగుదేశంవారు - టిడిపి, కాంగ్రెస్‌లే ఎన్నికల్లో లబ్ధి కోసం మోసం చేస్తున్నాయని వైఎస్‌ఆర్‌సిపి నాయకులు నిందించుకుంటున్నారు. మొత్తంగా ఈ పార్టీల విన్యాసాలు చూస్తే బూర్జువా-భూస్వామ్య పార్టీల ఎన్నికల అవకాశవాదం ఏ రకంగా ప్రజల జీవితాలతో, ప్రజల ఐక్యతతో చెలాగాటమాడుతోందో మరోసారి స్పష్టంగా కనిపిస్తుంది. 
-ప్రజామిత్ర(ప్రజాశక్తి 15.8.2013)

Tuesday, August 13, 2013

నేటి (13.8.2013) వ్యాసం, చర్చ

మోగని మోడీ!
కార్పొరేట్‌ మీడియా నరేంద్ర మోడీ గురించి పనిగట్టుకుని సాగిస్తున్న ప్రచార కాండ పస ఏమిటో ఆదివారం హైదరాబాదు సభతో తేలిపోయింది. ప్రధాని పరుగులో ముందుండాలని కలలుగంటున్న కాషాయ నేత శత ప్రచార సభలకు ఇది పేలవమైన ప్రారంభం అనాలి. అన్యధా శరణం నాస్తి అన్నట్టున్న స్థితిలో బిజెపి నాయకత్వం మోడీపై ఆశలు పెట్టుకుని ఊరేగిస్తున్నప్పటికీ ఆయనకూ ఆ అభివృద్ధి నిరోధక మతతత్వ పార్టీకి సహజంగా ఉన్న పరిమితుల రీత్యా ఇది మరోలా ఉండటం అసంభవం. తమ మౌలిక మతతత్వ సిద్ధాంతాలు చెబితే ప్రజలు మెచ్చరు గనక సూటిగా చెప్పలేరు. ప్రగతిశీల ప్రజాస్వామిక ప్రణాళికలు వారి దగ్గర ఎలాగూ ఉండవు. ఏతావాతా మిగిలేది ఉత్తుత్తి వాగాడంబరం, శుష్క సూక్తులే.

మోడీ పర్యటనలో జరిగిందదే.నరేంద్ర మోడీ ప్రసంగం కాంగ్రెస్‌పై విమర్శలతో సాగడంలో ఆశ్చర్యం లేదు గాని విధానపరంగా ఆయన ప్రస్తుత నమూనాను ఏమీ అన్నది లేదు. యువతను అంత పెద్ద ఎత్తున సమీకరించిన మోడీ వారికి ఒక ఆశాజనకమైన విధాన ప్రణాళిక ఇవ్వకుండానే “వుయ్ కెన్,  వుయ్ కెన్”  అని ఉత్తుత్తి ప్రతిజ్ఞ చేయిస్తే ఫలమేమిటి? హౌ కెన్‌” అన్నది దాటేసి “వుయ్  కెన్‌”  అనడం బూటకం. రూపాయి విలువ పతనం, నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి విషయాలెన్ని ప్రస్తావించినా అందుకు కారణమైన విధానాలను అంటుకున్నది లేదు. ఎందుకంటే బిజెపి కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు గాని, ఇప్పుడు గుజరాత్‌తో సహా పాలిస్తున్న చోట్ల గాని అక్షరాల ఇవే విధానాలను అమలు చేస్తున్నది.

