Sunday, April 12, 2015

మందగించిన పెరుగుదల, హెచ్చు స్థాయి నిరుద్యోగం – ఐ ఎం ఎఫ్ హెచ్చరిక

స్వల్ప పెరుగుదల, అధిక నిరుద్యోగం, ఋణ భారం-ఈ పరిస్థితిని ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సుదీర్ఘ కాలం ఎదుర్కొబోతున్నదని ఐ ఎం ఎఫ్ 8.4.2015న విడుదల చేసిన “వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్”  డాక్యుమెంటు లో హెచ్చరించింది. ఏడు సంవత్సరాల క్రితం ప్రారంభమయిన మాంద్యానికి గల కారణాలు పెట్టుబడిదారీ వ్యవస్థ పునాదిలోనే వున్నాయని, ఈ కారణాలను పరిష్కరించటం లో ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ  విఫలమయిందని ఈ డాక్యుమెంటు రుజువు చేస్తున్నది. అమెరికా, యూరప్, ఆసియా ఖండాలలో వున్న అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాలలో ఉత్పాదక రంగాలలో మదుపు (పెట్టుబడులు పెట్టటం) స్థిరముగా  తగ్గిపోతున్నదని ఈ డాక్యుమెంటు అన్నది.  అభివృద్ధి చెందిన దేశాలలో పెరుగుదలకి అవకాశాలు సంక్షోభానికి ముందరి కాలం కంటే తక్కువగా వున్నాయని, అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఈ అవకాశాలు మరింత తక్కువగా వున్నాయని ఈ డాక్యుమెంటు అన్నది.
ఈ పరిస్థితిలో జీవన ప్రమాణాలు భవిష్యత్తులో చాలా స్వల్పముగా మాత్రమే పెరుగుతాయి. అభివృద్ధి మందగించినందున పన్నుల వసూలు కూడా తదనుగుణముగా తగ్గి ద్రవ్య పటిష్టత కొనసాగింపు కష్టమవుతుంది.
అభివృద్ధి చెందిన దేశాల జనాభా లో వయోవృద్ధుల శాతం పెరగటం, ఉత్పాదకత పెరుగుదల రేటు తగ్గటం, తదితరాలు ఈ మాంద్యానికి కారణాలని ఐ ఎం ఎఫ్ అంటున్నది. కానీ అసలు వాస్తవాన్ని అది కప్పి పుచ్చుతున్నది. అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి పరాన్న భుక్కు తత్వం వలన వనరులను ఉత్పాదక రంగాలనుండి, ప్రత్యేకించి కార్మిక వర్గము నుండి కొద్ది మంది సంపన్నుల లాభాపేక్షకు మళ్లించటమే ఈ అసలు కారణం. ఆర్థిక వ్యవస్థ మాంద్యం లో వున్నప్పటికి, అత్యధిక ప్రజానీకం జీవన ప్రమాణాలు పడిపోతున్నప్పటికి ప్రపంచ పెట్టుబడిదారీ ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకులు సంపన్నులకు, అతి సంపన్నులకు అధిక లాభాలు సమకూరుస్తున్నాయి. కాబట్టి వీరి సంపద పెరుగుదల కి ఉత్పత్తి పెరుగుదలతో సంబంధం లేదు. పైగా ఉత్పత్తి పెరుగుదలని దెబ్బ తీయటం ద్వారానే వీరి సంపద పెంచబడుతున్నది.
ఆరు నెలల క్రితం తాను స్వల్ప పెరుగుదల పరిస్థితి చాలా కాలం పాటు కొనసాగుతుందని చెప్పానని, ఇది వాస్తవం కాకుండా చూడాల్సిన బాధ్యత నేడు మన పై వున్నదని 9.4.2015న “అట్లాంటిక్ కవున్సిల్” సమావేశం లో ఐ ఎం ఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టిన్ లాగార్దే అన్నారు. స్వల్ప పెరుగుదల, స్వల్ప ద్రవ్యోల్బణం మరియు అధిక అప్పులు, అధిక నిరుద్యోగం సమస్య అభివృద్ధి చెందిన దేశాలను వేధిస్తున్నదని ఆమె అన్నారు. సాధారణం కన్నా తక్కువగా వున్న ఈ పెరుగుదల వలన మరో ఆర్థిక పతనం ప్రమాదం పొంచి వున్నదని ఆమె అన్నారు. వాణిజ్యం లో పెరుగుదలసాధారణం కన్నా తక్కువగా వుండటం ఇది వరుసగా 4వ సంవత్సరం అని ఆమె అన్నారు.
