Sunday, September 8, 2013

రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న పాలక వర్గ పార్టీలు

జనాగ్రహాన్ని వాస్తవ సమస్యలపైకి మళ్ళించటమే వామ పక్షాల, 
అభ్యుదయ శక్తుల తక్షణ కర్తవ్యం

స్వార్థ రాజకీయ ప్రయోజనమే విభజన నిర్ణయానికి తక్షణ కారణం

భారత దేశంలో ఏర్పడిన మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ విభజనకు గురి అవుతున్నది. రాష్ట్రాన్ని విభజించి తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం 2013 జూలై 30 న నిర్ణయం తీసుకుంది. దీనిని కేంద్ర మంత్రివర్గం ఆమోదించాక, రాష్ట్ర శాసన సభ నిర్ణయం తీసుకోబడుతుందనీ, ఆ తరువాత పార్లమెంటు ఈ బిల్లును ఆమోదించటం జరుగుతుందనీ, ఈ మొత్తం ప్రక్రియకు 4 నుండి 5 మాసాలు పడుతుందని కాంగ్రెస్ పెద్దలు ప్రకటించారు.

ప్రజల కోరిక ప్రకారమే విభజన అవసరమయిందనుకుంటే 1969 లో ప్రత్యేక జై తెలంగాణా, 1972లో జై  ఆంధ్రా ఉద్యమాలు రెండు ప్రాంతాలలో జరిగినప్పుడే జరగాలి. కాబట్టి విభజనకు తక్షణ కారణం ప్రజలూ కాదు, ఉద్యమాలూ కాదు. రాష్ట్రంలో తుడిచిపెట్టుకు పోయే పరిస్థితి ఏర్పడిన కాంగ్రెస్ ను   కనీసం ఒక ప్రాంతంలో నయినా రక్షించుకోవాలనే తాపత్రయమే ఈ నిర్ణయానికి కారణం. కాంగ్రెస్ పార్టీ విభజన నిర్ణయాన్ని ప్రకటించిన అనంతరం గతంలో టి ఆర్ ఎస్ లోకి క్యూ కట్టిన రాజకీయ వలసలు ఇప్పుడు కాంగ్రెస్ లోకి ప్రారంభమయ్యాయి. కాబట్టి తన నిర్ణయం పని చేస్తున్నదనే విశ్వాసం కాంగ్రెస్ అధినాయకత్వానికి కలిగింది. అందుకనే సీమాంధ్రలో ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నప్పటికీ వెనక్కి తగ్గకుండా విభజన నిర్ణయం జరిగింది, దాని నుండి వెనక్కి తగ్గేది లేదు, మీ కోరికలు సమస్యలు ఏమైనా వుంటే చెప్పుకోండి, తీరుస్తాం అని కాంగ్రెస్ అధినాయకత్వం అంటున్నది.

విభజన నిర్ణయం లో కాంగ్రెస్ తో పాటు మిగతా పార్టీల భాగస్వామ్యమూ వుంది. తెలుగుదేశం విభజనకు మద్దతుగా గతంలో ప్రణాబ్ ముఖర్జీ కమిటీకి ఇచ్చిన లేఖ మాత్రమేగాక, రాష్ట్ర విభజనను కోరుతూ మళ్ళీ ఒక లేఖ ఇచ్చింది. వైఎస్సార్సీపి కేంద్రం  చేసే నిర్ణయానికి ఒప్పుకుంటానంది. బిజెపి మొదటినుండీ రాష్ట్రాన్ని చీల్చాలనే అంటున్నది. గతంలో సమైక్యరాష్ట్రాన్ని బలపరచిన సి పి ఐ, సిపిఐ(ఎం ఎల్) న్యూ డెమోక్రసీ లు మాట మార్చి ప్రత్యేక తెలంగాణా ఉద్యమాన్ని బలపరచాయి. సిపిఎం, ఎం ఐ ఎం  లు మాత్రమే సమైక్య రాష్ట్రం కొనసాగాలన్నాయి. ఎం ఐ ఎం  కూడా తెలంగాణా ప్రకటన వచ్చాక పాత వైఖరిని మార్చుకుని విభజనని సమర్థిస్తూ ప్రకటించింది. సి పి ఎం  ఒక్కటి మాత్రమే సమైక్యతకు కట్టుబడి వున్నది.

భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు చరిత్ర

సి పి ఎం  మొదటినుండి భాషాప్రయుక్త రాష్ట్రాల విధానానికి కట్టుబడివున్నది. స్వాతంత్ర్య ఉద్యమకాలంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల భావం ఆవిర్భవించింది. పోరాడేవారికి తమ భావజాల వ్యాప్తికి భాషాప్రయుక్త రాష్ట్రం అవసరం. కాబట్టి ఆనాడు బ్రిటీషు పాలనకి వ్యతిరేకంగా సీమాంధ్ర ప్రాంతంలో, నైజాము పాలనకి వ్యతిరేకముగా తెలంగాణా ప్రాంతములో జరిగిన పోరాటాలలో తెలుగు మాట్లాడే వారంతా ఒకే రాష్ట్రములో వుండాలనే భావం బలపడింది.  పోరాడే పాత్రలో వున్న కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును కోరుకున్నాయి. అందుకు భిన్నంగా అనేక భాషలు మాట్లాడే వాళ్ళతో తాను ఏర్పాటు చేసిన మద్రాసు, బొంబాయి తదితర ప్రావిన్సులు కొనసాగాలనీ, ఆ విధంగా భాష ప్రాతిపదికగా  ప్రజల ఐక్యత సాధ్యం కాకుండా చేయాలనీ బ్రిటీషు పాలకులు కోరుకున్నారు. భాషా  ప్రయుక్త రాష్ట్రాల డిమాండును తిరస్కరించారు. కానీ స్వాతంత్ర్యం అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తన వైఖరిని మార్చుకుని భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును తిరస్కరించింది. దాంతో హైదారాబాద్ రాష్ట్రంలో వున్న తెలంగాణాలో మరియు కోస్తా రాయలసీమ లలో తెలుగువారందరూ ఒకే రాష్ట్రంలో వుండాలనే విశాలాంధ్ర ఉద్యమం ఉధృతమయింది. ఆ కాలంలోనే భాష ప్రాతిపదికగా ఐక్య కేరళ, సంయుక్త మహారాష్ట్ర, ఐక్య గుజరాత్ తదితర భాష ప్రయుక్త రాష్ట్రాల ఉద్యమాలు ఉధృతమయ్యాయి. ఈ పోరాటాల తాకిడికి కాంగ్రెస్ ప్రభుత్వము దిగివచ్చి విశాల హిందీ ప్రాంతం మినహా దేశమంతటా భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఇదీ భాషా ప్రయుక్త రాష్ట్రాల క్లుప్త చరిత్ర. ఈ క్రమంలో భాగంగా హైదరాబాదు శాసన సభ, ఆంధ్ర శాసనసభ రెండూ అత్యధిక మెజారిటీతో ఆమోదించిన తరువాత 1.11.1956న ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడింది.

భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఈ నాటికీ అవసరమే

భాషా ప్రయుక్త రాష్ట్రం అనేది చాలా ముఖ్యమయిన విషయాలకు సూటిగా సంబంధం ఉన్న సమస్యగా మనం చూడాలి. భారత దేశం వివిధ జాతుల సమాఖ్య. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళీ, మరాఠీ, గుజరాతీ, పంజాబీ, బెంగాలీ, ఒరియా తదితర జాతులు మనదేశంలో వున్నాయి. ఈ జాతులన్నింటికీ ఎవరి భాష, ప్రాంతం, సంస్కృతి, ఆర్థిక వ్యవస్థ, చరిత్ర  వారికి వున్నాయి. కాబట్టి భాష, ప్రాంతం, సంస్కృతి, ఆర్థిక జీవనం, సాంప్రదాయాలు, చరిత్ర ఆధారంగా జాతులు ఏర్పడ్డాయి. భాష ప్రధాన ప్రాతిపదికగా ఈ జాతులన్నీ భాషాప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేసుకున్నాయి. ఈ విధముగా ఏర్పడిన జాతి సర్వతోముఖాభివృద్ధికి, సాంస్కృతిక వికాసానికి, ఆర్థిక ప్రగతికి ఆజాతి మొత్తము కలిసి  ఐక్యముగా ఏర్పడిన భాషా ప్రయుక్త రాష్ట్రానికి  స్వయం నిర్ణయాధికారాలు, పుష్కళముగా నిధులు అవసరం. అటువంటి రాష్ట్రాలు బలముగా వుండటం అవసరం. కానీ భారత బడా బూర్జువా పాలక వర్గాలు ఈ వైవిధ్యాన్ని గుర్తించనిరాకరిస్తున్నాయి. తమలాభ తృష్ణను సంతృప్తి పరచుకోటం కోసం అవి కేంద్ర ప్రభుత్వము వద్ద విశేష అధికారాలు ఉండాలని కోరుతున్నాయి. రాష్ట్రాలను బలహీనం చేస్తున్నాయి. వాస్తవానికి కేంద్రప్రభుత్వ పరిధిలో  దేశ రక్షణ, విదేశీ వ్యవహారాలు, కరెన్సీ నిర్వహణ, అంతర్రాష్ట్ర సమస్యలులాంటి కొన్నింటిని తప్ప మిగిలినవి వుండాల్సిన అవసరం లేదు.కానీ గత 66 సంవత్సరాలలో రాష్ట్రాలకు ఉన్న అధికారాలు కూడా కుంచించబడుతున్నాయి. ఇందుకు వ్యతిరేకముగా జ్యోతిబసు, ఎన్ టి రామారావు, ఫరూక్ అబ్దుల్లా వంటి ప్రతిపక్ష ముఖ్యమంత్రులు నాడు ఉద్యమించి అనేక ఐక్య పోరాటాలు నిర్వహించారు. ఈ పోరాటాల ఫలితముగా కేంద్ర, రాష్ట్ర సంబంధాలనూ, అధికారాలనూ సమీక్షించేందుకు సర్కారియా కమిషన్ ఏర్పడింది. ఆ కమిషన్ సిఫార్సులను కూడా ఇప్పటికీ సక్రమముగా అమలు చేయలేదు. రాష్ట్రాల హక్కులు, అభివృద్ధి కోసం ఇప్పటికీ ఈ పోరాటం కొనసాగుతున్నది. ఈ పోరాటంలో నిలవాలంటే రాష్ట్రాలు బలముగా వుండాలి. భాషా ప్రయుక్త రాష్ట్రాలను చీల్చ కూడదు.కాబట్టి జాతి ఆధారముగా ఏర్పడిన భాషాప్రయుక్త రాష్ట్రాలు బలముగా వున్నప్పుడే భారత దేశ సమాఖ్య(ఫెడరల్) వ్యవస్థ మనగలుగుతుంది. రాష్ట్రాల విభజనలు రాష్ట్రాల హక్కులను బలహీనపరుస్తాయి.
\
ప్రజాస్వామ్యము బలముగా వుండటానికి కూడా భాషా ప్రయుక్త రాష్ట్రాలు అవసరం. 1984లో అప్రజాస్వామికముగా రద్దు చేయబడిన ఎన్ టి రామారావు ప్రభుత్వ పునరుద్ధరణ ఆంధ్రప్రదేశ్ ఒక బలమయిన భాషాప్రయుక్త రాష్ట్రముగా వుండి ప్రజలందరూ ఐక్యముగా ఉద్యమించినందున జరిగింది. కాబట్టి భాషాప్రయుక్త రాష్ట్ర విభజన ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తుంది. సమస్యల పరిష్కారానికి ప్రజల ఐక్య పోరాటం బలహీనమవుతుంది.

