Tuesday, September 10, 2013

రామ రాజకీయం

దసరా పులి వేషం వేసినట్టు ఎన్నికలు అనగానే సంఘ పరివార్‌ రామ మందిరం సమస్యను పైకి తీయడం పరిపాటిగా మారింది. ఒకవైపున గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో తాము పూర్తిగా ఆధునికమైనామని చెప్పుకునే పరివార్‌ వ్యూహానికి రెండవ పార్శ్వమేమిటో ఇప్పుడు అయోధ్యలో తాజాగా జరిగిన పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. అశోక్‌ సింఘాల్‌, ప్రవీణ్‌ తొగాడియాలతో సహా అనేక మంది అరెస్టు కావడం, నిషేధాజ్ఞలు విధించి ఉండకపోతే పరిస్థితి చేయిదాటి పోయి ఉండేది. చతురాస్య పరిక్రమ కోష్‌ అని అశోక్‌ సింఘాల్‌ ప్రచారం చేసుకోవడాన్ని అయోధ్య సాధువులే వ్యతిరేకించారంటే ఈ మతతత్వ రాజకీయాల్లో మర్మం బోధపడుతుంది. మత పరంగా చూసినా పరిక్రమ ఇప్పటికే జరిగిపోగా మళ్లీ తాము చేస్తామని చెప్పుకోవడం బూటకమని ఆ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మహంత్‌ జ్ఞాన్‌దాస్‌, రామ జన్మభూమి ట్రస్టు ప్రధాన అర్చకుడు మహంత్‌ సత్యేంద్ర దాస్‌ చెప్పాల్సి వచ్చింది. ఎన్నికల ప్రయోజనాల కోసం రామ మందిర సమస్యను వాడుకోవడం మంచిది కాదని వారు సూటిగానే విమర్శించడం విహెచ్‌పి, ఆరెస్సెస్‌ వంటి వాటికి అంతకు మించి బిజెపికి చెంపపెట్టు. స్వాములనూ సాధు సంతులనూ రాజకీయ వ్యూహంలో పాచికలుగా వాడుకుంటున్నారని కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. గత ఇరవై ఏళ్లలోనూ అయోధ్యలో విహెచ్‌పి పునాది కోల్పోయిందనీ, కేవలం స్వార్థపరశక్తులే వారి వెనక చేరి ఇలాటి కార్యక్రమాలు చేస్తున్నారనీ ఈ సాధు సన్యాసులు చేసిన వ్యాఖ్యలను మతానుయాయులు తీవ్రంగా తీసుకోవడం అవసరం.
నిజానికి అయోధ్యలో బాబరీ మసీదు/రామ జన్మభూమి సమస్యను గాని, కాశీ, మధుర వంటివి గాని, మరో చోట వినాయక నిమజ్జనం గాని, దానిపై రభస సృష్టించి శాంతిభద్రతల సమస్యగా చేయడం వెనక గానీ ఉన్నది మతంపై ప్రేమ కాదు. మతతత్వం రెచ్చగొట్టడం ద్వారా ఓట్లు రాబట్టుకునే ఆరాటమేనన్న మాట వామపక్షాలు, లౌకికవాదులు మొదటి నుంచీ చెబుతూనే ఉన్నారు. పేద ముస్లిం మైనార్టీలు లేదా ఇతరుల సంక్షేమం కోసం ఏమైనా కనీస చర్యలు తీసుకుంటే ఓటు బ్యాంకు రాజకీయాలని విమర్శించే బిజెపి, ఆరెస్సెస్‌లు సాక్షాత్తూ రాముడి బొమ్మతోనే తాము రాజకీయం చేస్తున్న సంగతి కప్పిపుచ్చగలమనుకుంటారు. దేశ చరిత్రలో తొలిసారిగా తన రథయాత్రతో క్రమపద్ధతిలో హిందూత్వ హింసానలం రగిల్చిన ఎల్‌కె అద్వానీ రథంపై అటు ఎన్నికల గుర్తు కమలం ఇటు రాముడి బొమ్మలతో ఊరేగిన సంగతి ఎవరికి తెలియదు? రాముణ్ణి పూజించడం లేదా రామ మందిరం కట్టుకోవడం వేరు. ఒక మతానికి చెందిన కట్టడం ఉన్న చోట వందల ఏళ్ల కిందట ఏదో జరిగిందనే పేరుతో ప్రతీకార రాజకీయంగా దాన్ని కూలదోయడం వేరు. ప్రజా జీవనానికి, శాంతిభద్రతలకూ ఆటంకం కానంత వరకూ ఈ దేశంలో ఉన్న వందలాది మందిరాలతో ఎవరికీ ఏ పేచీ లేదు. అలా గాకుండా ఒక మత కట్టడం ఉన్నచోట మరో మతం వారు తలదూర్చి మంటలు పెట్టడమే ఆందోళనకు కారణమవుతుంది. ఆ క్రమంలో అయోధ్య కాండ ఎంతటి అనర్థాలకు దారి తీసిందో, అంతర్జాతీయంగా ఎంతటి