Sunday, May 18, 2014

ఎన్నికల ఫలితాలు, ఆ తరువాత

2014 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రాజకీయ పరిస్థితిని సమూలంగా మార్చాయి.  1984 తరువాత లోక్ సభలో  ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాలేదు. కానీ ఇప్పుడు బి జె పి ఒక్క దానికే 282 సీట్లతో పూర్తి మెజారిటీ వచ్చింది. బి జె పి తో సహా  ఎన్ డి ఏ కూటమి కి 333 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ కు చరిత్రలో ఎన్నడూ లేనంత తక్కువగా 44 సీట్లు మాత్రమే వచ్చి ప్రతిపక్ష పార్టీ హోదా కూడా దక్కని పరిస్థితి ఏర్పడింది. లోక సభ లో ప్రతిపక్ష గ్రూపులేగాని ప్రతిపక్ష పార్టీ అంటూ ఏది వుండదు.

స్వాతంత్ర్యం వచ్చినప్పటినుండి ఇప్పటివరకు వున్న రాజకీయ పరిస్థితి మొత్తముగా మితవాదానికి మత వాదానికి అనుకూలముగా లేదు. కానీ ఇప్పుడు మితవాద, మతవాద పార్టీ అయిన బిజెపి కి పూర్తి మెజారిటీ వచ్చింది. (మన దేశ రాజకీయాలలో కాంగ్రెస్  మధ్యేవాద పార్టీగా, బిజెపి మితవాద- మత వాద పార్టీగా, వామ పక్షాలు అతివాద పార్టీలుగా వున్నాయి.). ఇది సమూలమయిన మార్పు.

నిరుద్యోగం, ధరల పెరుగుదల, వ్యవసాయ రంగ సంక్షోభం, అవినీతి వలన ఏర్పడిన తీవ్ర అసంతృప్తి కారణంగా ప్రజలు కాంగ్రెస్ ని చిత్తు చిత్తుగా ఓడించారు. బి జె పి మినహా మరో ప్రత్యామ్నాయం ఏదీ కనిపించనందున ప్రజలకు కాంగ్రెస్ ను ఓడించటానికి బి జె పి ని గెలిపించారు. కార్పొరేట్ మీడియా బిజెపి కి వున్న అవలక్షణాలన్నీ కప్పిపుచ్చింది.  మోడి వస్తే బ్రహ్మాండమయిన అభివృద్ధి జరుగుతుందని, సుపరిపాలన వస్తుందని, అవినీతి వుండదని ప్రచారం చేసింది. ఈ విధమయిన భ్రమలను ప్రజలలో కార్పొరేట్ మీడియా విజయవంతముగా సృష్టించగలిగింది. మరోవంక ప్రజలను , ప్రత్యేకించి యూపీ, బీహార్ లో మతపరమయిన ఉద్వేగాలతో బిజెపి వెనుక సమీకరించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు మోడి అనుచరుడు అమిత్ షా ఆధ్వర్యములో జరిగాయి. ఈ పరిస్థితులలో కాంగ్రెస్ వ్యతిరేక వోటు బి జె పి కి భారీ స్థాయిలో లభించింది.

వామపక్షాలు కేరళలో తమ బలాన్ని కొంత పెంచుకోగలిగాయి. త్రిపురలో వున్న రెండు లోక్ సభ  సిట్లలోను  సి పి ఏం మరో సారి మరింత మెజారిటీతో ఘన విజయం సాధించింది. కానీ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ రాష్ట్ర వ్యాపితముగా భారీ ఎత్తున రిగ్గింగుకు, బెదిరింపులకు, హింసకు పాల్పడినా ఎలక్షన్ కమిషన్ పట్టించుకోటం లో విఫలమయినందున రెండు సీట్లలో మాత్రమే వామ పక్షం గెలవగలిగింది. ఇంతటి అననుకూల పరిస్థితులలో కూడా లెఫ్ట్ ఫ్రంట్ కు  బెంగాల్లో 30 శాతం ఓటింగు వచ్చింది. ఏమయినప్పటికి వామపక్షాలు ఎందుకిలా జరిగిందో, క్రమముగా ఎన్నికల రాజకీయాలలో బలం ఎందుకు తగ్గుతున్నదో  సమీక్షించుకుని సరయిన గుణపాఠం తీసుకుని తగు కార్యాచరణను నిర్ణయించుకోవాల్సిన అవసరం వున్నది.

విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణాన్ని చేయగల సమర్థత బాబు-మోడి జోడికి మాత్రమే వున్నదన్న ప్రచారాన్ని, రైతులకు ఋణ మాఫీ తదితర హామీలను  ప్రజలు విశ్వసించి చంద్రబాబుకు పట్టం కట్టారు. రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా అభిమానించి అది కురిపించిన హామీలను నమ్మి తెలంగాణా లో ప్రజలు టి ఆర్ ఎస్ కు  పట్టం కట్టారు. మన రాష్ట్రములో ఎన్నికలలో డబ్బు ప్రభావం విపరితమయింది. పోటీ చేసిన ప్రధాన బూర్జువా పార్టీలు వోటర్లకు డబ్బులు పెద్ద ఎత్తున ఇచ్చాయి. విపరీతముగా డబ్బు ఖర్చు పెట్టాయి. ఇది డబ్బు ఖర్చు పెట్టలేని వామపక్షాలను ఉద్యమం ఒక మేరకు వున్న చోట్లకూడా ఎన్నికల పోటీలో నిలబడటం కష్టమయిన పరిస్థితిని సృష్టించింది. డబ్బు తో వొట్ల కొనుగోలు విధానం ఎన్నికల రంగం నుండి   వామ పక్షాలని తొలగించేందుకు దారి తీస్తున్నది.  ఈ ఎన్నికలలో గమనించాల్సిన ఒక ముఖ్యమయిన విషయం కార్పొరేట్ అధినేతలు, అధిక సంపన్నులు బూర్జువా పార్టీల అభ్యర్థులుగా అత్యధిక స్థానాలలో నిలబడటం. 

కేంద్రం లో గెలిచిన బి జె పి అవినీతి లేని,  దృఢమయిన నిర్ణయాలతో కూడిన సుపరిపాలన అందిస్తానన్నది. అవినీతి విశ్వరూపం ధరించటానికి మూలకారణం నయా ఉదార వాద ఆర్థిక విధానాలు. బి జె పి నయా ఉదార వాద ఆర్థిక విధానాలకు, కాంగ్రెస్ వలెనే, లేదా అంతకన్నా ఎక్కువ, అనుకూలం. అటువంటప్పుడు అది అవినీతిని ఎలా నిర్మూలించగలదు? ఎన్ డి ఎ (వాజపాయి) హయాములో జరిగిన అవినీతి, గుజరాత్ లో జరిగిన అవినీతిని గుర్తుకు తెచ్చుకుంటే ఇప్పుడు అవినీతిని నిర్మూలించటానికి మోడి వద్ద వున్న మంత్రదండమేమిటనే సందేహం రాక తప్పదు.దృఢమయిన నిర్ణయాలు ఎవరికోసం ప్రభుత్వం తీసుకోవాలనేదే ప్రధాన సమస్య. ప్రధాన మంత్రిగా మోడి తీసుకోబోయే “దృఢమయిన” నిర్ణయాలు ప్రజలకి అనుకూలముగా వుంటాయా లేక విదేశీ స్వదేశీ బడా కార్పొరేట్ల దోపిడి మరింత విశృంఖలముగా జరగటానికి అనుకూలముగా వుంటాయా?

