Friday, September 6, 2013

అస్తిత్వం కోసం అడ్డగోలు విన్యాసాలు

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ తాము సమైక్యమేనని సూటిగా బహిరంగ లేఖ రాశారు. తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నేరుగా చెప్పక పోయినా ఇంచుమించు అదే సంకేతం ఇస్తున్నారని అందరూ గుర్తించగలుగుతున్నారు. కాంగ్రెస్‌ సరే ఈ అరవై డెబ్బయి ఏళ్లలోనూ, తెలుగు రాష్ట్ర ఏర్పాటు దశలోనూ, విభజన దశలోనూ కూడా అనేక పిల్లిమొగ్గలు వేసి ప్రజలనూ, ప్రాంతాలనూ గందరగోళపరుస్తూనే ఉంది. తెలంగాణా ఏర్పాటే ఏకైక లక్ష్యమని ప్రకటించిన తెలంగాణా రాష్ట్ర సమితి ఇంకా చెప్పాలంటే ఆ పార్టీ నేతలు కూడా ఈ పదేళ్లలోనూ రకరకాల వ్యూహాలతో రాజకీయ తికమకకు కారకులైనారు. ఇప్పుడు విభజనకు అనుకూలంగా నిర్ణయం వచ్చిన దశలో వారు కూడా తమ భవిష్యత్తు గురించి మల్లగుల్లాలు పడుతుండడం వింతగా కనిపించే వాస్తవం. విభజనకు వ్యతిరేకమని చెప్పిన మజ్లిస్‌ నేతలు ఇప్పుడు అనుకూలత ప్రకటించేశారు. తెలంగాణా బిల్లుకు కేంద్రంలో మా మద్దతే కీలకమని రోజూ చెప్పుకునే బిజెపి కూడా కాంగ్రెస్‌ విభజన విధానం ప్రకటించిన తర్వాత తన రాజకీయ లాభనష్టాలను బేరీజు వేసుకునే పనిలో తలమునకలవుతున్నది.
మొత్తం మీద ఈ పార్టీలు రకరకాలుగా విధానాలు మార్చుకోవడం వెనక ఎలాటి రాజకీయ సూత్రం లేదా ప్రాతిపదిక లేకపోవడం ప్రత్యేకంగా గమనించాల్సిన అంశం. ఎవరైనా తమకు లాభదాయకంగా ఉండే వ్యూహం అనుసరించవచ్చు గాని ఆ పేరుతో ఇష్టానుసారం రోజుకో వైఖరి ప్రకటిస్తూ ప్రజలతో, ప్రాంతాలతో చెలగాటమాడే హక్కు ఉంటుందా? ప్రజల మనోభావాలు అన్న మాటనే మంత్రంలా వాడుతూ రకరకాలుగా రాజకీయ నాట్యం చేయడం అవకాశవాదం కాక మరేమవుతుంది? ఆయా దశల్లో ఆ పార్టీల మాటలను గాఢంగా విశ్వసించిన ప్రజానీకం తర్వాత అవి తలకిందులయ్యే సరికి ఏమనుకోవాలి?
వైఎస్‌, వైసీపీ పిల్లి మొగ్గలు
వైఎస్‌ రాజశేఖర రెడ్డి 1986-87లో రాయలసీమ ప్రత్యేక ఉద్యమం అంచుల వరకూ వెళ్లి తిరిగి వచ్చారు. 2000 తర్వాత అధికారం కోసం ఆయనే ప్రత్యేక తెలంగాణా కోర్కె రంగం మీదకు రావడానికి వత్తాసునిచ్చారు. 2009 ఎన్నికల ముందు రోశయ్య కమిటీ వేశారు. తర్వాత ఎన్నికల తొలి దశ మొత్తం తెలంగానం ఆలపించి మలి దశ రాగానే వీసా పల్లవి ఎత్తుకున్నారు. ఆయన మరణానంతరం కుమారుడు జగన్మోహన రెడ్డి తెలంగాణా జిల్లాల్లో ఓదార్పు యాత్ర అన్నప్పుడు ఘర్షణ జరిగినా తర్వాత మళ్లీ సర్దుకుని అక్కడ వారు, ఇక్కడ మేము అన్న చందంలో టిఆర్‌ఎస్‌ నేతలు మాట్లాడారు. ఇడుపులపాయ సమావేశంలో తెలంగాణా ప్రజల మనోభావాలను గౌరవించడం గురించి చెప్పారు. ఉప ఎన్నికల్లోనూ ఆ కారణంగానే పోటీ చేయకుండా ఉండిపోయారు. సురేఖ ఆ కారణంతో రాజీనామా చేస్తే మళ్లీ టికెట్‌ ఇచ్చి పోటీ చేయించారు. కొన్నాళ్ల తర్వాత సామాజిక కోణంలో అక్కడ భూస్వామ్య వర్గాల ప్రతినిధులు తమతో చేరతారని, తెలంగాణాలో