Sunday, August 30, 2020

విద్వేష రాజకీయాలతో ఫేస్ బుక్ లాలూచీ

 

బిజెపికి, ఫేస్‌బుక్‌కి నడుమ ఉన్న లోపాయకారీ లాలూచీ కాస్తా వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ కథనంతో బట్టబయలైంది. భారతదేశంలో కొందరు బిజెపి నేతలు ఫేస్‌బుక్‌ ద్వారా విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రచారాలకు పాల్పడినా, వారిపైగాని, ఆ పోస్టింగులపై గాని ఎటువంటి చర్యా తీసుకోరాదంటూ ఫేస్‌బుక్‌ భారతదేశ ప్రతినిధి అంఖిదాస్‌ అడ్డుపడ్డారంటూ 'వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌' ఆ వివరాలను బైటపెట్టింది. బిజెపి నేతలు పెట్టిన పోస్టింగులు 'ప్రమాదకరం' అని, 'విద్వేషపూరితం' అని, అవి హింసకు దారితీస్తాయని ఫేస్‌బుక్‌ ఉద్యోగులు కొందరు ఎత్తిచూపినా, ఈ దేశంలో ఫేస్‌బుక్‌ వ్యాపార ప్రయోజనాలు దెబ్బతింటాయన్న కారణాన్ని చూపి అంఖిదాస్‌ ఆ పోస్టింగులపై ఎటువంటి చర్యా తీసుకోకుండా చూశారని ఆ పత్రిక తన కథనంలో బైటపెట్టింది. ప్రపంచంలోకెల్లా అతి ఎక్కువమంది ఫేస్‌బుక్‌ వాడకందార్లు భారతదేశంలోనే ఉన్నారు. పైగా, ఫేస్‌బుక్‌ ఇటీవలే రిలయన్స్‌ జియోలో రూ.40,000కోట్లకుపైనే పెట్టుబడులుపెట్టింది.


కొన్ని రాజకీయ పార్టీలతో, నాయకులతో చేతులు కలిపి వారి ప్రతిపక్షాల గొంతులు వినబడకుండా చేయడానికి ఫేస్‌బుక్‌ కొన్నిసార్లు తప్పుడు సమాచారాన్ని వ్యాపింప చేసే ట్రోల్స్‌తో కలిసి తీవ్రమైన భావజాలాన్ని, సిద్ధాంతాలను ప్రచారం చేసిందని డిసెంబరు 2017లోనే 'బ్లూమ్‌బెర్గ్‌' అనే పత్రిక ఫేస్‌బుక్‌ గురించి రాసింది.  ఫేస్‌బుక్‌ కు చెందిన కేటీ హార్‌బాత్‌ నాయకత్వంలో ఒక గ్లోబల్‌ ప్రభుత్వమే నడుస్తోందని, దాని రాజకీయ బృందం ఇండియా, బ్రెజిల్‌, జర్మనీ, బ్రిటన్‌ తదితర పెద్ద పెద్ద దేశాలలోని కొన్ని రాజకీయ పార్టీలకు సహాయపడుతూ ఉంటుందని, ఫేస్‌బుక్‌ ఉద్యోగులే ఒక విధంగా ఆయా పార్టీలకు ప్రచార కార్యకర్తలుగా పని చేస్తుంటారని 'బ్లూమ్‌బెర్గ్‌' రాసింది.


ఫేస్‌బుక్‌కు అతి ఎక్కువమంది వినియోగదారులు భారతదేశంలోనే ఉన్నారు. అంతే కాక, అతి ఎక్కువ వాట్సప్‌ వాడకందారులు కూడా వీరే. 2018లో ఫేస్‌బుక్‌ ఈ వాట్సప్‌ను దాదాపు రు.1,50,000 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ వాట్సప్‌ ను నిర్వహించే విధానం చాలా అస్పష్టంగా, ఫేస్‌బుక్‌ కన్నా ఎక్కువ అస్పష్టంగా ఉంటుంది. బిజెపి కి, ఆ పార్టీకి చెందిన 'ట్రోల్‌' సైన్యానికి ప్రధాన వేదికగా ఈ వాట్సప్‌ ఉంది. ముస్లిములే కరోనా వైరస్‌ వ్యాప్తికి కారకులన్న ప్రచారాన్ని, లవ్‌ జిహాద్‌ ప్రచారాన్ని, అదే తరహాలో ఇతర విద్వేష ప్రచారాలను ఫేస్‌బుక్‌లో చేసిన బిజెపి నాయకులెవరిపైనా ఫేస్‌బుక్‌ ఏ చర్యా తీసుకోలేదు. వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ కథనం ఈ వివరాలను తెలిపింది.