బి జె పి రాష్ట్ర విభజనని కోరటం ఇతర బూర్జువా పార్టీలలాగా తక్షణ రాజకీయ ప్రయోజనాలకే పరిమితం కాక, దీర్ఘ కాలిక మతోన్మాద దృష్టితోనేనని మనము గమనించాలి. బి జె పి, భారత దేశం అంతా ఒకే జాతి అని అంటున్నది. దేశాన్ని బహుళ జాతుల సమాఖ్యగా అది అంగీకరించదు. దాని దృష్టిలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, మరాఠా, గుజరాతీ, పంజాబీ, ఒరియా, బెంగాలీ, అస్సామీ తదితర జాతులు లేవు. ఒకే భాష(హిందీ), ఒకే జాతి(హిందూ), ఒకే దేశం (హిందుస్తాన్) అనేది ఆ పార్టీ సిద్ధాంతం. దానర్థం బి జె పి దృష్టిలో వేరే జాతులూ, మతాలు, భాషలూ లేవని కాదు. ఉన్నప్పటికీ అవి హిందీకి, హిందూ మతానికీ లొంగి వుండాలనేది వారి భావన.  వివిధ జాతులు  స్వతంత్రంగా అభివృద్ధి చెందటం కాక అవి కేంద్రం ముందు లొంగి పోవాలని, అఖండ భారత్ లో కేంద్రప్రభుత్వము వద్ద అంతులేని అధికారాలు వుండాలానీ దాని విధానం. రాష్ట్రాలను బలహీనపర్చటం ఆ పార్టీ వ్యూహములో భాగం. చిన్న రాష్ట్రాలలో మతకలహాలను సృష్టించటము దానికి తేలిక. అందుకే దేశములో 60 రాష్ట్రాలు ఏర్పడాలని అది కోరుతున్నది. కాబట్టి రాష్ట్ర విభజన వలన లౌకిక తత్వము దెబ్బ తిని మతోన్మాదం పెరుగుతుంది.

మరోకోణము నుండి కూడా రాష్ట్ర విభజన అంశాన్ని చూడాలి. ఈ విభజనలు ఒక రాష్ట్రంతోనే ఆగిపోతాయా? ఇలా రాష్ట్రాలను విభజించుకుంటూ పోతే మరిన్ని విభజనల డిమాండ్లు ముందుకు వస్తాయి. మన రాష్ట్రములో రాయలసీమ డిమాండు ముందుకు రానే వచ్చింది. తెలంగాణా ఇవ్వటం న్యాయమయితే రాయలసీమ ఇవ్వటం ఎందుకు న్యాయం కాదూ? అసలు విభజనకి ప్రాతిపదిక ఏమిటి?వెనుకబాటు తనం ప్రాతిపదికగా విభజించాలంటే వెనకబడిన జిల్లాలను కూడా రాష్ట్రాలు చెయ్యాలి కదా? ఇలా విభజిస్తూ  పోతే దేశాన్ని ఎన్ని ముక్కలు చేయాలి? విభజన వలన వెనకబాటు తనం పోతుందా? ఎక్కడయినా అలా జరిగిందా?వెనకబడిన ప్రాంతం విడిపోతే అభివృద్ధికి అవసరమయిన మౌలిక సదుపాయాల కల్పనాకు కావాల్సిన భారీ పెట్టుబడులను సమకూర్చుకోటం కష్టమై అభివృద్ధి కుంటుబడుతుంది.  వెనకబాటుతనాన్ని పోగొట్టటానికి విభజన పరిష్కారం కానేకాదు.

