Tuesday, May 20, 2014

మోడీ ప్రచార తీరు…. కథా కమామీషు....

దేశంలో బీజేపీ అన్ని సీట్లు గెలవడానికి కారణం ఏమిటీ ? ఎన్నికల ప్రచారంలో మోడీ కీలక పాత్ర పోషించారు. మరి మోడీ ప్రచారం ఏ విధంగా చేశారో తెలుసుకోవాలని ఉందా ?

మ్యాజిక్ నంబరే కాదు.. అంతకు మించిన సీట్లు సాధించింది బిజెపి. ఈ బృహత్కార్యంలో నరేంద్ర మోడీదే కీలక పాత్ర అని ఇటు మీడియానే కాదు.. ఇటు సొంత పార్టీ నేతలు కూడా చెప్పుకొచ్చారు. మోడీ వస్తే తప్ప మార్పు రాదంటూ నినదించారు. ఈ క్రమంలో మోడీని ఇమేజ్ లో ఎలాంటి మార్పులొచ్చాయి? ఎలా వచ్చాయి?
మోడీ గురించి ఏడాది క్రితం మీరేమనుకునే వాళ్లు? ఇప్పుడేమనుకుంటున్నారు? ఇమేజ్ లో మార్పేమన్నా కనిపిస్తోందా? అలా కనిపిస్తే ఎలా సాధ్య పడింది జరిగింది? నరేంద్ర మోడీ తనను తాను బ్రాండింగ్ చేసుకునేందుకు చాలా శ్రమించారా? వందలాది మంది టీమ్ వర్క్ గా పనిచేసి బ్రాండ్ మోడీని క్రియేట్ చేశారా? ఎన్నికలకు ముందు ఏం జరిగింది?

పక్కా ప్లాన్... ఫుల్ మార్కెటింగ్ స్ట్రాటెజీ...

టీ షర్టులు, కాఫీ కప్పులపై, నిలువెత్తు హోర్డింగుల్లో ఆయన ఫోటోలు హడావుడి చేసాయి. ఒక్క మాటలో చెప్పాలంటే భారీ బడ్జెట్ సినిమా స్టైల్లో, స్టార్ హీరో లెవెల్లో, లార్జర్ దాన్ లైఫ్ కేరెక్టర్ డిజైన్ చేసి జనాల పైకి వదిలారు.. అబ్ కీ బార్ అంటూ గ్యాప్ ఇవ్వకుండా సౌండ్ చేశారు. రేడియోలు, టీవీ ఛానళ్లు, వెబ్ సైట్లు, సోషల్ మీడియా... అక్కడా ఇక్కడా అనేది లేదు.. ఏ చోటునీ వదల్లేదు. ఎక్కడ చూసినా అవే సీన్ లు..అవే కాప్షన్ లు..ఒక్క రోజు కాదు.. నెలల తరబడి కాన్సిస్టెంట్ కాంపెయిన్ . ఏ చిన్న పొరపాటూ జరక్కుండా, ప్రత్యర్థికి ఒక్క అవకాశమూ మిగల్చకుండా, కేర్ ఫుల్ గా చేశారు. అన్ని మాధ్యమాలను కవర్ చేశారు. ఇది ఒక్కరితో సాధ్యమా? మోడీ ప్రచారంలో అసలు ఎంతమంది పని చేశారు? ఎవరేం పనిచేశారు...?

ఓ బడా కంపెనీ...

'ఓగిల్వీ అండ్ మాధర్' అనే పేరు ఎపుడైనా విన్నారా? పోనీ, ఈయనెవరో తెలుసా? వీరిద్దరికీ మోడీ ఇమేజ్ కి సంబంధం ఏంటి అనుకుంటున్నారా? అబ్ కీ బార్ మోడీ సర్కార్ ఈ నినాదం తెలుసు కదా.. దాన్ని రాసింది ఈయనే వాల్డ్ క్లాస్ టాప్ ఎడ్వర్టైజింగ్ కంపెనీ ఓగిల్వీ అండ్ మాధర్ క్రియేటివ్ డైరెక్టర్ పియూష్ పాండే.. అంటే ఓ బడా కంపెనీ తమ ప్రచారానికి ఎడ్వర్టైజింగ్ ఏజన్సీని వాడుకున్నట్టు ఇక్కడ మోడీ పంచ్ లైన్ కోసం కూడా వాడారు. మోడీని ప్రొజెక్ట్ చేయడానికి బిజెపి వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారిని బాగా ఉపయోగించుకున్నారు. ఈయనెవరో తెలుసా మీకు? ప్రసూన్ జోషి.. మెక్ కాన్ వాల్డ్ గ్రూప్ సౌత్ ఆసియా అడ్వర్టయిజింగ్ ఏజెన్సీ అధ్యక్షుడు, బాలీవుడ్ గీత రచయిత ప్రసూన్ జోషి. ఈయన బిజెపి ప్రచార గీతం రాశారు. వీరిద్దరినే కాదు...ఎందరో నిపుణులను, పలు రంగాల్లో నిష్ణాతులు వందలాది మందిని మోడీ తన ప్రచారంలో, బ్రాండ్ మోడి లో వాడుకున్నారు.