కాంగ్రెస్‌ కన్నా సమర్థంగా సరళీకరణ అమలు చేస్తానని దేశ, విదేశీ కార్పొరేట్ల అండదండలు కూడగట్టుకుంటున్న బిజెపి వాస్తవంలో వాటిని ఒక పిసరు అదనంగానే అనుసరిస్తుంది. గత శుక్రవారం మా సంపాద కీయంలో పేర్కొన్నట్టు ఈ విధానాల అమలులో ఉభయపార్టీల మధ్య మ్యాచ్‌ ఫిక్సింగ్‌ నడుస్తోంది. రాహుల్‌ వర్సెస్‌ మోడీ రాజకీయ ప్రహసనం అందులో భాగమే. దేశ భద్రత, పాకిస్తాన్‌ సైన్యం ఘాతుకాలు వంటి అంశాలను మోడీ దాడికి ఉపయోగించుకున్నారు గాని ఘనత వహించిన వారి ఎన్‌డిఎ ప్రభుత్వ హయాంలో ఇంతకన్నా అధ్వానమైన వ్యవహారాలు జరిగాయని ఎవరూ మర్చిపోలేదు. కాందహార్‌లో టెర్రరిస్టుల అప్పగింత, పార్లమెంటుపై టెర్రరిస్టు దాడి, మోడీగారి గుజరాత్‌లో అక్షర ధాంపై దాడి ఇవన్నీ ఎందుకు అరికట్టలేకపోయారు? కార్గిల్‌లో పాక్‌ దళాలు చొచ్చుకు వచ్చి తిష్ట వేసేంత వరకూ పసిగట్టకుండా పడుకుని గుర్రు పెట్టారే! ఆ నిర్లక్ష్య నిర్వాకాలకు ఆ తర్వాత దేశం ఎంత మూల్యం చెల్లించింది? కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పుడు సాగిస్తున్న అస్తవ్యస్త వ్యవహారాలను సమర్థించనవసరం లేదుగాని బిజెపి పరిస్థితి అంతకన్నా ఘోరంగా ఉందని ఈ వాస్తవాలే చెబుతున్నాయి. అలాగే పాక్‌నూ, చైనానూ ఒకే గాట కట్టి మాట్లాడ్డంలో ఆరెస్సెస్‌ రాజకీయం తప్ప దౌత్య నీతి గోచరించదు.

 విదేశాంగ విధానానికి సంబంధించి అమెరికాకు సాగిలబడటంలోనూ కాంగ్రెస్‌ బిజెపిల మధ్య ఆట్టే తేడా శూన్యం. కనుకనే దేశ సార్వభౌమత్వం, అమెరికా ఆధిపత్య వ్యతిరేకత వంటి మాటలు ఆయన నోట రావు. స్వతంత్ర ఆర్థికాభివృద్ధి, వ్యవసాయ సంక్షోభ నివారణ, ఉపాధి కల్పనా వ్యూహం, ఇత్యాది విషయాలు ఆయన ప్రస్తావిస్తారని ఆశపడిన వారికి నిరుత్సాహమే మిగలడం సహజం.

మోడీ ఎంపిక తర్వాత మోడువారిన ఎన్‌డిఎలో అకాలీదళ్‌ తప్ప చెప్పుకోదగ్గ భాగస్వామి ఒక్కటంటే ఒక్కటి లేదు. ప్రస్తుత సభలో కేవలం 116 స్థానాలు మాత్రమే పొందిన బిజెపికి ఈసారి బలం తగ్గడం తప్ప పెరిగే సూచనలు అగుపించడం లేదు. ఈ స్థితిలో కలసి వచ్చే వారి కోసం తహతహ లాడుతున్న బిజెపి నేతగా మోడీ ఎన్టీఆర్‌ వారసత్వ స్మరణ చేసి తెలుగు దేశంపై వల విసిరారు. ఆయన చైర్మన్‌గా ఉన్న నేషనల్‌ ఫ్రంట్‌లో బిజెపికి చోటు కల్పించలేదనీ, ఆ ఫ్రంట్‌ ప్రభుత్వంలోనూ బిజెపిని చేర్చుకోలేదనీ గుర్తుంచుకోవాలి. రథయాత్రానంతర మత కలహాలనూ, బాబరీ విధ్వంసాన్ని ఎన్టీఆర్‌ నిరసించారు. తర్వాత వారితో పొత్తు పెట్టుకోలేదు కూడా. చంద్రబాబు మాత్రమే 1999, 2004 ఎన్నికల్లో జతకట్టి తర్వాత ఆ విధానం మార్చుకున్నామని ప్రకటించారు. మోడీ వ్యాఖ్యలపై తెలుగుదేశం ఎలా స్పందిస్తుందో గానీ ఎన్టీఆర్‌ది లౌకిక వారసత్వమే. కాంగ్రెస్‌ వ్యతిరేకత పేరిట నానాజాతి కూటమి కట్టి తాను అధికార సోపానం అధిరోహించాలనేది బిజెపి చిరకాల వ్యూహమే. మోడీ దాన్ని పునరావృతం చేయాలని చూస్తున్నా కోరి కొరివితో తల గోక్కునేవారెవరూ ఉండరని ఆశించాలి.

