Monday, February 3, 2014

నేటినుండి స్పెక్ట్రమ్ వేలం; నందిగ్రామ్ నయవంచన

నేటినుండి స్పెక్ట్రమ్ వేలం

1800 మెగాహెర్ట్జ్ బ్యాండ్ లో 403 మెగాహెర్ట్జ్ పరిమాణపు స్పెక్ట్రమ్ ను, 900 మెగాహెర్ట్జ్ బ్యాండ్ లో 46 మెగాహెర్ట్జ్ పరిమానపు స్పెక్ట్రమ్ ను ప్రభుత్వము నేటి (3.2.2014)నుండి వేలం వేస్తుంది. ఈ రెండు బ్యాండ్లు  2జి స్పెక్ట్రమ్ బ్యాండ్లు. ఈ వేలం లో పాల్గొనేందుకు ఎయిర్టెల్, వోడాఫోన్, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్, ఐడియా,టెలీ వింగ్స్(యూనినార్), రిలయన్స్ కమ్యూనికేషన్స్, టాటా టెలిసర్వీసెస్ మరియు ఎయిర్సెల్-మొత్తం 8 కంపెనీలు ముందుకు వచ్చాయి.ఈ నవంబరులో వోడాఫోన్ లైసెన్సు కాలం 20 సంవత్సరాలు ఢిల్లీ, ముంబయి మరియు కలకత్తా లలో అయిపోతుంది. ఎయిర్టెల్ లైసెన్సు ఢిల్లీ, ముంబాయిలలో అయిపోతుంది.లూప్ లైసెన్సు ముంబయి లో అయిపోతుంది. కాబట్టి ఇవి ఈ సర్కిల్సు లో తమ సర్వీసులను కొనసాగించాలంటే ఈ వేలం లో పాల్గొని స్పెక్ట్రమ్ ను మళ్ళీ కొనాలి. బి ఎస్ ఎన్ ఎల్ కు లైసెన్సు కాలం 20 సంవత్సరాలు 2020 లో పూర్తి అవుతుంది. తగినంత స్పెక్ట్రమ్ కూడా వున్నది. కాబట్టి బి ఎస్ ఎన్ ఎల్ ఈ వేలం లో పాల్గొనాల్సిన అవసరం లేదు.

పైన తెలియజేసిన కంపెనీలలో ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియా మరియు లూప్ లు ఈ వేలం పై స్టే ఆర్డరు కోరుతూ సుప్రీం కోర్టుకు వెళ్ళాయి. తమ లైసెన్సు కాలం 20 సంవత్సరాలు నవంబరుతో అవుతున్నప్పటికీ మరో 10 సంవత్సరాలు దానిని పొడిగించి తమకున్న స్పెక్ట్రమ్ ను మళ్ళీ కొనాల్సిన అవసరం లేకుండా వుండేందుకు ఆర్డర్సు ఇవ్వాలని కోరుతూ ఈ ఈ కంపెనీలు టి డి శాట్ (టెలికాం డిస్ప్యూట్ సెటిల్మెంట్ అథారిటీ) వద్దకు వెళ్ళాయి. కానీ టి డి శాట్ వారి కోరికను నిరాకారిస్తూ ఆర్డర్సు ఇచ్చింది. దీనికి వ్యతిరేకముగా ఈ కంపెనీలు సుప్రీం కోర్టుకు వెళ్ళాయి. తమ పిటిషన్ పై తుది తీర్పు ఇచ్చే లోగా ఈ స్పెక్ట్రమ్ వేలము పై స్టే ఆర్డర్ ఇవ్వాలని కోరాయి. ఈ కంపెనీల పేటిషన్ ను విచారించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది.  కానీ ఇవి కోరిన విధముగా స్పెక్ట్రమ్ వేలం పై స్టే ఆర్డరు ఇచ్చేందుకు నిరాకరించింది. కాబట్టి ఈ కంపెనీలు కూడా వేలం లో పాల్గొనటం అనివార్యమయింది.

వేలం కు పెట్టిన స్పెక్ట్రమ్ మొత్తం అమ్ముడుపోతుందని, దీని వలన ప్రభుత్వానికి కనీసం రు.11000 వస్తాయనీ అంచనా.