మీడియా..మార్కెటింగ్..అడ్వర్టయిజింగ్..ద్వారా ప్రచారం...

టాగ్ లైన్ లు ప్రచార గీతాలు, టాప్ ఎడ్వర్టైజింగ్ ఏజన్సీలు...ఇంతవరకు చూశాం. కానీ, ఇవన్నీ ఒక చిన్న పీస్ మాత్రమే. ఒక క్యాంపెయిన్ ఎంత పకడ్బందీగా చేయొచ్చో, ఈ ఎన్నికల్లో మోడీ రుజువు చేశారు. టెక్నిక్ గా ఇమేజ్ బ్రాండ్ వాల్యూ సాధించటం ఎలాగో చేసి చూపించారు. ఓ వస్తువుకు బ్రాండ్ ఇమేజ్ కల్పించినట్డానికి బడా కార్పోరేట్ సంస్థలు ఏ విధంగా కృషి చేస్తాయో తెలుసా? కన్స్యూమర్ నాడిని బట్టి, అప్పటికి ఉన్న ప్రత్యర్థుల బలహీనతను తమ బలాన్ని ఒకేలా హైలైట్ చేస్తూ.... మెల్లగా వినియోగదారుణ్ని తమ వల్లో వేసుకుంటాయి. ఇక్కడ బ్రాండ్ మోడి మేకింగ్ లోనూ అదే జరిగింది. ఓ పథకం ప్రకారం మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించి విస్తృత ప్రచారం చేసింది. మీడియా, మార్కెటింగ్, అడ్వర్టయిజింగ్ ద్వారా మోడీకి ప్రచారం కల్పించడంలో వందకు వంద శాతం సక్సెస్ అయినట్టు ఈ ఎన్నికలు రుజువు చేశాయంటున్నారు విశ్లేషకులు. మోడీ బ్రాండిగ్ కు ఉన్న అన్ని కోణాలను బిజెపీ సమర్థవంతంగా వాడుకుందని పరిశీలకుల అంచనా.

మోడీ వార్ రూం...

మోడీ వార్ రూమ్. అంటే మోడీకి కావాల్సిన సమాచారాన్ని సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు, టాప్ కాలేజెస్ లో మేనేజ్ మెంట్ చదివినవాళ్లు క్షణాల్లో వెతికి పెడుతారు. అరవింద్ గుప్తా ఆధ్వర్యంలోని ఐటి టీమ్ కనీ వినీ ఎరుగని రీతిలో సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం చేసింది. వీళ్లు మాత్రమే కాదు. మోడీ కోసం రేయింబవళ్లు కష్టపడ్డ వారెందరో ఉన్నారు. కేవలం మోడీకి పాజిటివ్ ఇమేజ్ వచ్చేలా, ఓటర్ల మనసు దోచేలా రకరకాల ప్లాన్స్ వేయటమే వీరి పని. ఆన్ లైన్ లో మోడీ గురించి పాజిటివ్ ఒపీనియన్స్ రాయటం, కార్టూన్ లు, గ్రాఫిక్స్ ద్వారా మోడీ పై అభిమానాన్ని పెంచటమే వీరి జాబ్. అయితే వీరే కాదు.. ఈ పనిచేసిపెట్టేందుకు కొన్ని ఫేక్ కంపెనీలూ ఉన్నాయి. అప్పట్లోనే ఆపరేషన్ బ్లూ వైరస్ పేరుతో కోబ్రాపోస్ట్ చేసిన స్టింగ్ ఆపరేషన్ దీన్ని బట్టబయలు చేసింది. ఫేస్ బుక్, ట్విట్టర్ లలో ఫేక్ ఐడిలతో దొంగ లైక్ లు, ఫేక్ ఫాలోయర్స్ ని తయారు చేసే కంపెనీల బండారం కూడా బయటపడింది.