డిమాండ్ ను మరియు ఉత్పాదక పెట్టుబడులను పెంచటం ద్వారా పెరుగుదల రేటును పెంచాలని ఆమె చెప్పిన చిట్కా బడా పెట్టుబడిదారులకు అనుకూలముగా , కార్మిక వర్గానికి వ్యతిరేకముగా వున్నది. ఇందుకోసం కార్మిక సంస్కరణలు అవసరమని అన్నది.  కార్మిక హక్కులను, స్వల్పంగా మిగిలిన ఉద్యోగ భద్రతను రద్దు చేయాలనే ఈ కార్మిక సంస్కరణల అర్థం. ఆయిల్ ను దిగుమతి చేసుకునే అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆయిల్ సబ్సిడీలను రద్దు చేయాలని ఆమె అన్నది.
ద్రవ్యోల్బణం రేటుతో సరి చేసిన ఉత్పత్తి పెరుగుదల రేటు (ఉత్పత్తి పెరుగుదల సామర్థ్యం)  2015-2020 మధ్య కేవలం 1.6 శాతమే వుంటుందని, ఇది 2008 లో జరిగిన పతనానికి ముందున్న రేటు 2.25 తో పోలిస్తే చాలా తక్కువ అని ఐ ఎం ఎఫ్ డాక్యుమెంటు అన్నది. చైనా, భారత్, బ్రెజిల్, రష్యా వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో 2008-2014 మధ్య 6.5 శాతం ఉత్పత్తి పెరుగుదల సామర్థ్యం  వుండగా 2015-2020 మధ్య 5.2 శాతమే వుంటుందని ఐ ఎం ఎఫ్ అన్నది. 2008 సెప్టెంబరు నుండి ప్రారంభమయిన సంక్షోభానికి ముందున్న పెరుగుదల తో పోలిస్తే పెరుగుదల ఇంకా బలహీనంగానే వున్నదని ఈ డాక్యుమెంటు అన్నది.
అభివృద్ధి చెందిన దేశాలలో 2008 లో ద్రవ్య సంక్షోభం ప్రారంభం కావటానికి ముందున్న ప్రయివేటు పెట్టుబడుల పెరుగుదలతో పోలిస్తే గత 6 సంవత్సరాలలో సగటున సంవత్సరానికి 20 శాతం తగ్గింది. 1929 లో మహా ఆర్థిక మాంద్యం ప్రారంభం తరువాత 6 సంవత్సరాలలో పెట్టుబడుల పెరుగుదల 10 శాతమే తగ్గింది.
నేటి సంక్షోభం దశలో పెట్టుబడుల పెరుగుదల ఈ విధముగా తగ్గటానికి కారణం ఊహించవచ్చు. పెట్టుబడిదారీ విధానం, ప్రత్యేకించి అమెరికా పెట్టుబడిదారీ విధానం  ఘోరంగా కుళ్లి పోవటమే దీనికి కారణం. ఉద్యోగాలు తగ్గించి, వేతనాలకు కోత పెట్టి కార్పొరేషన్లు ట్రిలియన్ల కొలది డాలర్లను మూట కట్టుకున్నాయి. మరో వంక కేంద్ర బ్యాంకులు దాదాపు ఉచితముగా ఇచ్చిన నిధులతో స్టాక్ మార్కెట్ ల సూచికలను పెంచి లాభాలు దండుకున్నాయి. ఉత్పాదక రంగాలలో పెట్టుబడులు పెట్టె బదులు కార్పొరేట్లు ఈ విధముగా స్టాక్ మార్కెట్ అమ్మకాలు, కొనుగోళ్ళు మరియు విలీనాలు స్వాధీనాలు తదితర పరాన్నభుక్కు కార్యక్రమాలకోసం కేంద్ర బ్యాంకులు తమకి ఇచ్చిన నిధులను దుర్వినియోగం చేశాయి. ఈ కార్యకలాపాలు అదనముగా ఎటువంటి విలువను సృష్టించవు. కానీ ద్రవ్య పెట్టుబడిదారుల జాతకాలని వర్ధిల్లజేస్తాయి. కార్పొరేట్ కొనుగోళ్ళు ఉత్పాదక సౌకర్యాల   సమీకరణ మరియు ఉద్యోగాల కోత ద్వారా ఉత్పాదక శక్తులను దెబ్బ తీస్తాయి.