 కాబట్టి భాషా ప్రయుక్త రాష్ట్ర  విభజన వద్దనటానికి  కారణం  ఈ పెట్టుబడిదారీ వ్యవస్థలోనే ప్రజలు పోరాడి సాధించుకున్న సమాఖ్య వ్యవస్థ, లౌకిక వాదం, ప్రజాస్వామ్యము, ప్రజల ఐక్యత బలహీన పడకూడదనే.

విభజన-సమైక్యత ఉద్యమాల వర్గ స్వభావం మరియు ప్రజల భావోద్వేగాలు  

విభజన నిర్ణయాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించటానికి ముందు  తెలంగాణాలో విభజన ఉద్యమాలు బలంగా జరిగాయి.  విభజన నిర్ణయాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించిన అనంతరం సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం బలంగా జరుగుతున్నది. రెండు ప్రాంతాల ఉద్యమాలలోనూ ప్రజలు అధికంగా పాల్గొంటున్నారు. ఈ ఉద్యమాల వర్గ స్వభావాన్నీ,  ప్రజలలో పెల్లుబికిన భావోద్వేగాన్నీ అర్థం చేసుకోవాలి. ఒక్క సి పి ఎం  మాత్రమే నికరంగా సమైక్య రాష్ట్రానికి కట్టుబడి వున్నదని కేంద్ర హోమ్ మంత్రి షిండే 7.9.2013 న చేసిన ప్రకటనలో ధ్రువపరచారు.

మరి నిరంతరం కత్తులు దూసుకుంటూ పరస్పరం విమర్శలు చేసుకునే ప్రధాన పార్టీలు కాంగ్రెస్, తెలుగు దేశం లు విభజన విషయములో ఎందుకు ఏకాభిప్రాయం వ్యక్తము చేశాయి? విభజించాలని తెలుగు దేశం ఎందుకు లేఖలు ఇచ్చింది? విభజించాలని కాంగ్రెస్ ఎందుకు నిర్ణయించింది? ఇది చాలా ఆశ్చర్యముగా కనిపిస్తున్నది. కానీ వర్గ దృష్టితో చూస్తే ఇది ఆశ్చర్యకరమయిన విషయం కాదు. సరళీకరణ విధానాలు అమలులోకి వచ్చిన తరువాత మన దేశములో పాలక వర్గాలు బలమైన రాష్ట్రాలుండటం ఇబ్బందికరంగా భావిస్తున్నాయి. విదేశీ కార్పొరేట్ సంస్థలు, స్వదేశీ గుత్త పెట్టుబడిదారీ శక్తులు తమ దోపిడీని యధేచ్చగా సాగించుకోటానికి తమకు అనుకూలముగా నిర్ణయాలను సులభముగా సాధించుకోటానికి చిన్న చిన్న రాష్ట్రాలు ఉంటేనే ప్రభావితం చేయగలమని భావిస్తున్నాయి.అలాగే హిందూత్వ  శక్తులు కూడా చిన్న రాష్ట్రాలయితే మతోన్మాదాన్ని సులభముగా రెచ్చగొట్టవచ్చునని భావిస్తున్నాయి. దేశాన్ని 60 ముక్కలు చేయాలని బి జె పి కోరటంలో అంతరార్థం ఇదే.

ఇంతేగాక రాష్ట్రాల్లోని స్థానిక పెట్టుబడిదారీ వర్గాలు కూడా రాష్ట్రాలు ముక్కలయితేనే వనరులతోపాటు అధికారములో కూడా తమకు వాటాలు దక్కుతాయని భావిస్తున్నాయి. మన రాష్ట్రములో వివిధ ప్రాంతాల్లో పాత సంపన్న తరగతులకు తోడు కొత్త సంపన్న వర్గాలు తయారయ్యాయి. వారు అధికారములో భాగం కావాలని ఆరాట పడుతున్నారు. పాత తరగతులు తమ అధికారములో వాటా ఇవ్వటానికి స్వచ్ఛందముగా ముందుకు వచ్చే అవకాశము లేనందున తగాదాలు, ఘర్షణలు తలెత్తుతున్నాయి.  వాటి యొక్క ఒకానొక రూపమే ఈ విభజనోద్యమాలు. అందువలన ప్రస్తుతము రాష్ట్రములో జరుగుతున్న విభజన-సమైక్య ఉద్యమాల వెనుక పాలక వర్గాల్లోని వైరుధ్యాలున్నాయనేది గమనించాలి.

