Friday, August 28, 2020

కరోనా వైరస్ సమస్య- అసెంబ్లీ ల ఎన్నికలు- ఎన్నికల ప్రచారం


బీహార్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ గారు కరోనా వైరస్ సమస్యని దృష్టిలో వుంచుకుని అసెంబ్లీ ఎన్నికలను ఆన్ లైన్ పద్దతిలో నిర్వహించాలని అన్నారు. ఈ సూచనను అత్యధిక రాజకీయ పార్టీలు వ్యతిరేకించాయి. చాలా మంది వోటర్లు డిజిటల్ టెక్నాలజీని వినియోగించటం తెలియనందున రహస్యముగా ఓటు వేసే  అవకాశాన్ని కోల్పోతారు. ఇంతేగాక ఎన్నికల ప్రచారానికి కూడా డిజిటల్ ప్రచారమే వినియోగించాలని సూచించారు. ఇది కూడా ప్రజాస్వామ్యానికి విరుద్ధమయినదే. డిజిటల్ (స్మార్ట్ ఫోన్) సౌకర్యం లేని వోటర్లకు ఈ ప్రచారం చేరదు.  ధన బలం వున్న రాజకీయ పార్టీలు సోషల్ మీడియా, టెలివిజన్, తదితర అనేక డిజిటల్ టెక్నాలజిల సహకారముతో విరివిగా తమ ఎన్నికల ప్రచారం చేసుకోగలుగుతాయి. ధనబలం లేని పార్టీలకు ఈ అవకాశం తక్కువగా వుంటుంది.

  2019 సార్వత్రిక ఎన్నికల సందర్భముగా ఆనాటి బి జె పి అధ్యక్షులు అమిత్ షా,  తమకి గల  32 లక్షల వాట్సప్  గ్రూప్ ల ద్వారా మెసేజిలు అవి ఒప్పయినా, తప్పయినా కొద్ది గంటలలోనే దేశ వ్యాపితముగా విస్తారముగా (వైరల్) ప్రచారం చేయగలిగే సామర్థ్యం తమకి  వున్నదని అన్నారు.  సోషల్ మీడియా లో జరిగే ప్రచారం తప్పో ఒప్పే చెప్పే అంతర్జాతీయ వెబ్ సైట్స్ ప్రకారం ప్రపంచం మొత్తం లో తప్పుడు వార్తలలో అత్యధికం భారత దేశం లో ఆవిర్భవించినవేనని తేల్చి చెప్పాయి.

ఇప్పుడు బీహార్ ఎన్నికలు త్వరలో జరగ బోతున్నందున బి జె పి తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. ఆ పార్టీ నాయకుడు అమిత్ షా (కేంద్ర హోమ్ శాఖా మంత్రి) ఆన్ లైన్ ఎన్నికల సభ నిర్వహించారు. ఇందుకోసం 72000 ఎల్ఈ డి టి వి  మానిటర్లు ఏర్పాటు చేశారు.   60 వర్చువల్ ర్యాలీలను నిర్వహించిన  అనంతరం బి జె పి, తాము ఎన్నికల ప్రచారం లో 9500 ఐ టి సెల్సు కు ప్రత్యేక బాధ్యులను ఏర్పాటు చేశామని, వీరు ప్రతి పోలింగ్ బూత్  కు ఒక గ్రూప్ చొప్పున 72000 వాట్సప్  గ్రూప్ లను కొ ఆర్డినేట్ చేస్తారని అన్నది. ఇప్పటికే గత 2 నెలలలో 50,000 గ్రూప్ లను ఏర్పాటు చేశామని అన్నది.