 కాంగ్రెసేతర లౌకిక శక్తుల ప్రత్యామ్నాయం విధానాల ప్రాతిపదికన రూపొందించేందుకు వామపక్షాలు ఇప్పటికే ఒక పత్రం ప్రకటించాయి కూడా. విధానాల ప్రసక్తిలేని మోడీ వాగాడంబరానికి, దానికి హస్తిమశకాంతరం తేడా. ఇప్పుడు తెలంగాణా, సీమాంధ్ర సోదరుల్లా మెలగాలని హితబోధ చేయడం మంచిదే గాని చిన్న రాష్ట్రాల చిచ్చు బిజెపి అధికార విధానమన్నది కూడా ఆ నోటితోనే చెప్పారు. హిందూత్వ నామస్మరణ గుజరాత్‌లో ఘోర నరమేధాన్ని అనుమతించిన మోడీ హైదరాబాదు వంటి చోట నామమాత్రంగానైనా మైనార్టీల ప్రస్తావన చేయకపోవడం యాథృచ్ఛికం కాదు. ఆ బాధ్యత తమపై వేసుకున్న రాష్ట్ర జాతీయ తెలుగు నాయకులు షరా మామూలుగా మజ్లిస్‌ను విమర్శించే పేరిట స్థానిక సాంప్రదాయిక మతతత్వ భాష మాట్లాడారు. జవహర్‌లాల్‌ నెహ్రూ గాక సర్దార్‌ పటేల్‌ ప్రధాని అయివుండాల్సిందంటూ మోడీ చేసిన మరో ప్రసంగంలో సంఘ పరివార్‌ తాత్వికతను పూర్తిగా ప్రతిధ్వనించారు. వీర తెలంగాణా సాయుధ పోరాటం నిజాం నిరంకుశత్వానికి గోరికట్టి విముక్తి చేస్తే అది సర్దార్‌ పటేల్‌ ఘనకార్యమైనట్టు మోడీ ఇక్కడకొచ్చి చెప్పడం హాస్యాస్పదం. అభినవ సర్దార్‌ బిరుదు అద్వానీ నుంచి లాగేసుకున్న మోడీ సోషల్‌ నెట్‌వర్క్‌లు వాడుతున్నా బూజుపట్టిన భావజాలానికి ప్రతినిధి గనకే నవభారతం ఆయనను తోసిపుచ్చాల్సి ఉంటుంది.(ప్రజాశక్తి 13.8.2013 సంపాదకీయం)

మోసపూరితం... అవకాశవాదం

రాజకీయ పక్షాల వైఖరి మారకుండా విభజన ఆగదు –సి పి ఏం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు

కాంగ్రెస్‌, తెలుగుదేశం, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీల నాయకులు ప్రజలను మోసం చేసేందుకే సమైక్య ఉద్యమంలో పాల్గొంటున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు విమర్శించారు. సమైక్య రాష్ట్రంపై చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్యే, ఎంపీ పదవులకు కాకుండా తమ పార్టీలకు రాజీనామా చేసి ఆ పార్టీలపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. సోమవారం కర్నూలులో విలేకరుల సమావేశంలోను అనంతరం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో రాఘవులు మాట్లాడారు. పార్టీల వైఖరి మారకుండా రాష్ట్ర విభజన ప్రక్రియ ఆగదని అన్నారు. విభజన విషయంలో కాంగ్రెస్‌, టిడిపి, బిజెపి అవకాశవాదంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. సిడబ్య్లుసిలో రాష్ట్ర విభజనకు తీర్మానం చేశాక రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లో పెద్దఎత్తున ఆందోళనలు వచ్చాయని తెలిపారు. తమ పార్టీల వైఖరిని మార్చే విధంగా నాయకులు ఒత్తిడి తేవాలని సూచించారు. నాలుగు నెలల్లో ముగిసే ఈ పదవులు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అన్న పద్ధతిలో రాజీనామాలు చేస్తున్నారనీ, మళ్లీ ఎన్నికల్లో మీ కోసం నిలబడ్డామంటూ మాయమాటలు చెబుతారనీ అన్నారు. రాష్ట్ర విభజనకు సిద్ధమని టిడిపి లేఖ రాసిందని, కాంగ్రెస్‌ నాయకులు అధిష్టానం నిర్ణయానికి, వైఎస్‌ఆర్‌సిపి కేంద్రం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ప్రకటించారని గుర్తు చేశారు. ఇప్పుడు సమైక్యాంధ్ర కావాలని ఆందోళన చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఎన్ని ఇబ్బందులున్నా సిపిఎం భాషా ప్రయుక్త రాట్ట్రాలకు కట్టుబడి ఉందని చెప్పారు. రాష్ట్రాన్ని విభజించే వారిని అడ్డుకునే శక్తి తమ పార్టీకి లేదన్నారు.