ప్రజలందరికీ ఒక సమాచార సాధనంగా ఉపయోగపడే ఫేస్‌బుక్‌ నిర్వహణ బాధ్యతలను అంఖిదాస్‌ వంటి వ్యక్తులకు అప్పజెప్పడం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్నను వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ లేవనెత్తింది. ఈ సందర్భంగా భారతీయ ముస్లింలు ఒక దిగజారిన సమూహం అన్న ఒక పోస్టును అంఖిదాస్‌ తన స్వంత పేజీలో పోస్టు చేసిన వైనాన్ని ఆ పత్రిక ఉదహరిం చింది. వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ వ్యాసాన్ని బట్టి ఫేస్‌బుక్‌లో ఈ తేడా అంతటికీ అంఖిదాస్‌ అనే ఒక వ్యక్తి కారణం అన్న అభిప్రాయం కలుగుతుంది. కాని అసలు సమస్యకి మూలం ఇంకా లోతైనది.

 

గూగుల్‌, ఫేస్‌బుక్‌, అమెజాన్‌, యాపిల్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి డిజిటల్‌ గుత్త సంస్థలు వాటి ఆర్థిక బలానికి మించి ఇంకా ఎక్కువ అధికారాన్ని చెలాయిస్తున్నాయి. పెట్టుబడిదారీ సమాజంలో మీడియాను బతికించి వుంచేది యాడ్స్‌ ఆదాయం అన్న సంగతి అందరికీ తెలుసు. ప్రజలను ప్రభావితం చేసే శక్తి మీడియాకు ఎంత ఉందో అదీ తెలుసు. ఎంత ఎక్కువమంది పాఠకులు లేదా వీక్షకులు ఉంటే యాడ్స్‌ ఆదాయం అంత ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే ఈ డిజిటల్‌ మీడియా యాడ్స్‌ ఆదాయంలో ప్రధాన భాగాన్ని చేజిక్కించుకుంటోంది. వారి ఆదాయం ఇంకా ఎక్కువగా పెరగాలంటే వీక్షకులు పెరగాలి, వారు చూసే సమయమూ పెరగాలి. ఇదెలా జరుగుతుంది? కపిల్‌ మిశ్రా ఢిల్లీలో పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా రోడ్లపై బైఠాయించిన వారిని విమర్శిస్తూ పోస్టులు పెట్టాక, నిరసనకారులు ఖాళీ చేయకుంటే వారిపై భౌతిక దాడులు తప్పవని హెచ్చరిస్తూ పోస్టులు పెట్టాక, వాటిని వీక్షించిన వారి సంఖ్య పది రెట్లు పెరిగింది. కనుక ఈ తరహా పోస్టులను అనుమతిస్తే ఫేస్‌బుక్‌ యాడ్‌ ఆదాయం పెరుగుతుందన్నమాట!


మీడియాకి ఉన్న సామాజిక బాధ్యత దృష్ట్యా, ప్రజల ప్రయోజనాల కోసం దానిని నియంత్రించాల్సిన అవసరం ఉంది. 
ఈ విషయంలో ప్రెస్‌ కౌన్సిల్‌ కి ఒక నియమావళి ఉంది. పెయిడ్‌ న్యూస్‌ లతో దానిని ఉల్లంఘించినప్పుడు ఒక కమిటీ వేసి చక్కదిద్దే ప్రయత్నం పరిమితంగానైనా జరిగింది. అమెరికాలో ఒక తరహా మీడియా సంస్థ మరో తరహా సంస్థలో వాటాలు కలిగివుండకూడదన్న ఆంక్షలు ఉన్నాయి (ప్రింట్‌ మీడియా సంస్థకు టి.వి చానెళ్ళ లో వాటాలు ఉండకూడదు వంటి నిబంధనలు). అలాగే టెలికాం కంపెనీలకు మీడియా కంపెనీల్లో వాటాలు వుండకూడదు.