నందిగ్రామ్ నయవంచన


నిజాలను ఎల్లకాలం తొక్కిపెట్టి ఉంచడం సాధ్యం కాదు. 2007లో పశ్చిమ బెంగాల్‌ తూర్పు మేదినిపూర్‌ జిల్లా నందిగ్రామ్‌ దుమారం నిజానిజాలు ఇప్పుడు అధికారికంగా బయట పడటం ఆహ్వానించ దగింది. నాటి వామపక్ష సంఘటన ప్రభుత్వాన్ని అస్థిర పర్చటానికి తృణమూల్‌ నాయకురాలు మమతా బెనర్జీ, మావోయిస్టుల మిలాఖత్తుతో అన్ని వామపక్ష వ్యతిరేక శక్తులను కూడదీసుకుని జరిపిన మహాకుట్ర రూపురేఖలు ఇప్పుడు బయట పడుతున్నాయి. పాలకవర్గం మొత్తం, దాని మీడియాతో సహా ఈ కుట్ర వెనక ఉన్న తీరు బహిర్గతమైంది. వామపక్ష సంఘటన ప్రభుత్వానికి, దానికి నాయకత్వం వహిస్తున్న సిపిఎం పార్టీకి వ్యతిరేకంగా బెంగాల్‌లోనే గాక దేశ వ్యాపితంగానూ, అంతర్జాతీయంగా కూడా దుష్ప్రచారంతో ఊదరగొట్టడం జరిగింది. కేంద్రంలోని కాంగ్రెస్‌ సర్కారు అందుకు వత్తాసుగా నిలిచి వంత పాడింది. ఇప్పుడు ఆ ప్రభుత్వ ఆధ్వర్యంలోని సిబిఐ ద్వారానే ఆ మాటలన్నీ కట్టుకథలని తేలిపోయింది.
  
సెజ్‌ల పేరిట భూములు కట్టబెట్టే సరళీకరణను నికరంగా వ్యతిరేకించేది వామపక్షాలేనని అందరికీ తెలుసు. ఉన్న పరిమితుల్లోనే పరిశ్రమలు స్థాపించే ఉద్దేశంతో ఒక క్రమబద్ధమైన విధానం మేరకు వామపక్ష ప్రభుత్వం నందిగ్రామ్‌ ప్రాంతంలో భూమి సేకరించాలని తొలుత అనుకున్నా వ్యతిరేకత రావటంతో ఆలోచన విరమించుకుంది. అందుకోసం ఏ చర్యా తీసుకోకుండానే తలాతోక లేని ఒక ప్రకటనను పట్టుకుని తృణమూల్‌ అండదండలతో భూమి ఉచ్ఛేద్‌ ప్రతిరోధ సమితి(బియుపిఎస్‌) ఏర్పాటు చేసి విష ప్రచారం సాగించారు. భూసేకరణ జరగదని అప్పటి ముఖ్యమంత్రి బుద్ధదేవ్‌ భట్టాచార్య బహిరంగంగానే ప్రకటించారు. అంతకు ముందే బెంగాల్‌ హుగ్లీ జిల్లా సింగూర్‌లో టాటా కార్ల తయారీ కర్మాగారం రాకుండా మమతా బెనర్జీ నానా యాగి చేశారు. అత్యధికులు భూమి ఇష్టపూర్వకంగా ఇచ్చినా ఎవరో కొంతమంది ఇష్టపడ లేదంటూ నిరాహారదీక్షలు, నిరసనల ప్రహసనం నడిపింది. ఆఖరికి టాటా అక్కడి నుంచి గుజరాత్‌కు వెళిపోయే వరకూ ఆగలేదు. ఒక పక్క సింగూరు వివాదం నలుగుతూ ఉండగానే నందిగ్రామ్‌లో చిచ్చు రగిల్చారు. వామపక్ష ప్రభుత్వం పంట భూములూ, మందిరాలు-మసీదుల భూములూ అన్నీ బలవంతంగా లాక్కుంటుందని 2007 సంవత్సరం మొదటి నుంచే ప్రచారం మొదలయింది. పైగా అక్కడ భయంకరమైన విషపూరిత పరిశ్రమ నెలకొల్పటం జరుగుతుందని, దానివల్ల నది-సముద్రం నీరు, మట్టి అన్ని విషమయం అయిపోతాయని హడలగొట్టారు. ఈ దుష్ప్రచార గందరగోళానికి తోడుగా మావోయిస్టుల సహాయంతో హింసాత్మక ఆందోళన నడిపారు. రోడ్లు తవ్వేసి, వంతెనలు కూల్చేసి పోలీసు ప్రవేశించకుండా ఇబ్బంది కలిగించారు. ఆ నేపథ్యంలోనే 2007 మార్చి 14న పోలీసు ప్రవేశం తర్వాత విచారకరమైన ఘటనలు జరిగితే వాటి ఆధారంగా మరింత విష ప్రచారం నడిపించారు. బడా మీడియాలో, ఇంటర్నెట్‌లో ఘోరమైన ఎన్నో కథనాలు వ్యాప్తి చేసి వామపక్ష ప్రభుత్వం కూడా అమానుషమైందన్నట్టు కట్టుకథలు వ్యాపింప జేశారు. నేటి ముఖ్యమంత్రి, ఆమె పార్టీ తృణమూల్‌ ఆ రోజుల్లో పోలీసుల ముసుగులో సిపిఎం కార్యకర్తలు నందిగ్రామ్‌లో హత్యాకాండకు పాల్పడ్డారని అదేపనిగా ప్రచారం చేశారు. పసి పిల్లల్ని కాళ్ళు నరికి తాల్‌పాటి చెరువులో పడేశారని, ట్రాక్టర్లతో శవాలు నందిగ్రామ్‌ నుంచి తరలిస్తే హల్దీ నదిలో తేలాయని అంతులేని అబద్ధాలు వ్యాపింపజేశారు. దక్షిణ 24 పరగణా జిల్లా సాగర్‌లో కూడా నీరు రక్తంతో ఎరుపు బారిందనేది ఆనాటి అసత్య కథనాల్లో మరొకటి. ఆ రోజు ఆ తృణమూల్‌ ప్రచారాలలో కొట్టుకుపోయిన అనేకమంది మేధావులు కూడా దాని ఎన్నికల ప్రచారం కోసం పాటలు, నాటకాలు అందించే వరకూ వెళ్లారు. ఇవన్నీ కట్టు కథలని నేటి సిబిఐ చార్జ్‌షీట్‌తో తేలిపోయింది.
  