 ఎన్జీవోలు ఆందోళనకు సిద్ధమవుతున్నారని, మోసపూరిత పార్టీల మాటలు నమ్మి మోసపోతారేమోనని బాధగా ఉందని రాఘవులు అన్నారు.మంత్రి టిజి వెంకటేశ్‌ కాంగ్రెస్‌ అధిష్టానం ముందు రాయల తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చి, ఇక్కడేమో సమైక్య ఉద్యమంలో పాల్గొంటున్నారని తెలిపారు. ఆయన వైఖరి మందలో మేకతోలు వేసుకున్న తోడేలులా ఉందన్నారు. ఇలాంటి వారిని నిలదీయాలన్నారు. విభజనకు అనుకూలంగా ఉన్న పార్టీల్లో ఉంటూ మళ్లీ సమైక్యాంధ్ర కోసం ఆందోళనలు చేస్తే అది మోసపూరితం అవుతుందని తెలిపారు.

బిజెపి నాయకులు నరేంద్ర మోడీ మాటలు మోసపూరితంగా ఉన్నాయని, గుజరాత్‌లో గుజరాతీలు, తెలుగువారు కలిసి ఉన్నప్పుడు లేని అభ్యంతరం ఇక్కడ తెలంగాణ, సీమాంధ్రులూ కలిసి ఉండలేరా అని రాఘవులు ప్రశ్నించారు. కలిసి ఉండటమంటే సమైక్యవాదం కాదా.. ఒక ప్రాంతాన్ని ఎందుకు విడగొట్టాలని బిజెపి అనుకుంటోంది... అని అన్నారు. బిజెపి మొదటి నుండీ చిన్న రాష్ట్రాల డిమాండ్‌తో ఉందని, చిన్న రాష్ట్రాలుంటే మతవిద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందవచ్చని యోచిస్తోందని విమర్శించారు. చిన్న రాష్ట్రాల వల్ల కార్పొరేట్‌ శక్తులకు, ప్రపంచ బ్యాంకుకు, సామ్రాజ్యవాదులు తమ విధానాలను సులువుగా అమలు చేసేందుకు సాధ్యమవుతుందని తెలిపారు.

రాష్ట్ర విభజన వల్ల ఎలాంటి నష్టం వాటిల్లుతుందో తాము మొదటి నుంచీ చెబుతున్నామని గుర్తు చేస్తూ.. ఇప్పుడు విభజన ప్రక్రియ మొదలయ్యాక ఆ నష్టాల గురించి అందరూ మాట్లాడుతున్నారని చెప్పారు. విభజన వాదంపై సిపిఎం చెప్పిందే కరెక్ట్‌ అని ఇప్పుడు అంటున్నారని తెలిపారు. అవకాశవాద, మోసపూరితంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్‌, టిడిపి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీల ఉద్యమాలు విఫలమవుతాయే తప్ప ప్రజలకు ఎలాంటి ప్రయోజనం సమకూరదని అన్నారు. రాష్ట్రంలో గత మూడున్నరేళ్ల నుండి ప్రభుత్వమే లేదని, విభజన ప్రకటన తర్వాత ప్రభుత్వం పాత్ర మరింత దిగజారిపోయిందన్నారు. 108 సిబ్బంది, జూనియర్‌ డాక్టర్లు సమ్మెలో ఉంటే వారి గురించి అస్సలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. వరదలకు తోడు వర్షాకాలంలో వచ్చే రోగాలతో ప్రజలు విలవిల్లాడుతున్నా పట్టించుకునే వారు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.(ప్రజాశక్తి 13.8.2013)