భారతీయ ఎన్నికల చరిత్రలో ప్రథమం..

కనిపించే ప్రతి దృశ్యాన్ని, వినిపించే ప్రతి మాటని ఆకర్షణీయంగా మలిచే ప్రయత్నం చేసింది కమల దళం. ఆఖరికి మోడీ హావభావాలు, ధరించే బట్టల విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఇప్పుడు మోడీ కుర్తాలకు ఓ గుర్తింపు వచ్చింది. ఓ రాజకీయనేతకు బ్రాండ్ ఇమేజ్ కల్పించడం భారతీయ ఎన్నికల చరిత్రలో ఇదే ప్రథమం. ఓ వస్తువును మార్కెటింగ్ చేసిన విధంగా మోడీని మార్కెటింగ్ చేశారంటున్నారు బ్రాండింగ్ నిపుణులు. పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా, రేడియో, ఆన్ లైన్, సోషల్ మీడియా లాంటి ఏరియాల్లోనే కాదు... ర్యాలీలు నిర్వహించడం, టీ స్టాల్స్ వద్ద వినియోగదారులను ఆకర్షించటం కోసం చాయ్ కప్పులపై మోడీ ఫొటోలు వేశారు. వారణాసి రొట్టెలపై నమో ముద్ర వేశారు.

ఫ్రంట్ పేజీ అడ్వర్టయిజింగ్..

దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాష పత్రికల్లో ఫ్రంట్ పేజి అడ్వర్టయిజింగ్ ఇచ్చారు. టీవిల్లో మోడి అడ్వర్టయిజింగ్ మోత మోగింది. నగరాల్లో పెద్ద పెద్ద హోర్డింగ్ లు పెట్టారు.. పట్టణాల్లో రేడియో నెట్ వర్క్ ను ఉపయోగించుకున్నారు. డిజిటల్ మీడియాలో మోడీ స్టోరీలు పెట్టారు. ట్విట్టర్ లో హల్ చల్ చేశారు. ప్రీ రికార్డెడ్ వీడియో మెసేజ్ లను మారుమూల గ్రామీణ ప్రాంతాలకు పంపారు. పబ్లిక్ మీటింగ్ లో త్రీడీ హాలోగ్రామ్ ఇమేజ్ సిస్టం ఉపయోగించారు. ఈ రేంజ్ లో ప్రచారం చేయాలంటే ఎంత డబ్బు కావాలి. ఇదంతా లెక్కలో ఉన్నదేనా? లేక వేరే ఎవరన్నా స్పాన్సర్ చేశారా? ఆరోపణలు వెల్లువెత్తుతున్నట్టు కార్పొరేట్ శక్తులు తెరవెనుక ఉన్నాయా? ఓ పథకం ప్రకారం మోడీని ప్రమోట్ చేసింది అంబానీలు టాటాలే అని చాలా ఆరోపణలున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రచారం కోసం బిజెపి 5 వేల నుంచి 10 వేల కోట్లు ఖర్చు చేసిందని కాంగ్రెస్ ఆరోపిస్తూనే ఉంది. ఇందులో మీడియా, అడ్వర్టయిజ్ మెంట్లకే భారీ ఎత్తున బడ్జెట్ కేటాయింపులున్నాయని అంటోంది. వ్యక్తిగత లాభాల కోసం రాజకీయాలను వాడుకుంటున్న ముకేష్ అంబాని మోడీతో సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నారని కాంగ్రెస్ వర్గాలు ఆరోపిస్తూనే ఉన్నాయి.

బిజెపి వైపు మొగ్గిన బడా కార్పోరేట్లు

ఓ పథకం ప్రకారమే మోడీని కార్పోరేట్ సంస్థలు తెరపైకి తెచ్చాయనే వాదనలు వినిపిస్తున్నాయి. అవినీతి, కుంభకోణాలతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కు వ్యతిరేకత ఉండడంతో ఆ పార్టీ అధికారం కోల్పోనుందని గమనించిన బడా కార్పోరేట్లు ప్రత్యామ్నాయంగా బిజెపి వైపు మొగ్గారని విశ్లేషకులు చెబుతున్నారు. తమ స్వప్రయోజనాలు కాపాడుకోవడం కోసం తమకు అనుకూలంగా ఉండే మోడీని సమర్థించారనే వాదనలు వినిపిస్తున్నాయి. అంబానీలు, అదానీలు, టాటాలు మోడీకి వంత పాడుతూ, బిజెపి అధికారంలోకి వస్తుందని హైప్ చేసి, బ్రాండ్ మోడి ఇమేజ్ కోసం కార్పోరేట్ మీడియాను వాడుకున్నారనే విమర్శలున్నాయి. మోడీని ఓ ప్రోడక్ట్ గా ప్రొజెక్ట్ చేస్తూ, చేసిన క్యాంపెయిన్ తో ప్రజల్లో ఈయనో స్ట్రాంగ్ లీడర్ గా ప్రమోట్ అయ్యారని అడ్వర్టైజింగ్ రంగ నిపుణులు కూడా చెప్తున్నారు.