ఈ స్థాయిలో డిజిటల్ ప్రచారానికి అవసరమైన సిబ్బందికి, మరియు టెక్నాలజీ కి అయ్యే భారీ ఖర్చును ఎవరు భరిస్తారు? కార్పొరేట్ల నుండి ఈ నిధులొస్తున్నాయి. ఎవరిచ్చారో చెప్పాల్సిన అవసరం లేని అనామక ఎన్నికల బాండ్స్ విధానాన్ని బి జె పి ప్రభుత్వము ప్రవేశ పెట్టినది. ఇందు కోసం ఫైనాన్స్ చట్టం 2017 ను, ఆదాయపు పన్ను చట్టాన్ని, ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని సవరించింది.  ఈ బాండ్స్ ద్వారా ఇతర రాజకీయ పార్టీలకు కొన్ని నిధులు సమ కూరినా వాటన్నింటికి వచ్చిన నిధులను  కలపగా వచ్చే మొత్తం కన్నా అనేక రెట్లు ఎక్కువగా బి జె పి కి ఈ పద్ధతిలో ఎన్నికల నిధులు లభిస్తున్నాయి. కార్పొరేట్ నిధులు అనామికముగా, అపరిమితముగా ఒక రాజకీయ పార్టీ కి ఇచ్చే వీలు కలిగించిన ఈ విధానం వలన ఎన్నికల ప్రజాస్వామ్యానికి మృత్యు ఘంటిక  మోగినట్లయింది. తమకి నచ్చిన రాజకీయ పార్టీకి ఎన్నికల నిధులు భారీ స్థాయిలో సమకూర్చి తమకి నచ్చిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించుకునేందుకు, తమకి నచ్చిన విధానాలే అవి అమలు చేసేలా చేసేందుకు ఈ ఎన్నికల బాండ్స్ విధానం కార్పొరేట్సుకు ఉపయోగ పడుతుంది.   ఈ విధముగా బిజెపి, ఎన్నికల ప్రజాస్వామికానికి తిలోదకాలిచ్చే విధానాలను తీసుకొచ్చింది. కాబట్టి మన దేశం లో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొనేందుకు ఎన్నికల బాండ్స్ విధానాన్ని రద్దు చేయాలి. ఎన్నికల బాండ్స్ వలన రాజకీయ పార్టీలకు ఇచ్చే ఫండ్స్ విషయం లో పారదర్శకత లోపిస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీం కోర్టుకు చెప్పినది. ఇంతేగాక భారత కంపెనీలలో మెజారిటీ వాటాలున్న విదేశీ కంపెనీలు గుట్టు చప్పుడు కాకుండా రాజకీయ పార్టీలకు  ఎన్నికల నిధులిచ్చే అవకాశం ఏర్పడినదని, ఇందువలన విదేశీ కంపెనీలు మన దేశ విధానాలను ప్రభావితం చేసే అవకాశం వుంటుందని కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీం కోర్టుకు సమర్పించిన ఎఫిడవిట్ లో చెప్పింది.

2019 లోక్ సభ ఎన్నికల సందర్భముగా “నమో టీవి” అనేది రూల్సుకు విరుద్ధముగా మార్మికముగా వచ్చింది. ఎన్నికలయిన తరువాత అంతర్ధానమయింది. ఎన్నికల సంఘం ప్రతినిధి ఈ డిటిహెచ్ చానల్ కు అయిన ఖర్చులను  బి జె పి భరించినదని అన్నారు. కానీ ఎన్నికల ఖర్చుకు సంబధించి ఎన్నికల సంఘానికి సమర్పించిన లెక్కల లో  ఈ చానల్ ఖర్చును బిజెపి చూపించ లేదని తెలిసింది. ఎన్నికల నియమావళికి సంబంధించి ఇది తీవ్రమైన ఉల్లంఘన. కాబట్టి బి జె పి పై ఎన్నికల సంఘం తగు చర్యను తీసుకోవాల్సిన అవసరం వున్నది.  ఒక బి జె పి నాయకునికి చెందిన ఎడ్వర్టైజింగ్ మరియు సోషల్ మీడియా కంపెనీకి ఎలక్షన్ కమిషన్ తరఫున ఎన్నికల ప్రక్రియ కి సంబంధించిన విషయాలపై  ఆన్ లైన్ ప్రచారం చేసే బాధ్యతని 2019 అసెంబ్లీ ఎన్నికల సందర్భముగా  మహారాష్ట్ర చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ అప్పగించినట్లు తెలుస్తున్నది.  ఇంతే గాక 2019 లోక్ సభ ఎన్నికల సందర్భములో కూడా ఎన్నికల సంఘం తరఫున చేసే ప్రచారాన్ని నిర్వహించే బాధ్యతని ఇదే మీడియా కంపెనీకి అప్పగించ వచ్చునని సంబంధిత ప్రభుత్వ సంస్థలకి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా,  అధికారమిచ్చినట్లు తెలిసింది.

ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికలను  సమంజసమైన పద్ధతిలో నిర్వహించటమే గాక అలా నిర్వహించినట్లు కనిపించే విధముగా ఎన్నికల సంఘం ఎన్నికలను నిర్వహించాల్సిన అవసరం వున్నది.

(ఇందులో వున్న అంశాలను  సిపి ఏం పార్టీ ప్రధాన  కార్యదర్శి శ్రీ సీతారాం ఏచూరి గారు 18.8.2020 న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా కు రాసిన లేఖ నుండి తీసుకోటం జరిరిగినది) 

No comments:

Post a Comment