ప్రధాన పార్టీలన్నీ రాష్ట్ర విభజనను కోరుతున్నప్పటికీ ఈ పార్టీలన్నీ నిట్టనిలువునా చీలి తెలంగాణాలో విభజనకు, కోస్తా రాయలసీమలో సమైక్యతకు ఆందోళన చేస్తున్నాయి. సంపన్న వర్గాలు స్థూలంగా విభజనకు సానుకూలముగా వున్నప్పుడు పాలక వర్గ పార్టీల్లో నాయకులు కోస్తా రాయాలసీమల్లో సమైక్యత కోసం నిలబడటం ఎందుకు జరుగుతున్నది? కోస్తా రాయలసీమ ప్రాంతాల ప్రధాన పార్టీల నాయకులు సమైక్యవాదం అనేదానిని ఒక ముసుగుగా వినియోగించుకుంటున్నారు తప్ప నిజముగా సమైక్యత కోరుకోవటం లేదు. వారు విభజన వలన వచ్చే సమస్యలగురించే మాట్లాడుతున్నారు. ఆ సమస్యలు పరిష్కరిస్తే వారంతా విభజనకు అనుకూలమనేది స్పష్టం. హైదరాబాదు కేంద్రపాలిత ప్రాంతమయితే చిరంజీవి గారికీ, రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేస్తే కిషోర్ చంద్ర దేవ్ గారికీ,  రాయల తెలంగాణా చేస్తే జె సి దివాకర రెడ్డి గారికీ, కొత్త రాజధానికి 5 లక్షల కోట్లు ఇస్తే చంద్రబాబు గారికీ, అన్నీ ప్రాంతాలకీ సమ న్యాయం చేస్తే జగన్ గారికీ సమైక్యత అవసరం లేదు. అప్పుడు వాళ్ళంతా విభజనకు సిద్ధమే.  అలాగే ఉద్యమాలు నిర్వహిస్తున్న ఉద్యోగ సంఘాల నాయకులకి ఉద్యోగ, ఉపాధి, ఆస్తి భద్రతలు కల్పిస్తే విభజన చేసినా సమ్మతమే. నదీజలాలు సమంజసముగా పంపిణీ అయితే అనేక మంది రైతు నాయకులకు విభజన అభ్యంతరం లేదు. అందువలన ఈ రోజు కోస్తా రాయలసీమల్లో జరుగుతున్న సమైక్య ఉద్యమములో చాలా మందికి సమైక్యత అనేది ఒక ముసుగు మాత్రమే. (7.9.2013 నా జరిగిన ఏపీ ఎన్ జి వో ల ఎల్ బీ స్టేడియం సమైక్యతా సభ విభజనవలన సీమాంధ్ర ఉద్యోగులకి, విద్యార్థులకీ, రైతులకీ జరిగే నష్టాలనే చెప్పిందిగాని తెలంగాణా విద్యార్థులకు, ఉద్యోగులకు, ప్రజలకు విభజన వలన జరిగే నష్టాలను వివరించలేదు. కాబట్టి సారాంశంలో ఇది సీమాంధ్ర ప్రాంత ఉద్యమముగానే వున్నదిగాని సమైక్య ఉద్యమముగా లేదు)