కూడా అనూహ్యంగా పుంజుకోగలమని లెక్కలు చెప్పారు. మీరే నిర్ణయం తీసుకోండని కేంద్రానికి ఖాళీ చెక్‌ ఇచ్చి వచ్చారు. ఈ దశలన్నిటిలోనూ తెలంగాణా లేదా కోస్తా, రాయలసీమ ప్రాంతాలపై పడే ప్రభావం ఎలా ఉంటుందో పట్టించుకున్నది లేదు. తీరా చూస్తే విభజన నిర్ణయం రాకముందే రాజీనామాలు చేసి తర్వాత మరింత బాహాటంగా బయిటపడి కోస్తా, రాయలసీమలకే పరిమితమై పోవాలని నిర్ణయించుకున్నారు. విభజన జరిగితే ఇక్కడ ప్రాబల్యం వహించే అవకాశాలు నాస్తి అని అర్థం చేసుకోగానే విధానం మార్చుకున్న వైసీపీ కేంద్రాన్ని విమర్శించడం బాగానే ఉంది గాని తనను తాను విమర్శించుకోనవసరం లేదా? పైగా ఇప్పుడు కూడా కేంద్రం కన్నా తెలుగుదేశంపైనే దాని విమర్శ అధికంగా నడుస్తున్నది!
తెలుగు దేశం మల్లగుల్లాలు
ప్రధాన ప్రతిపక్షమైన ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం మరింత విపరీతమైన మార్పులకు గురైంది. ఎన్టీ రామారావు నాయకత్వంలో తెలుగు జాతి ఆత్మగౌరవమంటూ బయిలుదేరిన పార్టీ అది. ఆ పార్టీ నాయకులే టిఆర్‌ఎస్‌ స్థాపకు లైనారు. ప్రాంతీయం ఉప ప్రాంతీయానికి దారి తీసినప్పుడు మొత్తం రాష్ట్రంపై పట్టు నిలుపు కోవడానికే ఆ పార్టీ ప్రయత్నించింది. చిన్న రాష్ట్రాల సృష్టికర్త బిజెపితో పొత్తుపెట్టుకున్నా ఆ సూత్రం ఇక్కడ వర్తించకుండా అడ్డుకున్నది. 2004 ఎన్నికల్లో సమైక్య నినాదంతోనే పాల్గొన్నది. తర్వాత నాలుగేళ్ల పాటు ఎటూ తేల్చకుండా దాగుడు మూతలాడి 2008లో విభజనకు అనుకూలంగా ముందుకొచ్చింది. ఇందుకు ప్రాతిపదిక ఏమిటో పెద్దగా చెప్పింది లేదు. అప్పుడు ఇతర ప్రాంతాల నాయకులు అడ్డుకున్నదీ లేదు. ఢిల్లీలో లేఖ ఇవ్వడానికి వారే ఆధ్వర్యం వహించారు. అధికా రంలోకి రావడానికి కాంగ్రెస్‌ ఉపయోగించిన తెలంగాణా కార్డునే తెలుగుదేశం కూడా ప్రయోగిం చాలన్న తాపత్రయం తప్ప పర్యవసానాల గురించిన ఆలోచనే ఆనాడు లేకుండా పోయింది. ఆ నేపథ్యంలో టిఆర్‌ఎస్‌తో ఎన్నికల పొత్తు పెట్టుకున్నా అందులో ఉభయత్రా నిజాయితీ లోపించి పరాజయమే మిగిలింది. వైఎస్‌ ఆయన మాటల్లోనే పాసు మార్కులతో అధికారం నిలబెట్టుకున్నారు. కెసిఆర్‌ నిరాహారదీక్ష అనంతర పరిణామాలలో తెలుగుదేశం అప్పటి ప్రభుత్వంపై చాలా దూకుడుగా వ్యవహరించింది. అయితే డిసెంబర్‌ 9 ప్రకటన వచ్చిన తెల్లవారే చంద్రబాబు మాటల్లో తడబాటు కనిపించింది. ఆ సమయంలో రాజీనామాల ఘట్టం సూత్రధారులం తామేనని తెలుగుదేశం యువనాయకులు చెబుతుంటారు. దాదాపు మూడేళ్ల పాటు అనిశ్చితి తాండవిస్తున్నా ప్రధాన ప్రతిపక్షం కూడా అంతకన్నా అస్పష్టతలో కూరుకుపోయింది. రెండు ప్రాంతాల్లో పార్టీని కాపాడుకోవడమనే పేరిట రెండు రకాలుగా మాట్లాడ్డానికి అవకాశమిచ్చింది. టిఆర్‌ఎస్‌ దాడి కూడా దానిపైనే కేంద్రీకృతమైంది. చివరకు 2012లో చంద్రబాబు పాదయాత్రకు ముందు రాసిన లేఖతో స్పష్టత ఇచ్చామన్నారు. ఆఖరి అఖిల పక్షంలోనూ అదే చెప్పారు.