అచంచల వైఖరిపై అవహేళన

రాష్ట్రంలో అన్ని ఫ్రధాన పార్టీలూ విభజన సమస్యపై పరిపరి విధాల విన్యాసాలు చేస్తున్నాయి. అక్కడా ఇక్కడా లాభం పొందడమెలాగని తలలు పగలగొట్టుకుంటున్నాయి. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వంటివారిని కూడా చెరొక విధంగా మాట్లాడనిస్తున్నాయి. రాజీనామాల రాజకీయాలు నడిపిస్తున్నాయి. విలీనాలనూ, ఫిరాయింపుల బెడదనూ తప్పుకోవడానికి తంటాలు పడుతున్నాయి. ఇన్ని మల్లగుల్లాల మధ్యనా స్థిరంగా, నికరంగా నిలబడిన పార్టీ సిపిఎం. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ నిశ్చలంగా, నిశ్చయంగా ఒకే వైఖరి తీసుకున్న పార్టీ అది. భాషా రాష్ట్రాల విభజన నష్టదాయకమని అప్పుడూ ఇప్పుడూ చెబుతున్నది. తాజాగా రాజ్యసభలోనూ సీతారాం ఏచూరి అదే చెప్పారు. ఇందుకు భిన్నంగా ఏ రోటి దగ్గర ఆ పాట అన్నట్టు వ్యవహరిస్తున్నాయి చాలా పార్టీలు. ఈ కారణంగానే రాజకీయ ప్రత్యర్థులు సైతం సిపిఎం కచ్చితంగా నిలబడిందని అభినందిస్తున్నారు. అయితే అతికొద్దిమంది మేధావులకు, విమర్శకులకు మాత్రం సిపిఎం విధానం నచ్చడం లేదు. సమైక్యత అంటూనే అక్కడా, ఇక్కడా ఏమీ చేయడం లేదని అలాటి వారి వ్యాఖ్య. ప్రజాస్వామిక స్ఫూర్తి, వాస్తవిక దృష్టి ఉన్న ఏ పార్టీ అయినా ప్రజలు ప్రాంతాల వారీగా, రెండు శిబిరాలుగా చీల్చబడిన ఇలాటి క్లిష్ట సమయంలో సంయమనం పాటించడం సహజమని వారు అర్థం చేసుకోలేక పోవడం విచారకరం. ఈ పేజీలో ప్రచురించిన కొన్ని వ్యాసాలలో పేర్కొన్నట్టు విభజన, సమైక్యత నినాదాలు రెండింటినీ పాలక వర్గ పార్టీలు దుర్వినియోగపర్చి భావోద్వేగాలు రగిలిస్తున్నాయి. వీటన్నిటి చాటునా వాస్తవం ప్రజలకు అర్థం కావడానికి కొంత సమయం అవసరం. పైగా అధికారం చేతిలో ఉన్న పార్టీలూ అంగబలం, అర్థబలం గల పార్టీలూ రాజకీయ మనుగడ కోసం ప్రజలను దారి తప్పిస్తున్నప్పుడు మరగుపడుతున్న సమస్యలపై పోరాడవలసిన కర్తవ్యం కూడా ముఖ్యమైందే. ఒక కమ్యూనిస్టు పార్టీగా సిపిఎం ఆ పాత్ర నిబద్ధంగా నిర్వహించింది. నిర్వహిస్తున్నది. అవకాశవాదాలను ఎండగడుతూ ఒకటైనా, రెండైనా పోరాటం అనివార్యం అంటూ ప్రజల పోరాట ఐక్యతను చాటి చెబుతున్నది. ఈ క్రమంలో ప్రజల అవగాహనను పెంచేందుకు, ఆచరణను పదునెక్కించేందుకు బహుముఖ కార్యక్రమాలు సాగిస్తున్నది. అసలు దోషులను వదలిపెట్టి ఇంత నిర్దిష్టమైన కార్యాచరణతో నిలబడిన సిపిఎంపై విమర్శలు చేయడంలో ఔచిత్యమేమిటో సదరు మేధావులే ఆలోచించాలి.(ప్రజాశక్తి 13.8.2013)