ధరల పెరుగుదలని నియంత్రించటం, నల్ల ధనం వెలికి తీయటం, ఆహార భద్రత, సామాజిక న్యాయం, సాధికారికత, మైనారిటీలకు సమాన అవకాశాలు, మధ్యతరగతి ఆశలు నెరవేర్చటం, ఉద్యోగాల కల్పన, దారిద్ర్య నిర్మూలన కార్య క్రమాలు, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి, గ్రామీణ ప్రజలకు పట్టణ సౌకర్యాలు, పట్టణాలలో ట్రాన్స్పోర్టు మరియు హౌసింగులకు ప్రత్యేక కార్య క్రమాలు, పట్టణ దారిద్ర్య నిర్మూలన కార్యక్రమాలు, సాంకేతిక పరిజ్ఞానం లో ప్రగతి, పిల్లల సంరక్షణ మరియు అభివృద్ధి,సీనియర్ సిటిజన్సు సంరక్షణ మరియు ఆరోగ్య రక్షణ, వికలాంగుల సంక్షేమం, యువజనుల అభివృద్ధి,మహిళా సంక్షేమం, మహిళలకు చట్ట సభలలో 33 శాతం రిజర్వేషన్ కు చట్టం చేయటం, విద్యా రంగం అభివృద్ధి,నైపుణ్యం మరియు ఉత్పాదకతల అభివృద్ధి, నాణ్యమయిన వైద్యం తక్కువ ఖర్చుతో అందరికీ అందుబాటులోకి తేవటం, ఆర్థిక మాంద్యం తొలగింపు కు తగిన నిర్ణయాలు, వ్యవసాయ రంగానికి ప్రభుత్వ పెట్టుబడి పెంచటం, రైతులకు ఎరువులు విత్తనాలు ఎలక్ట్రిసిటీ తదితరాల ధరల తగ్గింపు,వ్యవసాయ ఖర్చు పై 50 శాతం లాభం గ్యారంటీ చేయటం, పారిశ్రామిక అభివృద్ధికి అవసరమయిన చర్యలు, చిన్న పరిశ్రమలకు సంరక్షణ,ఎగుమతులకు ప్రోత్సాహం, స్వల్ప ఖర్చుతో అందరికీ గృహవసతి, మౌలిక వసతుల(రోడ్లు, రైలు మార్గం, ఓడ రేవులు, విమానాశ్రయాలు, తేలికమ్యూనికేషన్సు, ఎలక్ట్రిసిటీ మొదలగునవి మౌలిక వసతులు) అభివృద్ధి, వాతావరణ కాలుష్య నివారణకు చర్యలు,దేశ రక్షణకు దృఢమయిన చర్యలు తదితర హామీలను బిజెపి తన ఎన్నికల ప్రణాళికలో ఇచ్చింది. కాంగ్రెస్ కూడా దాదాపు ఈ హామీలనే ఇచ్చింది. ఇప్పటివరకు కొనసాగిన కాంగ్రెస్ పాలన రుచి చూసి అంతకుముందున్న బిజెపి పాలన రుచి మర్చిపోయినందున ప్రజలు బిజెపికే మొగ్గు చూపారు. ఏమయినా ప్రజలకి అనుకూలముగా ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత ఇప్పుడు ఏర్పడబోయే మోడి ప్రభుత్వానికి వున్నది. ఈ హామీల అమలుకు ప్రభుత్వము పై ఒత్తిడి చేయాల్సిన అవసరం వున్నది.

ఈ హామీల అమలు అలా వుంచితే, బి జె పి తన ఎన్నికల ప్రణాళికలో ప్రకటించినదాని  ప్రకారం అది రక్షణ రంగం తో సహా అన్నీ రంగాలకు (మల్టీబ్రాండ్ రిటెయిల్ వ్యాపార రంగం  మినహా) ఎఫ్ డి ఐ ని భారీ ఎత్తున స్వాగతం చెప్పటానికి అనుకూలముగా వున్నది. ప్రభుత్వాన్ని కనీస స్థాయికి కుదించాలని బి జె పి ఎన్నికల ప్రణాళిక ప్రకటించింది. దీని అర్థం ఏమిటి? ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటుపరం చేయటమా? గత ఎన్ డి ఎ ప్రభుత్వము ప్రభుత్వ రంగ సంస్థల డిజిన్వేస్టుమెంటుకు ఒక ప్రత్యేక శాఖని సృష్టించిందని ఈ సందర్భముగా మనము గుర్తు చేసుకోవాలి. పబ్లిక్  ప్రైవేట్ పార్టీసీపేషన్ తో మౌలిక వసతుల అభివృద్ధి జరగాలని బి జె పి ప్రణాళిక అంటున్నది. దీని  అర్థం ప్రభుత్వ సొమ్ముతో ప్రయివేట్ కార్పొరేట్లు లాభ పడటం. ఇంతేగాక బి జె పి ఎన్నికల ప్రణాళిక  కార్మిక చట్టలకు కాలం చెల్లిందని, వాటిని సంస్కరించాలని అన్నది. కార్మిక చట్టాలను సంస్కరించటం అంటే కార్మికులకు వ్యతిరేకముగా వాటిని మార్చటమే.