ఇక్కడ రెండు విషయాలు గుర్తించాలి. మీడియా వ్యాపారం ఇతర వ్యాపారాల వంటిది కాదు. అది ప్రజాస్వామ్యాన్ని ప్రభావితం చేయగలదు. ఇక ప్రజాస్వామ్యానికి అన్నింటికన్నా పెద్ద ప్రమాదం గుత్త సంస్థల నుండే వస్తుందన్నది రెండో విషయం. 'మనకి ప్రజాస్వామ్యమైనా ఉంటుంది, లేదా కొద్దిమంది చేతుల్లో సంపదను కేంద్రీకరించే గుత్త సంస్థలైనా ఉంటాయి. కాని రెండూ ఏక కాలంలో ఉండవు' అని అమెరికన్‌ న్యాయమూర్తి బ్రాండీస్‌ ''స్టాండర్డ్‌ ఆయిల్‌'' గుత్త సంస్థ ఆధిపత్యాన్ని సవాలు చేసిన కేసులో విచారణ సందర్భంగా అన్నారు.


మళ్ళీ చాలా కాలం తర్వాత అమెరికన్‌ పార్లమెంటు లో ఈ గుత్తాధిపత్యం విషయం ఈ మధ్య చర్చకు వచ్చింది. ఆ పార్లమెంటరీ కమిటీల ముందు గూగుల్‌, అమెజాన్‌, ఫేస్‌బుక్‌, యాపిల్‌ సంస్థలు విచారణకు హాజరయ్యాయి. ఈ నాలుగు సంస్థల షేర్ల మార్కెట్‌ విలువ 4 లక్షల కోట్ల డాలర్లు దాటి వుంది (అంటే రూ.300 లక్షల కోట్లు). ఇది జర్మనీ దేశపు జిడిపి కన్నా ఎక్కువ. అంటే, అమెరికా, చైనా, జపాన్‌ దేశాల తర్వాత బలమైన ఆర్థిక శక్తి ఈ నాలుగు సంస్థలే. ఈ శక్తితోటే అవి బలమైన ఆర్థిక వ్యవస్థలున్న దేశాలను లంగదీయడం, బెదిరించడం, వాటి చట్టపరమైన నిబంధనలను సైతం ఉల్లంఘించడం వంటివి చేయగలుగుతున్నాయి. సమాజ హితానికి, కంపెనీల స్వంత లాభాలకు మధ్య ఎంచుకోవలసి వస్తే ఆ కంపెనీలు సమాజ హితానికి పెద్దపీట వేస్తాయని ఎవరైనా భావిస్తే అంతకంటే అమాయకత్వం ఇంకొకటి ఉండదు.

 

ఫేస్‌బుక్‌ ఆదాయంలో 98.5 శాతం యాడ్స్‌ నుంచే వస్తుంది. యాడ్స్‌ ద్వారా వచ్చే ఆదాయం వీక్షకుల సంఖ్య పైన, వారు వీక్షించే సమయం పైన ఆధారపడి వుంటుంది. ఒక పోస్టు ఎంత వైరల్‌ అయితే ఫేస్‌బుక్‌ కి అంత లాభం. అందువలన అటువంటి వైరల్‌ అయ్యే పోస్టులను నిషేధించాలనో, నియంత్రించాలనో ఫేస్‌బుక్‌ కోరుకోదు. పైకి సమాజంలో సామరస్య వాతావరణం ఉండాలని, ఆరోగ్య కరంగా చర్చలు జరగాలని ఎంత చెప్పినా, ఫేస్‌బుక్‌ వ్యాపార ప్రయోజనాలు మాత్రం ఎక్కువగా వైరల్‌ అయ్యే పోస్టులతోనే ముడిపడి వున్నాయి. ఈ జబ్బు ఒక ఫేస్‌బుక్‌ కే పరిమితం అయిలేదు. గూగుల్‌కి కూడా దాని యూట్యూబ్‌ వీడియోలతో ఇటువంటి ప్రయోజనాలే ఉన్నాయి. అయితే, ఫేస్‌బుక్‌ మాత్రం నిస్సందేహంగా విద్వేష రాజకీయాలను, ఫేక్‌ న్యూస్‌ ను ప్రచారం చేయడంలో అందరికన్నా ముందుంది.


