Thursday, August 20, 2020

కోవిడ్ 2019 సంక్షోభ కాలంలో చైనా-భారత్‌ విధానాలు

 

ప్రపంచ ఆర్థిక పునరుజ్జీవనానికి చైనా నాయకత్వం వహించే పరిస్థితి

కోవిడ్‌ 19 మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న పరిస్థితులలో ప్రపంచ ఆర్థిక పునరుజ్జీవనానికి చైనా నాయకత్వం వహిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. కోవిడ్‌-19 మహమ్మారిని కట్టడి చేయలేక, ఆర్థికాభివృద్ధి పతనాన్ని అరికట్టలేక ఆర్థికంగా అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాలు సతమతమౌతుంటే చైనా మహమ్మారిని జయప్రదంగా కట్టడి చేయటంతో పాటు జిడిపి పెరుగుదలను కూడా సాధించింది. చైనా ఈ ఘన విజయాన్ని ఎలా సాధించిందో తెలుసుకుందాం.

అభివృద్ధికి చైనా ప్రణాళిక-దాని ఫలితాలు


అన్ని దేశాలు లాక్‌డౌన్‌లు ప్రకటించటంతో ఆ దేశాలలో ఉద్యోగాలు, ప్రజల కొనుగోలు శక్తి పడిపోవటంతో తమ ఎగుమతులు తగ్గుతాయని చైనా అంచనా వేసింది. ఎగుమతుల తగ్గుదల వలన సంభవించే ఉత్పత్తి మాంద్యాన్ని అధిగమించటం కోసం తమ ప్రజల కొనుగోలు శక్తిని పెంచటానికి చర్యలు తీసుకుంది. ప్రజల ఉద్యోగాలు, కొనుగోలు శక్తిని కాపాడటం కోసం చైనా తమ దేశ చరిత్ర లోనే అతి పెద్ద ఆర్థిక ప్యాకేజిని ప్రకటించింది. ఈ ప్యాకేజీ విలువ మొత్తం 6 లక్షల కోట్ల యువాన్లు  (రూ.66 లక్షల కోట్లు). మహమ్మారి కారణంగా చిన్న, మధ్య తరహా కంపెనీలు పొందిన నష్టాన్ని భర్తీ చేసి, ఉద్యోగాలను నిలబెట్టటం కోసం అనేక రాయితీలు, సబ్సిడీలను ప్రభుత్వం అందించింది. ప్రభుత్వ బాండ్లను విడుదల చేయటం ద్వారా ప్రాంతీయ ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు ఖర్చు చేస్తున్న రెండు లక్షల కోట్ల యువాన్లకు ఇది అదనం.

2020 మొదటి త్రైమాసికంలో 6.8 శాతం కుచించుకుపోయిన చైనా జిడిపి (స్థూల జాతీయ ఉత్పత్తి)  ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా అంచనాలన్నింటినీ తలకిందులు చేస్తూ రెండవ త్రైమాసికంలో  3.2 శాతానికి పెరిగింది. గత సంవత్సరం 6.1 శాతం జిడిపి వృద్ధిని సాధించిన చైనా జిడిపి ఈ సంవత్సరం 5 శాతం పెరగవచ్చునని ఇపుడు అన్ని సంస్థలూ అంచనాలు వేస్తున్నాయి. 90 కోట్ల మంది శ్రామికులు ఉన్న చైనాలో శ్రామికులందరికీ పని కల్పించకపోతే వారు ఆకలితో ఉంటారని, పని కల్పిస్తే సంపదను ఉత్పత్తి చేస్తారనే అవగాహనతో చైనా నాయకత్వం పనిచేస్తున్నది. అభివృద్ధిని పట్టాలెక్కించటంతో ప్రజలకు జీవనోపాధిని మెరుగుపరచటం, కొత్తగా ఉద్యోగాల కల్పనకు అవసరమైన చర్యలు తీసుకొంటున్నారు. ఈ సంవత్సరం మొదటి ఆరు మాసాల కాలంలో 56.4 లక్షల మందికి నూతనంగా ఉపాధిని కల్పించారు. పేద ప్రజలు ఎక్కువగా ఉన్న సిచువాన్‌, గ్విజౌ, గ్వాంగ్జిలలో గ్రామీణ ప్రజల తలసరి ఆదాయం 5.5 నుండి 7.6 శాతం వరకు పెరిగింది. సామాజిక సంక్షేమ పథకాలను మరింత బలోపేతం చేయటం వలన వృద్ధాప్య, రిటైర్‌మెంటు పెన్షన్లు 9.3 శాతం, సంక్షేమ గ్రాంట్లు, సబ్సిడీలు 13.2 శాతం పెరిగాయి.