బి జె పి ప్రణాళిక ప్రకారం అయోధ్యలో రామ మందిరాన్ని బాబ్రీ మసీదును పడగొట్టిన చోట,  రాజ్యాంగం పరిధిని ఉల్లంఘించకుండా కట్టేందుకు గల అవకాశాలను పరిశీలిస్తామని వుంది. బాబ్రీ మసీదుని పడగొట్టటమే రాజ్యాంగ విరుద్ధమయినప్పుడు అక్కడ మందిరాన్ని కాట్టటం రాజ్యాంగ బద్ధం ఎ విధముగా అవుతుంది? జమ్ము కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి కి రాజ్యాంగం లో వున్న ఆర్టీకిల్ 370 ని రద్దు చేయాలని బి జె పి ప్రణాళిక అంటునంది. ఇటువంటి ప్రత్యేక ప్రతిపత్తి మన దేశం లో అనేక ప్రాంతాలకు ఏదో ఒక రూపములో వుండగా కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని మాత్రమే రద్దు చేస్తామనటం మత ప్రాతిపదికన, ఆ రాష్ట్రం లో ముస్లిం లు ఎక్కువ వున్నారనే అక్కసుతో , చేస్తున్నది కాదా? మతం ప్రాతిపదికన ప్రజలని విభజించే, కలహాలు స్ర్రుష్టించే ఇటువంటి అంశాలు బిజెపి ఎన్నికల ప్రణాళికలో వున్నాయి. బి జె పి కి సొంతంగానే లోక్ సభలో మెజారిటీ వచ్చింది కాబట్టి,  ఎన్ డి ఏ కూటమిలో వుంటే వీటన్నింటికి తాను కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది కాబట్టి,  ఇప్పటికయినా ఎన్ డి ఏ లో కొనసాగే విషయం చంద్రబాబు పునరాలోచించుకుంటే తెలుగు ప్రజలకు మంచిది.  

ఎన్నికలలో డబ్బు ప్రభావాన్ని నివారించాల్సిన అవసరం తక్షణ ఆవశ్యకతగా ముందుకు వచ్చిందని ఈ ఎన్నికలలో విచ్చలవిడిగా చేసిన డబ్బు ఖర్చు, వోటును కొనుగోలు సరుకుగా మార్చిన వైనం స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికలలో డబ్బు ప్రభావాన్ని నివారించటానికి,  (అ)రాజకీయ పార్టీలకు కార్పొరేట్సు ఎన్నికల విరాళాలు ఇవ్వటాన్ని నిషేధించాలి (ఆ) రాజకీయ పార్టీయల కు  ఎన్నికల విరాళం ఇచ్చేబదులు కార్పొరేట్ సంస్థలు  భారత ప్రజాస్వామ్యానికి ఆర్థికముగా తోడ్పడేలా విరాళాలిస్తే బాగుంటుంది. ఈ విరాళాలను ఎన్నికల కమిషన్ లేదా ఒక ప్రభుత్వ రంగ సంస్థ నిర్వహించే కార్పస్ నిధికి ఇవ్వాలి.  అనేక పశ్చిమ దేశాలలో వున్నట్లుగా ప్రభుత్వ ఖర్చుల నిర్వహణతోనే ఎన్నికలు జరపాలి. (ఇ) అన్నింటికన్నా ముఖ్యమయినది మన ఎన్నికలలో పాక్షిక దామాషా పద్ధతిని ప్రవేశ పెట్టటం.