ట్రంప్‌, బోల్సనారో, మోడీ  ఈ ముగ్గురికీ మితవాద రాజకీయాలు ఉమ్మడి అంశం. వాటితోబాటు తమ ప్రచారంలో వాట్సప్‌ పైన, ఫేస్‌బుక్‌ పైన ఎక్కువగా ఆధారపడడం ఈ ముగ్గురికీ ఉన్న మరో ఉమ్మడి అంశం. టి.వి చానెళ్ళలో ఫ్యాక్స్‌ న్యూస్‌ (అమెరికా), రిపబ్లిక్‌ టి.వి (ఇండియా) వంటివి ఏ విధంగా ఇతర పార్టీల వారిని మాట్లాడనివ్వకుండా ఒక పార్టీ తరఫునే వకాల్తా పుచ్చుకుని పని చేస్తాయో చూస్తున్నాం. అయితే ఆ సంగతి అందరికీ బోధపడిన విషయమే. కాని ఫేస్‌బుక్‌, వాట్సప్‌ అలా కాదు. తమ పాత్ర ఏమీ లేనట్టే ఉంటూనే ఎన్నికలలో విద్వేష రాజకీయాలను, ఫేక్‌ న్యూస్‌ ను బాగా ప్రచారం లోకి తీసుకువస్తాయి. బిజెపి, ఇతర మితవాద శక్తులు సోషల్‌ మీడియాను ఉపయోగించుకోవడంలో, వాటి ప్రయోజనాన్ని అర్ధం చేసుకోవడంలో తక్కిన వారందరికన్నా ముందున్నాయని చాలామంది అనుకుంటారు. అందువల్లనే ఆ శక్తులు విజయాలు సాధించగలుగుతున్నాయని అనుకుంటారు. కాని ఫేస్‌బుక్‌ ఈ మితవాద శక్తులకు తోడ్పాటునివ్వడం యాదృచ్ఛికం కాదని, తన వ్యాపార ప్రయోజనాల కోసమే అలా చేస్తోందని వారు తెలుసుకోవాలి. ఇందుకు సంబంధించిన ఆధారాలు ఇప్పుడు స్పష్టంగా బైటకు వస్తున్నాయి కూడా.


విద్వేష ప్రసంగాలు, పోస్టులు సోషల్‌ మీడియాలో చొరబడిన పురుగులని, వాటిని ఏరిపారేయాలని అనుకుంటూ వచ్చారు. కాని అవి సోషల్‌ మీడియాకు అత్యంత అవశ్యమైన అంతర్భాగం అని గ్రహించాలి. అందుచేత చాలా మర్యాదగా జుకర్‌బర్గ్‌కు, ఇతర డిజిటల్‌ గుత్త సంస్థల అధిపతులకు పిటిషన్లు పెడితే ఏమీ ఉపయోగం లేదు. వాటి గుత్తాధిపత్యాన్ని బద్దలుగొట్టి వాటిని ప్రజాప్రయోజనాల కోసం పని చేసే సర్వీసులుగా మార్చడమే నిజమైన పరిష్కారం.

రచయిత: ప్రబీర్‌ పురకాయస్థ; ప్రచురణ: ప్రజాశక్తి 29.8.2020 సంచిక 


ప్రబీర్‌ పురకాయస్థ 

 

No comments:

Post a Comment