సి పి ఎం  సమైక్యతకీ, ఇతరుల సమైక్యతకీ తేడా

సి పి ఎం  చెపుతున్న సమైక్యతకీ, పంపకాలలో కొన్ని సమస్యలు పరిష్కారం అయితే విభజనకి అభ్యంతరం లేని “సమైక్య వాదుల” సమైక్యతకీ మౌలికముగా తేడా వున్నది. భాషా ప్రయుక్త రాష్ట్రాలవలన పీడిత ప్రజల, కష్ట జీవుల, బలహీన వర్గాల ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయని భావించి సి పి ఎం  దానిని బలపరచటం లేదు.  భాషా ప్రయుక్త రాష్ట్రాల వలన పెట్టుబడిదారీ విధానములోనే ప్రజల కృషివలన స్థిరపడిన ప్రజాస్వామ్యము, లౌకిక వాదం, ఫెడరలిజం వంటి మంచి వ్యవస్థలు దెబ్బ తినకుండా వుంటాయి. కాబట్టే సి పి ఎం భాషా ప్రయుక్త రాష్ట్రాల విధానాన్ని బలపరుస్తున్నది. అంతే  తప్ప భాషా ప్రయుక్త రాష్ట్రాలవాలన కార్మికులకు వేతనాలు, కవులుదారులకు రుణాలు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, దళితులకు గిరిజనులకు ఆత్మ గౌరవము, మైనారిటీల అభివృద్ధి, వృత్తులకు రక్షణ, మహిళలకు భద్రత వస్తాయని కాదు. పెట్టుబడిదారీ విధానం వున్నంత కాలం ఈ సమస్యలు అపరిష్కృతముగానే వుంటాయి. నిరంతరం పరిష్కారం కోసం పోరాటం చేస్తూనే వుండాలి.

రాష్ట్రాన్ని విభజిస్తే సమస్యలు పరిష్కారమవుతాయని విభజనవాదులు భ్రమలు కల్పిస్తున్నారు. వాస్తవముగా సమాస్యలు ఇంకా తీవ్రమవుతాయి. ఐక్యముగా పోరాడాల్సిన ప్రజల పోరాడే శక్తి విభజన మూలముగా ఇంకా బలహీనమవుతుంది. కొత్త రాష్ట్రాలకు సారధ్యం వహించే పాలకులు కూడా పెట్టుబడిదారీ విధానాలనూ, సరళీకరణ విధానాలనే అమలు చేస్తారు. అందువలన ప్రజలకు మౌలికమయిన ప్రయోజనమేమీ కలగదు.

సి పి ఎం జాగ్రత్తగా, స్వతంత్రముగా వ్యవహరిస్తుంది

పై అంశాలాన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే ప్రస్తుతం కోస్తా రాయలసీమల్లో జరుగుతున్న సమైక్యవాద ఉద్యమం పరిమితులు అర్థమవుతాయి. ఈ ఉద్యమములో చురుకుగా పాల్గోవటం ద్వారా మార్క్సిస్టు పార్టీ బలపడవచ్చుననే ఆశకు ఉన్న పరిమితి కూడా అర్థము అవుతుంది. వాస్తవంగా ఆ ఉద్యమములో మమేకము కావటాము ద్వారా మార్క్సిస్టు పార్టీ ప్రత్యేకతను ప్రజల ముందుంచే అవకాశాన్ని కోల్పోయి పాలక వర్గ పార్టీల మోసకారితనాన్ని ఎండగట్టలేము. ఆ పార్టీల ప్రభావం ఇంకా స్థిరపడటానికీ, వారితో పాటు ప్రజలను మనం కూడా మోసం  చేయటానికీ తోడ్పడుతుంది.

అందువలననే భావోద్వేగాల మీద ఆధారపడి పాలక వర్గాలు సృష్టించే ఉద్యమాల పట్ల జాగ్రత్తగా, స్వతంత్రముగా వ్యవహరించాలి.  అందుకే సి పి ఎం  గతంలో విభజన ఉద్యమ సందర్భములో, ఇప్పుడు సమైక్య ఉద్యమ సందర్భములో స్వతంత్రముగా వ్యవహరిస్తున్నది. సి పి ఎం  చెపుతున్న సమైక్యత యొక్క ప్రత్యేకతను, సమైక్యతనూ కాపాడుకోవాలంటే అనుసరించాల్సిన పద్ధతులను వివరించి ప్రజలను చైతన్య పరచేందుకు క్షేత్ర స్థాయి వరకూ సభలూ, సమావేశాలద్వారా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది.