ఆ సమయంలో కొల్‌కతా హైకోర్టు నిర్దేశంతో సిబిఐ నందిగ్రామ్‌లో 2007 మార్చి 15న విచారణ ప్రారంభించింది. అంటే తూటాలు పేలిన మరుసటి రోజే. ఆరున్నర ఏళ్ళు విచారణ జరిపి సిబిఐ ఇప్పుడు చార్జ్‌షీట్‌ ఇచ్చింది. నిజానికి మమత ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్‌ భట్టాచార్యపైనే దర్యాప్తు అంటూ జైల్లో పెట్టాలని అనుకున్నది. సిబిఐ అందుకు అంగీకరించలేదనే అక్కసుతో ప్రభుత్వం పోలీసు అధికారులపై చర్య తీసుకోవటానికి అనుమతివ్వ లేదు. కనుక సిబిఐ కూడా అన్ని నిజాలు బయట పెట్టగల్గిందని చెప్పడం కష్టం. కానీ చెప్పిన మేరకైనా అప్పటి దుష్ప్రచారానికి ఆధారాలు లేవని తేలిపోయింది. ఆనాడు కాల్పులు జరిగిన రెండు ప్రాంతాలు భాంగాబేడా వంతెన, గోకుల్‌నగర్‌లకు సంబంధించి సిబిఐ రెండు చార్జ్‌షీట్లు ఇచ్చింది. ఆ ఘటనలకు బాధ్యులుగా గుర్తించబడిన వారిలో అత్యధికులు తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందినవారే ఉండటం అందరినీ దిగ్భ్రాంతపరిచింది. నందిగ్రామ్‌కు పోలీసులు రహస్యంగా వెళ్లారన్నది కూడా నిజం కాదని సిబిఐ స్పష్టంగా చెప్పింది. సాధారణ పాలన పునరుద్ధరించి శాంతిభద్రతలు నెలకొల్పడానికే వెళ్లింది.
  
వారిని అడ్డుకోవటానికి 'చట్టవిరుద్ధ' సమీకరణ జరిపింది తృణమూల్‌ స్థాపించిన కమిటీ సభ్యులే కావడం మరింత విపరీతం. ఆనాడు తాండవించిన గందరగోళం వెనక ఆ పార్టీ సాయుధ దుండగులు ఉన్నారు. వారే పోలీసులపై బాంబులు విసిరి, కాల్పులు జరిపారు. ఇప్పుడు సిబిఐ చార్జ్‌షీట్లో తేల్చి చెప్పిన ఈ నిజాలు నాడు వామపక్ష ప్రభుత్వం ఒకటికి రెండుసార్లు వివరించేందుకు ప్రయత్నించిన ప్రాథమిక సత్యాలనే రుజువుచేస్తున్నట్టు సిపిఎం ప్రతిపక్ష నాయకుడు సూర్యకాంత మిశ్రా చేసిన వ్యాఖ్య సత్యమైంది. ఈ తప్పుడు ప్రచారాలతో, చర్యలతో అధికారంలోకి వచ్చిన మమత సర్కారు ఆఖరుకు కాంగ్రెస్‌ కూడా భరించలేనిదిగా తయారవడమే గాక ప్రజాస్వామిక హక్కులపైనా దాడి చేస్తున్నది. ఇప్పుడు సిబిఐ చార్జిషీట్‌ను కూడా తోసిపుచ్చాలని హడావుడి చేస్తున్నది. అవన్నీ ఎలా ఉన్నా పాలకవర్గాల విష ప్రచారాలలో కొట్టుకుపోయే వారికి ఇది కనువిప్పు కావలసి ఉంటుంది. అవి ఎల్లకాలం నిలిచేవి కావనీ విశ్వాసం కలుగుతుంది. (ప్రజాశక్తి 31.1.2014 సంపాదకీయం)

No comments:

Post a Comment