విభజన నిర్ణయం వెలువడిన వెంటనే తొలి స్పందన కూడా ఆ దిశలోనే వెలువరించారు. తర్వాత మళ్లీ క్రమంగా స్వరం సవరించుకుంటూ సీమాంధ్ర ప్రజల సందేహాలు తొలగించాలన్న దానిపై వక్కాణింపు పెంచారు. అలా అనడంతో ఆగకుండా తాము విభజనను అడ్డుకు న్నామని, కాంగ్రెస్‌ తెలుగు జాతిని విచ్ఛిన్నం చేసిందని కొత్తగా పాత సంగతులు చెప్పడం మొదలు పెట్టారు. ఎన్‌డిఎ హయాంలో తెలుగుదేశం కారణంగానే తెలం గాణా ఇవ్వలేక పోయామని అద్వానీ వంటి వారు చెబితే ఖండిస్తూ వచ్చిన తెలుగుదేశం ఇప్పుడు చంద్రబాబు స్వయంగా చేసిన వ్యాఖ్యలపై ఇచ్చే వివరణ ఏముంటుంది? ఏం చెప్పినా ఎలా సమర్థనీయమవుతుంది? విధానాలు మార్చు కోవడమే జరిగితే మరోసారి సూటిగా చెప్పి ఒప్పించాలి గాని చాప కింద నీరులా సంకేతా లిచ్చి ప్రజల భయ సందేహాలను ఎగదోయడం సరైందేనా?
కేంద్రం నిర్ణయం రాగానే తమ వాళ్లను మౌనం పాటించాల్సిందిగా చెప్పిన చంద్రబాబు ఇప్పుడు తానే ఊరూరా ఆవేశంగా మాట్లాడుతున్నారు. ప్రతిచోటా ఆయన రాష్ట్ర సమస్యతో పాటు తమ పార్టీని కాపాడుకోవడం గురించి కూడా బహిరంగంగానే మాట్లాడు తున్నారు. ఇన్ని సార్లు విధానాలు మార్చు కోవడం, నిలకడ లేకపోవడం విశ్వసనీయతకు విఘాతం కలిగిస్తాయని తెలియక కాదు. పార్టీని కాపాడుకోవడంతో పాటు వ్యక్తిగతంగా లేక కుటుంబపరంగా నాయకత్వం కాపాడుకోవాలంటే కోస్తా, రాయలసీమ ప్రాంతాలలో దృఢమైన వైఖరితో ఉన్నట్టు కనిపించాలని ఆయన నమ్ముతున్నారు. ఇతర చోట్ల ప్రభావం ఏమిటనేది ఈ సమయంలో అంత ముఖ్యం కాదనుకుంటున్నారు. ఎందుకంటే విభజనే జరిగితే ఈ దఫా కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉంటుంది గనక తదుపరి కాలంపైనే దృష్టి పెడుతున్నారు. తెలంగాణాలోనూ బలమైన యంత్రాంగం, నాయకత్వం ఉన్నాయి గనక వాటి కోసం ఎలాగూ తమతో ఉండేవారు ఉంటారని ఆశిస్తున్నారు. ఈ మొత్తం వ్యూహ రచనలో ఎక్కడా సూత్రాలు, విధానాల ప్రసక్తి నాస్తి. పైగా తనే హైదరాబాదును అభివృద్ధి చేశాననీ, తన సంస్కరణలు గొప్పవేనని రెండు సార్లు ఓడిపోయిన తర్వాత కూడా చెప్పుకుంటూనే ఉన్నారు. ప్రస్తుత వేడి తగ్గగానే మళ్లీ తమవైపు చూస్తారన్న ఆశతోనే విధానాల గజిబిజిని పక్కన పెట్టి గంభీర ప్రసంగాలు చేస్తున్నారు. ఈ పోటీలో తమ కంటే ముందే ప్రవేశించిన వైసీపీని వెనక్కు నెట్టి ఉనికిని కాపాడుకోవడం తప్ప ఉచితానుచితాలు ముఖ్యం కాదనే తెలుగుదేశం భావనగా కనిపిస్తుంది.