మోడి ఇమేజ్ కోసం బిజెపి పక్కా స్కెచ్...

గుజరాత్ అభివృద్ధి బ్రహ్మండంగా జరుగుతోంది అంటూ మొదలైన ప్రచారం... ఆఖరికి దేశానికి మోడీ తప్ప దిక్కులేదు అనే దిశలోకి టర్న్ తీసుకుంది. ఇదే దిశలో పక్కా ప్లాన్ తో ప్రచారం చేసి బ్రాండ్ మోడీ క్రియేషన్ లో సక్సెస్ అయ్యారు. ఇదే సమయంలో కాంగ్రెస్ కి రాహుల్ ని ప్రమోట్ చేసుకునే సత్తా ఉన్నా విఫలం కావటం వెనుక కారణాలు అనేకం. మోడీ ఇమేజ్ కోసం బిజెపి పక్కా స్కెచ్ వేసింది. మేనేజ్ మెంట్, ఐటి ఎక్స్ పర్ట్స్, టెక్నాలజీ, కమ్యునికేషన్, ప్రొఫెషనల్ టీమ్స్, ఆర్ఎస్ఎస్ నెట్ వర్క్ కృషి చేశాయి. ఇక కాంగ్రెస్ కు ఖర్చు చేసే స్థోమత ఉన్నప్పటికీ ఆచరణలో విఫలమైదంటున్నారు విశ్లేషకులు. కాంగ్రెస్ ప్రచారం చేసిన ప్రతిచేతికి శక్తి, ప్రతి చేతికి అభివృద్ధి అనే నినాదం మాస్ ని తాకలేకపోయింది.
తనను తాను నేతగా బిల్డ్ చేసుకునేందుకు మోడీ చమటోడ్చినంతగా 2014 ఎన్నికల్లో మరెవరూ చేసి ఉండరు. 3లక్షల కిలోమీటర్ల దూరం, 437 ర్యాలీలు మోడీ స్వయంగా తిరిగారు. ఒక్క యూపి, బీహార్ లోనే, జిపిఎస్ ఉంచిన వాహనాలు మారుమూల పల్లెల్లో మోడీ వీడియోలు, స్పీచ్ లతో ప్రచారం చేశాయి.

బ్రాండ్ మోడీ సామర్ధ్యం ఎంత?

అంబానీలు, అదానీలు ప్రమోట్ చేస్తే ఎదిగిన నేత పనితీరు ఎలా ఉంటుంది? సామాన్యుడి పక్షాన వహించగలడా? అది సాధ్యమా? ఏ వనరులు కొల్లగొట్టడానికి సర్కారు సపోర్ట్ బడా బాబులు ఆశిస్తున్నారో దాన్ని ఇవ్వకుండా మోడీ ఉండగలరా? కార్పొరేట్ ల పెంపుడు నేత సామాన్యుడి ఇంట్లో సభ్యుడు కాగలడా? వేల కోట్ల వ్యాపారాలు ప్రభుత్వాలని నడిపే కాలంలో, దేశానికి పనికొచ్చే పనులు మోడీ చేస్తారా? వాళ్లు చేయనిస్తారా? ఇవన్నీ కళ్లముందున్న ప్రశ్నలు.. వీటికి సమాధానాలు త్వరలోనే తేలిపోతాయి. ప్రోడక్ట్ లాంచింగ్ అయితే, బ్రహ్మాండంగా జరిగింది. ఇప్పటికి బ్రాండింగ్ కథలో చిన్న విరామం వచ్చింది. మరి బ్రాండ్ మోడీ సామర్ధ్యం ఎంత? పనితనం ఎలా ఉంటుందో ? తొందర్లోనే తెలియబోతోంది. ఊదరగొట్టిన ఉపన్యాసాల్లో నిజం ఎంతో బయటపడనుంది.
(10టి‌వి) 


No comments:

Post a Comment