మొత్తం వోట్లలో 50 శాతం మించి వచ్చిన అభ్యర్థి గెలిచే విధానం మన ఎన్నికలలో లేదు. పోటీ చేసిన అభ్యర్థులకు వచ్చిన వోట్ల ప్రకారం మొదటి స్థానం లో ఎవరు వుంటే వాళ్ళే గెలిచినట్లు లెక్క. కాబట్టి ఈ విధానం డబ్బుతో వోట్లు కొనటానికి దారి తీస్తున్నది. ఇంతేగాక ఈ విధానం ప్రజాభిప్రాయం లో అధిక భాగానికి స్థానం లేకుండా చేస్తున్నది. మిగతా అందరూ అభ్యర్థులకు 30 శాతం కన్నా తక్కువ వచ్చి ఒక అభ్యర్థికి 30 శాతం వస్తే ఆ అభ్యర్థే గెలిచినట్లు లెక్క. 70 శాతం వొట్లకు విలువ లేకుండా పోతున్నది. దీనిని నివారించటానికి పాక్షిక దామాషా పద్ధతి అవసరం.
పాక్షిక దామాషా పద్ధతి లో రెండు లోక్ సభా స్థానాలను కలిపి ఒకటిగా చేసి, ప్రతి ఓటరుకు రెండు వోట్లు ఇవ్వాలి. అందులో ఒక ఓటు నిర్దిష్ట అభ్యర్థికి, రెండో వోటు విధానాలు, కార్యక్రమాల ప్రాతిపదికగా రాజకీయ పార్టీ కి వేయాలి. దీనికి గాను రాజకీయ పార్టీలు ముందుగానే ఎన్నికల కమిషన్ కు తమ ప్రతినిధుల ప్రాధాన్యతా జాబితాను ఎన్నికల కమిషన్ కు అందజేయాలి. దేశ వ్యాపితముగా ఆ రాజకీయ పార్టీకి వచ్చిన వోట్ల శాతం ప్రకారం అంతకు ముందు సమర్పించిన ప్రాధాన్యతా జాబితానుండి సీట్లు కేటాయించాలి. ఈ విధానం ఎన్నికలలో డబ్బు ప్రభావాన్ని నివారించటానికి లేదా తగ్గించటానికి తోడ్పడుతుంది. ఇటువంటి ఎన్నికల పద్ధతికోసం ఎన్నికలలో డబ్బు ప్రభావాన్ని నివారించాలనుకునే వారందరూ ఉద్యమించాలి.

ఈ ఎన్నికల ప్రచారం సందర్భముగా బి జె పి, టిడిపి, టి ఆర్ ఎస్ లు ప్రచారం చేసిన భ్రమలు ఇప్పుడు కాకపోతే తర్వాతైనా పటాపంచలవుతాయి. ఈ ఎన్నికల ప్రచారానికి ఈ పార్టీలకి ఏ కార్పొరేట్సు అయితే ఆర్థిక సాయం అందించారో వారికి రేపు  ఈ పార్టీల ప్రభుత్వాలు అనేక రాయితీలిచ్చి బదులు చెల్లించాల్సి వస్తుంది. ఇంతేగాక ఈ పార్టీల తరఫున గెలిచిన వారిలోనే అనేక మండి కార్పొరేట్ ప్రతినిధులు, కాంట్రాక్టర్లు, రియల్టర్లు తదితర సంపన్నులున్నారు. ప్రభుత్వ అధికారాన్ని వారు తాము అధిక లాభాలు సంపాదించుకొటానికే ఉపయోగించుకుంటారు. దీని వలన ప్రభుత్వాలు ప్రజలపై మరిన్ని భారాలు మోపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ఎన్నికల ప్రచారం లో అంతర్లీనముగా సాగిన హిందుత్వ ఎజెండా వలన మన లౌకిక, ప్రజాస్వామిక పునాదులకు మరింత ముప్పు వాటిల్లే ప్రమాదం వుంది. మతోన్మాద శక్తులు మరింత పదును తేలతాయి. ఈ రెండు ప్రమాదాలను ఎలా ఎదుర్కొంటామనే దాని పైనే మన ప్రజల, దేశ భవిష్యత్తు నిర్వచించబడతాయి.

మన దేశ ఐక్యత, సమగ్రత, లౌకిక ప్రజాస్వామిక పునాదులను పటిష్ట పరుస్తూ సామాజిక సామరస్యత కోసం కృషి చేయాల్సిన అవసరం వున్నది.  ప్రజా వ్యతిరేక ఆర్థిక విధానాలను ప్రతిఘటిస్తూ, ప్రత్యామ్నాయ ప్రజానుకుల విధానాలను ప్రచారం చేసేందుకు, బలపరచేందుకు కృషి చేయాల్సిన అవసరం వున్నది.


No comments:

Post a Comment