మోడీ పభుత్వ బాధ్యతారాహిత్యం- కరోనా రోగుల సంఖ్య లో 3వ స్థానం కు ఎదుగుదల

చైనా వ్యవహరిస్తున్న తీరుకు పూర్తి విరుద్ధంగా భారత ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నది. కోవిడ్‌ను అరికట్టటం పేరుతో హఠాత్తుగా లాక్‌డౌన్‌ ప్రకటించిన ప్రభుత్వం వైరస్‌ లక్షణాలున్న వారికి పరీక్షలు చేయటం, రోగులను గుర్తించటం, వైద్యం అందించటం, అనుమానితులను ఐసొలేషన్‌లో ఉంచటం తదితర చర్యలు తీసుకోవటానికి మారుగా లైట్లు ఆపివేయటం, చప్పట్లు చరచటం, వైద్య సిబ్బందిపై పూలు చల్లటం, నౌకలపై లైట్లు వెలిగించటం తదితర హాస్యాస్పదమైన చర్యలు తీసుకుంది.  ఫలితంగా 500లకు పైగా కేసులతో మార్చి 23వ తేదీన లాక్‌డౌన్‌ ప్రకటించిన మన దేశంలో ఆగస్టు 17 తేదీ నాటికి కేసులు 27 లక్షలు, మరణాలు 50 వేలు దాటిపోయాయి. ఫలితంగా ఈ రోజు వైరస్‌ సోకినవారి సంఖ్యలో ప్రపంచంలో మూడవ స్థానం, మరణించిన వారిలో నాలుగవ స్థానానికి చేరుకున్నది.

ఆర్థిక రంగం లో ప్రజా వ్యతిరేక విధానాలు:

ఆర్థిక రంగంలో కూడా ఇదే విధమైన విధానాలను అనుసరిస్తున్నది. ఉద్యోగాలను కాపాడటం, ప్రజలకు ఉపాధి కల్పించే అంశాలను పక్కనపెట్టి, బహుళజాతి సంస్థలు, బడా కార్పొరేట్లకు లాభాలు కట్టబెట్టే విధానాలను అనుసరిస్తున్నది. కోవిడ్‌-19 మహమ్మారి, ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోవటం కోసం అంటూ ప్రకటించిన రూ.20.79 లక్షల కోట్ల ప్యాకేజీ వాస్తవవానికి రూ.1.5 లక్షల కోట్లకు మించదు. ఆదాయం పన్ను చెల్లించని 80 శాతం ప్రజలకు నెలకు తలకు 10 కిలోల ఆహార ధాన్యాలు, కుటుంబానికి 7,500 రూపాయల చొప్పున ఆరు మాసాల పాటు అందించాలన్న నిపుణుల సూచనలను పట్టించుకోవటం లేదు.

లాక్‌డౌన్‌ వలన ప్రజలు పెద్దసంఖ్యలో కదిలి ఆందోళనలు చేయటం సాధ్యం కాని పరిస్థితులను ఆసరాగా చేసుకొని ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ దిగజారుస్తున్నది. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను వేగవంతం చేసింది. కార్పొరేట్లు బ్యాంకులకు ఎగ్గొట్టిన లక్ష కోట్ల రూపాయలకు పైగా రుణాలను రద్దు చేసింది. ఈ విధానాల ఫలితంగా ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో జిడిపి  రెండంకెలు పడిపోతుందని అంచనా వేస్తున్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో జిడిపి 3-4 శాతం తగ్గవచ్చని మొదట అంచనా వేయగా ఇపుడు 7 శాతం తగ్గుతుందని అంచనాలు వేస్తున్నారు. ప్రభుత్వం ఇదే విధానాలను కొనసాగిస్తే జిడిపి 10 శాతానికి మించి తగ్గినా ఆశ్చర్యం లేదు.
విధానాల లో వ్యత్యాసం

సంక్షోభ కాలంలో చైనా ప్రభుత్వ విధానాలు ప్రజలకి అనుకూలముగా వుండగా  భారత ప్రభుత్వ విధానాలు ప్రజలకి వ్యతిరేకముగా, కార్పొరేట్ల, బహుళ  జాతి సంస్థల లాభాలు పెంచే విధముగా వున్నాయి. మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధానాలతో ఆర్థిక మాంద్యం తీవ్రం కావటంతో పాటు దేశం ఆరోగ్య సంక్షోభంలో కూరుకుపోయి, నివారించదగిన వైరస్‌కు లక్షలాది మంది అమాయక ప్రజలు బలైపోయే పరిస్థితి ఏర్పడుతున్నది. (ప్రజాశక్తి 20.8.2020 సంచికలోప్రచురించబడిన శ్రీ ఏ.కోటిరెడ్డి గారి వ్యాసానికి కొన్ని చిన్నమార్పులను జోడించి సంక్షిప్తముగా చేయబడిన వ్యాసం ఇది) 

No comments:

Post a Comment