దుష్ప్రభావం కలిగించిందో అందరికీ తెలుసు. దాదాపు ఇరవయ్యేళ్ల కిందట యుపిలో తమకున్న అధికారాన్ని ఉపయోగించుకుని భజనలు చేస్తామని అనుమతి తీసుకుని మసీదును కూలదోసిన అఘాయిత్యం ఎవరూ మర్చిపోలేదు. తర్వాత రాష్ట్రంలో వారే అధికారంలోకి వచ్చినా, కేంద్రంలోనూ ఆరేళ్లకు పైగా అధికారం చేసినా సమస్యను పరిష్కరించాలనే ఆలోచనే చేయలేదంటే ఏమనాలి? తమ రాజకీయ అవసరాల కోసం రామమందిర సమస్య రావణకాష్టంలా రగులుతుండాలనే కుటిలత్వం తప్ప మరో కారణమేముంది?
ఈ ఇరవయ్యేళ్లలోనూ దేశంలో చాలా మార్పులు కలిగాయి. యుపిలోనూ చాలా కాలంగా బిజెపి బలం సన్నగిల్లుతున్నది. ఒక్క గుజరాత్‌లోనే భయానక జాతి హత్యాకాండ తర్వాత ఆ పార్టీ మోడీ నాయకత్వంలో పదే పదే విజయాలు సాధించింది. అనేక లోపాలు, పొరబాట్లు ఉన్నా ఆయననే తమ సారథిగా చేసుకుని ఎన్నికలలో గట్టెక్కాలని కలలు కంటున్నది. అందుకోసం ఆనాటి అయోధ్యుడు అద్వానీని కూడా అవతలకి నెట్టిందంటే అంతకంటే ఓటు బ్యాంకు రాజకీయం ఏముంటుంది? రాముణ్ణి రాజకీయ పావుగా చేసుకున్న పార్టీకి అద్వానీ, వాజ్‌పేయి వంటి వారు ఒక లెక్కలో ఉంటారా? మోడీ భజన ఎంత చేసినా, ఎంతగా ఆయనను భూతద్దంలో చూపినా తమ మౌలిక వ్యూహాలను మార్చుకునే ఆలోచన పరివార్‌కు ఎంతమాత్రం లేదు. పైగా మోడీ అటు కార్పొరేట్‌ మార్కెట్‌ తత్వానికి, ఇటు హిందూత్వ మతతత్వానికి ఏక కాలంలో ప్రాతినిధ్యం వహించగలడనే అంచనాతోనే ఎంచుకున్నారన్నది కూడా స్పష్టం. కనుకనే అలవాటైన పని విభజన ప్రకారం ఆయన రాజకీయ కార్పొరేట్‌ సమీకరణం చూసుకుంటే పరివార్‌ హిందూత్వ రాజకీయాలను ముమ్మరం చేస్తుందన్నమాట. ఉత్తరప్రదేశ్‌ పరిణామాలు, అయోధ్య వ్యవహారాలు అన్నీ అందులో భాగమే.
ఇప్పుడు యుపిలో అఖిలేష్‌ యాదవ్‌ నాయకత్వంలో నడుస్తున్న సమాజ్‌వాది పార్టీ ప్రభుత్వం, దాని మూలవిరాట్టు ములాయం సింగ్‌లు అనేక సందర్భాల్లో బిజెపిని గట్టిగా ఎదుర్కొన్న మాట నిజం. అయితే ఇటీవల అశోక్‌ సింఘాల్‌, తదితరులతో ముఖ్యమంత్రి సమావేశాలు జరపడం కొన్ని సందేహాలకు తావిచ్చిందంటే అందుకు యుపి రాజకీయ నేపథ్యమే కారణం. ఎస్‌పి, బిఎస్‌పిల మధ్య మూడో స్థానానికి పడిపోయిన బిజెపి మళ్లీ లేవడానికి తెర వెనక మంతనాలు జరుపుతుందన్న సందేహం చాలా మందికి ఉంది. తొలిదశలో ఎస్‌పి నేతల తీరు కూడా అందుకు కాస్త అవకాశమిచ్చినట్టు కనిపించినా అరెస్టులు, ఆంక్షలతో అవన్నీ తొలగిపోతాయని భావించాలి. అయితే కాశ్మీర్‌లోనూ, బీహార్‌లోని కొన్ని ప్రాంతాలలోనూ మత కలహాలు రగిలించడంలో బిజెపి, ఆరెస్సెస్‌లు చురుగ్గా ఉన్నాయన్న వార్తలను తీవ్రంగా తీసుకోకతప్పదు. మన రాష్ట్రంలోనూ ఇటీవల మోడీ పర్యటించి తెలుగుదేశంపై బహిరంగంగానే వల విసిరేందుకు ప్రయత్నించడం కూడా ఇందులో భాగమే. ఇక్కడ తిష్ట వేసిన అనిశ్చితి మాటున పట్టు పెంచుకునే మార్గాల కోసం సంఘ పరివార్‌కు చెందిన కొన్ని శక్తులు పొంచి చూస్తున్న మాట నిజం. అందుకే దేశవ్యాప్తంగా లౌకికశక్తులు అన్ని వేళలా అప్రమత్తత వహించాలి. అయోధ్య సాధు సంతులే చేసిన వ్యాఖ్యలను బట్టి హిందూత్వ శక్తుల నిజ స్వరూపం ఏమిటో ప్రజలు గ్రహించాలి. (ప్రజాశక్తి 30.8.2013)

No comments:

Post a Comment