Sunday, April 19, 2015

4 జి మరియు వాయిస్ సర్వీసులు త్వరలో దేశ వ్యాపితముగా యిచ్చేందుకు కొత్త కంపెనీ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ సన్నద్ధం- మరి బి ఎస్ ఎన్ ఎల్ పరిస్థితి ఏమిటి? • బి ఎస్ ఎన్ ఎల్ వైర్ లైన్ నెట్ వ్కర్క్ (ల్యాండ్ లైన్) కు మంచి రోజులు రానున్నాయా? • ఏప్రిల్ 21,22 సమ్మె జయప్రదం చేసి బి ఎస్ ఎన్ ఎల్ కు అవసరమయిన సహాయం అందించేందుకు ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలి

రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ ముకేష్ అంబానీ కంపెనీ.(రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ అతని తమ్ముడు అనిల్ అంబానిది). ఈ కంపెనీ వద్ద మిగతా ఏ టెలికాం కంపెనికన్నా ఎక్కువగా సరళీకృత స్పెక్ట్రమ్ వున్నది. సరళీకృత స్పెక్ట్రమ్ అంటే ఏమిటి? సుప్రీం కోర్టు తీర్పు వలన  2012 నుండి ప్రభుత్వము స్పెక్ట్రమ్ ను వేలం లో అమ్మటం ప్రారంభించింది. అంతకు ముందు ప్రభుత్వము ఒక ధరను నిర్ణయించి ఆ ప్రకారం స్పెక్ట్రమ్ ను అమ్మేది.
ప్రభుత్వము నిర్ణయించిన ధర ప్రకారం 2012 కి ముందు కొన్న స్పెక్ట్రమ్ ద్వారా ఏ సర్వీసులు ఇవ్వాలో లైసెన్సు షరతులు నిర్ణయించాయి. 900 MHz మరియు 1800MHz బ్యాండ్స్ స్పెక్ట్రమ్ తో 2 జి సర్వీసులు మాత్రమే ఇవ్వాలి. ఈ బ్యాండ్స్ పై 3 జి, 4 జి కూడా ఇవ్వ వచ్చు. కానీ లైసెన్సు షరతు అందుకు ఒప్పుకోదు. ఇది ప్రభుత్వ నిర్దేశిత ధర ప్రకారం కొన్న స్పెక్ట్రమ్ సంగతి.
2012 నుండి స్పెక్ట్రమ్ ను వేలం లో అమ్మటం ప్రారంభమయింది. వేలం లో కొన్న స్పెక్ట్రమ్ తో ఏ సర్వీసులయినా (2జి, 3జి లేదా 4జి) ఇయ్య వచ్చును. అయితే 2012 కి ముందే ప్రభుత్వము నిర్ణయించిన ధరకి 2 జి స్పెక్ట్రమ్ ను కొన్న కంపెనీలు ఆ స్పెక్ట్రమ్ పై 4 జి సర్వీసులు ఇవ్వాలంటే ఏమి చేయాలి? 2012 తరువాత జరిగిన వేలం లో ఆ బ్యాండ్ స్పెక్ట్రమ్ కు ఎంత ధర పలికిందో దానికి, తాము ఆ బ్యాండు స్పెక్ట్రమ్ కోసం ప్రభుత్వ ధర ప్రకారం గతం లో చెల్లించినదానికి గల తేడాని ప్రభుత్వానికి చెల్లించి 4 జి సర్వీసులను 2 జి స్పెక్ట్రమ్ పై ఇచ్చేందుకు అనుమతి పొంద వచ్చు. దీనినే స్పెక్ట్రమ్ సరళీకరణ అంటారు. కాబట్టి సరళీకృత స్పెక్ట్రమ్ అంటే వేలం లో పలికిన ధరకి కొన్న స్పెక్ట్రమ్,  లేదా  వేలం లో పలికిన ధరకి మరియు గతం లో ప్రభుత్వ ధర ప్రకారం చెల్లించినదానికి మధ్య గల తేడాని చెల్లించి 4 జి సర్వీసులు ఇవ్వటానికి అనుమతి పొందిన స్పెక్ట్రమ్.