విభజనవాదుల వింత కలలు
ఇక తెలంగాణాకే పరిమితమైన టిఆర్‌ఎస్‌ సంగతి కూడా ఇందుకు భిన్నం కాదు. విభజన జరిగితే విలీనమై పోతాం అని చెప్పడం ద్వారా ఆ పార్టీ నాయకులు కాంగ్రెస్‌కు తలుపులు తెరిచి ఉంచారు. తెలంగాణా విభజనవాదులు చెప్పే కష్టనష్టాలకు ప్రధాన కారణంగా అత్యధిక కాలం పాలించిన కాంగ్రెస్సే చెప్పాలి. తెలంగాణాలో భూస్వామ్య వర్గాలు, పెత్తందారీ తరగతులు ఇప్పటికీ ఆ పార్టీలోనే ఎక్కువగా ఉన్నారు. విభజన నిర్ణయం చేసినంత మాత్రాన ఆ పాతకాలన్నీ పరిహారమై పోతాయా? ఇప్పటి దుస్థితికి కారణమైన పాలక పార్టీ వారే రేపు నవతెలంగాణా నిర్మాతలుగా మారిపోతారా? విచిత్రమేమంటే మావోయిస్టులు, ఎంఎల్‌ పార్టీల సానుభూతిపరులైన మేధావులు కూడా ఇలాటి సమ్మేళనంలో నవతెలంగాణా స్వప్నం గురించి సంభాషించడం, సంకల్పాలు చెప్పడం!! ఈ దురవస్థలన్నిటికీ మూలవిరాట్టు లాటి కాంగ్రెస్‌లో టిఆర్‌ఎస్‌ నేతలు కలసి కరగిపోయాక విభజనవాదుల కలలు నెరవేరే అవకాశమెక్కడీ కెసిఆర్‌ కురిపించిన హామీల అమలుకు ఆధారమేమిటి? ఆ లోగా సంయమనం పాటించే బదులు ప్రాంతీయ ఉద్రేకాలు పెంచేందుకు కారణమైతే ఎవరికి నష్టం? కాంగ్రెస్‌ తమను విస్మరిస్తోంది గనక తాము మరో ప్రాంతంపై కవ్వింపులకు పాల్పడతామంటే ఏ విధంగా సమర్థనీయం?
కాంగ్రెస్‌ కాపట్యం
ఇక కాంగ్రెస్‌ రాజకీయ చదరంగం గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలంగాణా రాష్ట్రం ఇచ్చేది మేమేనని, అడ్డుకునేది మేమేనన్నట్టుగా తమ వారు అటూ ఇటూ వ్యవహరించేందుకు అధిష్ఠానం అనుమతినిచ్చేసింది గనకే మంత్రులు రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఈ రాజకీయ విన్యాసంలో ప్రతి మలుపూ కోట్ల మంది ప్రజల జీవితాలతో ముడిబడివున్నదన్న కనీస బాధ్యత కూడా లేకుండా తెలంగాణాలో ఎక్కువ సీట్లు తెచ్చుకుని తక్కిన చోట్ల ఉనికిని కాపాడుకోగలిగితే చాలన్నదే వారి ఆరాటంగా ఉంది. అవసరమైతే తమ వారు తాత్కాలికంగా బయిటకుపోయి మళ్లీ రావడానికి కూడా పథకం వేసినట్టు కనిపిస్తుంది. ఈ రాజకీయ నాటకాలలో ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర తరగతుల ప్రజలూ సమిథలు కావడమే ఇక్కడ విచారకరమైన వాస్తవం. విభజన, సమైక్యత ఏ నినాదమైనా సరే పాలక పక్షాల రాజకీయ క్రీడను సవ్యంగా అర్థం చేసుకోలేకపోతే వారు ఈ పరమపద సోపానంలో పాముల నోట పడటం తథ్యం. ఏ పదజాలం వెనక ఏ ప్రయోజనాలున్నాయో అర్థం చేసుకోవాలన్న లెనిన్‌ మాటలు ఇప్పుడు బాగా అక్కరకు వస్తాయి. 
-తెలకపల్లి రవి(ప్రజాశక్తి 6.9.2013)
  

No comments:

Post a Comment