జనాగ్రహాన్ని వాస్తవ సమస్యలపైకి మళ్ళించాలి

పాలక వర్గాలు రెండు ప్రాంతాలలో నిర్వహిస్తున్న విభజన, సమైక్య ఉద్యమాల ఫలితాలు ఎలా వున్నా దానివలన ప్రజలకు ఒరిగేదేమీ వుండదు. ఆ డిమాండ్లు నెరవేరితే లాభ పడేది పాలక వర్గాలే కానీ ప్రజలు కాదు. ఎందువలనంటే పెద్ద రాష్ట్రమయినా, చిన్న రాష్ట్రమయినా పాలక వర్గాలు అనుసరించే విధానాలు సామాన్యుల కష్టార్జితాన్ని కుబేరులకు దోచిపెట్టేవే తప్ప ప్రజల ఆశలను నెరవేర్చేవి కావు. మరీ ముఖ్యంగా ప్రపంచ వ్యాపితముగా ఆర్థిక సంక్షోభాలు ముదురుతున్న తరుణంలో, ప్రపంచీకరణ విధానాల అమలులో చిక్కుకున్న మనం కూడా ఆ ముంపుకు గురికావటం ఖాయం. అందుకే మన దేశ స్థూల జాతీయోత్పత్తి పెరుగుదల పడి పోతున్నది. ఇప్పటికే 5 శాతానికి దిగజారింది. ఆహారం, కూరగాయలు, పెట్రోలు, డీజీలు ధరల నిరంతర పెరుగుదలతో ఇంకా అనేక సరుకుల ధరల పెరుగుదలతో ప్రజలు సతమవుతున్నారు. డాలరుకు మన రూపాయి మారకం విలువ ఎన్నడూ లేనంతగా దిగజారింది. దీని ఫలితాలు సామాన్యులపై దారుణంగా ఉండబోతున్నాయి. ప్రజల అసంతృప్తుల్ని ప్రస్తుతానికి విచ్ఛిన్న ఉద్యమాల వైపు పాలకా వర్గాలు జయప్రదంగా మళ్ళించగలుగుతున్నప్పటికీ ఈ కుయుక్తులను ఎల్ల కాలం సాగించ లేరు. జనాగ్రహాన్ని వాస్తవ సమస్యల పైకి మళ్ళించటమే వామ పక్షాలు, అభ్యుదయ శక్తుల తక్షణ కర్తవ్యముగా వుంటుంది.

(గమనిక: ఇది “మార్క్సిస్టు” సైద్ధాంతిక పత్రిక సెప్టెంబరు 2013 సంచికలో ప్రచురించబడిన “రాజకీయ అవకాశవాదంతో రాష్ట్రం నాశనం” పేరుతో తమ్మినేని వీరభద్రం గారు రాసిన వ్యాసం నుండి, “విభజన, సమైక్య ఉద్యమాల వర్గ స్వభావాన్ని అర్థం చేసుకోవాలి” అనే మకుటం తో కొన్ని ప్రశ్నలకు బి.వి.రాఘవులు గారు ఇచ్చిన జవాబు నుండి వివరాలను సేకరించి దానికి మరి కొన్ని వాక్యాలను అక్కడక్కడా జోడించి తయారు చేయబడినది)

2 comments:

  1. Pls. also focus on the problems faced by the telangana region like employment, irrigation development, article 371D, 6 10 go, mulky issue, land grabing by the politicians etc

    ReplyDelete
  2. Every one is aware that cplm is opposed to smaller states and the principles are also worth. But what the party is doing to solve the issues which are raised by the region.

    ReplyDelete