బి ఎస్ ఎన్ ఎల్ కు 2000 లో 2 జి స్పెక్ట్రమ్ ను 900 MHz మరియు 1800 MHz బ్యాండ్స్ లో ఉచితముగా కేటాయించారు. 2020 వరకు ఈ స్పెక్ట్రమ్ ను బి ఎస్ ఎన్ ఎల్ వాడుకోవచ్చు. నూతన టెలికాం విధానం 1999 ప్రకారం బి ఎస్ ఎన్ ఎల్ కు స్పెక్ట్రమ్ ను ఉచితముగా కేటాయించాలి. ఆ ప్రకారమే 2 జి స్పెక్ట్రమ్ ను ఉచితముగా కేటాయించారు. ఈ 2 జి స్పెక్ట్రమ్ పై 4 జి సర్వీసులు ఇచ్చేందుకు (స్పెక్ట్రమ్ సరళీకరణకు) బి ఎస్ ఎన్ ఎల్, ప్రభుత్వానికి ఈ స్పెక్ట్రమ్ కు మిగిలిన  లైసెన్సు కాలానికి మార్కెట్ రేటు ప్రకారం (అంటే వేలం లో పలికిన ధర ప్రకారం)  చెల్లించి అనుమతి పొందాలి. ఈ చెల్లింపు లేకుండానే 2 జి స్పెక్ట్రమ్ పై 4 జి ఇవ్వటానికి అనుమతించాలని యూనియన్లు మరియు బి ఎస్ ఎన్ ఎల్ మేనేజిమెంటు కోరుతున్నాయి. ప్రభుత్వ విధానం ప్రకారం 2 జి స్పెక్ట్రమ్ ను బి ఎస్ ఎన్ ఎల్ కు ఉచితముగా కేటాయించినందున ఆ స్పెక్ట్రమ్ పై 4 జి సర్వీసులిచ్చేందుకు కూడా ఉచితముగానే అనుమతించాలి. అందుకు మార్కెట్ ధర చెల్లించాలనటం అక్రమం.
బి ఎస్ ఎన్ ఎల్ కు స్పెక్ట్రమ్ ను ఉచితముగా కేటాయించటం ప్రభుత్వ విధానమయినప్పుడు  3 జి స్పెక్ట్రమ్ ను మరియు బి డబ్ల్యూ ఏ స్పెక్ట్రమ్ ను కూడా ఉచితముగా కేటాయించాలి. కానీ  3జి మరియు బి డబ్ల్యూ ఏ స్పెక్ట్రమ్ కు ప్రభుత్వము 2010 లో జరిగిన వేలం లో పలికిన ధర ప్రకారం ఋ. 18500 కోట్లు  బి ఎస్ ఎన్ ఎల్ నుండి  వసూలు చేసింది.
ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియా తదితర టెలికాం కంపెనీలకు మొదట ప్రభుత్వము నిర్ణయించిన తక్కువ ధరకి 2 జి స్పెక్ట్రమ్ (900 MHz మరియు 1800 MHz బ్యాండ్స్ లో ) కేటాయించారు. ఆ తరువాత కొన్ని సర్కిల్సులో 20 సంవత్సరాల గడువు తీరినందున ఆ సర్కిల్సులో ఈ స్పెక్ట్రమ్ ను ఈ కంపెనీలు వేలం లో కొన్నాయి. ఈ విధముగా ఈ కంపెనీలకు కొన్ని సర్కిల్సు లో ప్రభుత్వము నిర్ణయించిన ధర ప్రకారం కొన్న 2 జి స్పెక్ట్రమ్ (ఇది సరళీకృతం కానీ స్పెక్ట్రమ్.  దీనితో 3 జి కానీ, 4 జి కానీ ఇవ్వ కూడదు) మరి కొన్ని సర్కిల్సులో  వేలం లో పలికిన ధర ప్రకారం కొన్న 2 జి స్పెక్ట్రమ్ (ఇది సరళీకృత స్పెక్ట్రమ్. దీని పై 3 జి, 4జి సర్వీసులు కూడా ఇయ్యవచ్చు) వున్నది. అంటే ఈ కంపెనీలకు కొన్ని సర్కిల్సు లోనే సరళీకృత స్పెక్ట్రమ్ వున్నది.
ఇందుకు భిన్నముగా త్వరలో సర్వీసులు ప్రారంభించబోయే రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ కు అన్నీ సర్కిల్సు లోనూ సరళీకృత స్పెక్ట్రమ్ (అంటే వేలం లో కొన్న స్పెక్ట్రమ్) వున్నది.  ఈ స్పెక్ట్రమ్ తో అది 2 జి, 3 జి, 4జి ఏ సర్వీసులయినా  ఇయ్య వచ్చు. ఈ కంపెనీ ఇటీవల జరిగిన వేలం లో 800 MHz(ఇది 4 జి కి అత్యంత ఉపయోగకరమయిన బ్యాండ్),  మరియు 1800 MHz ( ఈ బ్యాండ్స్ పై 2 జి తో పాటు 4 జి కూడా ఇయ్య వచ్చు) ను అనేక సర్కిల్సు లో కొన్నది. 2300 MHz (ఇది కూడా 4 జి కి పనికి వచ్చే బ్యాండ్) స్పెక్ట్రమ్ ను ఈ కంపెనీ గతం లోనే (2010 లో) అన్నీ సర్కిల్సుకు  కొని అలానే వుంచుకున్నది. ఈ విధముగా రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ వద్ద ఏ ఇతర కంపెనీ వద్ద లేనంత ఎక్కువగా సరళీకృత స్పెక్ట్రమ్ వున్నది. ఈ స్పెక్ట్రమ్ ద్వారా త్వరలో అది దేశ వ్యాపితముగా 4 జి సర్వీసులు ప్రారంభించబోతున్నది. ఈ విధముగా దానికి ఇతర ఏ టెలికాం కంపెనికి లేని అనుకూలత వున్నది.