ఈ పరాన్న భుక్కు తత్వం ఇటీవలి కాలం లో మరింతగా వ్యక్తమవుతున్నది. యూరపులో స్టాక్  మార్కెట్ నూతన శిఖరాలకు  చేరుకున్నది. గత 15 సంవత్సరాలలో ఎన్నడూ చేరుకొని స్థాయికి జపాన్ స్టాక్ మార్కెట్ సూచిక “నిక్కి” 20,000 పాయింట్లకు చేరుకున్నది. 2000 మార్చిలో చేరుకున్న 405.5 పాయింట్లకన్నా ఎక్కువగా 409.15 పాయింట్లకు “స్టాక్స్ యూరపు 600”  సూచిక చేరుకున్నది.
8.4.2015న రాయల్ డచ్ షెల్ ఆయిల్ కంపెనీ చేసిన ప్రకటన ప్రకారం అది బ్రిటన్ కు చెందిన బి జి గ్రూప్ ను 70 బిలియన్ల డాలర్లకు కొనేందుకు అంగీకరించింది. ఎనర్జీ రంగం లో ఒక దశాబ్ద కాలం లో జరిగిన అతి పెద్ద స్వాధీనం ఇది. దీని వలన ఎనర్జీ రంగం లో వేలాది ఉద్యోగాలు రద్దవుతాయి. 2015 లో ఇప్పటి వరకు జరిగిన స్వాధీనాల విలువ 1 ట్రిలియన్ డాలర్లు. ఇదే విధముగా కొనసాగితే 2015 లో మొత్తం స్వాధీనాల విలువ 3.7 ట్రిలియన్ల డాలర్లు మించుతుంది. ఈ స్వాధీనాలు, విలీనాల ద్వారా వాల్ స్ట్రీట్ బ్యాంకర్లకు మిలియన్ల డాలర్ల లాభాలు వస్తున్నాయి. 8.4.2015న గోల్డ్ మాన్ సాక్స్, షెల్ బి జి కంపెనీకి మైలాన్ పెరిగో అనే కంపెనీని కొనేందుకు సహాయం చేసింది. ఈ ఒప్పందం విలువ 100 బిలియన్ డాలర్లు. ఇందులో గోల్డ్ మెన్ సాక్స్ కు వచ్చే లాభం 50 మిలియన్ డాలర్లు.
ఈ విధముగా ఆర్థిక మాంద్యం కాలం లో కేంద్ర బ్యాంకులు దాదాపు ఉచితముగా ఇచ్చిన నిధులతో స్టాక్ మార్కెట్ లావా దేవిలు, విలీనాలు-స్వాధీనాల ద్వారా ఉత్పత్తి పెంచకుండా లాభాలు దండుకునే ప్రయత్నం లో కార్పొరేట్లు వున్నాయి.
----పి.అశోక బాబు, జాతీయ ఉపాధ్యక్షులు, బి ఎస్ ఎన్ ఎల్ ఈ యు
( మూలం: IMF warns of slow growth, high unemployment “ by Barry Gray, 11.4.2015, as published in the facebook page “vedika” of Com M.Koteswara Rao)   



No comments:

Post a Comment