మొబైల్ కాల్ టెర్మినేషన్ చార్జి  ( తన నెట్ వర్క్ లో టెర్మినేట్ అయ్యే మొబైల్ కాల్ కు ఆ మొబైల్  కంపెనీ ఆ కాల్ ప్రారంభం అయిన మొబైల్ కంపెనీ నుండి వసూలు చేసే చార్జి- దీనినే క్లుప్తముగా MTC అంటారు) ని నిమిషానికి 20 పైసల నుండి 14 పైసలకు టి ఆర్ ఏ ఐ తగ్గించింది. ఇది అన్యాయమని ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియా లు అంటున్నాయి. టెలికాం కంపెనీల రెవిన్యూ లో 70 శాతం ఈ 3 కంపెనీలకే వస్తున్నది. MTC ని లెక్కించేటప్పుడు స్పెక్ట్రమ్ యూసెజ్ చార్జి, లైసెన్సు ఫీజు, మరియు స్పెక్ట్రమ్ కొనుగోలుకు వేలం లో చెల్లించిన ధర-వీటిని కూడా లెక్కించాలని ఈ కంపెనీలు వాదిస్తున్నాయి. ఈ విధముగా లెక్కిస్తే ఒక కాల్ కు MTC 18.5 పైసలు అవుతుందని అంటున్నాయి. ఈ మూడు కంపెనీలకే వినియోగ దారులలో అత్యధికులున్నందున వీటికే  ఇంటర్ కనెక్ట్ చార్జి ఎక్కువగా ఇతర కంపెనీలు చెల్లించాల్సి వస్తున్నది. అందుకే ఇవి ఇంటర్ కనెక్ట్ చార్జి (MTC)  కనీసం 18.5 పైసలు వుండాలని వాదిస్తున్నాయి.
రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ కొత్తగా వస్తున్నది కాబట్టి అది తక్కువ మంది వినియోగదారులతో ప్రారంభమవుతుంది. వినియోగ దారులు అధికముగా వున్న పై 3  కంపెనీలకు అది ఇంటర్ కనెక్టు చార్జి అధికముగా చెల్లించాల్సి వస్తుంది. అందుకనే అది ఇంటర్ కనెక్ట్ చార్జి 14 పైసలే వుండాలన్న టి ఆర్ ఏ ఐ నిర్ణయాన్ని సమర్థిస్తున్నది. తక్కువ వినియోగదారులున్న విడియోకాన్, తదితర టెలికాం కంపెనీలు కూడా MTC తగ్గింపును సమర్తిస్తున్నాయి. మొత్తం గా చూస్తే MTC తగ్గింపు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ కు అనుకూలం గా వున్నది.
అయితే టి ఆర్ ఏ ఐ ఇచ్చిన ఒక ఆర్డరు లాండ్ లైన్ నెట్ వర్క్ మనుగడకు కొంత ఉపయోగకరముగా వున్నది. బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్లు ఇవ్వటానికి వైర్లెస్ కన్నా వైర్ లైన్ మారింత అనుకూలమని టి ఆర్ ఏ ఐ తేల్చి చెప్పింది. డేటా సర్వీసులు ఇవ్వటానికి తగినంత స్పెక్ట్రమ్ అందుబాటులో వుండదని, వైర్ లెస్ కన్నా వైర్ లైన్ మాత్రమే డేటా సర్వీసులకు మరింత అనుకూలమని అన్నది. కాబట్టి బి ఎస్ ఎన్ ఎల్, ఏం టి ఎన్ ఎల్ ల వైర్ లైన్ నెట్ వర్క్ లను కొనసాగించాల్సిన, విస్తరించాల్సిన అవసరాన్ని గుర్తించింది. అయితే బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్స్ పై వచ్చే రెవెన్యూ తో మాత్రమే బి ఎస్ ఎన్ ఎల్, ఏం టి ఎన్ ఎల్ ల వైర్ లైన్ నెట్ వర్క్ మనుగడ సాగించలేవని, వాయిస్ కాల్సు కూడా వైర్ లైన్ నెట్ వర్క్ ద్వారా అధికముగా చేసే పరిస్థితి వుంటేనే వైర్ లైన్ నెట్ వర్క్స్ మనుగడ సాగించగలవని టి ఆర్ ఏ ఐ అన్నది. ఈ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని వైర్ లైన్ నెట్ వర్క్ నుండి మొబైల్ నెట్ వర్క్ కు చేసే కాల్స్ కు MTC (మొబైల్ టెర్మినేషన్ చార్జి)  ని పూర్తిగా రద్దు చేసింది. ఇదే విధముగా మొబైల్ నుండి వైర్ లైన్ కు, వైర్ లైన్ నుండి వైర్ లైన్ కు చేసే కాల్స్ కు కూడా టెర్మినేషన్ ఛార్జీలు రద్దు చేసింది. టెర్మినేషన్ ఛార్జీలు రద్దు చేసినందున ల్యాండ్ లైన్ నుండి మొబైల్ కు లేదా ల్యాండ్ లైన్ కు చేసే కాల్సు రేటు ఆ ప్రకారమే తగ్గించి మరింత మంది వినియోగ దారులను  ల్యాండ్ లైన్ కనెక్షన్సు  తీసుకునేలా చేయ వచ్చు. ఆ విధముగా ల్యాండ్ లైన్ నెట్ వర్క్ ను పటిష్టవంతం చేయ వచ్చును.
బి ఎస్ ఎన్ ఎల్ మేనేజిమెంటు 1.5.2015 నుండి ల్యాండ్ లైన్ వినియోగ దారులు రాత్రి 9 గం. నుండి ఉదయం 7 గం. వరకు బి ఎస్ ఎన్ ఎల్ ల్యాండ్ లైన్, మొబైల్ కు మాత్రమే కాక  ఏ ఇతర నెట్ వర్క్ కు కాల్ చేసినా చార్జి వుండదని ప్రకటించింది. దీని వలన బి ఎస్ ఎన్ ఎల్ ల్యాండ్ లైన్ కనెక్షన్లకు డిమాండ్ పెరిగే అవకాశం వున్నది.

ల్యాండ్ లైన్స్ బిజినెస్ ను ఈ విధముగా పెంచుకుంటూనే మొబైల్ రంగం లో కూడా బి ఎస్ ఎన్ ఎల్ ముందుకు పోవాల్సిన అవసరం వున్నది. 4జి సర్వీసులను కూడా బి ఎస్ ఎన్ ఎల్ ప్రారంభించాలి. ఇందుకు బి ఎస్ ఎన్ ఎల్ తన 2 జి స్పెక్ట్రమ్ పైనే 4 జి సర్వీసులిచ్చేందుకు ప్రభుత్వము ఉచితముగా అనుమతించాలి. అవసరమయితే 800 MHz బ్యాండ్ స్పెక్ట్రమ్ ను కూడా బి ఎస్ ఎన్ ఎల్ కు 4 జి సర్వీసులు అందించేందుకు ఉచితముగా కేటాయించాలి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం  తో మొబైల్ సర్వీసుల విస్తరణకు, ఆప్టిక్ కేబుల్ విస్తరణకు అవసరమయిన పెట్టుబడిని సమకూర్చుకునేందుకు ప్రభుత్వము బి ఎస్ ఎన్ ఎల్ కు చెల్లించాల్సిన బి డబ్ల్యూ ఏ స్పెక్ట్రమ్ చార్జి రీఫండ్ ఋ.6724 కోట్లను, టి ఆర్ ఏ ఐ సిఫార్సు ప్రకారం 2012-13 సంవత్సరం లో ల్యాండ్ లైన్స్ పై వచ్చిన నష్టానికి పరిహారముగా చెల్లించాల్సిన ఋ.1250 కోట్లను వెంటనే చెల్లించాలి. బి ఎస్ ఎన్ ఎల్ ఏర్పాటు సందర్భముగా యిచ్చిన హామీ ప్రకారం గ్రామీణ ప్రాంత ల్యాండ్ లైన్స్ పై వస్తున్న నష్టానికి పూర్తి పరిహారం చెల్లించాలి. ఎక్విప్మెంటు కొనేందుకు అవసరమయిన పెట్టుబడి కోసం ప్రభుత్వము హామీ వుంది బి ఎస్ ఎన్ ఎల్ కు తక్కువ వడ్డీ కి బ్యాంకులనుండి అప్పు ఇప్పించాలి. ఈ డిమాండ్స్ తో పాటు బి ఎస్ ఎన్ ఎల్ యూనియన్ల ఐక్య వేదిక సమర్పించిన మొత్తం 20 డిమాండ్స్ ను ప్రభుత్వము ఆమోదించాలి. ఇందు కోసం ప్రభుత్వం పై  ఒత్తిడి చేసేందుకు ఏప్రిల్ 21,22 న జరుగు సమ్మె లో బి ఎస్ ఎన్ ఎల్ ఉద్యోగులు, అధికారులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలి

No comments:

Post a Comment